గుమ్మడి కాయంత దేశానికి ఆవగింజంత మణిపూర్ సందేశం యిదే!
x

గుమ్మడి కాయంత దేశానికి ఆవగింజంత మణిపూర్ సందేశం యిదే!

కుకీ, మెయిటీ జాతుల ప్రజల మధ్య విద్వేషాల వల్ల హింస జరిగినట్లు కార్పొరేట్ మీడియా చిత్రించింది. చేదు నిజం ఏమిటో తాజా ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.



ఏడాది క్రితం 1-జాతి 2-మత 3-ప్రాంతీయ విద్వేషాలతో నెత్తురోడిన నేలపై ఈ సుహృద్భావ తీర్పు నేర్పే పాఠమేమిటి?

ఓడిన, గెలిచిన పార్టీల సంగతి కాదు, మణిపూర్ జనహృదయ ప్రతిస్పందన బోధిస్తున్న సందేశమేంటి?

-ఇఫ్టూ ప్రసాద్

ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరునాడు 1-బరాముల్లా, 2-ఫైజాబాదు (అయోధ్య), 3-వారణాసి (కాశీ) ప్రజల తీర్పులపై రైటప్ రాశా. ఇప్పుడు మరో క్యాచింగ్ పాయింట్ పై స్పందిస్తున్నా.

ఏడాది క్రితం వార్తలకెక్కిన మణిపూర్ గూర్చి తెల్సిందే! కుకీ స్త్రీలను ఇంఫాల్ వీధుల్లో 1-జాతి 2-మత 3-ప్రాంతీయ విద్వేష మూకలు దిగంబరంగా ఊరేగించిన వార్త దేశ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేసి ప్రపంచ ప్రజల దృష్టిని మళ్లించింది. పరామర్శకు సైతం మణిపూర్ వెళ్ళని మోడీ జాతీయంగానే కాక అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు గురయ్యాడు. ఇక అసలు విషయంలోకి వద్దాం.

మణిపూర్ లో రెండు లోక్ సభ నియోజకవర్గాలు. ఒకటి, ఇన్నర్ మణిపూర్! రెండు, ఔటర్ మణిపూర్!

'ఇంఫాల్ లోయ'గా పిలిచే సారవంత మైదాన ప్రాంతాలు, జనసాంద్రత గల ప్రాంతాలతో 'ఇన్నర్ మణిపూర్' లోక్ సభ నియోజకవర్గం ఉంది. ఏడాది క్రితం వార్తలకెక్కిన మెయిటీ జాతీయుల ప్రాంతం యిదే! జనసంద్రత తక్కువ వుండే ఆదివాసీ కొండ ప్రాంతాలతో 'ఔటర్ మణిపూర్' ఉంటుంది. మెయిటీ జాతి విద్వేష శక్తుల దాడికి గురైన బాధిత కుకీ ప్రజల ప్రాంతమిదే! 'ఇన్నర్' లో మెజార్టీ ప్రజలు హిందువులు. 'ఔటర్' లో మెజార్టీ ప్రజలు క్రిస్టియన్లు. 'ఇన్నర్' లో వ్యవసాయ పంట భూముల సేద్యం ఎక్కువ! 'ఔటర్' లో వ్యవసాయాధారిత భూములు తక్కువ! 'ఔటర్' తో పోల్చితే 'ఇన్నర్' లో ప్రజల జీవన ప్రమాణాలు తక్కువే!

1-బ్రిటీష్ వలస వ్యతిరేక పోరాటాల్లో; 2-1947 తర్వాత స్వతంత్ర్య మణిపూర్ స్థాపనకై సాగిన పోరాటాల్లో; 3-భారత రాజ్యాంగ పరిధిలో ఆ రాష్ట్ర స్వయంప్రతిపత్తి కోసం సాగిన పోరాటాల్లో; 4-భారత ప్రత్యేక సాయుధ బలాల చట్టం రద్దుకై సాగే పోరాటాల్లో చారిత్రికంగా 'ఇన్నర్ మణిపూర్' ప్రజలు అగ్రగామి పాత్ర పోషించారు. పైన పేర్కొన్న వివిధ దశల్లో 'ఔటర్ మణిపూర్' ప్రజలు 'ఇన్నర్ మణిపూర్' ప్రజలను మార్గదర్శకంగా భావించి అనుసరించడం జరిగేది. ప్రధానంగా కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల పట్ల, వారు అనుభవిస్తున్న పేదరికం పట్ల పోరాటాల చరిత్ర గల 'ఇన్నర్ మణిపూర్' ప్రజలకు ప్రత్యేక సానుభూతి ఉండేది. 'ఔటర్' ప్రజలకి ప్రభుత్వాలు కల్పించే రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల పట్ల మద్దతు ఇస్తుండేవారు. ఆ మేరకు 'ఇన్నర్ మణిపూర్' ప్రజల పట్ల 'ఔటర్ మణిపూర్' ప్రజలకు సానుభూతి ఉండేది. ఇది చారిత్రక వాస్తవ స్థితి!

ఇటీవల భూగర్భ శాస్త్ర పరిశోధనల ఫలితంగా 'ఔటర్' లో అపారమైన ఖనిజ సంపద వెలుగు చూసింది. అంబానీ, ఆదానీ వంటి బడా కార్పొరేట్ల కళ్ళు పడ్డాయి. ఆర్ధికతలంలో వచ్చిన కొత్త మార్పు యిది.

2014 లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మీద కార్పొరేట్లకు సేవ చేసే బరువు, బాధ్యత రాజకీయ వ్యవస్థ పై అదనంగా పడింది. రాజకీయ తలంలో కొత్త మార్పు యిది. 'ఔటర్ మణిపూర్' లోని విలువైన ఖనిజ సంపదను కబ్జా చేయాలంటే ట్రైబల్ ప్రజల్ని కొండప్రాంతాల నుండి తరిమివేయాలి. అందుకోసం ప్రజల మధ్య విద్వేషాలతో పాటు రక్తపాతం అవసరం. అది సహజంగానే కార్పొరేట్ల వ్యూహంగా మారింది. వారికి శునక సేవలు చేసే ఫాసిస్టు పాలకులకు అదో రాజకీయ కర్తవ్యంగా కూడా మారింది.


మణిపూర్ ఆర్ధికరంగంలో ఏర్పడ్డ నూతన పరిస్థితులు రాజకీయ రంగంలో నూతన సమీకరణలకు దారి తీసింది. కాంగ్రెసు రాజకీయ పునాది బీజేపీ రాజకీయ పునాదిగా పరివర్తన చెందింది. దానితో 'జాతి' స్థానాన్ని 'మతం' ఆక్రమించింది. దశాబ్దాలుగా హక్కుగా 'ఔటర్ మణిపూర్' ఆదివాసీలు నిర్వివాదంగా అనుభవిస్తున్న రిజర్వేషన్లను సాపేక్షికంగా మెరుగ్గా జీవించే 'ఇన్నర్ మణిపూర్' మెయిటీ జాతి ప్రజలకు వర్తింపజేసింది. సంప్రదాయ హక్కుకు భంగం కలిగించడాన్ని నిరసిస్తూ భారీ నిరసన ప్రదర్శన ఇంఫాల్ లో కుకీ, ఇతర తెగల ప్రజలు చేపట్టారు. వారిపై బీజేపీ వ్యూహాత్మక ప్రోత్సాహంతో మెయిటీలు విద్వేష దాడులకు దిగారు. ఆ నేపథ్యంలో సాగిన విద్వేషాపూరిత వరస దాడుల పరంపరలో పరాకాష్ట చర్యయే నిరుడు మే మొదటి వారంలో కుకీ స్త్రీల దిగంబర ప్రదర్శన!

పై హత్యాకాండ ఫలితంగా అధికారికంగా 220 మంది మరణించారు. 70,000 మంది నిర్వాసితులయ్యారు. 4000 కి పైగా తుపాకులు లూటీకి గురయ్యాయి. రోడ్లు రక్తసిక్తమయ్యాయి. ఏడాది క్రితం మనం విన్న విషాద మణిపూర్ దీన గాథ యిది.

కుకీ, మెయిటీ జాతుల ప్రజల మధ్య విద్వేషాల వల్ల హింస జరిగినట్లు కార్పొరేట్ మీడియా చిత్రించింది. చేదు నిజం ఏమిటో తాజా ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.

2014 ఎన్నికల్లో రెండు స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. కానీ కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి రాజకీయ సమీకరణల్ని వ్యూహాత్మక ఎత్తుగడలతో మార్చింది. మణిపూర్ లో బీజేపీ ప్రవేశం, పెరుగుదల జరిగింది. ఆ వెలుగులో 2019 ఎన్నికల్ని పరిశీలించాల్సి వుంటుంది.

2019 లోకసభ ఎన్నికల్లో 'ఇన్నర్ మణిపూర్' లో బీజేపీ గెలిచింది. 'ఔటర్ మణిపూర్' లో కాంగ్రెస్ పై బిజెపి విజయం పొందింది. 'ఔటర్ మణిపూర్' లో బీజేపీ మీద 'నాగాల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్' (NPF) అభ్యర్థి విజయం సాధించాడు. ఇది ఐదేళ్ల క్రితం ఎన్నికల చిత్రం.

భౌగోళికంగా కార్పొరేట్ల వ్యూహాత్మక ప్రాంతంగా మణిపూర్ రాష్ట్రం మారిన తర్వాత, ముఖ్యంగా 'ఇన్నర్ మణిపూర్' కార్పొరేట్ల తక్షణ టార్గెట్ అయ్యాక, అది జాతి, మత, ప్రాంతీయ విద్వేష రక్తసిక్త నేలగా పరివర్తన చెందాక జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పుకు రాజకీయ ప్రాధాన్యత ఉంది.

ఈ ఎన్నికల్లో 'ఇన్నర్ మణిపూర్' లో బీజేపీ పై కాంగ్రెస్ సుమారు ఒక లక్షా పది వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. 'ఔటర్ మణిపూర్' స్థానంలో NPF అభ్యర్థి పై కాంగ్రెస్ అభ్యర్థి 80 వేలకు పైగా ఓట్ల అధిక్యతతో విజయం సాధించాడు.

అనూహ్యమైన విశేషాలు కొన్నింటిని తాజా మణిపూర్ ఎన్నికల ఫలితాల్లో చూస్తాం.

1- 'ఇన్నర్ మణిపూర్' చారిత్రికంగా మెయిటీ జాతి జనుల ప్రాంతం. 2-ఆధ్యాత్మిక రీత్యా హిందు మత ప్రజల ప్రాంతం. 3-రాజకీయంగా బీజేపీ ప్రభావిత ప్రాంతం. 4-ఆర్ధికంగా మెరుగైన జీవన ప్రమాణాలు గల ప్రాంతం. 5-విద్వేష దాడులు చేసిన ఫాసిస్టు మూకల ప్రాంతమది. ఈ ఐదు అంశాలతో కూడిన 'ఇన్నర్ మణిపూర్' లో బీజేపీ ఎందుకు ఓటమి పొందింది? పైగా లక్షా పది వేల తేడాతో ఎందుకు ఓటమి పొందింది?


'ఔటర్ మణిపూర్' లో బీజేపీ పోటీ చేయలేదు. కానీ 2019 లో ఇద్దరు సమీప ప్రత్యర్థి పార్టీల మధ్య ఈసారి పొత్తు కుదిరింది. 2019 లో గెలిచిన NPF అభ్యర్థికి ఓడిన బీజేపీ ఈసారి మద్దతు ఇచ్చింది. ఆ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ ఓటమి కోసం సర్వ శక్తులు ఒడ్డాయి. ఐనా కాంగ్రెస్ ఎలా విజయం సాధించింది?

ఏ పార్టీ గెలిచిందో ముఖ్యం కాదు. ఫాసిస్టు పార్టీ ఓటమి ముఖ్యమైనది. అంతకంటే ఫాసిస్టు రక్తసిక్త దాడులకు గురైన మణిపూర్ ప్రజల తీర్పు ముఖ్యమైనది. మరో ముఖ్య గమనార్హ అంశమిది. ఈ క్యాచింగ్ పాయింట్లకు మనం ప్రాచుర్యం కల్పిస్తే మన దేశ ప్రజలకు నూతన స్ఫూర్తిని అందించగలం.

కుకీలు అందరూ పీడితులే కావచ్చు. కానీ మెయిటీలు అందరూ పీడకులు కాదు.

హిందువులందరిలో హిందూ మతాభిమానం వుండొచ్చు. అంతమాత్రాన వారు హిందూ మత దురభిమానులు కారు. ఫాసిస్టు శక్తులు వ్యూహాత్మక దృష్టితో రెచ్చగొట్టే పరిస్థితుల్లో కొద్ది శాతం మంది మత దురభిమానులుగా మారే అవకాశం ఉంది. కానీ వారు మతోన్మాదులు కాదు. ఆ మారిన అత్యల్ప సంఖ్యాక మతోన్మాదుల్లో కూడా మత మరణహోమనికి పూనుకునే ఫాసిస్టులు మరింత తక్కువ. ఈ వాస్తవాన్ని గ్రహించగలిగితే మతాన్ని ఆధ్యాత్మిక దృష్టితో అనుసరించి సామాన్య ప్రజల పట్ల ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో ప్రజల కోసం పని చేసే సంస్థలకు స్పష్టంగా అర్ధమౌతుంది. ముఖ్యంగా సాధారణ మతాభిమానుల్ని తమ రాజకీయ ఎజెండాకు అనుకూలంగా ఫాసిస్టులు మతోన్మాదులుగా మార్చాలని వ్యూహాత్మకంగా కుట్రలకు పాల్పడే ప్రమాదకర కాలంలో ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ సంస్థలు, పార్టీల పని కత్తి మీద సాము వంటిది. ఈ సమయంలో మణిపూర్ ప్రజల సందేశం విలువైనది.

'ఇన్నర్ మణిపూర్' హిందు మత 'ఔటర్ మణిపూర్' క్రిస్టియన్ మత ప్రజలు అన్నదమ్ముల్లా, అక్కాచెల్లెళ్ల వలె సుహృద్భావ చైతన్యంతో ఫాసిస్తు శక్తుల్ని ఓడించిన తీర్పు విలువైనదీ, రాజకీయ ప్రాధాన్యత గలదీ. దీనికి విస్తృతంగా ప్రాచుర్యం కల్పించుదాం.



Read More
Next Story