ఒకానొక గిరి ప్రదక్షిణ !
x

ఒకానొక గిరి ప్రదక్షిణ !

అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి?


-పుష్యమీ సాగర్

అరుణాచల గిరి ప్రదక్షిణకు చాలా ప్రాముఖ్యత వున్నది. అరుణాచలం వెళ్లిన వారు తప్పకుండా గిరిప్రదక్షిణ చేస్తారు. అరుణాచలేశ్వరుడికి కూడా గిరి ప్రదక్షిణ అంటే చాలా ఇష్టమని శాస్త్రం చెబుతోంది. అందుకే పరమశివుడు కూడా పార్వతీ దేవితో కలిసి సంవత్సరానికి రెండు సార్లు గిరి ప్రదక్షిణ చేస్తాడని పండితులు చెబుతన్నారు. గిరి ప్రదక్షిణ చేసే వారిని చూసి ఆ దేవదేవుడు చాలా సంతోషిస్తాడు. వారి కోరకలను నెరవేరుస్తాడు. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం. ఈ కొండ చుట్టూ దూరం సుమారుగా 14 కిలోమీటర్లు వుంటుంది.

నేను తిరుపతి ఎప్పుడు వెళ్లినా కూడా అరుణాచలం వెళదాం అనుకుంటాను. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా వెళ్లలేకపోతాను. చాగంటి వారి ప్రవచనాలతో అరుణాచలం లో తెలుగు భక్తుల రద్దీ ఎక్కువ అని తెలిసినా ఈ సారి ఎలాగైనా వెళ్లి గిరి ప్రదక్షిణ చెయ్యాలి అని నిశ్చయించాను. నేను మా కుటుంబ సభ్యలతో కలిసి వెళ్లాను. మొదట గా తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అటు పిమ్మట అరుణాచలం కి బస్సు లో ఎక్కి వెళ్లాను. సుమారు గా ఐదు గంటల ప్రయాణం. హైదరాబాద్ లో ఉన్న వాతావరణానికి , అరుణాచలం చాలా తేడా ఉంది. అక్కడ విపరీతమైన వేడి . బహు శా అగ్ని లింగ క్షేత్రం అయినందు వలన కావచ్చు లేదు చుట్టూ కొండల ప్రభావం వలన కావచ్చు.

అరుణాచలం లో విపరీతమైన రద్దీ. అతి కష్టం మీద మాకు హోమ్ స్టే దొరికింది. రెండు వేల కి ఒకటిన్నర రోజులు ఉండేలా మాట్లాడుకున్నాం ఎందుకంటే మా సభ్యులు మొత్తం ఏడుగురు కదా అందుకని ...ఉత్తర రాజగోపురం దగ్గరే ఉంది కాస్త సులువు అయ్యింది. వెళ్లిన మరుసటి రోజు తెల్లవారుఝామున ఐదు గంటలకి గిరి ప్రదక్షణ మొదలు పెట్టాము. (అంతకు ముందు నాలుగు సార్లు అరుణాచలం వచ్చినా కేవలం దర్శనమే తప్ప గిరి ప్రదక్షిణ చేసేంత టైం లేకుండా .ఉన్నదీ ఈ సారి అలా కాకుండా దీని కోసమే ఒక రోజు కేటాయించాము కాబట్టి సమస్య లేదు).

నాకు రోజు వాకింగ్ చేస్తాను కాబట్టి కొంతవరకు పరవాలేదు. పాపం మా వాళ్ళకి కొత్త కదా కాసంత ఇబ్బంది పడ్డారు. గిరి ప్రదక్షిణ లో నేను చూసిన ఆలయాలు గురించి చెప్తాను. ఇంకా అసలు గిరి ప్రదక్షణ ప్రాముఖ్యం ఏమిటో కూడా తెలుసుందాం..

గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యం

గిరి ప్రదక్షిణ గురించి ఒక సారి గౌరీ దేవి గౌతమ మహర్షిని ఇలా అడుగుతుంది. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని అడిగింది. దీనికి గౌతమ మహర్షి సంతోషించి శివుడి కోసం ధ్యానించాడు. శివుడు ప్రత్యక్షమై గౌతమ మహర్షితో ఇలా అంటాడు. భూలోకంలో నేను అరుఛాలేశ్వర రూపంలో వున్నాను. అందుకే దేవతలు, మునులు అక్కడకు వచ్చి నాకు ప్రదక్షిణ చేస్తారు.


నా చుట్టూ చేసే ప్రదక్షిణకు ప్రతీ అడుగుకు వారి జన్మజన్మల పాపాలు నశిస్తాయ్. పుణ్య తీర్థాల నుంచి వచ్చే ఎంతో పుణ్యము ఈ గిరి ప్రదక్షిణతో వస్తుంది. కొంచెం కూడా పుణ్యం చేయని పాపాత్ముడు నా చుట్టూ తిరగడం వల్ల చాలా శక్తులను పొందగలుగుతాడు.

ఒక అడుగుతో భూలోక ప్రాప్తి, రెండవ అడుగుతో మధ్యలోక ప్రాప్తి, మూడవ అడుగుతో దేవలోక ప్రాప్తి కలుగుతుంది. మొదటి అడుగులో మానసిక పాపాలు తొలగిపోతాయ్. రెండవ అడుగులో వాచిక పాపములు తొలగిపోతాయి, మూడవ అడుగులో శారీరక పాపాలు నశిస్తాయి. ఈ అరుణాచలం చుట్టూ మునులూ, సిద్ధ పురుషుల ఆశ్రమాలు వేల సంఖ్యలో వున్నాయ్. నేను సిద్ధ స్వరూపముతో ఈ అరుణాచలంలో వుంటూ వారిని చేస్తున్నాను. ఈ అరుణాచలం తేజో స్తంభం. ఈ తేజో లింగాన్ని మనసున ధ్యానిస్తూ నెమ్మదిగా ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా ప్రదక్షిణ చేస్తే వారి జన్మ జన్మల పాపాలు నశిస్తాయి.


గిరి ప్రదక్షిణ కోసం కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు, భక్తులు పర్వతం యొక్క ఎనిమిది దిక్కులలో ఉన్న శివలింగాలను దర్శనం చేసుకోవచ్చు.

అరుణగిరి ప్రదక్షిణ నియమాలు

అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే భక్తులు పాదరక్షలు ధరించకూడదు. మద్యపానం, మాంసాహారం, ధూమపానం చేయరాదు. ప్రాపంచిక విషయాలను పక్కన పెట్టి 'అరుణాచల శివ అరుణాచల శివ' అంటూ గిరి ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ వలయంలో కాఫీ, టీ, ఇతర తినుబండారాలు దొరుకుతాయి. మార్గమధ్యంలో ప్రయాణ బడలిక తీర్చుకోడానికి కాఫీ, టీ తాగవచ్చు. తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు.

భక్తి ప్రధానం

అరుణాచల గిరి ప్రదక్షిణానికి కావాల్సింది ఆ ఈశ్వరుని మీద పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు మాత్రమే! ఏదో కాలక్షేపం కోసమో, ఒక విహార యాత్రకు వెళ్లినట్లుగానో అరుణాచలానికి వెళ్లకూడదు. జీవితంలో ఒక్కసారి గిరిప్రదక్షిణ చేస్తే మోక్ష ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రతి నిత్యం సాయం సంధ్యా సమయంలో 'అరుణాచల శివ' అని స్మరిస్తే చాలు కొండంత పాపరాశి యైన అరుణాచలుని కృపాగ్నిలో ధ్వంసమై పోతుంది.


మేము ఐదు గంటలకి మొదలు పెట్టాము కదా.. మధ్య దారి లో ఒక ఇద్దరు స్థానికులు అనుకుంటాను . అందరికి ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అక్కడికి చాలా మంది రావడం నేను గమనించాను. ఒక మూడు కిలోమీటర్ లు నడిచాక మాకు ఆకలి వేసి ఒకచోట టిఫిన్ చేసాము. తప్పదు కదా...దారి పొడవునా శివ నామం తలుస్తూ ముందుకు సాగాము. మొదటి ఐదు కిలోమీటర్ లు బాగానే నడిచాము ఎండా వేడి కి తట్టుకోలేకపోయాము ...అయితే అక్కడ అడుగు అడుగు కి వాటర్ బాటిల్ అమ్మేవాళ్ళు, జ్యూస్ పాయింట్ లు ఇంకా తినేవాళ్ళకి తిండి , దారి పొడవునా టాయిలెట్ సౌకర్యాలు బాగున్నాయి. అంతా తారు రోడ్డు అయినా మధ్య లో కా లి బాట కోసం పైన గొడుగులు కింద టైల్స్ వేశారు బాగుంది.

మొత్తం పద్నాలుగు కిలోమీటర్ లు దూరం నడిచే వారికి మా వాళ్ళకి నాకు కూడ శక్తి అయిపోయింది . మధ్య మధ్య లో నీళ్లు మజ్జిగా తాగాము కాబట్టి సరిపోయింది. పొద్దున్న తిరుగుతున్నాము కాబట్టి దారి లో ఉన్న అన్ని గుడులని దర్శించే భాగ్యము కలిగింది. సరిగ్గా మద్యాహ్నం ఒకటి గంట కల్లా గిరి ప్రదక్షిణ పూర్తి చేసాము. అటు నుంచి అటు రూమ్ కి వెళ్లి పడుకున్నాము. ప్రతీ సారి దేవస్థానం వారి అన్నదానం లో పాల్గొనడం జరిగేది. అక్కడ దొరికే అన్నదానము అద్భుతం. అయితే భక్తుల రద్దీ ఎక్కువ కావడం మూలానా మాకు కుదరలేదు. బయట ఎదో మంచి హోటల్ లో భోజనం చేసి రూమ్ కి వెళ్లి ఆ రోజు అంతా కూడా రెస్ట్ తీసుకున్నాం. మరల మరుసటి రోజు సాయంత్రం తిరుపతి కి వచ్చి రైలు ఎక్కి హైదరాబాద్ వచ్చేసాం. మొత్తానికి నా అరుణాచల గిరి ప్రదక్షణ అలా పూర్తి అయ్యింది.

ఇలా చేరుకోవచ్చు

అరుణాచలం చెన్నై నుంచి 185 కి.మీ. దూరంలో ఉంది. చెన్నై నుంచి బస్సు మరియు ట్రైన్ సౌకర్యం ఉంది. చెన్నై నుంచి అరుణాచలం చేరుటకు 4-5 గంటల సమయం పడుతుంది. తిరుపతి నుంచి కూడా అరుణాచలమునకు బస్సులు కలవు.

ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః

Read More
Next Story