
నాటి 'ఆర్ ఎస్ యు సుధాకర్' తో కాస్సేపు...
విప్లవోద్యమానికి పందిరి గుంజలా నిలబడ్డ విద్యార్థి నాయకుడు
ఒక మిత్రుణ్ణి నాలుగు దశాబ్దాల తరువాత కలిస్తే ఎలా ఉంటుంది! ? అందులో అతను పీపుల్స్ వార్ లో పనిచేసిన కీలకమైన వ్యక్తి. ఒక ఆసక్తి.. ! ఒక ఉత్సుకత.. ! ఒక ఉద్వేగం.. ! ఒక ఆనందం.. ! ఒక సంభ్రమాశ్చర్యం..!
‘ఇన్నేళ్ళ తరువాత సుధాకర్ ఎలా ఉన్నాడు!?’ ‘ఒకరినొకరు గుర్తు పట్టగలుగుతామా’ అన్న సందేహం. సూరిశెట్టి సుధాకర్ తిరుపతి వచ్చారని వాకా ప్రసాద్ ఫోన్ లో చెప్పారు.
ఏడాదిగా సుధాకర్ తో ఫోన్ లో మాట్లాడడమే తప్ప, చూడ లేదు. అతను రాసిన ‘సిరా చుక్కలు’ పుస్తకాన్ని చదివి ‘దిశ’లో ఆ మధ్య సమీక్షించాను. సాయంత్రం ఫోన్ చేస్తే, ఫలానా లాడ్జిలో దిగానని చెప్పాడు. ఆ లాడ్జిలో గది సమీపిస్తుండగా సుధాకరే ఎదురొచ్చాడు.
అతన్నంతా ఆర్.ఎస్.యూ సుధాకర్ అనే వాళ్ళు. తాను పనిచేసిన విద్యార్థి సంఘం పేరునే ఇంటి పేరును చేసుకున్నంతగా జనం నోళ్ళలో నానిపోయాడు. జనం నోళ్ళలో ఎంతగా నానాడో, ప్రభుత్వం నోళ్ళలో, పోలీసుల నోళ్ళలో అంతగా నలిగిపోయాడు.
ఎస్వీయూనివర్సిటీలో 1980-85మధ్య సోషియాలజీలో, తెలుగులో రెండు ఎమ్మేలు చదివాడు. ఆ రోజుల్లో నేను డీఎస్ ఓ ను ఆర్గనైజ్ గా చేస్తుంటే, సుధాకర్ రాడికల్ విద్యార్థి సంఘం ఆర్గనైజర్ గా చేసేవాడు. అప్పుడప్పడూ కలుసుకునే వాళ్ళం. మా మధ్య స్నేహ సంబంధాలుండేవి.
శుక్రవారం సాయంకాలం మేం ఇద్దరం హోటల్ గదిలో కూర్చుని గతంలోకి వెళ్ళిపోతుంటే, కాసేపటికి వాకా ప్రసాద్ కూడా మాతో పాటు గతంలోకి నడిచారు.
ఆ నాటి విషయాల్లో త్రిపుర నేని మధుసూధన రావు గురించిన చర్చ మాలో వచ్చింది. ఆయన చేసిన సాహిత్య సేవ, యువకులకు మార్క్సిస్టు పాఠాలు చెప్పడం, ఆస్తులు పెంచుకోని నిస్వార్ధజీవనం. త్రిపురనేని ప్రభావంతో ఎందరు కవులు, రచయిత లు అయ్యారో లెక్కేలేదు. ఆ ప్రభావంతో కొందరు అజ్ఞాతంలోక్కూడా వెళ్ళిపోయారు.
త్రిపురనేని స్థాయికి మళ్ళీ ఎవరూ ఎదగలేదు. మైకుల్లో కాకుల్లా అరిచినా ఆ నిబద్దతా లేదు, ఆ నిజాయితీ లేదు. ఆయన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు.మా సంభాషణలో అటు, ఇటు అనేక పేర్లు దొర్లాయి. అలా గుర్తు చేసుకున్న వారిలోమరొకరు త్రిపురనేని శ్రీనివాస్.
తోటి వారి వల్ల శ్రీనివాస్ లో అరాచకం చొరబడినా, నిర్మలమైన మనసు, నిజాయితీకల బతుకు. శ్రీనివాస్ మధుసూదనరావు అన్న మదన్ మోహన్ రావు కొడుకు. ఇంట్లోంచి వచ్చేసి సుధాకర్ గదిలోనే కొన్నాళ్ళు ఉండిపోయాడు.
నాకు ఇప్పటికీ జ్ఞాపకం. శ్రీనివాస్ అజ్ఞాతం వీడి బైటికి వచ్చేసిన కొత్తలు. స్నేహితులతో రోడ్డు పక్కన నిలుచుని మాట్లాడుతున్నాడు. దూరంగా నన్ను చూసి చేయి ఊపాడు. నేను దగ్గరకొచ్చేలోపు శ్రీనివాస్ తో మాట్లాడుతున్న వాళ్ళు చెల్లాచెదరైపోయారు. అలా ఎందుకు పారిపోతున్నారని అడిగాను.
‘మిమ్మల్ని చూసి పోలీస్ ఇంటెలిజెన్స్ అనుకున్నారు’ అని పకపకా నవ్వేశాడు. అప్పుడు నా క్రాఫ్ అలా ఉండేది. నా ఆకారం కూ డా అలా ఉండేది.
ఆనాటి సాహిత్య వాతావరణం గురించి చాలా సేపు మాట్లాడుకున్నాం. అవ్వన్నీ తీపి గుర్తులుగా మిగిలిపోయాయి. సుధాకర్ ఆర్.ఎస్.యూ జనరల్ సెక్రెటరీ అయ్యాడు. ఆ తరువాత కొంతకాలానికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. తాను అజ్ఞాతంలో గడిపిన నాటి విషయాలు చెప్పుకుపోతున్నాడు. అతనిలో అదే ఆలోచన, అదే ఉద్వేగం, అదే నిబద్దత. కానీ, నిర్మాణంలో లేడు.
పీపుల్స్ వార్ నాయకులంతా కర్నాటకలో సమావేశమయ్యారు. సుధాకర్ ఆ సమావేశ ఏర్పాట్లలో కీలకంగా ఉన్నాడు.అగ్రనాయకుల్లో ఒకరైన ముక్కు సుబ్బారెడ్డి ఒక దగ్గరకు వెళ్ళవలసి ఉంది. సుబ్బారెడ్డి బదులు, సుధాకర్ ను పంపమని కొండపల్లి సలహా. పోలీసులు ముక్కు సుబ్బారెడ్డి కోసం కాచుక్కూర్చున్నారు. సుబ్బారెడ్డి బదులు సుధాకర్ వెళ్ళే సరికి పోలీసులు చుట్టుముట్టారు.
అనుకున్న సమయానికి సుధాకర్ తిరిగి రాకపోయే సరికి పీపుల్స్ వార్ అగ్రనాయకులు పోలీసుల కంట పడకుండా తప్పించుకు పోయారు. సుధాకర్ ను మూడు రోజులు పోలీసులు చిత్రహింసలు పెట్టినా, ఎక్కడ సమావేశమైందీ సుధాకర్ చెప్పలేదు. ఎవరెవరు సమావేశమవుతున్నదీ బైటపెట్టలేదు. చిత్రహింసలు భరించాడు.
కర్ణాటకలో జనతా ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కొండపల్లి సీతారామయ్య జార్జిఫెర్నాండజ్ ద్వారా చెప్పించడం వల్ల పోలీసులు సుధాకర్ ను ఎన్ కౌంటర్ చేయలేదు. ఒక వేళ సుధాకర్ పోలీసు చిత్రహింసలకు తట్టుకోలేక నోరు విప్పితే !? కొండపల్లి, సత్యమూర్తి, గణపతి, రామకృష్ణ వంటి అగ్రనాయకులంతా పోలీసుల చేతిలో మరణించేవారేమో. పీపుల్స్ వార్ తుడిచిపెట్టుకుపోయేది.
మూడు రోజులపాటు రాత్రింబవళ్ళనక పోలీసులు పెట్టిన చిత్రహింసలు భరించాడు. ఫలితంగా మూడు నెలలు నడవలేకపోయాడు. మూడేళ్ళు జైల్లో గడిపాడు. సుధాకర్ జైల్లో ఉన్నప్పుడే ముక్కు సుబ్బారెడ్డి పోలీసులకు లొంగిపోయాడు.
ముక్కు సుబ్బారెడ్డి లొంగిపోయాక పోలీసులకు ఏం చెప్పాడో తెలియదు. సుధాకర్ వెళ్ళకుండా ముక్కు సుబ్బారెడ్డే వెళ్ళినట్టయితే పోలీసుల చేత చిక్కేవాడు. ఎందరు పీపుల్స్ వార్ అగ్రనాయకులు పట్టుబడేవారో ఊహించలేం.
జైల్లో నుంచి విడుదలయ్యాక సుధాకర్ ఆర్టీసి లో పని చేశాడు. హై కోర్టు లో న్యాయ వాదిగా ప్రాక్టీస్ చేశాడు. పీపుల్స్ వార్ కు, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల సందర్భంగా శాంతి సంఘం తరపున పని చేశాడు.
విప్లవం పట్ల సుధాకర్ నిబద్ధతను గుర్తు చేసుకుంటే, ఆ మనిషి నా ముందరే కూర్చేని నాతో మాట్లాడుతున్నాడన్న వాస్తవం గమనిస్తే ఆశ్చర్యమూ ఆనందమూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
సుధాకర్ లాంటి కనపడని ఎందరు పందిరి గుంజల వల్లనో నాటి పీపుల్స్ వార్, నేటి మావో ఇస్టులు విప్లవమనే పందిరి పడిపోకుండా నిలబెడుతోంది !
Next Story