యువ మూవీ రివ్యూ!
x
Source: Twitter

'యువ' మూవీ రివ్యూ!

ఓ వారసత్వ హీరో లాంచింగ్ సినిమా అంటే ఎలా ఉంటుంది. మనకు తెలియంది ఏముంది. మా అబ్బాయికి ఫలానాది వచ్చు.. ఫలానాది అదరకొట్టేస్తాడు అని చూపెట్టే షో రీల్ లాంటిది.


ఓ వారసత్వ హీరో లాంచింగ్ సినిమా అంటే ఎలా ఉంటుంది. మనకు తెలియంది ఏముంది. మా అబ్బాయికి ఫలానాది వచ్చు.. ఫలానాది అదరకొట్టేస్తాడు అని చూపెట్టే షో రీల్ లాంటిది. ఇదే ఫార్మెట్ సేమ్ టు సేమ్ కన్నడ పరిశ్రమను శాసిస్తూ ఏలుతున్న రాజకుమార్ కుటుంబం నుంచి పరిచయమవుతున్న వారస హీరో యువరాజ్ కుమార్(రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు) సినిమాలో కనిపించింది. అయితే 2024లో కూడా అలాంటి కథలేనా అంటే ఏం చేస్తాం.. తండ్రి, తాత వారసత్వం నిలబెట్టాలి, వారి అభిమానులను సంతృప్తి పరిచాలంటే వాళ్లు చేసినట్లే అనిపించాలనే ఆన్సర్ వస్తుంది. అందులోనూ ఈ సినిమా దర్శకుడు సంతోష్ ఆనంద్.. రామ్ సినిమాలు డైలాగులకు ఫేమస్. కాబట్టి సినిమా అంతా యాక్షన్ సీన్స్, డైలాగ్స్‌తో నింపేశారు.

టార్గెట్ ఆడియన్స్ కన్నడ వాళ్లు అదీ రాజ్ కుమార్ అభిమానులు కాబట్టి మనకు అంత గొప్పగా అనిపించదు. అయితే తెలుగులో డబ్బింగ్ చేసి వదిలారు కాబట్టి మనం ఓ లుక్కేయటమే చేయగలిగేది. అప్పుడు మనకూ ఓ ఆనందం కలుగుతుంది. కన్నడ సినిమా మారిపోయింది. ఇక అక్కడ కేవలం కేజీఎఫ్‌లు, కాంతారా లాంటి సినిమాలు వస్తాయనే భ్రమ ఏదైనా ఉంటే ఈ సినిమా కొట్టిపారేస్తుంది. మేము ఏమీ మారలేదు, మీరు కంగారు పడకండి హ్యాపీగా రొటీన్ సినిమాలు చేసుకోండి అంటుంది. ఇంతకీ ఈ సినిమాలో కథేంటంటారా..

ఈ సినిమా ఓ ఇంజనీరింగ్ కాలేజీలో తలుపు వేసుకుని మరీ మీటింగ్ పెట్టుకున్న యాజమాన్యం, స్టాఫ్‌తో స్టార్ట్ అవుతుంది. ఆ మీటింగ్ దేనికయ్యా అంటే ఆ కాలేజీలో ఎప్పుడూ కొట్టుకు చచ్చే రెండు గ్రూప్‌ల గురించి.. వాళ్ల గ్యాంగ్ వార్స్ గురించి. లోకల్ స్టూడెంట్స్‌కు బయట నుంచి వచ్చి హాస్టల్స్‌లో ఉండే స్టూడెంట్స్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఇది చూస్తే మనకు మండుతుందనుకోండి. ఆ కాలేజీ వాళ్లు గ్యాంగ్‌లను కంట్రోలు చేయలేరు. తమ ఎమోషన్స్‌ని కంట్రోలు చేసుకుంటూ మీటింగ్‌లు పెట్టుకుంటూంటారు. ఎందుకంటే ఆ గ్యాంగ్‌ల వెనక పెద్ద పెద్ద తలకాయలు ఉంటాయి. అయితే అక్కడే ఫైనల్ ఇయర్ చదువుతున్న మన హీరో యువరాజ్ మాత్రం రివర్స్. తన చదువేదో చదువుకోకుండా ఆ గ్యాంగ్‌ల మధ్యలోకి వెళ్లి కెలుకుతూంటాడు. దాంతో ఆ గ్యాంగ్‌లు వాళ్లంతా అతన్ని వేసేయాలని తిరుగుతూంటాయి.

యువరాజ్ ఓ ఫైర్ బ్రాండ్. కదిపితే రెచ్చిపోయి కుళ్ల పొడిచేస్తూంటాడు. అంతేకాదు అతను ప్రొపిషనల్ రెజ్లర్ అవుదామనే జీవితాశయం పెట్టుకున్నవాడు. కానీ ఓ పొరపాటు మూలంగా ఇతన్ని కాంపిటీషన్‌కు రానివ్వరు. రెండు సంవత్సరాలు నిషేధం విధిస్తారు. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే.. యువ వాళ్ళ నాన్న శంకర్ (అచ్యుత్ కుమార్) ఒక బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడు. కొడుకు ఎలాగూ కలిసి రాలేదు. దాంతో కూతురు పెళ్లైనా గ్రాండ్‌గా చేయాలని అతను భావిస్తాడు. దాంతో కొడుక్కు కూడా చెప్పకుండా అప్పులు చేసి మరీ కూతురు పెళ్లి చేస్తారు. అప్పులిచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి గొడవలు చేస్తుంటే భరించలేక ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు.

ఇవన్నీ చూసి విసుగెత్తి అతని గర్ల్ ఫ్రెండ్ సిరి ( సప్తమి గౌడ) మన హీరోకు బ్రేకప్ చెప్పేస్తుంది. ఈ క్రమంలో మన హీరోకు ఓ పక్కన గ్యాంగ్ వార్స్, మరో పక్కన ఇంట్లోంచి వెళ్లి పోయిన తండ్రి.. ఇంటి భారం భుజాన వేసుకోవడం… అలాగే బ్రేకప్ చెప్పిన గర్ల్ ప్రెండ్‌ని వెనక్కి తెచ్చుకోవటం వంటి లక్ష్యాలు ఉంటాయి. అవన్ని ఎలా నెరవేర్చున్నాడు అనేది మిగతా కథ. హీరోకు ఫలానా స్కిల్స్ అని చెప్పడం కోసం సీరియల్‌కు రాసుకున్న సీన్స్ లాంటివి అడుగడుగునా పలకరిస్తాయి. తమ హీరో లవ్, ఎమోషన్, యాక్షన్, కామెడీ ఇలా నవరసాలు మాత్రమే కాకుండా నీరసం కూడా పండించగలడని చెప్పాలని దర్శక, నిర్మాతల ఉద్దేశం కాబోలు. అది గమనించి హీరో గారు ఎనీ ఎమోషన్ సింగిల్ ఎక్స్‌ప్రెషన్ అన్నట్లు సీరియస్‌గా అలా చూస్తూంటాడు.

అయితే కోవిడ్ తర్వాత కథలు మారిపోయాయి. చిన్న పాయింట్ పెట్టుకుని స్క్రీన్ ప్లే చేసి రెండు గంటల సేపు హ్యాపీగా డైరక్టర్స్ సినిమాలు తీస్తున్న సమయం ఇది. ఇలాంటి టైమ్‌లో అడుగడుక్కీ హీరోకు కష్టాలు, పద్మవ్యూహాలు పెట్టి.. వాటిలోంచి బయటకు రావాలంటూ కథనం రాసుకోవటం చూసే వారికి కాస్త ఇబ్బందే. అన్ని సమస్యలు మనం మాత్రం ఎక్కడ గుర్తు పెట్టుకుంటాం. మనవి మనకే చాలటం లేదు. ఈ సినిమాలో స్టూడెంట్స్ సమస్యలు, స్పోర్ట్స్ ఇండస్ట్రీ సమస్యలు, మిడిల్ క్లాస్ సమస్యలు, స్టాక్ మార్కెట్, డెలివరీ ఏజెంట్స్ సమస్యలు, తండ్రీ కొడుకు రిలేషన్‌షిప్ సమస్య ఇలా వరసపెట్టి అన్నీ పలకరిస్తూంటాయి. వీటిన్నటికి పరిష్కారం ఒకటే దర్శక, నిర్మాతలు చూపించారు. అదేమిటి అంటే దండం దశగుణం భవేత్. అంటే నాలుగు బాదితే అంతా సర్దుకుంటుంది అని. సూపర్బ్ ఐడియా కదా.

యాక్షన్ ఎపిసోడ్స్ బాగుండటంతో కొంతలో కొంత రిలీఫ్. మాస్, క్లాస్, చిన్నా, పెద్దా అందరినీ ఎట్రాక్ట్ చేయాలన్న తపనతో డైరక్టర్ ఈ తరహా స్క్రిప్ట్ ఎంచుకున్నాడని అర్థమవుతుంది. డైరక్టర్‌ని తప్పు పట్టలేం. ఇక ఈ సినిమాకు టెక్నికల్ టీమ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బాగా ఖర్చు పెట్టారు. మనమూ రెండున్నర గంటలు టైమ్ ఖర్చుపెడతాం అనే విషయం కూడా వాళ్లు గుర్తు పెట్టుకోవాలి.

చూడచ్చా

ఓటీటిలోనే కాబట్టి యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఓ లుక్కేయచ్చు.

ఏ ఓటిటిలో ...

అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో ఉంది.

Read More
Next Story