జ్యోతిష్యాన్నే తలకిందులు చేసిన ‘ప్రతివాది’
x

జ్యోతిష్యాన్నే తలకిందులు చేసిన ‘ప్రతివాది’

జెమిని గణేశన్ కు సైతం స్వరం ఇచ్చారు ప్రతివాది భయంకర శ్రీనివాస్


ఎనిమిది బాషలలో దిట్ట ….

పదిహేనవ శతాబ్దంలో వెంకటేశ్వర సుప్రభాతం పాడిన ప్రతివాది భయంకరం అన్నాంగారాచార్య వారసుడు ….

జెమిని గణేశన్, ముతురామన్ ,రవిచంద్రన్ లాంటి ప్రఖ్యాత తమిళనటులకు స్వరం ఇచ్చినవాడు ….

మూడు వేల పాటలు పాడినవాడు …..

తెలుగు వాడైనా కన్నడం ,తమిళం ,మలయాళం పరిశ్రమల్లో కూడా గాయకుడిగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నవాడు ….

ఆయనే ప్రతివాది భయంకర శ్రీనివాస్ (పిబి శ్రీనివాస్ ).

ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి ఒకటే ప్రాముఖ్యత సంతరించుకున్న విషయం కాదు, ఇదే రోజు తెలుగు నాట పుట్టి దక్షిణ భారత దేశాన్ని తన మధుర స్వరంతో ఉర్రూతలూగించిన పిబిశ్రీనివాస్ వర్ధంతి కూడా.

పిబి శ్రీనివాస్ తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో 22 సెప్టెంబర్ ,1930లో ఫణీంద్ర స్వామి, శేషగిరమ్మ దంపతులకు జన్మించాడు. కన్నడ,తెలుగు ,తమిళం ,హిందీ ,మలయాళం ,తులు మొత్తం మీద అన్ని బాషలలో మూడు వేల పాటల దాకా పాడారు.ఆయన తెలుగు నాట పుట్టినా, ఎక్కువ సంఖ్యలో పాటలు పాడింది మాత్రం కన్నడలోనే.

పిబి శ్రీనివాస్ కుటుంబంలో కళలకు అనుకూలంగా ఉన్న వాతావరణమే ఆయన్ని గాయకుడు అయ్యేలా చేసింది. ఆయన తల్లికి సంగీతంలో ప్రవేశం ఉంది. మేనమామ కిడంబి కృష్ణస్వామి నాటక ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు పాటలు కూడా పాడేవారు. మేనల్లుడికి పాటల మీద ఉన్న ఆసక్తిని గమనించిన కృష్ణస్వామి తన నాటకంలో శ్రీనివాస్ కి పాడే అవకాశం ఇచ్చారు. కానీ శ్రీనివాస్ తండ్రి ఫణింద్ర స్వామికి మాత్రం కొడుకుని ఒక ప్రభుత్వ అధికారిని చేయాలన్న కోరిక ఉండేది. ఈ విషయం మీద ఉన్న సందిగ్దత వల్ల ఫణింద్ర ఒక జ్యోతిష్యుడిని కలిసి అడిగితే ,శ్రీనివాస్ సంగీతంలో రాణించడని తేల్చేసాడు. అయినా ఫణింద్ర స్వామి తన కొడుకు మీద నమ్మకంతో ప్రోత్సహించాడు.

డిగ్రి పూర్తి చేసిన తర్వాత చెన్నైలో ఉన్న జెమిని స్టూడియోకి వెళ్ళాడు శ్రీనివాస్. అక్కడ సంగీతకారుడిగా ఉన్న ఇమని శంకర శాస్త్రి జెమిని స్టూడియో యజమాని అయిన వాసన్ కి శ్రీనివాస్ ని పరిచయం చేసాడు. శంకర శాస్త్రి శ్రీనివాస్ కుటుంబానికి ఆప్తుడు. వాసన్ ని మెప్పించిన శ్రీనివాస్ జెమిని నుండి వచ్చిన సినిమా ‘సంపత్’లోని పాటలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అందులో ఆయన పాడిన పాట "ఆజి హం భారత్ కీ నారి" ఒక యుగళ గీతం. దీనిని "గీతా దత్త్ "తో కలిసి పాడారు. ఆయన మొదటి సోలో సాంగ్ "ప్రేమ పాశం" చిత్రంలో పి.సుశీలతో పాడారు. తర్వాత కన్నడ నుండీ ఎన్నో అవకాశాలు వచ్చాయి. నటుడు రాజ్ కుమార్ కి పాడిన పాటలతో ఆయన చాలా పాపులర్ అయ్యాడు. ఆయన ఎక్కువ పాటలు పాడింది రాజ్ కుమార్ కే,ఆ తర్వాత తమిళ స్టార్ జెమినీ గణేశన్ కోసం కూడా పాడారు. రాజ్ కుమార్ కోసం ఆయన పాడిన పాటలు విమర్శకుల ప్రశంసలు కూడా పొందాయి. శ్రీనివాస్ గాయనీమణులైన పి.సుశీల, ఎస్.జానకి, పి.భానుమతి, కె.జమునా రాణి, ఎల్.ఆర్.ఈశ్వరి, లతా మంగేష్కర్ లతో కలిసి పాడారు.ఆయన ఆధ్యాత్మిక పాటలను కూడా పాడారు. అవి "శారదా భుజంగ స్తోత్రం", "శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్", "ముకుంద మాల", "శ్రీ మల్లికార్జునస్తోత్రం", పురందరదాసు సంకీర్తనలు.

శ్రీనివాస్ ఒక కవి కూడా. 1997 లో ఏసుదాస్ ,బాల సుబ్రహ్మణ్యం వంటి గాయకులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారి మీద ఆశుకవిత్వం కూడా రాసారు. చంద్రుడి మీద మనిషి అడుగు పెట్టిన సందర్భాన్ని కీర్తిస్తూ ఆయన రెండు ఆంగ్ల కవితలు కూడా రాసారు. వాటిని పాటలుగా మార్చి ఎస్ ,జానకి తో కలిసి పాడి,వాటి గ్రామఫోన్ రికార్డులను నాటి అమెరికా అధ్యక్షుడు రిచార్డ్ నిక్సన్ కు ,నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కు కూడా పంపించారు. వారిరువురూ ఆయన్ని అభినందించారు.

కర్నాటక రాష్ట్రం అత్యున్నత పురస్కారం ‘కనడ రాజ్యోత్సవ’ను ,తమిళనాడు ‘కలైమామణి ‘పురస్కారాన్ని ఆయన పొందారు.

గాయకుడిగా అందరిని మెప్పించిన పిబి శ్రీనివాస్ తన 82 ఏళ్ల వయసులో 2013 ,ఏప్రిల్ 14 న గుండెపోటుతో మరణించారు. ఆయన జీవిత కథను ‘మాధుర్య సార్వభౌమ డాక్టర్ పిబి శ్రీనివాస్ ‘పేరుతో ఆర్ శ్రీనాథ్ రాసారు.

పిబి శ్రీనివాస్ మరణించినా ఆయన స్వరానికి మరణం లేదు!

* * *

Read More
Next Story