Agamya Gamyalu Book Cover
x

చీకటి ఆఫ్రికా చరిత్రకు పూసిన వెలుతురు పూల వేదనా గీతిక

కన్నీళ్ళతో పాడిన విషాద జీవన గీతికలివి.


కవి యల్లపు ముకుంద రామారావు రక్తాక్షరాలతో రాసి చీకటి చరిత్ర ఇది. కన్నీళ్ళతో పాడిన విషాద జీవన గీతికలివి. రచయిత యల్లపు ముకుంద రామారావు ముందు తరాల కోసం బాధ్యతగా రికార్డు చేసిన వలస వేదనా సముద్ర కెరటాల ఘోష ఇది. పరిశోధకుడు యల్లపు ముకుంద రామారావు మన తాతల, నానమ్మల, బిడ్డల రక్తాశ్రువుల్ని అక్షరాలుగా అనువదించిన ఒక భయానక అనుభవం… ఈ ‘అగమ్యగమ్యాలు’ Impassable Destinations of elusive Horizons

వాళ్లు భారతీయ కూలీలు. నిరుపేదలు. పేరులేని గుంపులు. పశువులు. బానిసలు. నిరంతరం పనిచేసే యంత్రాలు. సముద్రాలకు అడ్డంపడి

దారీ తెన్నూ లేని తీరాలకు ఎగిరిపోయిన వలస పక్షులు రాసిన వేదనాభరిత జీవన కావ్యాలివి. దూర దేశాల్లో దీవుల్లో శిధిలమై పోతున్న సమాధుల మీద మాసిపోతున్న శిలాఫలకాల్లోని అక్షరాలు చెబుతున్న కఠోరమైన జీవన సత్యాలివి! అంతేనా? యుద్ధకాలంలో

కాన్సంట్రేషన్ క్యాంపుల్లాంటి నరకకూపాల్లో వాళ్లెలా బతికారు.? మానవ మృగాల కొరడా దెబ్బల్ని తట్టుకొని వాళ్ళు ఎలా నిలబడగలిగారు? నిస్సహాయులైన ఆడవాళ్లు అక్కడే బిడ్డల్ని కని వాళ్లని ఎలా పెంచగలిగారు? నెత్తురోడిన గాయాలైనా తలఎత్తుకుని నిలబడి, పోరాడి గెలిచిన సాహసం పూల సుగంధమై పాడిన విజయగీతికల్ని సేకరించి మన కోసం దాచి ఉంచిన దార్శనికుడు ముకుంద రామారావు.

ఈ పరిశోధనా గ్రంథానికి సంపాదకునిగా ఉన్న ప్రసిద్ధ విమర్శకుడు ఎ.కె. ప్రభాకర్ ‘సృష్టికర్తలు’ అనే ముందు మాటలో … అది విస్మృత కోణం. చీకటి అధ్యాయం. నెత్తిటితో తడిసి నలిగిన పుట. చెమటతో చెరిగిన అక్షరం. చరిత్రలో గొప్ప ప్రయోగంగా వలస దేశాలు అభివర్ణించుకునే ఒప్పంద కార్మిక వ్యవస్థ Human Dignity పై జరిగిన అమానుష దాడి. పేదరికం కారణంగా జాతి పేరున ప్రాంతీయ అసమానతల మూలంగా సాటి మనుషుల్ని హీనంగా చూసిన క్రూరత్వానికి పరాకాష్ట ఇది.


ముకుంద రామారావు తాతగారు, మరికొందరు కుటుంబ సభ్యులు ఒప్పంద కార్మికులుగా దక్షిణ ఆఫ్రికాకు వలస పోయారు. తన మూలాల గురించి అన్వేషిస్తూ వెళ్లిన ఎలెక్స్ హేలీలాగా రామారావు గారి తవ్వకపు పనిలో పుట్టినదే ‘అగమ్య గమ్యాలు’. భారతదేశాన్ని విడిచి వెళ్లిన లక్షలాది కార్మికుల జీవన వేదనను వొడిసి పట్టారు - అని రాశారు. ఢిల్లీ అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అమిత్ కుమార్ మిశ్రా ఇలా అన్నారు… 1830 నుంచి 20వ శతాబ్దం ప్రారంభం వరకు 15 లక్షలకు పైగా భారతీయులు సముద్రాలను దాటి ప్రపంచవ్యాప్తంగా వలస దేశాల్లో పని చేశారు. ఈ వలసల చలనాన్ని కొత్త దాస్య వ్యవస్థగా పరిగణించారు. ఇది ఆఫ్రికా, కరేబియన్, పసిఫిక్ సమాజాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపడమే కాదు.. నేటికీ కొనసాగుతున్న వారసత్వాన్ని సృష్టించింది.

రచయిత ముకుంద రామారావు తన మాటలో ఇలా అన్నారు… 1838 నుంచి 1917 వరకూ 80 సంవత్సరాలు బ్రిటిష్ వలసవాదుల చక్కెర, రబ్బరు, టీ, కోకో తోటల పని కోసం ‘ఒప్పంద కార్మిక వ్యవస్థ’ కొనసాగింది. దక్షిణాఫ్రికా, కెన్యా, ఉగాండా, జమైకా, ట్రిని డాడ్ టొబాగో లాంటి 20 దేశాలకు మన కూలీలు వెళ్లారు. మా తాతయ్య దక్షిణాఫ్రికాకు చెరుకు పండించే రైతుగా వెళ్లారని, మా నాన్న జన్మించింది అక్కడే అని అతని ఆరు నెలల ప్రాయంలో తిరిగి వచ్చేసారని మాత్రమే మాకు తెలుసు.

ఆరు గంటల ప్రయాణమే ట్రినిడాడ్ పోవడానికి అని చెప్పి ఓడ ఎక్కించారు. 103 రోజులు పట్టింది అక్కడికి చేరుకోవడానికి. ఓడలో ఉన్న వారందరిదీ ఒక అరణ్య రోదన అని ఒక వృద్ధ ఒప్పంద కార్మికురాలు చెప్పిందని తెలిసినప్పుడు సముద్ర కెరటాలకు, ఓడ లోని వారి కన్నీటి కెరటాలకూ తేడా లేదు అనిపిస్తుంది. వీళ్ళ బాధలపై బీహార్ కి చెందిన దర్శకుడు సిమిత్ భగత్ ‘ఇన్ సెర్చ్ ఆఫ్ బిదేశీయ’ అనే ఒక లఘు చిత్రాన్ని భోజ్ పురిలో అద్భుతంగా తీశారు.

బీబీసీ వాళ్లు తీసిన Coolies: How British Rinvented slavery కూడా చూడతగ్గది.

ఈ దీనుల గురించి మహాత్మా గాంధీ…ప్రతి భారతీయుడూ మినహాయింపు లేకుండా యూరోపియన్ల అంచనాల్లో ‘కూలీ, దుకాణదారులు’ కూలీ దుకాణదారులు’ గుమస్తాలు కూలీ గుమస్తాలు. ప్రతి భారతీయుణ్ణి హేయంగా ‘కూలీ అంటారు. భారతీయులందరూ వారు ఎవరైనా సరే ‘కూలీ’ గానే చూడబడుతున్నారు అన్నారు.

ఒప్పంద కార్మిక వ్యవస్థ పద్ధతులను నిరసిస్తూ కవితలు వచ్చాయి. ముఖ్యంగా ఇవి ఉత్తర భారతదేశం నుండే వచ్చాయి. వారణాసి నుంచి వెట్టి చాకిరిని నిరసిస్తూ కరపత్రంగా ముద్రించి విడుదల చేసిన భోజ్ పురి జానపద పాట… డిపో వాళ్ళ నుంచి మిమ్ములను మీరు కాపాడుకోండి. జాగ్రత్త! జాగ్రత్త! అది ఉపాధి కాదు. పచ్చి మోసం. వారి వలలో చిక్కుకోకండి. పశ్చాత్తాప పడతారు. వారు మిమ్మల్ని సముద్రాల మీద తీసుకువెళ్తారు.


జమైకా, ఫిజీ, డేమెరారా, మారిషస్, బ్రిటిష్ గయానా, ట్రినిడాడ్, హుండోరాస్, అవి వలస రాజ్యాలు కాదు, జైళ్లు. కాపాడుకోండి. జాగ్రత్త పడండి, డిపో వాళ్ళ నుంచి ఉపాధి నెపంతో మీ మతాన్ని పాడు చేస్తారు. వాళ్ల తీయటి మాటలు వినొద్దు. వాళ్లు మీ శత్రువులు. ప్రియమైన సోదరులారా, స్టేషన్లలో బజార్లలో దళారీలు కనిపించి మిమ్మల్ని అడుగుతారు ఉపాధి కోసమా అని. మీకు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏ ఉద్యోగాలూ లేవు. కలకత్తాకు తీసుకుపోయి ఒప్పందం ప్రకారం మిమ్మల్ని ఇతరులకు అమ్మేస్తారు.

దానికోసం వారికి డబ్బు అందుతుంది. మీకు మిఠాయిలు పెట్టి ప్రలోభ పెడతారు. వాళ్లే మీకు ఉద్యోగాలు ఇస్తారని చెబుతారు. మిమ్మల్ని అధికారుల దగ్గరికి తీసుకెళ్తారు. వారి బుజ్జగింపుల్లో చిక్కుకోకండి. వారు చెప్పేది వినొద్దు. వారి దగ్గర నిలబడొద్దు. వారికి ప్రతిచోటా, వారివే కొన్ని డిపోలు, ఏజెన్సీలూ ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మర్చిపోవద్దు, ఈ వార్తను అన్ని గ్రామాలకూ తెలియజేయండి.

రచయిత , కవి ముకుంద రామారావు

ఇండెంచర్ కార్మికుల దుస్థితి గురించి జాతీయ కవి మైథలీ శరణ్ గుప్తా రాసిన గొప్ప కవితల్ని ముకుంద రామారావు గుర్తు చేశారు. వాటిని కోట్ చేశారు.

నిరుద్యోగం, నిరాశ, ఇంటి సమస్యలు, రోజు గడవకపోవడం వల్ల, దుర్భరమైన పేదరికం వల్ల మనవాళ్లు పనికి ఒప్పుకునే వాళ్ళు. మంచి పని, మంచి జీతాలు అని మోసం చేసి వాళ్లను ఓడలు ఎక్కించేవాళ్లు. పదివేల మైళ్ళ ప్రమాదకర ప్రయాణాలవి. ఏ వసతీ ఉండదు. సముద్రం గాలి, ప్రయాణం పడక పోవడం వల్ల వాంతులు, విరోచనాలు, జ్వరాలతో కొందరు చనిపోయే వాళ్ళు. ఆ శవాలతో పాటు కొందరు బలహీనులను, స్త్రీలను ఓడలోని నుంచి నీళ్లలోకి విసిరేసేవాళ్లు.

చనిపోయిన ప్రతికూలీకీ 30 డాలర్ల ఇన్సూరెన్స్ వాళ్లకు ముట్టేది. మారిషస్ లోనో, జమైకాలోనో రోజంతా తోటల్లో పని. సరిగా చేయడం లేదంటూ కొట్టడం, జైళ్లలో పెట్టడం చాలా మామూలుగా జరిగేది. స్త్రీలను లైంగికంగా వాడుకునే వాళ్ళు. ఎప్పటికైనా తిరిగి ఇళ్లకు వెళ్తామనే ఆశతో (Myth of return) ‘కూలీలు’ ఆ నరకంలో చావలేక బతికే వాళ్ళు. ఈ 350 పేజీల పుస్తకంలో హృదయవిదారకమైన ఇలాంటి ఎన్నో సంఘటనలను రచయిత వివరంగా రికార్డు చేశారు.

అనేకమంది రాసిన కవితల్ని ముకుంద రామారావు ప్రతిభావంతంగా తర్జుమా చేసి మనకు అందించారు. అందులో ఒకటి… ‘నువు మాకు గిలిగింతలు పెడితే మేము నవ్వమా? నువు గుచ్చితే మాకు రక్తం కారదా? నువు విషమిస్తే మేము చావమా? అలాగే నువు అన్యాయం చేస్తే మేము తిరగబడొద్దా?- షాషిపియా.

నవంబరు 2025 చివరిలో వచ్చిన ‘అగమ్యగమ్యాలు’ చరిత్ర చెక్కిలి మీద ఘనీభవించిన ఒక కన్నీటి చుక్క. ఒకనాడు ఘంటంతో రాసిన పురాతన తాళపత్ర గ్రంథాలంత అమూల్యమైన పుస్తకం ఇది. 80 సంవత్సరాల వయసులో పగలూ, రాత్రీ యేళ్ల తరబడి చేసిన అవిశ్రాంత కృషికి, అధ్యయనానికీ ఒక కొండ గుర్తుగా ఈ గ్రంథం చరిత్రలో నిలిచిపోతుంది.

1944 నవంబర్ 9న పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్ లో ముకుందరామారావు జన్మించారు. ఎంఎస్సీ, డి.ఐ.ఐ.టి చదువుకున్నారు. 2024 లో ‘రాత్రి గాలి వీస్తున్న గాలి’తో మొత్తం తొమ్మిది కవితా సంపుటాలు తెచ్చారు. అదే ఆకాశం, అదే గాలి, అదే నేల, అదే కాంతి, అదే నీరు అనే పేర్లతో తెచ్చిన ఐదు కవితా సంకలనాల్లో వేల మంది కవుల్ని ముకుంద రామారావు పరిచయం చేశారు. వందల కవితల్ని అనువాదం చేశారు.

గాంధీజీ చేసిన పోరాటం

1904 లో గాంధీజీకి 35 సంవత్సరాలు. ఆయన దక్షిణాఫ్రికాలో రెండోసారి పదేళ్లు వున్నారు. రస్కిన్ Unto this last (1860)- పుస్తకం ‘ఈ చివరి వరకూ’ లో సత్యం ఆయనకు తెలీదు. ఆ పుస్తకం గాంధీజీ జీవిత గమ్యాన్ని మార్చివేసింది. గుజరాతిలోకి ఆ పుస్తకాన్ని ఆయనే స్వయంగా అనువదించారు. నాటి ఒప్పంద కార్మిక వ్యవస్థకి వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో గాంధీ కీలక పాత్ర పోషించారు.

‘అగమ్య గమ్యాలు’ ఒక తరం జీవనానుభవానికి ఘనమైన నివాళి. చరిత్ర చీకటి వీధుల్లోకి నడుస్తుంటే, ముకుంద రామారావు పాదముద్రలు కాగితాలపై వాక్యాలవుతాయి. రాలిపోయిన పాత జ్ఞాపకాలు మళ్లీ చిగురిస్తాయి. ఆయన వేలి కొసల నుంచి రంగుల సీతాకోకచిలకలు ఎగిరి మన భుజాలపై వాలుతాయి.

Read More
Next Story