
తెలంగాణలో ‘మానసిక సంక్షో భం’
మనస్సుకు సాంత్వన చేకూర్చే ప్రయత్నం ‘సేవ’
-వెలది. కృష్ణ కుమార్
శ్రీవాణి మధ్యతరగతి గృహిణి, సాఫీగా సాగిపోయే జీవితమే.. ఆర్థిక ఇబ్బందులు పెద్దగా లేవు, ఇద్దరు పిల్లలతో చక్కని సంసారం.. అయినా ఏదో మానసిక ఆందోళన, నిత్యం భయం, దడ..ఈ జీవితం ఎందుకు... చనిపోవాలనే ఆలోచన..
శ్రీధర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి తగినంత జీతం అయినా నిత్యం నరకయాతన ఆలోచనలతో సతమతం, ఎవరితోనూ కలవలేడు.ఎప్పుడూ ఏదో పొగొట్టుకున్నాననే బాధ, జీవితం పై విరక్తి.....ఇది ఒక్క శ్రీవాణి సమస్యో.. లేకుంటే ఓ శ్రీధర్ సమస్యో కాదు.. మారుతున్న జీవనసరళితో సమాజంలో పెరుగుతూ వస్తున్న రుగ్మత ఇది..అదే డిప్రెషన్...
ప్రేమ విఫలం, పరీక్షలలో ఫెయిల్, దీర్ఘకాలిక అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, గృహ హింస, కరువవుతున్న పిల్లల ఆదరణ, అనుకోకుండా జరిగే ఘటనలు,ఉద్యోగం లో వత్తిడి, వేధింపులు, జూదం, మద్యం లాంటి వ్యసనాలు , ఇలా ఒక వ్యక్తి మానసికంగా దెబ్బతినడానికి సవాలక్ష కారణాలు.ఒకసారి కుంగుబాటుకు గురైతే నరకం చూడాల్సిందే.చదువుకునే విద్యార్దుల నుంచి వృద్దుల వరకూ ఎవరిని వదలని రోగంలా మారింది.ఎప్పుడో ఒకప్పుడు మానసిక అనారోగ్యానికి గురికావడం... ఇప్పుడు అందరికీ పరిపాటిగా మారిందంటే కాదనలేమేమో.
ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు
తాజాగా విడుదలైన తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాల అనంతరం ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం, ఆ కుటుంబ సభ్యులనే కాదు, యావత్ రాష్ట్రాన్ని కలచివేసింది. ఏదో ఇప్పుడే ఇలాంటి దారుణం జరిగింది అనుకుంటే పొరబాటే, పరీక్షలలో ఫెయిల్ అయ్యామనే కాదు, వత్తిడిని భరించలేక డిప్రెషన్ కు గురై బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న విద్యార్ధుల సంఖ్య పెరుగుతోంది. మానసిక నిపుణులు ఎన్నో సూచనలు చేస్తున్నా, ఒక పరీక్ష లో ఫెయిల్ అయితే ఏమికాదు.. ఎంతో భవిష్యత్ వుందని తెలిసినా, తమ బంగారు జీవితాలను మొగ్గలోనే విద్యార్థులు తుంచేసుకోవడానికి కారణం వారిని వెంటాడుతున్న మానసిక వత్తిడి.
విస్మయపరుస్తున్న తెలంగాణ గణాంకాలు
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో 2022 లో ఇచ్చిన నివేదిక ప్రకారం ..కేవలం 2022లో 543 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని డేటా చెబుతోంది. ఆ సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతి నెలా కనీసం 45 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల అత్మహత్యల కంటే విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా వుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2022లో రైతుల ఆత్మహత్యల సంఖ్య 178 గా విద్యార్థులు 543 మంది సూసైడ్ చేసుకున్నారని లెక్కలు చెబుతున్నాయి. 2019 నుండి 2022 వరకు - తెలంగాణలో 2,025 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని NCRB రికార్డులు చూపించాయి. విద్యార్దులే కాదు అన్ని వయస్సులవారిలో మానసిక వత్తిడి పెరిగిపోతోంది.
ప్రతియేటా పెరుగుతున్న డిప్రెషన్ కేసులు.. ఆత్మహత్యలు
అనాలోచితంగా, ఒత్తిడి భరించలేక,క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం, కొన్ని సంవత్సరాలుగా పరిస్థితి మరింత దిగజారుతోంది. 2017 నుంచి 2022 వరకు ఆత్మహత్యల రేటు లక్షకు 9.9 నుంచి 12.4కి పెరిగింది. 2022లోనే దేశవ్యాప్తంగా 1,70,924 ఆత్మహత్యలు నమోదయ్యాయి. 2021లో ఉన్న 1,64,033 కేసులతో పోలిస్తే 4.2 శాతం పెరిగింది.తెలంగాణ లో 26.3 శాతం ఆత్మహత్యలు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా చూస్తే ప్రభుత్వోద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువగా తమిళనాడులో నమోదైంది. 2,166 ఆత్మహత్యల్లో 364 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంఖ్య మహారాష్ట్రలో 286, కర్ణాటకలో 169గా ఉంది.ఈ వివరాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్‌లో పబ్లిష్ అయ్యాయి.
గ్రామీణ ప్రాంతాలలోనూ పెరుగుతున్న డిప్రెషన్ కేసులు
నగరజీవనానికి పరిమిమైన డిప్రెషన్, ఆందోళనలు గ్రామీణ భారతానికీ వ్యాపించినట్టు తాజాగా సర్వేలో తేలింది. ట్రాన్స్‌ఫార్మ్ రూరల్ ఇండియా, దాని అనుబంధ డెవలప్‌మెంట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి.గ్రామీణ భారతంలో ఆరోగ్య స్థితిగతుల పేరిట ఈ సర్వే ఫలితాలను విడుదల చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 45 శాతం మంది తాము డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడ్డామని చెప్పుకొచ్చారు. మొత్తం 21 రాష్ట్రాల్లోని 5,389 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.మానసిక రోగాలు పెరగడం ప్రజారోగ్యానికి మంచిది కాదని మానసిక నిపుణులు తెలుపుతున్నారు.
వయసులో ఉన్న వారికంటే వయసు మళ్లిన వారిపై ఈ సమస్య ఎక్కువ ప్రభావం చూపిస్తోందని సర్వేలు పేర్కొంటున్నాయి. 18-25 ఏళ్ల వయసు 40 శాతం మంది తమను ఏదోక సందర్భంలో భయాందోళనలు వేధించాయని తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారిలో 53 శాతం మంది తమకీ ఇబ్బంది కలిగినట్టు చెప్పుకొచ్చారు.
కరోనా మహమ్మారి వచ్చిన తరువాత మరింత ఆందోళనకరంగా డిప్రెషన్ కేసుల సంఖ్య పెరిగినట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. మన మానసిక ఆరోగ్యం మన మానవస్థితిలో ఒక ముఖ్యమైన భాగం కాబట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో అవసరమని, ఆదిశగా అన్ని దేశాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని WHO కూడా పేర్కొంది.
మానసిక రోగులకు అండగా "సేవ"
మానసిక రోగానికి మందు లేదనేది కొందరి మాట... తాము మానసికంగా కుంగి పోవడమే కాదు, మొత్తం కుటుంబాన్ని ఇబ్బందుల లోకి నెట్టే ...ఇలాంటి వారికి కావలసింది కొద్దిగా ఓదార్పు నిచ్చేవారు.. మనస్సులో ధైర్యం నింపి ఆ రోగం నుంచి దూరం జరిగేలా చేసేవారు కావాలి.మందులు చేయని పని సరియైన కౌన్సెలింగ్ చేసి చూపిస్తుంది. అందుకే సరిగ్గా అలాంటి పని చేస్తూ, బాధితులకు అండగా .. నిలవాలన్న తలంపు నుంచి ఆవిర్భవించింది "సేవ" స్వచ్ఛంద సంస్థ .మానసికంగా కృంగిపోతున్న వారికి అండగా నిలుస్తూ , వారిలో మార్పు తీసుకురావడానికి శత విధాలా ప్రయత్నిస్తోంది.మానసికంగా కుంగుబాటు.. అదే డిప్రెషన్ కు గురైన వారికి మేమున్నాం అంటూ ధైర్యం చెబుతోంది.నిపుణులైన కౌన్సెలింగ్ థెరపిస్టులు అందుబాటులో వుండి ఉచితంగా బాధితుల మనస్సుకు స్వాంతన కల్గించడం సేవా సంస్థ విధులు.
1993 ఆగస్టు21 న ఒక మహిళామూర్తి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది SEVA వాలంటరీ ఆర్గనైజేషన్..ఆమే శారదా గోపాలకృష్ణన్ .ఢిల్లీలోని ఓ స్వచ్ఛంద సంస్థలో సభ్యురాలు. అక్కడ మానసిక సమస్యలతో బాధపడే వారికి కౌన్సెలింగ్ , సలహాలు ఇస్తుంటారు. ఆమె భర్త ఉద్యోగరిత్యా హైదరాబాద్ కు బదిలీ కావడంతో ఇక్కడకు వచ్చిన శారదా గోపాలకృష్ణన్ హైదరాబాద్ లోనే స్థిరపడి" సేవ ఫౌండేషన్ "కు రూపం ఇచ్చారు. తన ఆలోచనలు మరి కొందరితో పంచుకొని ఒక బృందం లా ఏర్పడి స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి 30 సంవత్సరాలకు పైగా ఈ సేవ కార్యక్రమం కొనసాగుతోందని ప్రస్తుతం "సేవ" కార్యదర్శి గా వున్న అభిలాష్, గౌరవ అధ్యక్షులుగా వున్న త్యాగరాజన్ ఫెడరల్ తెలంగాణా తో మాట్లాడుతూ తెలిపారు. మొదట్లో చిన్న సేవా కేంద్రంగా ప్రారంభమైన సేవ కార్యక్రమాలు నగరంలో పలు చోట్లకు విస్తరించామన్నారు. మానసికంగా ఆందోళన గురయ్యే వారిలో కాన్ఫిడెన్స్ పెంచడానికి కౌన్సెలింగ్ ఇస్తామని, అన్ని రకాల ఎమోషనల్ సమస్యలకు పరిష్కారం ఇవ్వడానికి తమ వంతు ప్రయత్నం "సేవ"సంస్థ ద్వారా చేస్తామని అభిలాష్ తెలిపారు. 50 కి పైగా కమిటెడ్ వాలంటీర్లు కౌన్సిలర్లు గా అవసరం అయిన వారికి అందుబాటులో వుంటారన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఈ తరహా ఉచిత సేవలు సేవ సంస్థతోనే మొదలయ్యాయని తెలిపారు.
"గుప్పెడంత గుండెలో ఎటువంటి ఆందోళన వుండకూడదు, ఏ రకమైన వత్తిడికి లోనుకాకూడదు"అనే ఉద్దేశ్యంతో తమ కార్యాచరణ వుంటుందని త్యాగరాజన్ అరుణాచలం తెలిపారు. మొదటి నుంచి వాలంటరీగా ముందుకు వచ్చే వారిని కొంత మందిని తీసుకుని కౌన్సెలింగ్ లో వారిని నైపుణ్యం పెరిగేలా శిక్షణా తరగతులను నిర్వహించామన్నారు. అలా సేవా ఫౌండేషన్ తరుపున వాలంటీర్ల సంఖ్య పెరిగిందని తెలిపారు.తమని సంప్రదించిన వారికి ఫోన్ ద్వారా, విడియో కాల్స్ ద్వారా అవసరమైన కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నేరుగా వచ్చే వారికోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో వున్న తపాడియా డయాగ్నసిస్ భవనం లోనూ, పంజాగుట్ట లోని హీల్ హెల్త్ ఎడ్యుకేషన్ సెంటర్ లోనూ సీనియర్ కౌన్సిలర్లు, సైకాలజిస్టులు సైతం నిర్ణీత సమయంలో అందుబాటులో వుంటారు. కౌన్సెలింగ్ తీసుకోవడానికి మానసిక రోగులు ముందుకు రారని తమ విషయం మరొకరికి తెలుస్తుందన్న భయం వుంటుందని, కౌన్సెలింగ్ కు వచ్చిన వారి వివరాలు, ఫోన్ చేసి మాట్లాడేవారి వివరాలు గోప్యంగా వుంచుతామని ఇందులో భయపడాల్సింది ఏమి లేదన్నారు. తన దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ తీసుకున్న తరువాత పూర్తిగా ఆ భయం నుంచి బయటపడిన వారు అనేక మంది వున్నారని, జీవితాలలో మార్పు తెచ్చి ఆనందం నింపినందుకు తనకు ఎంతో తృప్తి గా వుందన్నారు. ఏడాది లో వెయ్యికి పైగా కాల్స్ ను రిసీవ్ చేసుకోవడమే కాక, వారికి తగిన రీతిలో మనోధైర్యాన్ని సేవ ఫౌండేషన్ అందిస్తోంది. ముఖ్యంగా తెలుగు , ఇంగ్లీష్ , హిందీతో పాటు అవసరమైన వారికి తమిళం, మరాఠీ,గుజరాతీ లో కౌన్సెలింగ్ అందించడానికి వాలంటీర్లు అందుబాటులో వున్నారు.
సేవా ఫౌండేషన్ అవేర్ నెస్ కార్యక్రమాలు
మెంటల్ హెల్త్ పై ప్రజలకు అవగాహన పెంపొందించడానికి పలు కార్యక్రమాలను సేవా ఫౌండేషన్ నిర్వహిస్తోంది. కళాశాలలో , ఎంపిక చేసుకున్న ప్రదేశాలలో సెమినార్ లను సేవ సంస్థ తరుపున నిర్వహించారు. యాంటీ టొబాకో అవేర్ నెస్ కార్యక్రమాలు, వ్యసనాలకు బానిసైన వారిలో మార్పు తెచ్చేరీతిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. హైదరాబాద్ లో వున్న ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రులు గాంధీ, నిమ్స్ , ఉస్మానియాల లోని మానసిక రోగుల విభాగాలలో చికిత్స పొందుతున్న రోగులకు సేవ సంస్థ తమ వాలంటీర్ల తో కౌన్సిలింగ్ ఇస్తూ వారిలో త్వరగా మార్పు వచ్చేలా ప్రయత్నిస్తోంది. నగర వ్యాప్తంగా అనేక కమిటీలను తయారుచేసి వాటిద్వారా సెమినార్లు,వర్క్ షాప్ , శిక్షణా కార్యక్రమాలు పూర్తి ఉచితం గా అందిస్తోంది. సైకాలజిస్టులు, ఉత్సాహం వున్నవారు తమతో కలిసి రావాలని ఆహ్వానిస్తోంది.మానసిక వత్తిడి, డిప్రెషన్ తో బాధపడుతూ భరోసా కౌన్సెలింగ్ కోరుకునే వారు 94902 33170 నెంబర్ కు ఫోన్ చేయవచ్చు. వెబ్ సైట్ ను విజిట్ చేయవచ్చ.
Next Story