అడవి ఒక రాఘవ అనే పరుసవేది!
x

అడవి ఒక రాఘవ అనే పరుసవేది!

'శేషాచలం కొండల్లో..'(తిరుమల దృశ్య కావ్యం-2) ముందుమాట చివరి భాగం)


రాఘవగారికి అడవిలో ట్రెక్కింగ్ చేసినప్పుడు చిన్నప్పుడు నాయనమ్మ ఊరికో.. అమ్మమ్మ ఊరికో వెళ్ళినప్పుడు కలిగే బాల్యానందం తిరిగి అనుభూతిలోకి వచ్చేస్తుంది. నగరంలో మానవ నాగరికత మూలాల్ని అయన అడవిలో కొండ కోనల్లో వెతుక్కున్నారు. రాఘవగారికి ట్రెక్కింగ్ ఒక సామాజిక అంశం అని ఎందుకన్నానంటే..

విదేశాల్లో ట్రెక్కింగ్ వారాంతంలో ఒక వ్యాపకంలా చేస్తారు. అలా కాకుండా భారతదేశంలో ట్రెక్కింగ్ మతంతో ముడిపడి ఉందంటారు. సంవత్సరానికోసారి దేవుడి దర్శనం కోసం తిరుపతి, చార్ ధామ్, కాశీయాత్రలుకు వెళుతుంటారు. జీవితంలో ట్రెక్కింగ్ మతంతో సంబంధించిందని, మతం నుంచి విడదీసి చూసి జీవితంలో ఒక సహజమైన భాగంలా అయిపోవాలంటారు. అలా విడదీసినప్పుడు ట్రెక్కింగ్ లౌకిక విలువలతో, సమానత్వంతో, సమిష్టితత్వంతో మహాద్భుతంగా ఉంటుందని మత రహిత సమాజానికి ఒక లౌకిక వాదిగా పిలుపునిస్తారు.

అలాగే ఆయన శేషాచలం కొండల్లో ఆకులో అకుగా.. పూవులో పూవుగా.. జలపాతంలో జలపాతంగా మారిపోయి ప్రయాణిస్తూ పయనిస్తూ అడవిని ప్రకృతిని ఆవాహన చేసుకున్నారు. ఒక హెర్బలిస్టుగా, ఒక వృక్ష శాస్త్రవేత్తగా కొత్త వనమూలికల గురించి, అరుదైన ఫలాల చెట్ల గురించి రాశారు.

శేషాచలం కొండల్లోని అన్ని తీర్థాల్లో ఆయన యాత్ర సాగింది. అందరిలా కాకుండా ఒక ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ లాగా ఆయన అడవిని అడవి బయట సమాజంతో పోలుస్తూ పరిశీలించడం అలవాటు చేసుకున్నారు. అడవిని కాపాడే అన్ని భౌగోళిక పరిస్థితుల్ని ఆయన పసిగట్టారు. పాదాలతో దూరదూరాలు నడిచే కొండలెక్కే.. నీటి గుండాల్లో ఈదే, లోయల్లోకి వెళ్ళిపోయి ట్రెక్కింగ్ ఒక సైన్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లో అతి ముఖ్యమైన భాగం. ఇది విద్యార్థులకు బయట అడవుల్లో, కొండ కోనల్లో జలపాతాల మధ్య, ఎడారి దారుల్లో చేసే యాత్రలను గురించిన నైపుణ్యాలు, జాగ్రత్తల గురించి నేర్పిస్తుంది.

అలాగే ట్రెక్కింగ్ వల్ల పొందే మానసిక వ్యక్తిత్వ వికాసం గురించి సామూహిక ప్రయోజనాల గురించి అడవిని, అటవీ సంపద వనరుల పరిరక్షణ గురించే కాక, ట్రెక్కింగ్ లో నెగెటివ్ ధోరణులను పాటించే విధ్వంసకర పద్ధతుల వలన అడవికెంత నష్టమో కూడా ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లో చెబుతారు. ఉదాహరణకు ట్రెక్కర్లు తీసుకెళ్ళే ఆహారం, ప్లాస్టిక్ వస్తువులు, అక్కడి జంతువులకు హాని కలిగిస్తాయి. నీటిని రసాయనికంగా కలుషితం చేయడం, అలాగే తరచూ అటవీ జంతువులు మనుషులని చూడ్డం వలన వాటి సహజ ప్రవర్తనకు భంగం కలుగుతుంది. ఉదాహరణకు సిగ్గుపడడం, కలవరపడడం లాంటివి. అవి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాయి.

మనుషులు ఎక్కువగా అడవిలో సంచరించడం వల్ల వాటి జీవరసాయన చక్రం దెబ్బతిని జంతువుల సంభోగ చక్రాన్ని దెబ్బ తీస్తాయని శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలిన అంశం. అలాగే ట్రెక్కింగ్ వలన మానవ వ్యర్థాలు అటవీ వనరులను, భూమినీ, అక్కడ వదిలేసే ఆహారం, ముఖ్యంగా జంక్ఫుడ్స్ ఉండే రసాయన పదార్థాలు నీటిని కలుషితం చేస్తాయి. నీటిలో ఉండే చేపల్లాంటి జలచరాలకి, నీటిని తాగే జంతువులకు ప్రాణహాని చేస్తాయి. ట్రెక్కర్లు వాడే టిన్స్, క్యాన్స్, గాజు, ప్లాస్టిక్ గ్లాసులు ఇవ్వన్నీ తీసేయడానికి మున్సిపాటిటీ సేవలు అడవిలోపల లేకపోవడం వలన పేరుకుపోయి భూ సాంద్రతను దెబ్బ తీస్తుంది.

సరే.. మరి అలా అంటే ట్రెక్కింగ్ చేసే హక్కు మనుషులకి లేదా? అటవీ ప్రకృతి సౌందర్యాన్ని చూసే అధికారం లేదా? అంటే ఉంది. మనిషి ప్రకృతిలో భాగం కాబట్టి కనీసం పాటించాల్సిన జాగ్రత్తలతో బాధ్యతాయుతమైన ట్రెక్కర్లుగా యాత్రను చేసుకుంటూనే అడవిని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఈ విషయాలన్నీ ట్రెక్కింగ్ పర్యావరణ శాస్త్ర అధ్యయనంలో భాగంగా చాలా కూలంకషంగా చర్చించాలి.

ఇవ్వన్నీ పర్యావరణాన్ని జీవావరణాన్ని దెబ్బతీసే అంశాలు. రాఘవగారు అనేక సార్లు శేషాచలం కొండల్లో అనేక తీర్థాల్లో, సెల ఏర్లు, జలపాతాలు, కొండకోనలు, లోయలు, నీటి గుండాల గుండా ప్రయాణం చేసినప్పుడు గమనించి అవేదన చెందిన అంశాలే! మరీ ముఖ్యంగా ప్రభుత్వమే జోక్యం చేసుకుని పెట్టుబడిదార్లతో మిలాఖత్ అయిపోయి, అడవి లోపల టూరిజం అభివృద్ధిచేసినప్పుడు అడవిలో చాలా భాగం చెట్లు కొట్టేయాల్సి వస్తుంది. కొండల్ని పగుల కొట్టి, నేల చదును చేయాల్సి వస్తుంది. అప్పుడు పెద్ద ఎత్తున భూమి సాంద్రత కోల్పోయి, అడవి తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది. అందుకే మార్క్సిస్టు పర్యావరణ సిద్ధాంతం మనిషికీ, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని కేపిటలిజమ్ ధ్వంసం చేస్తున్నదని చెబుతుంది.

ఈ విధ్వంసం జీవావరణ వినాశనానికి (ecological crisis) దారి తీస్తుంది. అడవిలోని జంతువులకు, పరిసరాలకు మధ్యన ఉండే సంపూర్ణమైన సంబంధాన్ని జీవావరణ శాస్త్రమని అంటారు. పెట్టుబడిదారి వ్యవస్థ లాభాలు పెంచుకుంటూ పోయేక్రమంలో (profit maximization) టూరిజం పేరిట, స్పెషల్ ఎకనమికల్ జోన్ల (సెజ్) పేరిట అటవీ భూముల విధ్వంసానికి పాల్పడుతూ, ప్రకృతికీ మనిషికీ మధ్యన ఉండే జీవావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నది. మార్క్స్ ప్రకారం మనిషి ప్రకృతిలో ముఖ్య భాగం. మనిషికి ప్రకృతితో సరైన సంబంధం ఉంటేనే మనిషి మనుగడ సరిగ్గా కొనసాగుతుంది.

రాఘవగారి ప్రకృతి ప్రేమ ఆయన్ని కవిగా మార్చి గుంజన జలపాతంపై కవిత్వాన్ని రాయించింది. అలాగే నీటికి రాళ్ళకి మధ్య వందల ఏళ్ళ నుంచి జరిగే వొరిపిడి, ఘర్షణ వల్ల మారే రాతి రూపాలను అధ్యయనం చేసే జియోలజిస్ట్ గా మార్చింది. అడవిలో ఆయన పరిశీలన; ముఖ్యంగా కొండలు, శిలల గురించి ఎంత లోతైనదంటే అవి శతాబ్దాలుగా నీటి ఉధృతికి, గాలికి ఒరుసుకుని ఒరుసుకుని ఎలా రూపాన్ని కోల్పోయి, కోసుగా, నిలువుగా, వలయాకారంగా, కొండ మరో కొండ అంచులకి రాతి బండతో అతికించినట్లుగా, రంపంలాంటి అంచున్న కొండలుగా రూపొందాయో అచ్చం ఒక జియోలజిస్ట్ లాగా చెప్తారు. ఎన్నేళ్ళ పరిశీలన ఉంటే ఇలా నీటికి, కొండలకి, రాళ్ళకి మధ్యన ఇంటరాక్షన్ని ఇంత ఖచ్చితంగా చెప్పగలరా ఎవరైనా?

వివిధ తీర్థాల్లో భిన్నమైన రూపాలలో ఉండే కొండల గురించి కాకుండా, గాలి వీచినప్పుడు చేసే శబ్దపు భాషని వింటూ, వాటికి లిపిని, సంభాషణకి మనమే రాస్కోవాలంటారు. గుంజన కవితలో రాసినట్టు 'రాతి సితార' నుంచి ఆ సంగీత ధ్వనిని ఆయనతో పాటు మనమూ వింటాం. అడవికి చెట్లకి జలపాతాలకి కొండ కోనలకు కులం, మతం, జాతి లేదని అడవి ఒక లౌకిక రాజ్యమని మురిసిపోతారు.

దేశం దాటి ఖండాంతరాలకి వలస వెళ్ళిన కులం అడవిలోకి ఎందుకు రాదని నేను అన్నప్పుడు చిన్నబోయారు రాఘవ గారు. కానీ, అడవికి కులం లేదు. అడవిలోని జంతువుల సమిష్టితత్వం గురించి చెపుతూ మనిషి ఏకాకితనం గురించి అవేదన చెందుతారు. ఆయన ట్రెక్కింగ్ చేసిన అనేక అద్భుతమైన తీర్థాలు, దాటిన అడవులు, దుంకి ఈదిన నీటి గుండాలు.. ఆయన సాహసం చూసి ఆశ్చర్యానికి గురవుతాం.

వెండి జలతారు వేలాడేసినట్లుండే బ్రహ్మతీర్థం నుంచి ఎర్రటి కొండల నడుమ నారాయణ తీర్థం చేరడం, కొండపైనుంచి రెండు పాయలుగా జాలువారే నారాయణ తీర్థం అందం చూస్తాం కానీ అర్థం కాదు. రాఘవ గారి వర్ణనలో ఆ దృశ్యాన్ని మనమూ చూస్తాం. కుమారధార-శక్తికటారి మధ్య అతికష్టమైన ప్రయాణం. ఎగుడుదిగుడు రాళ్ళపై మోటారు బైకుల్లో ప్రయాణం గుర్రపు స్వారీలా ఉండడం, బైకులు ఆగడం, అదుపు తప్పడం లాంటి ప్రయాణ బాధలను వర్ణిస్తారు.

ఇక్కడ సెలఏటిని ఎన్నెన్ని రూపాల్లో దాటుతారో చమత్కారంగా చెప్పినా, నిజాలే చెబుతారు. సెలఏటి నడక సాగడంగా, గెంతడంగా, దిగడంగా, లోతుల్లో ఈదడంగా ఉంటుందని చెప్పారు. అలాగే తాను చూసిన కొండల రూపాలు వెడల్పు సన్నగా, కోసుగా ఎలా ఉంటాయో చెబుతారు. అలాగే ప్రమాదకరమైన లోయ ప్రయాణం చేసే పద్ధతి చూస్తే భయం వేస్తుంది.

లోయ పైన చెట్ల మొదళ్ళకి తాడు కట్టి..కింద ఇనుప నిచ్చెనకి కలిపి కట్టి లోయలోకి దిగడం, లోయలో దిగడానికి ఇనుప నిచ్నెనలు వాడడం, లోయలో దిగేటప్పుడు వర్షానికో.. జలపాతాల నీళ్ళకో తడిసిన మట్టి నడవడం, ఒక గుండం నుంచి మరొక గుండంలోకి పక్కనే ఉన్న కొండ ఎక్కి మళ్ళీదుంకడం (శక్తికటారి తీర్థం), మోకాళ్ళు, మోచేతులు కొండల మీద అదిమి పెట్టి ఎక్కడం, మోచేతులు గీరుకోవడం, మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు చేరుకోవడానికి ఈదిన గుండాలన్నీ మళ్ళీ ఈదుకుంటూ ఎక్కి రావాలి. నిజంగా ఎంత కష్టం! ఒకరాత్రి, రెండు పగళ్ళు ప్రయాణం చేసి కైలాస తీర్థం, యుద్ధగళ, హలాయుధ తీర్ధం, అన్నదమ్ముల బండలను దర్శించడం గొప్ప సాహసం! మరీ ముఖ్యంగా యుద్ధగళ తీర్థంలో వీచే గాలిలో యుద్ధనాద శబ్దాలు రావడం చాలా వింతగా అనిపించింది.

శేషాచలంలోని అన్ని తీర్థాలకీ పౌరాణిక పేర్లుంటే, డబ్బారేకుల కోన అని ఒక తీర్థానికి గిరిజనులు పెట్టుకున్న పేరు. విచిత్రంగా ఉన్నా దేని సౌందర్యం దానిదే. దిక్కులు కూడా తెలియకుండా డబ్బారేకుల కోనకు మంచులో చేసిన ప్రయాణం. వైకుంఠ తీర్థంలో తిరుమల డ్రైనేజీ నీళ్ళు కలిసి దుర్వాసన రావడం విచిత్రం. కొన్ని చోట్ల నీళ్ళు లేక తీర్థాలు ఎండిపోయి కనిపిస్తాయి. మార్కండేయ తీర్థం సమీపంలో భూమి నుంచి నీరు ఉబికి రావడం శేషాచలంలో మరెక్కడా కనిపించలేదంటారు. మధ్య మధ్యలో వచ్చే సెల ఏటి సంగీతానికి.. ఏటి ఏటికీ మధ్య ఉండే సంగీత తేడాకి ఆశ్చర్యపోతారు.

పాపనాశనం పాదాల కింద లోయలో ఏడు తీర్థాలను ఒకే రోజు చూడడం పెద్ద సాహసం. ఈ ఏడు తీర్థాలే కాకుండా, తుంబురు, దశావతారం, గుంజనలను ఏది చూసినా, అక్కడి ప్రకృతిలోని మార్పులను సూక్ష్మంగా పరిశీలిస్తూ, అనుభూతి చెందుతూ ప్రకృతి మీద ప్రేమను కురిపిస్తూ ముందుకు సాగారు. శేషాచలం కొండల్లో ఆయన చేసిన ప్రతీ తీర్థ ప్రయాణం ఒక గొప్ప సౌందర్యాత్మక సాహసం!

ట్రెక్కింగ్ ను పర్యావరణ సైన్సులో భాగంగా చూసినప్పుడు రాఘవగారి పరిశీలనలు సరైనవిగా తోస్తాయి. తేనె టీగల దాడికి గురై తాను, తన తోటి ట్రెక్కర్లు ఎలా అస్పత్రి పాలయ్యారో, తన షుగర్ లెవల్స్ ఎలా పడిపోయాయో కూడా హెచ్చరికగా చెబుతారు. రెండు లీటర్ల నీరు, తినే ఆహార పదార్థాలు, తేలికపాటి బ్యాగు, ఊత కర్ర కూడా ట్రెక్కింగ్ లో చాలా అవసరమైన వస్తువులు.

కొన్ని సార్లు నీటి గుండాలను ట్యూబులు కట్టుకుని ఈదాలి. వస్తువులను ట్యూబులపైన పెట్టి ఆవలికి చేర్చాలి. చాలా కష్టమైన ప్రయాణం ఇది. శేషతీర్థం నుంచి దశావతారం వెళ్ళేటప్పుడు వీటిని వర్ణిస్తారు.

శేషతీర్థం లోయలోకి దిగే క్రమంలో 'అకేషియా డల్హసి' అనే అరుదైన మర్రి జాతి చెట్టుని చూస్తాం. విదేశాల నుంచి పక్షుల ద్వారా శేషాచలం కొండల్లో పడి మొలిచింది. ఆకులు తుంచితే తెల్లని పాలు వచ్చి, కాసేపటికి నీలి రంగులోకి మారడం దీని ప్రత్యేక లక్షణం. అలాగే తుంబురు నుంచి మామండూరు వైపు వెళ్ళే దారిలో భూటాన్ సరిహద్దు బోడోలాండ్లో కనిపించే అరుదైన ఎలిఫెంట్ ఆపిల్.. కొబ్బరి బోండాం అంత పెద్ద పెద్ద కాయలు ఆశ్చర్యపరుస్తాయి. వెంగమాంబ గుహలో చాలా కాలం జీవించిన దిగంబర సాధువు సుబ్బారావు హత్యకు గురయ్యాడనే విషయాన్ని చాలా బాధతో రాస్తారు.

సాహసోపేతమైన మహిళా ట్రెక్కర్ వనతి! వనతి గురించి చెబుతూ రాఘవగారు ఆమె సాహసానికి ట్రెక్కింగ్ పట్ల ఆమెకుండే ఉత్సాహానికి ఆశ్చర్యపోతారు. మహిళా ట్రెక్కర్లు తక్కువ సంఖ్యలో రావడాన్ని గురించి బాధపడతూ కారణాలను అన్వేషిస్తారు. ట్రెక్కింగ్ మగవారికేనా అని ప్రశ్నిస్తారు. స్త్రీలు ఇంటి పనికి, వంట పనికి, పిల్లల పెంపకాల బాధ్యతల్లో పడి ఇంట్లోనే మగ్గిపోవడం. ఆసక్తి ఉన్నా ఇళ్ళల్లో మగవాళ్ళు అనుమతించకపోవడం. అందుకే స్త్రీలు ఆసక్తి ఉన్నా ఇతర రంగాల్లోలానే ట్రెక్కింగ్ రంగంలోకూడా ముందుకు రాలేకపోతున్నారు.

లోతైన లోయల్లోకి దిగడం, ఎత్తైన కొండలపైకి ఎక్కడం, అగాధాల్లాంటి నీటి గుండాల్లో ఈత కొట్టడం, దేహ దారుఢ్యం ఉన్న మగవాళ్ళకి సాధ్యమైనట్లు సున్నితమైన, ఫిజికల్ ఫిట్ నెస్ అంతగా లేని స్త్రీలకి సాధ్యం కాదు. ఈ పరిస్థితిని అధిగమించడానికి తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్ (టీటీసీ) పిల్లల కోసం స్త్రీల కోసం ట్రెక్కింగ్ ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గదని చెప్తారు. స్పైడర్ ఉమన్ లా కొండల మీదకు ఎక్కేస్తూ, లోయల్లోకి చకచకా దిగేస్తూ, నీటి గుండాల్లోకి దూకేసే చెన్నైకి చెందిన వనతిని స్త్రీలందరూ ఆదర్శంగా తీసుకోవాలంటారు.

ఇక ఈ పుస్తకంలో రాఘవగారు మదర్స్ డే సందర్భంగా అడవిలోని పునర్జన్మ విమోచన తీర్థం నుంచి తెల్లవారుజామున అమ్మకి ఒక బహిరంగ లేఖ రాయడం ఒక అద్భుతంలా అనిపిస్తుంది. పునర్జన్మ విమోచన తీర్ధం నుంచి అమ్మకు లేఖ రాస్తూ మరో జన్మ ఉంటే నీ కడుపునే పుడతాననడం, ఒక మార్క్సిస్టుగా పునర్జన్మ మీద నమ్మకం లేకపోయినప్పటికీ, అమ్మ మీద తనకున్న ప్రేమని, ఆమె మీద ఉన్న అలవిమాలిన అలాపనని తెలియచేస్తుంది.

రాఘవగారికి అమ్మంటే ఎంత అలాపన, అబ్సెషన్ అంటే, అడవిలో ప్రకృతిలో పరవశిస్తూ కూడా ప్రకృతి సౌందర్యంలో అమ్మను చూసుకుంటారు. అనుక్షణం తలుచుకుంటూనే ఉంటారు. ఈ పుస్తకంలో అమ్మగురించిన ప్రస్తావన చాలా సార్లు వచ్చింది. 'అడవంటే అమ్మ ఒడే కదా!' అంటూ అడవిని అమ్మతో పోల్చడం ఒక అద్భుతం. అమ్మకి రాసిన లేఖలో అనాథ శరణాలయంలోని వృద్ధుల మనో వేదన గురించి చర్చిస్తారు అమ్మతో. అలాగే అమ్మ వేసుకునే మందులు, అమ్మ జ్ఞాపకాలుగా మిగిలిపోయిన అమ్మ కట్టుకోని జరీ నేత చీరలు, అమ్మకు హాస్పిటల్లో, ఇంట్లోతాను చేసిన సేవ, పండగలకి పిల్లల్ని ఇంటికి పిల్చుకోవడాలు లాంటి జ్ఞాపకాల వలపోత ఎంతో అర్ధ్రంగా రాస్తూ, "అమ్మా నువ్వు మరణించాక నేను జీవించడమే మానేసా” అంటారు. ఇప్పటి నిర్దయ లోకంలో ఎక్కడున్నారు ఇలాంటి సున్నితమైన, సహృదయులైన, హృదయమున్న కొడుకులు? ఏడుపొస్తోంది. ఇక రాయలే నని ముగించిన లేఖ నిజంగా కళ్ళను చెమ్మబారుస్తుంది.

అలాగే తాను ట్రెక్కింగ్ కు వెళితే తాను వచ్చేదాకా అమ్మ చూసే ఎదురుచూపుల్లోని ఆందోళన, అప్యాయత గురించి రాస్తారు. “నన్ను ఒంటరిగా వదిలి అడవికి వెళితే ఎలారా” అని బెంగగా అడిగే తల్లిని తల్చుకుంటారు. బయలుదేరే ముందు తీసుకోవల్సిన ఇన్సులిన్ ఇంజక్షన్లు, ఇతర మందుల గురించి అమ్మ గుర్తు చేయడం, సిగ్నల్స్ లేకపోయినా కూతురు గాయత్రిని ఎక్కడున్నాడో కనుక్కోమని ఫోన్లు చేయమని పోరడం, అడవి నుంచి తిరిగి ఇంటికి వచ్చేదాకా ఆత్రంగా భయంగా ఎదురు చూడ్డమే అమ్మ పని.

చంద్రగిరి సమీపంలోని తాటికొండ మీద తేనెటీగలు దాడి చేసి కుడితే, సీరియస్పై ఆస్పత్రిలో చేరడం, అమ్మకి తెలీకుండా గమ్మున ఇంటికి రావడం, ఆ విషయం దాచడం, అన్నీ తలుచుకున్నారు. అడవినుంచి ఆ ఫొటోలు కూడా చూపించడం మానుకున్నారు. నీటి గుండాల్లో దుంకను అని అమ్మకు చేసిన వాదా మొన్న గుంజన నీటి గుండం లో దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి దుంకి ఉల్లంఘించారు రాఘవ.

ఈ పుస్తకంలో గుంజన మీద రాఘవగారు రాసిన కవిత గురించి చెప్పాలి. గుంజనమీదున్న అలవిమాలిన ప్రేమ వల్ల దాన్ని అత్యద్భుతమైన నయాగరా జలపాతంతో పోల్చుకున్నారు కూడా. అంత అందంగా ఉంటుందేమో గుంజన? 'గుంజనా.. ఎవ్వరూ మీటకుండానే జల సంగీతాన్ని వినిపించే రాతి సితారవి" అన్న పోలిక గొప్పగా అనిపించింది. నిత్యం దుమికే జలపాత నైజాన్ని మార్క్సిస్టు దృక్పథంలో కూలికోసం శ్రమిస్తున్న మా జాతి జనుల్లాగా అన్ని రుతువుల్లో ఆగకుండా, అలసిపోకుండా దూకుతూనే ఉంటావు అంటారు. గుంజన పట్ల కలిగిన అలౌకిక ఆనందాన్ని వర్ణిస్తూ, అన్ని బంధాలను తెంచేసుకుని దిగంబరంగా, భయం, బాధ లేకుండా గుంజనలో ఐక్యమై పునీతుడిగా మళ్ళీ విశ్వమానవుడిగా తిరిగి రావాలని ఉందని కవితలో ప్రస్తావిస్తారు.

మొత్తానికి శేషాచలం అడవుల్లోని అన్ని తీర్థాలను గొప్ప కావ్యంలా పరిచయం చేసి తనతో పాటు ఆ అడవినంతా చదువుతున్న పాఠకులతో గొప్ప ట్రెక్కింగ్ చేయించారు రాఘవ గారు. శేషాచలం అడవుల్లోకి వెళ్ళాలనుకునే కొత్తవారికి ఈ తిరుమల దృశ్యకావ్యం ఒక గొప్ప గైడ్ గా పని చేస్తుంది. అయితే రాఘవ గారూ, ట్రెక్కింగ్ కి సంబంధించి సంపూర్ణమైన గైడ్ ని పర్యావరణ సైన్స్ లో భాగంగా, కొన్ని పాఠాల రూపంలో ఒక పుస్తకంగా తనముప్పై ఏళ్ళ ట్రెక్కింగ్ జీవితానుభవం నుంచి తిరుమల దశ్యకావ్యం 1,2 కు భిన్నంగా తీసుకుని వస్తే చాలా బాగుంటుంది. ఆయన రాయగలరు కూడా. త్వరలో ఆ పుస్తకాన్ని రాఘవగారు తీసుకురాగలరని ఆశిద్దాం.

చివరగా నాకు అద్భుతమైన ఈ తిరుమల దృశ్యకావ్యానికి ముందుమాట రాసే గౌరవాన్ని ఇచ్చినందుకు రాఘవ గారికి కృతజ్ఞతలు.

(సమాప్తం)


ఇది కూడా చదవండి




మరణ యాత్రలో.... యాతన ఎలా ఉంటుంది? రోగుల కోసం వైద్య ప్రయోగం చేపట్టి మరణ యాతన డైరీ రాసిన సాహసి ఈ మెడికో


Read More
Next Story