గాంధీ హత్య ఆమెను బాగా కలచి వేసింది...ఆ పాటే సాక్ష్యం
x
ఆలూరువిమలా దేవి

గాంధీ హత్య ఆమెను బాగా కలచి వేసింది...ఆ పాటే సాక్ష్యం

గాంధీజీ హత్య ఆలూరు విమలాదేవిని బాగా కలిచివేసింది. గాంధీజీ నిర్యాణం పైన ఆమె తరుచూ ఒక పాట పాడుతుండేది. దాన్నెవరు రాశారో తెలియదు. అమ్మ చెప్పిన ముచ్చట్లు : 7అమ్మ చెప్పిన ముచ్చట్లు - 8-రాఘవ శర్మ

" వేమవరంలో నా పెళ్ళి వరకు మా పుట్టింటారి పరిస్థితి బాగానే ఉంది.
ఆ తరువాత కాస్త తారుమారైంది.
ఒక్కో ఎకరా, ఒక్కో ఎకరా అమ్ముకోవడం మొదలు పెట్టారు" అంటూ చెపుతోంది మా అమ్మ.
"ఎందుకిలా జరిగింది!? మీ గంగులు మావయ్య, శేషన్నయ్య వ్యసనాలే కారణమా!?" అని అడిగాను.

"కర్ణుడి చావుకు ఎన్ని కారణాలో, మావాళ్ళు పొలాలు పోగొట్టుకోడానికి కూడా అన్ని కారణాలు.
మా అమ్మ కాస్త దుబారా మనిషి.
మా నాన్న మాట పెడ చెవిన పెట్టేది.
పెద్ద కూతురిని తమ్ముడికిచ్చిపెళ్ళి చేసి, ఇంట్లోనే అట్టి పెట్టుకుంది. రెండవ కొడుకు మా శేషన్నయ్యకు చదువు లేదు.
మా గంగుల మావయ్య వల్ల వ్యసనాలకు బానిసైనా పట్టించుకోలేదు.
వాళ్లకు అడిగినంతా ఇచ్చేది.
సంప్రదాయాలు, పెట్టుపోతల పేరుతో మా అమ్మ కాస్త దుబారా చేసేది.
ఖర్చు పెట్టడమే తప్ప ఆదాయాన్ని చూసుకునేది కాదు.
మా పెళ్ళైన కొత్తల్లో కుటుంబ పరిస్థితి దిగజారిపోతోంది.
అప్పులు తీర్చడానికి, కుటుంబం గడవడానికి పొలాలు అమ్ముకోవడం తప్ప వేరే మార్గం కనిపించడంలేదు.
ఆ సమయంలో మా అమ్మకు చివరి సంతానంగా మా తమ్ముడు పుట్టాడు.
ఇంట్లో కొడుకు పుట్టాడన్న సంతోషమే లేదు.
కుంటుంబమంతా బందరు వచ్చేసింది.
మా చిన్న తమ్ముడు పెరుగుతున్నాడు.
ఆ పరిస్థితిలో వాడికి పేరుకూడా పెట్ట లేదు.
సుభాష్ చంద్రబోస్ చనిపోయి అప్పటికి నాలుగేళ్ళవుతోంది.
నేనే మాచిన్న తమ్ముడికి సుభాష్ చంద్రబోస్ అని పేరు పెట్టాను.
పుట్టిన తిధి, నక్షత్రం ఏమీ చూడలేదు.
ఆ పేరే స్థిరపడిపోయింది.
మా కుటుంబం వేమవరం నుంచి బందరు వచ్చేసింది.
మా పెద్దన్నయ్య రెండవ పెళ్ళి చేసుకుని తన పాటికి తాను వెళ్ళిపోయాడు.
చిన్నన్నయ్యకు పొలం పనులు తప్ప ఏమీ తెలియదు.
కొన్నాళ్ళకు మా వదిన, మా నాన్న కూడా పోయారు.
కుటుంబం గడవడమే కష్టమవుతోంది.
చదువు రాని మా శేషన్నయ్య కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు.
వ్యసాలను వదిలించుకున్నాడు.
రైస్ మిల్లులో డ్రైవర్ గా చేరాడు.
రాత్రీ పగలనకుండా కష్ట పడుతున్నాడు.
ఇద్దరు చెల్లెళ్ళను, ఇద్దరు తమ్ముళ్ళను, తల్లిని పోషిస్తున్నాడు.
ఇద్దరు చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళయ్యే వరకు తానే చూశాడు.
చివరికి చెల్లెళ్ళ పిల్లల్ని కూడా చూశాడు.
మా శేషన్నయ్యే చూడకపోతే వాళ్ళంతా ఏమైపోయేవారు !? " అంటూ అనాటి పరిస్తితిని వివరిస్తోంది మా అమ్మ.

మా అమ్మ చెపుతుంటూ మా శేషుమావయ్య గుర్తుకొచ్చాడు.
దానితో పాటేపాత సినిమాలో సి.నారాయణ రెడ్డి రాసిన ఒక పాట కూడా గుర్తుకొచ్చింది.


వేమవరపు శేషగిరి రావు(విమలా దేవి చిన్నన్నయ్య


‘‘చదువు రాని వాడవని దిగులు చెందకు

మనిషి మదిలోన మమత లేని చదువు లెందుకు?
అడవిలోన నెమలి కెవరు ఆట నేర్పిరి?
కొమ్మ మీద కోయిల కెవరు పాట నేర్పిరి?
చెరువులోన చేపపిల్ల కెవరు ఈత నెర్పిరి?’’

మా శేషుమావయ్య రైస్ మిల్లు కార్మికుడిగా పనిచేస్తూనే కమ్యూనిస్టు పార్టీ కార్మిక సంఘంలో తిరిగాడు.
అది సిపిఐ నో, సిపిఎం నో తెలియదు.
కార్మికులు వేతనాల కోసం ఆందోళన చేస్తే, మిగతా కార్మికులతో పాటు మా శేషు మావయ్యను కూడా రెండు మూడు సార్లు పోలీసులు అరెస్టు చేశారు.
మా శేషుమావయ్యకు కమ్యూనిస్టు సిద్ధాంతాలేమీ తెలియపోయినా కమ్యూనిస్టన్న ముద్రమాత్రం పడిపోయింది.
చదువుకున్న మిగతా ముగ్గురు మేనమామలకు ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి.
మా ఇద్దరు చిన్న మేనమామలు మాత్రం ‘‘నేను, నా భార్య, నా పిల్లలు, నా సిగరెట్లు, నా మందు’’ అంతే.
మా పెద్ద మేనమామకు అలాంటి అలవాట్లేమీ లేవు.
తల్లి తోబుట్టువులకు దూరంగా ఉండే వాడు.
మళ్ళీ మా అమ్మ ఇలా చెప్పడం మొదలు పెట్టింది.
"ఢిల్లీలో గాంధీజీని నాథూరాం గాడ్సే చంపినప్పుడు మీ నాన్న అక్కడే మిలటరీలో పనిచేస్తున్నారు" అంటూ మరొక ఆసక్తి కర విషయం చెప్పింది.

"గాంధీ అంటే నీకెందుకు అంత ఇష్టమమ్మా" అన్నానొకసారి.

"మనకు స్వాతంత్య్రం తెచ్చాడు కదరా అందుకే" అన్నది.
గాంధీజీ హత్య మాత్రం మా అమ్మను బాగా కలిచివేసింది.
అందుకునే గాంధీజీ నిర్యాణం పైన తరుచూ మా అమ్మ ఒక పాట పాడుతుండేది.
పాట పాడమని ఎవరడిగినా ముందు ఈ పాటే పాడేది.

" ఏమి చెప్పుదు సోదరా
మాహాత్మ గాంధీ నిర్యాణమ్మును
పామరుడు చెప్పలేడూ
భారత స్వామి ఆయన నిజముగా..
బిర్లా భవనంబునకును
ప్రార్థనకు బిరబిరా పోవుచుండా..
దారిలో హంతకుండూ..
తూపాకి బారు చూపీ కొట్టెను..

ఏమి చెప్పుదు సోదరా
మాహాత్మ గాంధీ నిర్యాణమ్మును
పామరుడు చెప్పలేడూ
భారత స్వామి ఆయన నిజముగా..

ఇరువురూ మనుమరాండ్రన్
పట్టుకుని మురువుగా నడుచుచుండా
మారాటి హిందు ఒకడు
బాపూజీ ముందు వచ్చి వంగెనూ..
ఆలసించితి రనుచునూ
గాంధీజి మ్రోలనూ నమస్కరించి
క్రీలునా పట్టి పిస్తోల్
గుండే కేసి కొట్టి చంపెనూ..
డొక్కలో గుండు దూరి
రక్తమూ కారుచుండుగ మీదుగా
ప్రార్థనా జనుల వైపు
చేతూలు పైకెత్తి పడిపోయెనూ..
ఢిల్లీ నగరమంతయూ
నిమిషములో తల్లి డిల్లీ పోయెనూ..
పెండ్లిడ్లు కూడ మాని
బాపూజిని చూడవచ్చిరి పరుగునా..

జవహర్ లాల్ నెహ్రు, పటేల్,
గవర్నర్ జనరల్ మౌంటు బాటన్
చుట్టునా మూగియుండిరి
బ్రతుకంగ జూచుచుండిరి ఆశతో
తరలిరీ శరణార్థులు
మా గాంధీ తండ్రిగారేరనుచునూ..

సర్వజిత్తూ నామ పుష్య
బహుళ పంచమీ శుక్రవారం
హస్త నక్షత్ర మందూ
బాపూజి అస్తమించెను పుడిమినా..

ఏమి చెప్పుదు సోదరా
మాహాత్మ గాంధి నిర్యాణమ్మును
పామరుడు చెప్పలేడూ
భారత స్వామి ఆయన నిజముగా" అంటూ పాడేది.
ఈ పాట పాడేటప్పుడు కొన్ని హావభావాలు కూడా ప్రదర్శించేది.
కొన్ని చరణాలప్పుడు మా అమ్మకు మాట పెగిలేది కాదు. "అలసించితిరనుచును" అన్న చరణం పాడినప్పుడు పిడికిలితో చేతిని ప్రశ్నార్థకంగా పెట్టేది.
"క్రీలునా పట్టి పిస్తోల్" అని పాడినప్పుడు చేతిని పిస్తోలులాగా చూపించేది.
"డొక్కలో గుండు దూరి" అని పాడినప్పుడు వేళ్ళన్నీ ముడిచి,చూపుడు వేలితో డొక్కను చూపించేది.
నిజంగా తన డొక్కలో గుండు దూరినట్టు కళ్ళు తేలేసినట్టు చూసేది.
"మౌంట్ బాటన్" అని పలకడం రాక "మౌంట్ బాటల్" అని పలికేది.
మేం నవ్వుకునే వాళ్ళం.
అసలీ పాట ఎవరు రాశారో తెలియదు.
ఎక్కడా రికార్డు అయినట్టు లేదు.
ఆరోజుల్లో గాంధీజీ హత్యతో చలించిపోయిన ప్రజలే రాసుకుని పాడుకున్నట్టున్నారు.

వనపర్తి ప్యాలెస్ లో ప్రైవేట్ పాలిటెక్నిక్ ను నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1959 లో ప్రారంభించారు.
మా నాన్నకు ఆ కాలేజీలో ఉద్యోగం.
ఆ ప్యాలెస్ ఆవరణలోనే మా ఇల్లు.
మా అమ్మ ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఆ ప్రారంభ సభకు వెళ్ళింది.
నన్ను, మా అక్కను, మా చెల్లెలిని పట్టుకుని ముందు వరుసలోనే కూర్చుంది.
ప్రారంభసభ అయిపోయాక, నెహ్రూ తనకు వేసిన పూలమాలలను ముందు వరున కూర్చున్న వారి పైకి విసిరేశాడు.
నెహ్రూ స్వాతంత్య్ర సమరయోధుడు కనుక వారంతా అపూలమాలను చాలా పవిత్రంగా భావించి ఇళ్ళకు తీసుకెళ్ళారు.
అలా మా అమ్మ కూడా ఆ పూలను ఎంతో గౌరవంతో ఇంటికి తెచ్చుకుంది.
మా అమ్ముకు వేమన పద్యాలంటే చాలా ఇష్టం.
"వేమన పద్యాల పుస్తకం తెచ్చిపెట్టు" అంటే తెచ్చిపెట్టాను.
వీలున్నప్పుడల్లా వాటిని చదువుకునేది.
అలాగే గురజాడ 'పుత్తడి బొమ్మ పూర్ణమ్ము' గీతం అన్నా చాలా ఇష్టం.
ఇదివరలో చూడకుండా కొన్ని చరణాలు అప్పుడప్పుడూ పాడేది. ఆ మధ్య గురజాడ మునిమనుమడు గురజాడ ప్రసాద్, గురజాడ ఇందిర దంపతులను మా ఇంటికి తీసుకొచ్చాను.
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ లోని కొన్ని చరణాలను వాళ్ళ ముందర మా అమ్మపాడి వినిపిస్తే ఎంత సంతోషించారో!
చాలా చరణాలు జ్ఞాపకానికి రానందుకు బాధపడిపోయింది.
మా అమ్మ వాళ్ళతో ఎన్ని కబుర్లు చెప్పిందో!
'గురజాడ దేశభక్తి గీతం' అన్న పుస్తకాన్ని గురజాడ ఇందిర మా అమ్ముకు ఇచ్చారు.

గురజాడ ప్రసాద్, గురజాడ ఇందిర దంపతులు ఆలూరు విమలా దేవికి గురజాడ ‘దేశభక్తి’ పుస్తకం ఇస్తున్నప్పటి చిత్రంఆ పుస్తకాన్ని దిండుకింద దాచుకుని, తీరిక దొరికినప్పుడల్లా చదువుకునేది.
తాను పాడిన పాటలన్నిటినీ నా చేత రాయించి, ప్రింటౌట్ తీయించి, ఆ పుస్తకంలో దాచుకుంది.
నేను రాసిన పుస్తకాలలో ఒక్కొక్క కాపీ తీసుకుని దిండు కిందదాచుకునేది.
అప్పుడప్పుడూ వాటిని తిరగేస్తూ ఉండేది.
ఎవరైనా వస్తే "మా బాబు రాశాడు. చూశారా!'' అంటూ వాటిని మురిపెంగా చూపించేది.

(ఇంకా ఉంది)

*( ఆలూరు రాఘవ శర్మ, జర్నలిస్టు, రచయిత, సాహితీ సౌగంధం ( ఉమ్మడి చిత్తూరు జిల్లా సాహితీ వేత్తల గురించి)కొత్త బంగారు లోకం ( చైనా పర్యటన అనుభవాలు) తిరుమల దృశ్య కావ్యం ( శేషాచలం కొండల లో ట్రెక్ అనుభవాలు) పుస్తకాలు అచ్చయ్యాయి. త్వరలో ‘వనపర్తి ఒడి లో’ విడుదల కానుంది.)


Read More
Next Story