‘చివరకు మిగిలేది’లో  రాయలసీమ
x

‘చివరకు మిగిలేది’లో 'రాయలసీమ'

ప్రముఖ రచయిత బండి నారాయణస్వామి విశ్లేషణ


సాహిత్యం జన్మించిన కాలానికి, ఆ సాహిత్యంలో ద్యోతకమయ్యే దేశకాల పరిస్థితులకు సంబంధం వుంటుంది అని ఆరుద్రగారు సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో గొప్పగా రుజువు చేసినారు. బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది నవలకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ నవలకు అంకురార్పణ జరిగినది 1943 సంవత్సరం. స్థలం అనంతపురం. కాబట్టి, ఈ 1943వ నాటి కాలము, రాయలసీమ ప్రాంతము తమ దేశకాలాలను ఏవిధంగా పోషించాయో ఈ నవల చదివితే తెలుస్తుంది.

1905 బెంగాల్ విభజనతో తెలుగు ప్రజలలో భాషాస్పృహ పెరిగింది. అప్పటికి రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతం మదరాసు ప్రెసిడెన్సీలోనే వున్నాయి. 1910లో ఉన్నవ లక్ష్మీనారాయణ వంటివారు భాషాప్రయుక్త రాష్ట్రాలు కోరుకున్నారు. 1913 ఆంధ్రమహాసభలో కొండా వెంకటప్పయ్య ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని ప్రస్తావించినాడు. కానీ అందుకు రాయలసీమ ప్రాంతం సిద్ధంగా లేదు. 1849-50లోనే కోస్తా ప్రాంతాలకు ధవళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణాబ్యారేజ్ వచ్చి, ఆ ప్రాంతాలు సస్యశ్యామలం అయినాయి. మదరాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి, ఆంధ్రరాష్ట్రంలో చేరితే తమకు పుట్టగతులు వుండవని రాయలసీమ నాయకుల భయం. అప్పటికే వార్తామాధ్యమాలు కానీ, సినీ నిర్మాణాలు కానీ, విద్యాఉద్యోగాలు అన్నీ.. కోస్తావారి చేతుల్లోనే దఖలు పడిపోవడం, వారి భాషా సంస్కృతులే రాయలసీమ అచ్చుపుస్తకాలలో కూడా చెలామణి కావడం ఒక వాస్తవం. ఆంధ్రరాష్ట్రంలో చేరితే అప్పటికే మదరాసు ప్రెసిడెన్సీలో రాయలసీమ కోసం ఏర్పడిన నీటి ఒప్పందాలు ప్రమాదంలో పడతాయి అని, సర్కారు జిల్లాలవారి శక్తియుక్తులతో తలపడేంత శక్తి, వెనుకబడిన రాయలసీమకు వుండదు అని అప్పటి రాయలసీమ నాయకుల భయం.

1913 ఆంధ్రమహాసభలోనే, ఆంధ్రరాష్ట్రానికి రాయలసీమ వారు వ్యతిరేకం అని గుత్తి కేశవపిళ్లై ప్రకటించినాడు. ఉంటే మదరాసు ప్రెసిడెన్సీలోనే వుంటాము అని, లేదా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రంగా వుంటామని ప్రసంగించినాడు. 1926లో రాయలసీమకు రావలసిన ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని సర్కారు జిల్లాలు తరలించుకుపోవడంతో ఈ వ్యతిరేకత మరింత బలపడింది. ఈవిధంగా ఆంధ్రోద్యమం ఒకవైపు, ఆంధ్రోద్యమ వ్యతిరేక ఉద్యమం ఒకవైపు బయలుదేరినాయి. ఇందుమూలంగా సర్కారు జిల్లా ప్రజలకీ, రాయలసీమ ప్రజలకీ ప్రాదేశిక విముఖత ఏర్పడింది. ఒకరిమీద ఒకరు నమ్మకం కోల్పోయినారు. రాయలసీమ విద్యావంతుల సమూహాలలో కోస్తాంధ్ర పట్ల వ్యతిరేకత బాహాటంగా వ్యక్తమవుతూవున్న రోజులవి. ఇవీ ఆనాటి రాయలసీమ దేశకాల పరిస్థితులు. ఈ ఆంధ్రోద్యమ వ్యతిరేక భావజాలం 1943 నాటికి మరింత తీవ్రమయింది.

రెండు ప్రాంతాల ఈ వ్యతిరేక భావజాలాల నడుమ, బుచ్చిబాబు గారు అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో లెక్చరర్‌గా చేరినారు. చిత్రమేమిటంటే బుచ్చిబాబు గారు సర్కారు జిల్లా ఏలూరులో 1916లో జన్మిస్తే, అనంతపురం ఆర్ట్స్ కళాశాల కూడా అదే 1916లోనే ప్రారంభించబడింది.

బుచ్చిబాబు నవలలో దయానిధి ప్రధాన పాత్ర. నవలలో దయానిధి పాత్ర అభిప్రాయాలను బుచ్చిబాబు తాత్వికతగా మనం అర్థంచేసుకోవచ్చు. దయానిధి ఏలూరు నుంచి బయలుదేరడంతోనే ఒక తాత్వికతను వెంటబెట్టుకొని వస్తాడు. ఆ తాత్వికతను బుచ్చిబాబు నవల ముందుమాటలో ఇట్లా రాసుకుంటాడు-

‘‘సమాజాల మధ్యవున్న ద్వేషాలకు, వ్యక్తులు ప్రేమించలేకపోవడానికి ఏదో సంబంధం వుండివుండాలని నా నమ్మకం’’.

‘‘మనుషుల్లోని ప్రేమించలేనితనమే వారి అకారణ ద్వేషమని, ఆ అకారణ ద్వేషమే ప్రాంతీయ విద్వేషాలకు కూడా దారితీస్తుంది’’ అని కూడా సూత్రీకరిస్తాడు.

ఈ సూత్రీకరణను కొన్ని సందర్భాలలో కోస్తా, రాయలసీమలకు మధ్యవున్న విముఖత్వానికి కూడా ఆపాదిస్తాడు. కానీ ఈ ప్రాంతాల మధ్య విముఖత్వానికి అకారణ ద్వేషం కారణం కాదని మనకు తెలుసు. ఈ రెండు ప్రాంతాల మధ్య విముఖత్వానికి స్పష్టమైన కారణాలు అనేకం వున్నట్లుగా చరిత్ర రుజువు చేస్తూనేవుంది. ఈ కారణాలు కనుక్కోవడానికి దయానిధికి కొంత సమయం పడుతుంది. అయితే ఈలోపల దయానిధికి రాయలసీమ పల్లెల పట్ల, ఆ ప్రాంతపు దారిద్ర్యం పట్ల సహృదయత లేకపోలేదు. బుచ్చిబాబు చిత్రకారుడు కూడా. గొప్ప కళాకారుడు. అతడు దయానిధి పాత్ర ద్వారా తాను చూసిన రాయలసీమ పల్లెల దుస్థితిని ఈవిధంగా దృశ్యమానం చేస్తాడు-

‘‘ఆ ఊళ్లు చిత్రంగా వుంటాయి. మైళ్లుమైళ్లు చెట్లేవుండవు. రకరకాల రాళ్లు. అంతా రాళ్లమయం. చిత్రమైన గడ్డి. తమాషా మొక్కలు. మూడు రాతిబండలు, మూడు గోడలు, పైన రాయి. అదే ఇల్లు! కాలువ, పిల్లకాలువ, చెరువు, నుయ్యి.. ఏవీ కనపడవు. ఉండివుండీ అన్ని ఆకులూ ఊడిపోయి, మొండికొమ్మల చెట్టు కొమ్మలు చాచి అస్తిపంజరం ప్రదర్శిస్తుంది. ఆ రాళ్ల వెనక సూర్యాస్తమయం చూస్తే ఏడవాలనిపిస్తుంది!’’

రాయలసీమ భౌగోళిక దుస్థితి గురించి ఇతర ప్రాంతాలకు అర్థం చేయించినవారిలో కొనకళ్ల వెంకటరత్నం తోపాటు బుచ్చిబాబు గారు కూడా వున్నారని ఈ చివరికి మిగిలేది నవల తెలియచేస్తుంది.

ఉద్యోగ నిమిత్తం అతడు రాయలసీమకు రాకపోయివుంటే, ప్రేమరాహిత్యం అనే తన తాత్విక భ్రమలోనే వుండేవాడు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల మధ్య విముఖత్వానికి అకారణ ద్వేషమే కారణమని నమ్మివుండేవాడు. తన నమ్మకాన్ని మార్చుకోవడానికి అసలు కారణం అతడు అనంతపురంలో కాలుమోపడమే. అప్పుడు అనంతపురంలో అతడి సహచరులు ఎవరు? పరిచయస్తులు ఎవరు? అనంతపురంలో ప్రత్యేక రాయలసీమ భావజాలం ఏవిధంగా ఆవరించి వుండేది? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పుకుంటే తప్ప, రాయలసీమ ఉద్యమం పట్ల బుచ్చిబాబులో వచ్చిన భావపరిణామం మనకు అర్థంకాదు.

బుచ్చిబాబు గారు పనిచేసిన కళాశాల సీడెడ్ జిల్లాలు అంతటికీ మొదటి కళాశాల. అప్పటికి ఆ కళాశాలలో చిలుకూరి నారాయణరావుగారు పనిచేస్తున్నారు. అతడు 1928 నంద్యాల సభకు హాజరైనవాడు. దత్తమండలాలకు బదులుగా ‘రాయలసీమ’ అనే గౌరవనీయమైన పేరు సూచించినాడు. 1943లో అదే కళాశాలలో అతడు పదవీవిరమణ చేసేవరకు బుచ్చిబాబు గారు ఆ కళాశాలలోనే వున్నారు. ఇంకా చెప్పాలంటే చిలుకూరి గారు- ‘‘దత్తత ఇవ్వడానికి నిజాము ఎవ్వడు..? పుచ్చుకొనుటకు ఇంగ్లీషువాడు ఎవ్వడు..?’’ అని ధిక్కరించినవాడు. కళాశాల అధ్యాపకులలో వారిద్దరూ సహచరులు కావడం వల్ల ఇద్దరిమధ్యా సంభాషణలు జరిగేవుంటాయి. రాయలసీమ ప్రసక్తి వచ్చేవుంటుంది. చిలుకూరి నారాయణరావు గారిది శ్రీకాకుళం. రాయలసీమ ఉద్యమం పట్ల చిలుకూరి నారాయణరావు గారి ఆర్తిని బుచ్చిబాబు గారు గమనించే వుంటాడు.

కళాశాలలో బుచ్చిబాబు గారు ఉద్యోగిస్తున్న కాలంలోనే అనంతపురంలో పప్పూరి రామాచార్యులు గారు వున్నారు. అతడు రాయలసీమ ప్రత్యేకరాష్ట్ర దార్శనికుడు. అనంతపురంలో శ్రీసాధన పత్రిక నడుపుతున్నవాడు. చిలుకూరి నారాయణరావు ప్రతిపాదించిన ‘రాయలసీమ’ పేరును తన పత్రిక ద్వారా ప్రాచుర్యంలోకి తెస్తున్నవాడు. రాయలసీమ ప్రజల ప్రాంతీయ భావోద్వేగాలను ప్రతిబింబించే వారి ‘శ్రీసాధన’ పత్రికను బుచ్చిబాబు గారు చదివేవుంటారు. రాయలసీమ సమస్యల గురించి పప్పూరి రామాచార్యులవారితో సంభాషణలు జరిపేవుంటారు.

అనంతపురంలోని ఈ సాంస్కృతిక వాతావరణం అంతా బుచ్చిబాబుగారి మీద పని చేసేవుంటుంది. ప్రభావితం చేసే వుంటుంది. అందుకే అతడి నవలలోని దయానిధి పాత్ర పోనుపోనూ రాయలసీమ ఉద్యమానికి సానుకూలంగా మారుతుంది. రాయలసీమకు, కోస్తా జిల్లాలకూ నడుమ పొడుచుకొస్తున్న ద్వేషం అకారణం కాదని, అందుకు కారణాలు అనేకం వున్నాయని ఆ పాత్ర గ్రహిస్తుంది.

నాడు స్వాతంత్ర్య ఉద్యమంతోపాటు ఆంధ్ర రాష్ట్రోద్యమం సమాంతరంగా కొనసాగుతూవుంది. మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విడివడి ఆంధ్రరాష్ట్రంలో చేరే విషయం గురించి తెలుగు ప్రజలు రెండు దృక్పథాలుగా చీలిపోయినారు. అప్పటికే 1937 సంవత్సరంలో శ్రీబాగ్ ఒడంబడిక రూపొందివుంది. అందులో రాయలసీమకు కృష్ణా నీళ్లు, రాజధాని వాగ్దానం చేయబడింది. అయినప్పటికీ పప్పూరి రామాచార్యులు, భుజంగరావు, రామకృష్ణారెడ్డి వంటి రాయలసీమ నాయకులు కోస్తా పెద్దల వాగ్దానాన్ని నమ్మలేకపోయినారు.

చివరకు మిగిలేది నవలలో దయానిధికి ఒక స్నేహితుడు వుంటాడు. పేరు రాజభూషణం. పశ్చిమగోదావరి జిల్లా. మదరాసు ప్రెసిడెన్సీ నుండి బయటపడి, తెలుగువారంతా ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని నిర్మించుకోవాలనే భావజాలాన్ని అతడు రాయలసీమలో ప్రచారం చేస్తుంటాడు. ఈ పాత్ర ద్వారా కోస్తా జిల్లాలవారికి రాయలసీమపై గల విముఖత్వాన్ని, చిన్నచూపును బహిర్గతం చేస్తారు బుచ్చిబాబు.

రాజభూషణం భావజాలం ఇట్లావుంటుంది-

‘‘ఏమండీ మీరు సద్దరొట్టె తింటారా?’’ అని అనంతాచార్ల కూతురు అడుగుతుంది. ఈ అనంతాచార్యుల పాత్ర, నిజజీవితంలో పప్పూరి రామాచార్యులు గారే!

దానికి జవాబుగా- ‘‘మరి గత్యంతరం లేదు. గుర్రాల తిండి తప్ప, ఏదోఒకటి!’’ అని నవ్వుతాడు రాజభూషణం.

‘‘వీళ్లకి ఓ సంస్కారమా, ఓ భాషా, ఓ కళా..? వెనుక కృష్ణదేవరాయల టైంలో గొప్పగా బ్రతికామన్న డాబులు తప్ప, వీళ్లు నిజంగా అడవి మనుషులే..’’ అని ఈసడిస్తాడు.

ఆంధ్రరాష్ట్ర కమిటీవారు కడపలో సభ పెడతారు. ఆ సభలో రాజభూషణం మాట్లాడిన మాటలు కలకలం రేపుతాయి-

‘‘నేను మొన్న రాఘవశ్రేష్టి గారి ఇంట్లో దిగాను. నాకు నవ్వొచ్చింది. ఆ ఇంట్లో నాలుగు భాషలైనా విన్నాను. ఒకరు తెలుగు మాట్లాడతారు. ఒకరు సంస్కృతం. మరిఒకరు కన్నడం. అత్తగారు తమిళం మాట్లాడుతుందిట. అందరికీ కొద్దోగొప్పో హిందీ కూడా వచ్చేవుంటుంది. వీరికి మాతృభాష లేదేమో!’’ అని ఎకసెక్కం చేస్తాడు. మాతృభాష మరచిపోకుండా, ఎన్ని ఎక్కువ భాషలు మాట్లాడితే అంత నాగరికత అన్న విషయం కోస్తా విద్యావంతుడైన రాజభూషణంకు తెలియదు. రాయలసీమకు వున్న బహుభాషా నాగరికత, మధ్యాంధ్రప్రదేశ్‌కు వుండే అవకాశం కూడా లేదు. రాయలసీమలో బహుభాషా నాగరికత అంతరించిపోవడానికి భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటమే కారణం. పరభాషా ప్రభావాలు లేని స్వచ్ఛమైన భాష మద్యాంధ్ర భాష అని కోస్తా విద్యావంతుల దురభిప్రాయం. భాషాపరంగా స్వచ్ఛత అనేది వుండదని, భాషాశాస్త్రజ్ఞులు ఏనాడో తేల్చిచెప్పినారు. ఇంకొకరకంగా చూస్తే, కావ్యభాషకు దగ్గరగా వున్నది తెలంగాణ, రాయలసీమ భాషలే కానీ, కోస్తా భాష కాదు అనికూడా ధృవీకరించినారు.

రాజభూషణం ఇంకా ఇట్ల అంటాడు- ‘‘ఆంధ్రరాష్ట్రోద్యమం సర్కారు జిల్లాలలో బయలుదేరింది. ప్రతి ఉద్యమంలోనూ సారస్వతోద్యమం కానివ్వండి, మరే ఇతర నూతన ఉద్యమం లేవదీయాల్సివచ్చినా సర్కారు జిల్లాలవారే ముందంజ వేసేది. వారే మార్గదర్శకులు. రాజకీయ, ఆర్థిక, కళ, సాంఘిక అభ్యుదయానికి పునాదిరాళ్లు వేసింది వారు!’’ అని.

కడుపు నిండిన ప్రాంతం నుండి వచ్చే కళలకు, సాహిత్యానికి.. కడుపు ఎండిన ప్రాంతం నుండి వచ్చే కళలకు, సాహిత్యానికి స్వభావంలో పెద్ద అంతరం వుంటుంది. ఈ వాస్తవాన్ని రాజభూషణం సౌకర్యంగా విస్మరిస్తాడు.

‘‘మనతో కలిస్తే, వాళ్లని మనతో సమానంగా చేయాలంటే మూడు పుష్కరాలైనా పడుతుంది’’ అంటాడు రాజభూషణం.

బ్రిటీష్ గవర్నమెంటు తన రెవెన్యూ పెంచుకునే దృష్టితో సర్కారు జిల్లాలను మాత్రమే సుసంపన్నం చేసిందికానీ, ప్రకృతి పరంగా కరువు ప్రాంతమైన రాయలసీమను అభివృద్ధి చేయలేకపోయింది.. అన్న చారిత్రక వాస్తవాన్ని అతడు గుర్తించడు.

తిప్పేస్వామి అనే పాత్ర ఒక కార్మిక నాయకుడు. రాయలసీమ ఉద్యమంలో ప్రధాన కార్యకర్త. అతడు కడప సభలో ఇట్లా అంటాడు- ‘‘మేం (ఆంధ్ర) రాష్ట్రం వద్దు అనటంలేదు. మా ప్రాజెక్టులు ఫలించి, ఆర్థికంగా సమానత్వం తెచ్చుకున్న తర్వాత రాష్ట్రం అవశ్యం తెచ్చుకుంటాం!’’ ఈ మాట దయానిధిని పూర్తిగా ప్రభావితం చేసినట్లు అనిపిస్తుంది.

రాయలసీమను చిన్నచూపు చూస్తున్న తన స్నేహితుడు రాజభూషణంతో దయానిధి ఇట్లా అంటాడు-

‘‘ముందు రాష్ట్రం రావాలని నీ వాదం. ముందుగా ఈ ఆశయం (అభివృద్ధి) కొనసాగాలని నా సంకల్పం!’’ ఇక్కడ దయానిధిలో ఆంధ్రోద్యమ వ్యతిరేకత, రాయలసీమ భావజాలం స్పష్టంగా కనిపిస్తుంది.

రాయలసీమ పల్లెల దుస్థితి గురించి మరొకచోట బుచ్చిబాబు రచయితగా ఇట్లా ఆర్తి చెందుతాడు-

‘‘ఎక్కడా మనుషులే కనపడరు. అది ఊరు. నాలుగు ఇళ్లు, పది గొర్రెలు, మూడు ఆవులు, రెండు కోళ్లు, ఒక ముసలిది ఎండలో కూర్చుని ఏదో చేస్తుంటుంది. ముసలివాడు రాళ్లు కొడుతున్నాడు. ఎక్కడా వార్ధక్యమే కానీ, యవ్వనం లేదు. ఆ మనుషులకు యవ్వనదశే వున్నట్లు తోచదు. రాళ్లల్లో ఆడుకుంటూ కుర్రాళ్లు కూడా ముసలి నవ్వులు నవ్వుతారు. వారికి వేరే ఉనికి, వ్యక్తిత్వం లేదు. వారు కదిలే రాళ్లు. నిజంగా అది రాయలసీమ కాదు. ఎవరో అన్నట్లు, రాళ్లసీమే!’’

కడప సభలో రాజభూషణం రాయలసీమలోని బహుభాషా కుటుంబాన్ని విమర్శించినందుకు ప్రతిగా, తిప్పేస్వామి దయానిధి మీద వ్యక్తిగత దూషణలకు దిగుతాడు. రాయలసీమ పట్ల అప్పటికే ఆర్తి కలిగిన దయానిధి మనసు కలత చెందుతుంది. వెంటనే కడప నుండి అనంతపురం వచ్చేస్తాడు. ఈ దాడినే రచయిత బుచ్చిబాబు కూడా తన రాయలసీమ సహోద్యోగుల నడుమ అనుభవించినాడా.. అని మనకు అనుమానం వస్తుంది. ఏ ఉద్యమానికైనా ఒకానొక టోకు దృష్టి వుంటుంది. శత్రుసమూహానికి చెందిన వ్యక్తులు అందరినీ ఒకే గాటను కట్టి విమర్శించడం ప్రతి ఉద్యమంలోనూ జరిగేదే.

‘‘ఇరుగుపొరుగు వారి స్నేహానికి ఆటంకాలు ఏవి?’’ అని ప్రశ్నించుకుంటాడు దయానిధి.

నవల చిట్టచివరికి రెండు ప్రాంతాల మధ్య ద్వేషానికి గల కారణాలను ఇట్లా దర్శిస్తాడు- ‘‘ఆర్థిక సమానత్వం వుంటేకానీ మానవుడు అందరినీ సమానంగా ప్రేమించ నేర్చుకోడు. దయాదాక్షిణ్యాలు, ఔదార్యం, ప్రేమ.. ఇట్లాంటి విలువలకు భౌతిక సంపదకు అంతటి దగ్గరి సంబంధం వుంది. అంచేత అందరికీ సమాన భౌతిక సంపద (వనరులు) సమకూర్చడం తప్ప గత్యంతరం లేదనుకుంటా!’’

దీనితో తన ప్రేమరాహిత్యం తాత్వికతను అణగారిన ప్రజల ఉద్యమాలకు ఆపాదించకూడదు అని అతనికి పూర్తిగా స్పష్టమయింది- ఒక ప్రేమరాహిత్యమే మనుషుల ద్వేషానికి, ప్రాంతాల మధ్య ద్వేషానికి కారణం కాబోదని, బుచ్చిబాబు సంపూర్ణ నిర్ణయానికి వచ్చినట్లు అయింది. అయిననూ అతడి ప్రేమరాహిత్యవాదం ‘తాత్వికం’గా నిరాకరింపలేనిదని గుర్తించవలసి వుంటుంది.

రాయలసీమ ఉద్యమకారులు-

దయానిధి నౌకరును గాయపరుస్తారు.

దయానిధి మీద కత్తి విసురుతారు.

దయానిధి తల్లి విగ్రహాన్ని బద్దలు చేస్తారు.

అతడి గని తవ్వకాన్ని మట్టి, రాళ్లతో పూడ్చేస్తారు.

ఇంటిని తగలబెడతారు.

ఎంతో తీవ్రమైన ఫ్యాక్షన్ కొట్లాటలో జరిగే బీభత్సాన్ని రచయిత రాయలసీమ ఉద్యమకారులకు ఆపాదించడం సత్యదూరమే అనిపిస్తుంది. లేదా నవల కోసం జరిగిన కల్పన అనికూడా అనుకోవచ్చు. కానీ ఒక ఔచిత్యమైన కల్పన వక్రీకరణ రూపం తీసుకోకూడదు కదా. రాయలసీమ ఉద్యమం అంతటి ద్వేషస్థాయిలో పనిచేసినట్లు నిరూపించే చారిత్రక ఆధారాలు ఏవీలేవు.

చివరకు మిగిలేది ప్రధానంగా మనస్తాత్విక నవల. దేశకాల సమస్యను చర్చించడం ఈ నవల ముఖ్య ఉద్దేశం కాదు. అయినప్పటికీ 1943 నాటి రాయలసీమ దేశకాల వాతావరణాన్ని పరిశీలించే అవకాశం ఈ రచయితకు రాకపోయివుంటే ఈ నవలా నిర్మాణం ఈవిధంగా జరిగివుండేది కాదు.

ఇతడు పప్పూరి రామాచార్యుల వెంటనో, చిలుకూరి నారాయణరావు వెంటనో.. లేక ఇద్దరి వెంటనో రాయలసీమ సభలకు హాజరు అయివుంటే తప్ప, తిప్పేస్వామి వంటి రాయలసీమ కార్యకర్తల భావోద్వేగాలను రికార్డు చేసేవాడు కాడు.

రాయలసీమ భావజాల నేపథ్యాలు వంటబట్టకుంటే- అప్పట్లో ఆంధ్రరాష్ట్రానికి వ్యతిరేకంగా, రాయలసీమ రాష్ట్రానికి మద్దతుగా గవర్నరుకు సమర్పించిన డెప్యుటేషన్ అంశాలను నవలలో పొందుపరచేవాడు కాడు.

బుచ్చిబాబు వంటి సహృదయ రచయితలు ఇప్పటికాలంలో వుంటే ఎంత బాగుండేది! రాయలసీమేతర ప్రాంతాల నుండి వచ్చే ఇటువంటి రచయితల వల్ల రాయలసీమ ఆసక్తులకు గొప్ప మద్దతు లభిస్తుంది.

ఒకేఒక్క నవల రాసి, తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధ నవలాకారుడిగా పేరొందిన రచయిత బుచ్చిబాబు గారు. వడ్డెర చండీదాస్ వంటి ఎంతోమంది ఆరాధకులను సంపాదించుకున్నాడు ఆయన. వారిలో నేనూ ఒకడిని.

బుచ్చిబాబు గారి మీద రస్సెల్ ప్రభావం వుందన్నారు.

జిడ్డు కృష్ణమూర్తి ప్రభావం వుందన్నారు.

షేక్స్పియర్ పాత్ర హామ్లెట్ (టు బి ఆర్ నాట్ టు బి) ప్రభావం, దయానిధి మీద వుందన్నారు.

కోమలి, సుశీల, అమృతం, ఇందిర.. ఈ స్త్రీలతో దయానిధికి కల సంబంధం చర్చించినారు.

దయానిధికి తన తల్లి పట్ల మదర్ ఫిక్సేషన్ వుందని అన్నారు, ఆర్.ఎస్.సుదర్శనం గారు.

రాయలసీమ పట్ల రచయిత భావజాలంలో వచ్చిన పరివర్తన వరకే ఈ వ్యాసకర్త పరిమితమైనాడు.

తెలంగాణ విడిపోయిన తరువాత (2014) రాయలసీమ ఆసక్తులు మళ్లీ మేలుకొంటున్న సందర్భంలో చివరకు మిగిలేది నవల (1946) ప్రాసంగికతను అర్థంచేసుకునే ప్రయత్నమే ఈ వ్యాసం.


Read More
Next Story