
" సఫర్ నామా"
-పరవస్తు లోకేశ్వర్
ఆమె సార్థక నామధేయురాలు. ఆ పేరులోనే గిరులు, తరులు, కొండలు, బండలు, చెట్లు, పుట్టలు దాగి ఉన్నాయి. ఎంతైనా గిరి పుత్రిక కదా! చెట్టులెక్కగలవా? గుట్టలెక్కగలవా? అని సవాల్ చేయ వలసిన అవసరమే లేదు. ఆమె ఒక లోకసంచారిణి. అది ఆమె రక్తసిక్త సహజసిద్ధ స్వభావమేమో! ఇంతులు పూబంతులు అని వర్ణించే కాలం ఎప్పుడో కభ్రస్థానాలలో సమాధి అయిపోయిందని ఇప్పుడు వస్తున్న ఇంతియానాలు ఢంకా భజాయిస్తూ చెబుతున్నాయి.
" ముబారక్ హో! గిరిజా ముబారక్ హో! ."
ఆమె లోక సంచారాలన్నీ సాహసోపేతమైన ఆధ్యాత్మికత, శిల్పకళ, ప్రకృతి సౌందర్యాల మేలి కలయికల మిలా యింపులు. జీవితంలో ఆరు పదుల మైలురాళ్లు దాటిన ఈ ట్రెక్కర్ విషయంలో " ఏజ్ ఈజ్ ఓన్లీ ఎ నంబర్ ఫర్ కౌంటింగ్." గిరగిరా దేశం నలు మూలలా నిరంతరం పర్యటించే ఈ గిరిపుత్రికను చదువుతుంటే " ముఝే ఏక్ జగా ఆరాం నహీ, రుఖ్ జానా మేరా కామ్ నహీC." హేమంత్ కుమార్ పాడిన పాత పాట జ్ఞాపకం రాక మానదు.
యాత్ర అంటే కేవలం ప్రదేశాలను చూడటమే కాదు, అక్కడి స్థానిక స్త్రీ పురుషులతో, చిన్న పిల్లలతో సంభాషించి స్నేహ సంబంధాలను నెలకొల్పుకోవడం. వారి జీవితాలను అధ్యయనం చేసి, " దునియాకి సైర్ కర్ లో. ఇన్సాన్సే ప్యార్ కర్ లో."అన్న పాటను తన ఆచరణలో నిజం చేస్తుంది. మనుషుల్ని ప్రేమించే తత్వం ఉన్న వారే ఈ పని చేయగలరు. అటు ఉత్తరాన హిమవత్ పర్వత పాదపంక్తుల నుండి దక్షిణాన లక్షద్వీపాల దాకా ఇటు పశ్చిమ కనుమల నుండి ఆగ్నేయాన కొలువైన అండమాన్ దీవుల దాకా విహరించే ఈ విహంగానికి సంచార
తత్వం ఒక తీరని దాహం. ఒక తపన. ఆరని ఆగిపోని ఒక అగ్నిజ్వాల.
" హై మేరే దిల్ కహీc ఔర్ చల్/ గమ్ కీ దునియాసే దిల్ భర్ గయా."
తినబోయే వారికి రుచులు చెప్పటం ఎందుకు గానీ ఈ రచయిత్రి జీవితమే ఒక లంబా సఫర్. కర్ణుడు కవచకుండలాలతో జన్మించినట్లు ఈమె పాదాలకు చక్రాలతో పుట్టినట్లుంది. పాహియాన్ , హుయాన్ త్సoగ్ , ఇబాన్ బటూటా, రాహుల్ సాంకృత్యాయన్ లాంటి లోకసంచారులు ఈమె చిన్ననాడే కలలో కనబడి అధర్వణ వేదంలోని "చరైవేతి చరైవేతి" మంత్రాన్ని చెవిలో బ్రహ్మోపదేశం చేసినట్లుంది. లేకపోతే ఈమె జిప్సీ లాగా ఎందుకు మారుతుంది? ఘుమక్కడ్ లాగా ఎందుకు తిరుగుతుంది?
మేఘాల అంచుల్ని అందుకొని ఊయలలూగడం, వ్రేలాడే వేర్ల వంతెనలపై అడుగులు వేయడం, ఖాసీ కొండలలో ట్రెక్కింగులు చేయడం, జలపాతాల హోరులలో జలకలాటలలో స్నానాలు, తడిసి ముద్దయ్యి పునీతులు కావడం, చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవులలో చేతిలోని కత్తితో కొమ్మలు నరుకుతూ దారి కాని దారులలో ప్రయాణిస్తూ ఉత్తిష్ఠోపతిష్టగా కొండలను అధిరోహిస్తూ అక్కడి ఆకాశాన్ని బద్దలు కొట్టి కిందికి దూకుడుగా దుమికే జలపాతాలను తమ కళ్ళనిండా నింపుకొని, ఒంపుకొని పరవశించి పలవరించటం ఈ సాహసురాలికే సాధ్యం. చలికి గడ్డకట్టుకపోయే చార్ధామ్ యాత్రలో వెండి కొండల్లా ధగధగా మెరిసే హిమసమూహాలు, మరోవైపు ఆకుపచ్చ లోయలలో వొంపు సొంపులు తిరుగుతూ వయ్యారాలు పోయే అలకనందా, భగీరథ, మందా కినులు జన్మజన్మలకు సరిపడా అనుభవాలు కదా!
గుళ్ళు గోపురాలు మాత్రమే కాక మసీదులు, చర్చిలు దర్శించడం కూడా వీరి సర్వమత సమానత్వానికి ఒక కొండ గుర్తు. కార్తీక మాసంలో మనం వన భోజనాలకు వెళ్లినట్లు ( తెలంగాణలో చెట్లల్లకు పోవటం ) తెల్లవాళ్ళు కూడా "గాన్ టు ద రాక్స్" వేడుకలు, ఉత్స వాలు
చేసుకుంటారు. అట్లాగే మన ముసాఫిర్ కూడా రాతిగుట్టల సౌందర్యాన్ని తిలకించి, అక్కడ కొండలను బండలను కాపాడాలనే నినాదంతో అసలు సిసలు "గిరిపుత్రికలు" అవుతుంటారు.
నల్లమల పశ్చిమ కనుమల్లోని అహోబిలం కొండల్ని అధిరోహించి, అక్కడి సౌందర్యాన్ని వర్ణించటానికి భాష సరిపోదని ఎవరు బాధ పడతారు? ఇలాంటి "ఆవారా బాద ల్ "లు, " ఆస్మా న్ కా తారలు " తప్ప! తుంబురుతీర్థంలో మోకాలి లోతు వాగుల్ని, వంకల్ని దాటుకుంటూ ఎర్రచందనం వృక్షాల నీడలలో నడుస్తూ పాదాల కింద నలిగే ఎర్ర చందనం ఆకుల చప్పుడు వినటం ఒక లైఫ్ టైం అపూర్వ అనుభవం కాదా? రూసో చెప్పిన "తిరిగి ప్రకృతిలోకి, బ్యాక్ టు ద నేచర్" అంటే ఇదే కదా! అమ్రాబాద్ అడవులలో సలేశ్వరం లోయలలోని కాలి నడకల ఆయాస ప్రయాసలు కూడా " బాధే సౌఖ్యమనే భావన రానీయవోయ్ " అన్న తత్వాన్ని అక్షరాల ఆచరణలో బోధపరచటమే కదా! అతి తక్కువ ఖర్చుతో ఎక్కువగా ప్రపంచాన్ని చూడటం అనేది ఈమెకు, ఈమె స్నేహం బృందానికి ఎక్కువ కెక్కువగా తెలిసిన ఒక "పొదుపు కళనే."
హిమగిరులలోని "పువ్వుల లోయల"లో పర్యటిస్తూ పరవశిస్తూ ఆ తీరున్నొక్క పుష్పాల వేన వేల రంగుల్ని తిలకిస్తూ ఆ అనుభవాలనూ అనుభూతుల్ని హృదయాలలో భద్రపరచుకోవటం "డబ్బు జబ్బు"తో బాధపడే వారికి పచ్చ నోట్ల పిచ్చి సంస్కృతిని ఆరాధించే వారికి చీమ కాలంతైనా అర్థమవుతుందా? వారు కోటి జన్మలెత్తినా చివరికి కోతి లాగానే మిగిలిపోతారు.
వీరి స్నేహ బృందం యాత్రా పిపాసను ఒక ఉద్యమంగా కొనసాగించాలన్న ఆశయంతో మహిళా "విహంగ "బృందాన్ని ఏర్పాటు చేయటం శుభసూచకం. మహిళలలో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఆరోగ్యాన్ని పెంచాలన్నదే వీరి లక్ష్యం. అప్పుడప్పుడైనా నాలుగు గోడల్ని బద్దలు కొట్టుకొని విశాల ప్రపంచంలోకి అడుగు పెట్టడం. "పంచి బనూ ఉడ్ తే ఫిరూ నీలి గగన్ "మే లాగా. రొటీన్ లైఫ్ నుండి హ్యాపీ ఎస్కేప్. ఎస్కేప్
ఇన్ టు ఫ్రీడం. ఎస్కేప్ ఇన్ టూ ఎటర్నిటీ. ఈ పుస్తకం పుణ్యమా అని ఈనాటి యువతరానికి యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వివిధ ప్రదేశాలలోని ట్రెక్కింగ్ సంస్థల సమాచారం లభిస్తుంది.
బిందువులో సింధువును సందర్శించే కళాత్మక జీవు లైన యాత్రికులు సాక్షాత్తూ సాగర తీరాన నిలుచున్నప్పుడు తమ చూపుల గాలాలతో అలలను లాగాలని తమ పాదాక్రాంతుల్ని చేసు కోవాలని విఫలయత్నాలు చేస్తుంటారు. వెన్నెలలో ఆడుకునే ఆడపిల్లల్లా వీరందరూ సాగర తీరాన సముద్రుడితో సయ్యాటలాడుతారు. సముద్రుడిపై సవారీ చేసి, సాహస క్రీడలు ఆడుతారు. ఒక ముక్కలో చెప్పాలంటే వీరందరూ "వేర్ ఈగిల్స్ డేర్ " అన్నమాట.
మూడు వేల సంవత్సరాల ప్రాచీన భారత నాగరికతకు కాణాచి అయిన కాశీని త్రినేత్రంతో, కొత్త చూపుతో సందర్శించటం, అర్ధరాత్రి వెలుగునీడల దారులలో పధ్నాలుగు కిలోమీటర్ల అరుణగిరి చుట్టూ ప్రదక్షిణలు చేయటం, పంచగనిలో పక్షి వీక్షణాలు, ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయంగా మారిన ఒక ఊరును చూడటం, హెరిటేజ్ వాక్ లు, హెరిటేజ్ టూర్ లు అన్నీ ఈ పుస్తకం చదివిన పాఠకుల్ని " గీత్ గాతే చల్ " అంటూ దూర దూర ప్రాంతాలకు " యాత్రోన్ముఖల్ని" చేస్తాయి. ఆకాశమే నా హద్దు అనుకుంటూ గాలిలో పక్షుల్లాగా పారాసెయిలింగ్ చేయటం, సముద్ర గర్భానికి సబ్ మెరైన్ లలో ప్రయాణించి అక్కడ పాతాళ లోకపు వింతల్ని చూడటం, అంతూ పొంతూ లేని ఇసుక ఎడారులలో వెన్నెల రాత్రులలో ఏకాంతంగా ఒంటరోంటరిగా ఆకాశపు పందిరి కింద పడుకొని ఈ పాడు ప్రపంచాన్ని మరచి పోవటం, జంగిల్ సఫారీలు, బోట్ సఫారీలు, రాఫ్టింగులు, కయాకింగ్ లు, నట్టనడి సంద్రాన ఫెడలింగ్ లు ఎవరు చేయగలరు? గిరిజ లాంటి సాహస యాత్రికులు తప్ప! అవును " సాహసం సమక్షంలో మృత్యువు ఒక లెక్క కాదు " అన్న సంజీవ్ దేవ్ మాటలే జ్ఞాపకం వస్తున్నాయి.
" పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో " అన్నట్లు, పల్లెకు పోదాం ప్రజలను చూద్దాం చలో చలో అని కరీంనగర్ జిల్లా కొండగట్టు
నుండి నలభై కిలోమీటర్ల దూరం లాంగ్ మార్చ్ చేస్తూ గ్రామాల అధ్యయన యాత్ర చేయటం " నమో నమః ." అదొక సామాజిక అధ్యయన యాత్ర. సంచలిస్తూ, సంచరిస్తూ చేసిన ఆ యాత్రలన్నీ పరిశీలిస్తే పదవీ విరమణ చేసిన ఆ అధ్యాపకురాలు నిరంతర నిత్య విద్యార్థిని అని బోధపడుతుంది.
" అరవైలో ఇరవై " లాగా చేసిన ఈ సాహసభరిత, ఉత్సాహపూరిత యాత్రల పుస్తకం ఇక రాబోయే కాలంలో మహిళా పర్యాటకులందరికీ ఒక ట్రావెల్ గైడ్ గా ఉపయోగ పడుతుందనీ, పాఠకుల మనో నేత్రాలు స్పష్టంగా సంపూర్ణంగా తెరుచుకుంటాయనీ, వారి వారి అంతర్గత, సృజనాత్మక శక్తులు విస్ఫోటనం చెందుతాయని, జడాత్మక జీవితాలు మరిక అందంగా, అర్థవంతంగా, ఉపయోగకరంగా పరివర్తనం చెందుతాయని నా ప్రగాఢ విశ్వాసం.
(ఈ పుస్తకానికి పరవస్తు లోకేశ్వర్ ముందుమాట)

