ఆ ఆరు కాకుల లెక్కేమిటీ!  ఈ లండన్ టవర్ కూలడమేమిటీ?
x
ఫోటో కర్టసీ ట్విట్టర్

ఆ ఆరు కాకుల లెక్కేమిటీ! ఈ లండన్ టవర్ కూలడమేమిటీ?

వందల ఏళ్ల చరిత్ర ఉన్న లండన్ టవర్ కి కాకికి లంకేమిటీ, ఆ ఆరు కాకుల లెక్కేమిటీ, దానికో ఉద్యోగి ఏమిట్రా నాయనా..


ఓరి మీ పిండం కాకులకు పెట్టా అని మనం తిడుతుంటాం గాని ఆ పిండం పెట్టడానికే కాకుల పెంపకంలో ఆరితేరిన ఓ పెద్దాయనకి పెద్ద ఉద్యోగం ఇచ్చారని తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు కదూ!

‘బలగం’ సినిమా తర్వాత కాకులు, పిండంపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చే జరిగింది. కాకులపై కవిత్వాలు, సైకాలజీలు, రాతకోతలనేకం తెలుగు రాష్ట్రాల్లో నడిచాయి. హేతువాదులు ఓపక్క ఆధ్యాత్మిక వాదులు మరోపక్క చేరి బల్లలు బద్దలుగొట్టారు. మూడనమ్మకం, ఆచారం అంటూ ‘కాకుల గోల’ వినిపించారు. అయితే ఈ పిచ్చి మనల్ని ఏలిన ఇంగ్లీషోడికి కూడా ఉందట.

నిజంగానే కూలుతుందా!


ఇండియా అంటే తాజ్ మహల్, పారిస్ అంటే ఈపిల్ టవర్, అమెరికా అంటే లిబర్టీ స్టాచ్యూ ఎలా గుర్తుకు వస్తాయో ఇంగ్లాండ్ అంటే లండన్ టవర్ చెబుతారు. అదో పురాతన కోట. ఈ కోటకీ నల్లకాకులకీ సంబంధం ఉందట. పురాణాల ప్రకారం ఈ టవర్‌ను కాకుల గుంపు ఎప్పుడైనా వదిలివెళితే ఇక ఆ పవర్ ఫుల్ కోట దుమ్ముకొట్టుకుపోతుందట.

కాకి అద్వైతాన్ని నేర్పుతుందా!

కాకి మనకు అద్వైతాన్ని నేర్పుతుందన్న నానుడి ఇండియా అంతటా ఉంది. మనం పెట్టిన ఆహారాన్ని చూడగానే కాకి ఎంతో కావ్ కావ్ మంటూ వచ్చి వాలుతుంది. అది తినడం మంచిదా చెడ్డదా అనేది పక్కన బెడితే వీధుల్ని శుభ్రంగా ఉంచడంలో పశుపక్ష్యాదులు మానవునికి స్నేహితులు. కాకులు భగవత్ స్వరూపులని భారతీయ పురాణాలు చెబుతుంటే ఇంగ్లాండ్ కాకులు గనుక లండన్ టవర్ ను వీడితే అరిష్టమని ఇంగ్లీషు పండితులు చెబుతున్నారట.

కానీ ఈ విచిత్ర పురాణం వెనక పెద్ద కథే ఉందట. ఇది నిజంగా పురాతనమైందా లేక మనం ఇటీవలి కాలానిదా? మరేదైనా జానపద కథా అంటే- లండన్ టవర్ చుట్టూ ఓ ఉల్లాసభరితమైన స్టోరీని అల్లి ఉండవచ్చునన్న సందేహం కూడా లేకపోలేదు.

జానపద, పౌరాణిక, చారిత్రాత్మక అన్వేషణను పక్కనబెడితే కాకి పురాణానికి లండన్ టవర్ కి మధ్య ఏదో సంబంధం ఉందనేది గత చరిత్ర చెబుతోంది. అదో అద్భుతమైన గోతిక్ కథగా చెబుతుంటారు. బ్రిటన్ చరిత్ర యావత్తు యుద్ధాలతో రాసిందే. దీనిపై ఎవరి వాదనలు వారికున్నాయి. బ్రిటన్ లోనూ మూఢనమ్మకాలు, ఆత్మలు, దెయ్యాలు వంటివి ఉన్నాయి.

ఆత్మలు బయటకి వస్తాయా!

యుద్ధాల్లో తెగిపడిన తలలు మాట్లాడేవని, మాంత్రికులు చచ్చిపోయిన వారి దేహాల నుంచి ఆత్మలను బయటిపంపే వారని, ఒకనొక బీభత్స సమయంలో పక్షులు తమ ఆవాసాలను మార్చుకున్నాయని... ఇలా అనేక కాకమ్మ కథలు ఉండేవి. లండన్‌లోని మూడు పవిత్ర మట్టిదిబ్బలు, ఇంగ్లండ్ రక్తపాత చరిత్రకు సంబంధించిన విక్టోరియన్ గోతిక్ శిల్పాలు, లండన్ టవర్‌కి ఎలా ముప్పు వాటిల్లింది అనే దాని గురించి చెబుతాయి.

కాకులు- రోమన్లు- లండన్లు!

లండన్ టవర్ ఉన్న ప్రదేశంలో కాకులు రోమన్ కాలం నుంచి ఉండేవని ఇప్పటికీ చాలమంది నమ్ముతారు. ఇంగ్లాండ్ ప్రసిద్ధ కోటకు ముందు ఉన్న రోమన్ కోటలలో కూడా కాకులు ఉండేవట. ప్రసిద్ధ రచయిత పీటర్ అక్రాయిడ్ జీవిత చరిత్ర ప్రకారం రోమన్ నగరమైన లోండినియం చుట్టూ లండన్ లో మాదిరే పెంపుడు కాకులు ఉండేవి. వాటిని చూడడానికి సామాన్య ప్రజలు కూడా వచ్చే వాళ్లు. రాజప్రసాదాలలో ఈ పక్షుల్ని ఎందుకు పెంచేవాళ్లంటే.. చచ్చిపోయిన జంతువుల్ని తినడానికి. ఈ పెంపుడు పక్షులు వీధుల్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడేవి.

రోమన్లు పోయినా ఇంగ్లండ్ లో కాకులున్నాయ్!

రోమన్లు ఇంగ్లాండ్ ను విడిచిపెట్టి పోయిన తర్వాత లండన్ వాసులు ఇప్పటికీ కాకుల్ని, గద్దల్ని పెంచడానికి గల కారణాలలో వీధుల పరిశుభ్రత ఓ కారణమై ఉంటుంది. ఈ పక్షుల్ని చంపితే శిక్షించేలా చట్టాలు ఉన్నాయి. పిల్లల చేతుల్లోని రొట్టె ముక్కల్నో, బ్రెడ్ ముక్కల్నో తన్నుకుపోతుంటాయి కాకులు. అయినా ఏమీ అనకూడదన్న నిబంధన ఉంది. కొందరైతే ఈ రొట్టెముక్కల్ని పెట్టి మచ్చిక చేసుకుంటుంటారు. గద్దల పెంపకంపై ఓ యాత్రికుడు రాసిన దాని ప్రకారం కొందరు మాంసం వ్యాపారులు తమ వద్ద మిగిలిన వ్యర్థాలను వేసి మచ్చిక చేసుకుంటారు.

ఆ నాటి చెక్క భవనమే నేటి లండన్ టవర్!

అయితే లండన్ టవర్ కి కాకులకు సంబంధం ఏమిటనేదే ప్రశ్న. ఇప్పుడు లండన్ టవర్ ఉన్న చోట 1066లో ఒక చెక్క భవనం ఉండేదట. 1077లో జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. నార్మన్లు వైట్ టవర్‌ను నిర్మించడం ప్రారంభించారు. అదే ఇప్పటి లండన్ టవర్‌కు కేంద్రంగా ఉన్న రాతి కోట. అది థేమ్స్ నది ఒడ్డున ఉంటుంది. దాని చుట్టూ ఒక కందకం ఉంది. శత్రువులు రాకుండా ఈ కందకం ఉపయోగపడేది. శత్రుజాడల్ని కనిపెట్టి ఉంచేలా కాకుల్ని, గద్దల్ని పెంచేవాళ్లనే ప్రచారం ఉంది. టవర్ కి సమీపంలో ఉండే ఈస్ట్‌చీప్ మార్కెట్ -మాంసం వ్యాపారులకు ప్రసిద్ధి. పశువ్యర్థాలు ఉంటాయి కాబట్టి అక్కడ కాకులు గుమికూడేవని, కాకుల్ని ఎవరూ పెంచలేదన్న వాదనలు కూడా ఉన్నాయి.

కింగ్ చార్లెస్ కి జ్యోతిష్యం చెప్పిందెవరో!

అయితే 17వ శతాబ్దంలో కింగ్ చార్లెస్ 11కి ఎవరో జ్యోతిష్యుడు ఓ మాట చెప్పారట. దాని ప్రకారం లండన్ టవర్స్ లో కనీసం ఆరు కాకులు ఎల్లప్పుడూ ఉండాలట. ఆరు కన్నా తగ్గితే అరిష్టమని భావించి అప్పటి నుంచి కాకుల సంరక్షణ కోసం ఓ కేర్ టేకర్ ను పెడుతున్నారు మంచి జీతం ఇచ్చి.

బార్నీ చాండ్లర్ నియామకం...

ఆ పురాతన జోస్యం నిజమైందేనని చెప్పడానికేమో ఇంగ్లాండ్ రాజవంశస్తులు.. మైఖేల్ "బార్నీ" చాండ్లర్‌కి అత్యంత ముఖ్యమైన ఉద్యోగం ఇచ్చారు. ఆయన చేయాల్సిన డ్యూటీ ఏంటంటే లండన్ టవర్స్ లోని కాకుల్ని సంరక్షించడం. 56 ఏళ్ల మాజీ రాయల్ మెరైన్ లండన్ టవర్‌లో కాకుల్ని పెంచడం, సంరక్షించడం. వేయేళ్ల పురాతన కోటలోని నల్లకాకుల్ని రక్షించే బాధ్యత ఇకపై ఆయనదే. పురాణాల ప్రకారం, కాకి థేమ్స్ నది పక్కన ఉన్న 11వ శతాబ్దపు టవర్‌ను వదిలివేస్తే, దాని వైట్ టవర్ కూలిపోతుంది. ఇంగ్లాండ్ రాజ్యం నాశనమవుతుంది. 17వ శతాబ్దంలో కింగ్ చార్లెస్- IIకి ఎవరో జోస్యం చెప్పారట. అందుకని టవర్ వద్ద ఎల్లప్పుడూ ఆరు కాకులు ఉండేలా చూడాలని ఆ రాజుగారు ఆదేశించారు. రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదువేముంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఆచారం కొనసాగుతోంది. ఆ ఆరు కాకుల సంరక్షణకు ఇప్పుడు కొత్త గార్డియన్ వచ్చారు. "ఈ బాధ్యతను చాలా సీరియస్ గా తీసుకుంటాం" అంటున్నారు చాండ్లర్. "ఇప్పుడు నేను రావెన్‌ (కాకులు) మాస్టర్‌ని, నా భుజాలపై అదనపు బాధ్యత ఉంది" అన్నారు ఆయన. జోస్యం విషయానికొస్తే, "ఇది నిజమో కాదో మాకు తెలియదు, ఎందుకంటే మేము ఎప్పుడూ ఆ సంఖ్యను ఆరు కంటే తక్కువకు పడిపోనివ్వలేదు, ఇక ముందూ అలా జరగదు. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నా" అంటారాయన.


Read More
Next Story