బడిని బతికించండి...
x
image source: yourstory

బడిని బతికించండి...

మరణశయ్యమీదికి బడిని బలవంతంగా నెడుతున్న సమయంలో ‘ఉపాధ్యాయులారా ఎకం కండి’ అని పిలుపునిస్తున్న కవిత.


నేనో పిల్లల్లేని బడిని

భక్తులు దాని గుడిని

నన్ను నిర్మూలించాలని

మెర్సీకిల్లింగుతో ప్రాణాలు తీయాలని

జరుగుతున్నాయి ప్రయత్నాలు...

కిలోమీటరు కొక పాఠశాల....

ఆవాస ప్రాంతానికొక విద్యాలయమన్న

నినాదం.. నా జననానికి కారణం.

పక్కాభవనాలు.. తాగునీటి బావులు

మధ్యాహ్న భోజనానికి వంటశాలలు

వరదలా విడుదలవుతున్న నిధులు

ఆశయాలకు కల్పించాయి ఆశలు

లోకాస్టు నోకాస్ట్ తో...

అందాన్ని కనువిందు చేశాయి

బడిలో వెలుగుకోసం విద్యుత్తు నిచ్చారు

పిల్లల కోసం ఏకరూప దుస్తుల నిచ్చారు

అందరిలో ఇది మనబడి అనిపించారు

నేడు....

నన్ను నిర్మూలించడానికి

కార్పోరేటు విద్యాలయాలకు వెసులుబాట్లు

ప్రయివేటు విద్యాసంస్థలకు పెద్దపీటలు

విద్యావ్యాపారులకు రెడ్ కార్పెట్లు...

భవనాలు లేకున్నా... వసతులు లేకున్నా

విద్యార్ధులకు ఆడుకొనే స్థలాలు లేకున్నా...

ఉపాధ్యాయులు లేకున్నా....

వారికి సరైన విద్యార్హతలు లేకున్నా...

అనుమతులు ఇచ్చేస్తున్నారు!

నేను మాత్రం...

పిల్లలు లేనిబడిగా...

సర్కారు కంట్లో నలుసుగా

విద్యాశాఖకు భారమయ్యాను

ప్రపంచీకరణ పాశంతో

ప్రపంచబాంకు పరవశంతో

బడికి గోరీని కడుతున్నారు!

గుడిని తడిగా మారుస్తున్నారు

పిల్లలు లేరని.. పిల్లలు రారని

బడిని సమాధి చేస్తున్నారు

తల్లిని బతికించుకోవడానికి

ఉపాధ్యాయులారా ఏకంకండి!

విద్యారంగ పరిరక్షణ పేరుతో

బడితల్లుల్ని కాపాడుకొండి

పిల్లలు వదిలిపోయారని

అమ్మని చంపుకుంటారా?

అమ్మని బతికించండి...

బడిని బతికించండి..!


Read More
Next Story