పచ్చని చెట్ల నీడలో మైమరపించే ప్రశాంతత… పక్షుల కిలకిలరావాలతో ఉత్సాహం… కొండలపై నుంచి జాలువారే జలపాతాల మాధుర్యం… ఇలా ప్రకృతి తన అందాలన్నింటినీ ఏకతాటిపై ఉంచిన ప్రదేశం అనంతగిరి హిల్స్. వికారాబాద్ జిల్లాలోని ఈ అరణ్య ప్రాంతం ఇప్పుడు ఎకో టూరిజంతో పర్యాటకులకు మరింత సరికొత్త అనుభూతిని అందిస్తోంది.
ఎతైన చెట్లు...కొండలు, కోనలు...ఎత్తైన గుట్టలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు...పచ్చని పచ్చిక బయళ్లతో కూడిన గడ్డి భూములు...వాగులు, వంకలు...వివిధ రకాలైన వన్యప్రాణులు...పక్షుల కిలకిలరావాలతో వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పచ్చని ప్రకృతి సోయగాలను పర్యాటకులు తిలకిస్తూ మైమరచిపోతున్నారు.
బర్డ్ వాక్, ట్రెక్కింగ్
బర్డ్ వాక్, అనంతగిరి కొండలపై ట్రెక్కింగ్, ఫారెస్టులో సఫారీ యాత్ర, నైట్ క్యాంపింగ్, రాత్రివేళ ఎకో టెంట్లలో బస, లోయల్లో విహరించేందుకు వీలుగా తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వికారాబాద్ జిల్లాలో ‘ది బ్రీజ్ ఎట్ అనంతగిరి హిల్స్ డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ పేరిట పర్యావరణ పర్యాటక యాత్రను శనివారం ఆరంభించింది. పర్యాటకులకు పర్యావరణ అవగాహన కల్పించడంతోపాటు ఎకో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఉద్ధేశించిన ఈ సఫారీ యాత్రలో పాల్గొనేందుకు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.
వినూత్న అనుభూతి అందించేలా...
అనంతగిరి కొండల్లో ప్రశాంతమైన ప్రకృతి దృశ్యంలో ఉన్న ది బ్రీజ్ లగ్జరీ టెంట్లలో పర్యాటకులకు ఏర్పాటు చేసిన బస వినూత్న అనుభవాన్ని అందిస్తుంది.పర్యాటకుల భద్రత, పర్యావరణ పరిరక్షణ, అటవీ ప్రాంతాల్లో క్రమశిక్షణతో పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేలా ఈ యాత్రను చేపట్టారు. జీవవైవిధ్యం, జంతువుల ప్రవర్తన, పక్షుల గుర్తింపు,పరిరక్షణ పద్ధతులను పర్యాటకులకు ఈ సఫారీ యాత్రలో అటవీశాఖ అధికారులు వివరిస్తున్నారు. అనంతగిరి హిల్స్ లో ఆతిధ్యం, ట్రెక్కింగ్, సఫారీ యాత్ర ద్వారా స్థానిక యువతకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు.ఎకో టూరిజం కింద ట్రెక్కింగ్, బర్డ్ వాక్స్, నైట్ క్యాంప్స్, జంగల్ కాటేజెస్ లో బస, సఫరీ, అడవిలో బుష్ బ్రేక్ ఫాస్ట్ వంటి వినూత్న కార్యక్రమాలకు ఈ యాత్రలో చేర్చామని అటవీఅభివృద్ధి సంస్థ అధికారి అఖిల్ చెప్పారు.
అనంతగిరి గడ్డి భూములు
అనంతగిరిలోని విస్తారమైన గడ్డి భూములు పర్యావరణ ఆకర్షణగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ బహిరంగ ప్రకృతి దృశ్యాలు వివిధ జాతుల పక్షుల వైవిధ్యానికి ఆలవాలంగా మారాయి. అద్భుతమైన పక్షుల వీక్షణ, ఫోటోగ్రఫీ అవకాశాలను అందిస్తుంది.అనంతగిరి కొండలపై ది బ్రీజ్ ప్రకృతిలో మీకు ఒక మంత్రముగ్ధమైన ప్రయాణాన్ని అందించడానికి అటవీ అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది.
సాహసం కోసం రండి
సాహసం కోసం రండి, అనుభవం కోసం బస చేయండి... అరణ్యంపై ప్రేమతో బయలుదేరండి అంటూ అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు పిలుపు ఇచ్చారు. రుచికరమైన భోజనం, పక్షుల విహారం, ట్రెక్కింగ్, సఫారీ,సహజ అటవీ వాతావరణంలో విందు,అడవిలో ప్రత్యేకమైన బుష్ అల్పాహారం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
అనంతగిరి కొండలు గొప్ప జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందాయి. అనుభవజ్ఞులైన ప్రకృతి శాస్త్రవేత్తల నేతృత్వంలో గైడెడ్ బర్డింగ్ సెషన్‌లు ఏర్పాటు చేశారు. పర్యాటకులకు స్థానిక, వలస పక్షి జాతులను పరిచయం చేసి, వాటి పర్యావరణ పాత్రల గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజరు కళ్యాణపు సుమన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
అరణ్యాన్ని ఆస్వాదిస్తూ దానిని కాపాడుకోవాలనే సందేశంతో అనంతగిరి హిల్స్‌లో ప్రారంభమైన ఈ ఎకో టూరిజం యాత్ర పర్యాటకులకు సాహసం, ప్రశాంతత రెండింటినీ ఒకే చోట అందిస్తోంది. ప్రకృతి ఒడిలో గడిచే ప్రతి క్షణం ఒక అనుభూతిగా మారే ఈ ప్రయాణం, అనంతగిరిని మళ్లీ మళ్లీ పిలిచే గమ్యంగా మారుస్తోంది. అరణ్యాన్ని గౌరవిస్తూ, అనుభూతులతో తిరిగి రావాలంటే ఈ ఎకో టూరిజం యాత్రలో పాల్గొనాల్సిందే.