అమ్రాబాద్ అడవిలో 50 పులులు: పెరుగుతున్న పులుల సంతతి
x
తెలంగాణలోని అమ్రాబాద్ అడవిలో పులుల గణనలో భాగంగా వాలంటీర్లకు కనిపించిన పులి

అమ్రాబాద్ అడవిలో 50 పులులు: పెరుగుతున్న పులుల సంతతి

అడవుల్లో అడుగడుగునా పులుల ఆనవాళ్లు… తెలంగాణలో చురుకుగా సాగుతున్న వన్యప్రాణుల గణన


తెలంగాణ అడవుల్లో పులుల గర్జన ఎక్కడ? వాటి అడుగుల ముద్రలు ఎన్ని? తెలుసుకునేందుకు ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వేల మంది వాలంటీర్లు అడవిబాట పట్టారు. అమ్రాబాద్, కవాల్ పులుల అభయారణ్యాలతోపాటు అన్ని అటవీ ప్రాంతాల్లో పులులు, వన్యప్రాణుల గణన మంగళవారం నుంచి ప్రారంభమైంది.

సమయం : ఉదయం ఆరు గంటలు. అడవుల్లో మౌనం. ఆ మౌనాన్ని చెదరగొడుతూ వాలంటీర్లు అడుగులు వేస్తున్నారు. చెట్లపై గీతలు, నేలపై పులుల పాదముద్రలు, వాగుల ఒడ్డున ఆనవాళ్లు… ఇవే తెలంగాణ అడవుల్లో పులుల ఉనికిని చెప్పే సంకేతాలు. నాలుగేళ్లకోసారి జరిగే జాతీయ పులుల గణనలో భాగంగా తెలంగాణలో ఈ సర్వే సాగుతోంది.

ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్, కవాల్ పులుల అభయారణ్యాలతోపాటు అడవుల్లో ఆరువేల మంది వాలంటీర్లు మంగళవారం నుంచి పులులతోపాటు జంతువులు, వన్యప్రాణుల గణన చేపట్టారు. ఈ నెల 20,21,22 తేదీల్లో మూడు రోజుల పాటు శాకాహార జంతువుల గణన ట్రాన్ సెక్ట్ విధానంలో చేపట్టారు. ఈ నెల 23,24,25 తేదీల్లో మాంసాహార, శాకాహార జంతువులును ట్రయల్ విధానం గణిస్తున్నామని తెలంగాణ అటవీశాఖ వన్యప్రాణుల విభాగం ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. నాలుగేళ్లకు ఓ సారి జరుగుతున్న పులుల గణనలో వాలంటీర్లు అడవుల్లో ఉదయాన్నే 6 గంటల నుంచి కాలినడకన తిరుగుతూ ప్రత్యక్షంగా, పరోక్షంగా పులుల పాదముద్రలు, మలమూత్ర విసర్జనాలు, పులులు గీరిన చెట్లను లెక్కిస్తున్నారని ఆయన తెలిపారు. వాలంటీర్లకు సర్వే కిట్లను అందజేశామని ఆయన వివరించారు.

ఎం- స్ట్రైప్ అప్లికేషన్ లో పులుల గణన వివరాలు
తెలంగాణ అడవుల్లో పులుల గణన వివరాలను అధునాతనమైన మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇన్ సెంటివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకోలాజికల్ స్టేటస్ (ఎం-స్ట్రైప్) అప్లికేషన్ లో వాలంటీర్లు నమోదు చేస్తున్నారు. దీంతోపాటు అడవుల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్ల నిక్షిప్తమైన వివరాలతో పులులను గణిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని అటవీ ప్రాంతాల్లోని బీట్లలో వాలంటీర్లు నడచి వెళుతూ పులులే కాకుండా చెట్లు, వన మూలికలు, గడ్డి జాతుల వివరాలను సైతం యాప్ లో నిక్షిప్తం చేస్తున్నారు. అడవుల్లోని కుంటలు, సరస్సులు, చెరువులు, వాగులు, నదుల వద్ద నీళ్లు తాగేందుకు పులులు వచ్చి పోతుంటాయి. అలా వచ్చినపుడు పులుల పాదముద్రలను గుర్తించి వాటిని లెక్కిస్తున్నారు. ఇలా సేకరించిన సమాచారాన్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి పంపిస్తున్నారు.

అడవిబాట పట్టిన అటవీశాఖ ఉద్యోగులు
పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యంలో కీలకపాత్ర పోషిస్తున్న పులుల సంతతి, సంరక్షణ, నిర్వహణకు ఉపయోగపడనున్న పులుల గణనలో వాలంటీర్లే కాకుండా అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు అడవి బాట పట్టారు.డీఎఫ్ఓలు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, డిప్యూటీ ఎఫ్ ఆర్వోలు, సెక్షన్, బీట్ అధికారులు వన్యప్రాణుల గణనలో పాల్గొంటున్నారు. పులులు, ఇతర వన్యప్రాణుల ఆవాసాలు, ఆహారం లభ్యత కూడా ఈ సర్వేలో వెలుగుచూడనుంది.



ఏ ఏ వన్యప్రాణులను లెక్కిస్తున్నారంటే...

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అడవుల్లోని పులులు, సింహాలు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, అడవి పిల్లులు, నక్కలు, అడవి కుక్కలు, తోడేళ్లు, శాకాహార జంతువుల్లో సాంబార్, నీలుగాయి, చుక్కల దుప్పులు, కొండ గొర్రెలు, అడవి కోళ్లు, నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లను వాలంటీర్లు లెక్కిస్తున్నారు. పులుల పాదముద్రలతోపాటు అవి విసర్జించిన మలమూత్రాలు, వేటాడిన జంతు కళేబరాలు, చెట్లకు గీసిన గీతలను గుర్తించి వాటిని లెక్కిస్తున్నారు.

గణనలో స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు
తెలంగాణలోని అన్నీ అడవుల్లో అటవీశాఖ ఉద్యోగులే కాకుండా స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు, వన్యప్రాణుల ప్రేమికులు పులుల గణనలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ వాలంటీర్లు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగుతున్న ఈ పులుల గణనలో వాలంటీర్లు రోజుకు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం కాలినడకన అడవుల్లో తిరుగుతూ వన్యప్రాణుల లెక్కలను సేకరిస్తున్నారు.



అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో 50 పులులు

జాతీయ పులుల గణనలో భాగంగా తెలంగాణలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో పులుల గణన ఆరంభం అయింది.కృష్ణానదీ తీరంలో వాగులు,లోయలు, జలపాతాలు, చెరువులతోపాటు గుహలు, పొదలతో కూడిన నల్లమల అడవుల్లో ఏ యేటి కాయేడు పులుల సంఖ్య పెరుగుతోందని తాజాగా వెల్లడైంది. గతంలో 34 ఉన్న పులుల సంఖ్య నేడు 50కి పెరిగాయని అధికారులు చెప్పారు. అటవీశాఖ వేటగాళ్లకు చెక్ పెట్టి, పులుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలతో అమ్రాబాద్ అడవిలో పులుల సంఖ్య 50కు పెరిగాయని తాజాగా వెల్లడైంది. గత నాలుగు సంవత్సరాలుగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ATR) వన్యప్రాణులకు గమ్యస్థానంగా అభివృద్ధి చెందింది. గత ఏడాది (2025) అక్టోబర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అమ్రాబాద్ లో 50 పులులను సందర్శకులు వీక్షించారు. 16 కిలోమీటర్ల ఫర్హాబాద్ సఫారీ, 35 కిలోమీటర్ల గుండం సఫారీ, కేవ్స్ సఫారీల్లో సందర్శకులకు పులుల సంచారం కనిపించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవసరాన్ని తగ్గించడం, సౌరశక్తితో నడిచే బోర్ వెల్స్, నీటి కుంటల ఏర్పాటుతో వన్యప్రాణుల సంచారం పెరిగింది.

కవాల్ అభయారణ్యంలో అయిదు పులుల సంచారం
కవాల్ పులుల అభయారణ్యంలో మహారాస్ట్ర నుంచి వలస వచ్చిన అయిదు పులులు సంచరిస్తున్నాయని పులుల గణనలో వెల్లడైంది. ఈ అయిదు పులులు సంచరిస్తున్న ప్రాంతాలను వాలంటీర్లు గుర్తించి సర్వేలో నిక్షిప్తం చేశారు.

అడవుల్లో సఫారీ సేవలకు బ్రేక్
తెలంగాణ రాష్ట్రంలో పులుల గణన జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి వారం రోజుల పాటు అమ్రాబాద్ పులుల అభయారణ్యం, కవాల్ పులుల అభయారణ్యంలలో సఫారీ సేవలను నిలపివేసినట్లు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఎస్ హీరేమత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కొత్తగా 20 కిలోమీటర్ల కొల్లం సఫారీని కూడా ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. సఫారీల ద్వారా వచ్చే ఆదాయాన్ని టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ కు మళ్లిస్తున్నామని సునీల్ వివరించారు.

నాగార్జున్‌సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో...
నాగార్జున్‌సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ను 1983లో ప్రాజెక్ట్ టైగర్ కింద ప్రకటించారు.గల గలా పారే కృష్ణమ్మ చెంత నాగార్జున్‌సాగర్ జలాశయం, శ్రీశైలం డ్యాంల నుంచి ఈ అభయారణ్యానికి ఈ పేరు వచ్చింది. నాగార్జున్‌సాగర్–శ్రీశైలం వన్యప్రాణుల అభయారణ్యంలోని కొన్ని భాగాలను ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తృతమైన బఫర్ అడవులతో కలుపుతుంది. ఈ అభయారణ్యం ఆకురాల్చే అడవులు, పొదలు-అడవులు, లోతైన కనుమలు, కృష్ణా నది, దాని ఉపనదుల వెంబడి నదీ ఆవాసాలతో ఉంది. ఇది దక్కన్ పులుల ప్రధాన కోట. ఈ అడవుల్లో పులుల గణన సాగుతోంది.



ఈ గణన ఫలితాలు తెలంగాణ అడవుల్లో పులుల ఉనికి, వాటి ఆవాసాల స్థితిగతులు, భవిష్యత్ సంరక్షణ చర్యలకు కీలకంగా మారనున్నాయి. జాతీయ పులుల సంరక్షణ విధానాలకు ఈ డేటా ఆధారంగా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

పులుల సంఖ్య పెరుగుతుండటం తెలంగాణకు మంచి సంకేతం. ఈ గణన ద్వారా లభించే స్పష్టమైన సమాచారం పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణకు కొత్త బలం ఇవ్వనుంది. అడవులు సురక్షితంగా ఉంటేనే పులుల భవిష్యత్తు సురక్షితం అన్న సత్యాన్ని ఈ సర్వే మరోసారి గుర్తు చేస్తోంది.


Read More
Next Story