‘పెన్ గన్’ వదలని రంగనాయకమ్మ ఇపుడేం చేస్తున్నారో తెలుసా?
x

‘పెన్ గన్’ వదలని రంగనాయకమ్మ ఇపుడేం చేస్తున్నారో తెలుసా?

రంగనాయకమ్మ అనగానే కొందరికి రామాయణ విషవృక్షం, మరికొందరికి ‘బలిపీఠం’ సినిమా, మరికొందరికి కార్ల్ మార్క్స్ తెలుగు ‘క్యాపిటల్’ గుర్తొస్తాయి.


-రాఘవ శర్మ


గత సోమవారం సాయంత్రం రంగనాయకమ్మ (85) గారింటికి వెళ్ళి వారితో, గాంధీ గారితో చాలా సేపు ముచ్చటించాను.
వారిద్దరితో మాట్లాడుతుంటే, నాకు తెలియకుండానే కాలం మంచులా కరిగిపోయింది.
ఏడాది క్రితం రంగనాయకమ్మ గారితో ఫోన్ లో మాట్లాడినా, గాంధీ గారితో తరుచూ మాట్లాడుతునే ఉన్నాను.

‘నిన్న హైదరాబాద్ వచ్చాను. మీరు తీరికగా ఉండేట్టయితే, ఈరోజు సాయంత్రం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మళ్ళీ ఎల్లుండి తిరుపతి వెళ్ళిపోతున్నాను’ అని గాంధీ గారికి జనవరి 15 సోమవారం మెసేజ్ పెట్టాను.

‘సాయంత్రం 4-30కి చేరేలా రండి’ అని సమాధానమిచ్చి, గూగుల్ మ్యాప్ తో పాటు అడ్రస్ కూడా పంపారు.
మా మేనల్లుడు పండు నన్ను బుల్లెట్ లో వాళ్ళింటికి తీసుకెళ్ళాడు.
నాలుగున్న రంటే, నాలుగుకే వెళ్ళాం.

మమ్మల్ని చూసి గాంధీ గారు ‘రండి రండి’ అంటూ లోపలకు ఆహ్వానించారు.
బండిలో నన్ను దింపి వెళ్ళడం మా పండు వంతైతే, మా సంభాషణ అయిపోయాక ఫోన్ చేస్తే నన్ను తిరిగి తీసుకెళ్ళడం మరో మేనల్లుడు బుడుగు వంతు.
యువకులు కదా, మా మాటలు వాళ్ళకు విసుగనిపిస్తాయని ఈ ఏర్పాటు చేసుకున్నా.
మా పండు వెళ్ళిపోతుంటే ‘రా బాబు లోపలకు రా. టీ తాగైనా వెళ్ళు’ అన్నారు గాంధీ గారు.

నాతోపాటు మా పండు కూడా లోపలకు వచ్చాడు.
లోపల ఉన్న రంగనాయకమ్మ గారికి నర్సు చేయాల్సిన సపర్యలు చేసేసి అప్పుడే వెళ్ళిపోతోంది.
ఆ నర్సు వీరితో మాట్లాడ్డానికి వచ్చినప్పడు, రోజుకు ఎనిమిది వందల రూపాయల చొప్పున ఇస్తామని కుదుర్చుకున్నారు.
రెండు రోజులు కాగానే, రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తామని రంగనాయకమ్మ గారు చెప్పేశారు.
అంటే నెలకు ముప్పై వేల రూపాయలు.
ఆదివారాలు రానవసరం లేదు.
శెలవు తీసుకునే ఆదివారాలకు జీతం కోత ఉండదు.
‘రంగనాయకమ్మ గారింట్లో పనిమనిషిగా కుదిరినా బాగుండేది’ అన్నాట్ట ఒక జర్నలిస్టు.
చాలా మంది రిటైరైన జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితి అలాఉంది.
రంగనాయకమ్మ గారి గురించి క్లుప్తంగా ఈ తరానికి పరిచయం చేస్తాను.
రంగనాయకమ్మ గారు సాధారణ పాఠా కుల చేత విస్తృతంగా చదివించ గల సృజనాత్మక రచయిత్రి.

జానకి విముక్తి వంటి ప్రసిద్ధ నవల తో పాటు, బలిపీఠం వంటి వెండి తెర కెక్కిన అనేక నవలలు, కథలు రాశారు.

వారు రాసిన 'రామాయణ విష వృక్షం' ఒక సంచలనం.

'ఇదండి మహాభారతం', 'వేదాలు వేదాలు వేదాలు' వంటి గ్రంథాలు ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక దృష్టి తో ఎలా చూడా లో చెపుతా యి.

'ఇంగ్లీష్ కీకారణ్యం లోకి ప్రవేశించండి', తెలుగు వ్యాకరణం గురించి రాసిన పుస్తకాలు భాష పైన రంగనాయకమ్మ గారికి ఉన్న శ్రద్ధను, పట్టును తెలియ చేస్తాయి.

'కారల్ మార్క్స్ క్యాపిటల్' ను సరళ మైన తెలుగు లో పరిచయం చేయడం, 'ప్యారిస్ కమ్యూన్' గురించి రాయడం 'చైనాలో ఏమి జరుగు తోంది', 'చైనాలో సాంస్కృతిక విప్లవమూ, పరిశ్రమల నిర్వాహణ' వంటి వారి అనువాద గ్రంథాలు, 'దళిత సమస్యకు బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాల డు, మార్క్స్ కావాలి' వంటి గ్రంథాలు, 'తత్వ శాస్త్రం చిన్న పరిచయం', 'వర్గాల గురించి మార్క్స్ ఏంగెల్స్ లు ఏం చెప్పారు' వంటి గ్రంథాలు తెలుగు వారికి విజ్ఞాన సర్వస్వం వంటివి.

రంగనాయకమ్మ గారి రచన ల్లో ఇవి కొన్ని మైలు రాళ్ళు మాత్రమే.

రంగనాయకమ్మ గారి తో మాట్లాడుతున్న ఈ వ్యాస రచయిత రాఘవ శర్మ


తర్వాత, రంగనాయకమ్మ గారి గదిలోకి వెళ్ళాం.
ఒక మంచంపైన పడుకున్నట్టు దిండుకు ఆనుకుని కూర్చున్నారు.
వెండితీగల్లా తలంతా అల్లుకుని, నెరిసిపోయిన జుట్టుకు క్రాఫ్ చేయించుకున్నారు.
కడుపులో సమస్య వచ్చి ఆపరేషన్ చేసినప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు.
ఇరవై రోజుల క్రితం వరకు లేచి ఇంట్లోనే వాకర్ తో నడిచేవారు.
ఇప్పుడు నడవలేక పోతున్నారు.

నర్సు సాయంతో స్నానానికి లేచి, వాకర్ తో కొన్ని అడుగులు మాత్రం వేయగలుగుతున్నారు.
ఆస్పత్రి గౌన్ వేసుకుని, మెడవరకు దుప్పటి కప్పుకున్నారు.
పొట్టపైన హెర్నియా కాస్త ఉబ్బి పైకి కనిపిస్తోంది.
అంత ఇబ్బందిలో కూడా రాయడం మానుకోలేదు.
రంగనాయకమ్మ గారికి రాయడం అంటే శ్వాసించడమే.
శ్వాసించినంత కాలం రాస్తూనే ఉంటారు.
పక్కపైనే కాయితాలు పెట్టుకుని, పెన్నుతో రాసిస్తే, కంప్యూటర్లో కంపోజ్ చేయించి, 36 పాయింట్ల సైజ్ లో ప్రింటౌట్ తీసిస్తే, వాటిని సరిచేసి, మార్పులు చేర్పులతో ఇస్తారు.
తనకు సంతృప్తి కలిగే వరకు అలా మారుస్తూనే ఉంటారు.
వారి మంచం పక్కన మరొక మంచం ఖాళీగా ఉంది.
బహుశా గాంధీ గారు పడుకుంటారనుకుంటా.
దాని పక్క మరొక మంచంలో పడుకున్న ‘స్పార్టకస్’ అప్పుడే లేచి మమ్మల్ని చూస్తున్నాడు.
‘స్పార్టకస్ మా మనవడు ’ అని గాంధీగారు పరిచయం చేశారు.
స్పార్టకస్ పదమూడు, పద్నాలుగేళ్ళ కుర్రవాడు.
ఏదో జబ్బు చేసి, మానసిక, శారీరక వైకల్యంతో ఉన్నట్టు కనిపించాడు.
స్పార్టకస్ అని పేరు పెట్టి ఆ పిల్లవాడిని చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు.
ఎంత మంచి పేరు !

కంప్యూటర్లో స్పార్టకస్ కంపోజ్ చేస్తాడట!
రంగనాయకమ్మ గారికి నమస్కారం పెట్టి, పక్కనే వేసిన కుర్చీలో కూర్చున్నాను.
వారికి ఎదురుగా ఉన్న కుర్చీలో మా పండు కూర్చున్నాడు.
గాంధీ గారు మా ఇద్దరికీ టీ తెచ్చారు.
టీ, కాఫీ తాగడం మానేశానని చెప్పాను.
‘‘ఎందుకు తాగరు?’’ గాంధీగారి ప్రశ్న.
‘‘మా అమ్మ ఉగ్గు పాలతో కాఫీ అలవాటు చేసింది.
కాఫీ నాకొక వ్యసనమై పోయింది.
ఆఫీసుకు కూడా ఫ్లాస్క్ లో కాఫీ తీసుకెళ్ళేవాడిని.
పొట్టలో ఏదో సమస్య వచ్చి డాక్టర్ మానేయ మంటే టీ, కాఫీలు మానేశాను.
ఎందుకొచ్చిందిలే అని మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు’’ అన్నాను.
‘‘ఏం తాగుతారు?’’ అంటే, ఏమీ అవసరం లేదన్నాను.
మజ్జిగ తెచ్చిచ్చారు.
జతీన్ గారు రాసిన ‘సోవియట్ సాహిత్య భాస్కరులు’ అన్న పుస్తకం, జతీన్ గారే అనువాదం చేసిన ఖలీల్ జీబ్రాన్ కథల పుస్తకం, ప్రవాష్ గోష్ రాసిన ’శరత్ సాహిత్యాన్ని నేటికీ అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత ఏమిటి?’ అన్న పుస్తకం రంగనాయకమ్మ గారికి ఇచ్చాను.

’‘మంచి పుస్తకాలు. సాహిత్యానికి సంబంధించినవి. తప్పకుండా చదివించుకుంటాను’’ అన్నారు.
‘‘మీరు దేవుణ్ణి నమ్ముతారా’’ అని రంగనాయకమ్మ గారు మొదటి ప్రశ్న సంధించారు.
‘‘నమ్మనండి’’ అన్నాను.
‘‘చాలా మంచిది’’ అన్నారు.
‘‘శ్రమ దోపిడీని గమనించారా?’’ అడిగారు.
‘‘ఇది వర్గ సమాజం కదా. శ్రమ దోపిడీని గమనించానండి. దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు'’ అన్నాను.
‘‘చాలా చాలా మంచిది’’ అన్నారు రంగనాయకమ్మ గారు.
‘‘రంగాజీ ఆయనెవరనుకుంటున్నారు?
ఆలూరు భుజంగరావు గారి అన్న కొడుకు.
ఇదివరకు మనింటికి కూడా వచ్చారు.
గుర్తు పట్టలేదా?’’ అంటూ అడిగారు గాంధీగారు.
‘‘నాకు గుర్తు లేదు గాంధీ.
విషయం గుర్తుంటోంది తప్ప మనుషులు గుర్తుండడం లేదు’’ అన్నారు రంగనాయకమ్మ గారు.
‘‘మనం పని చేసిన పార్టీలోనే వారుకూడా కొంత కాలం చేశారు’’ అని చెప్పారు గాంధీ గారు.
‘తరువాత ఏం చేసేవారు?’
‘‘పత్రికల్లో పనిచేస్తూ, పదేళ్ళ క్రితం రిటైర్ అయ్యాను’’ అన్నాను.

మా సంభాషణ వ్యక్తిగత విషయాలలోకి వెళ్ళింది.
తొలుత వ్యక్తి గత విషయాలు రాయకూడదనుకున్నా.
వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండవు. ప్రతిదీ సమాజంతో ముడిపడినవే. సామాజికమే.
రంగనాయకమ్మ గారు తనకు సంతృప్తి కలిగే సమాధానం వచ్చే వరకు ప్రశ్నలు వేస్తూనే ఉంటారు.
‘‘మీ పెళ్ళాం బిడ్డలేం చేస్తారు?’’ రంగనాయకమ్మ గారి ప్రశ్న.
‘‘నేను పెళ్ళి చేసుకోలేదండి’’ అన్నాను.
‘‘అయ్యో.. ఎందుకు పెళ్ళి చేసుకోలేదు?’’ అంటూ ఆశ్చర్యంతో మరో ప్రశ్న.
‘‘దానికి పెద్ద కారణాలేం లేవు. చేసుకోలేదంతే. వదిలేశాను’’ అన్నాను.
‘‘ఏదో కారణమే ఉంటుంది. మీ ఆలోచనలకు తగిన అమ్మాయి దొరకలేదా?’’
‘‘నేను ప్రయత్నం చేయలేదండి’’ అన్నాను.
‘‘మీరు నచ్చిన వారెవరూ మిమ్మల్ని చేసుకోవాలనుకోలేదా?’’
‘‘నేను గమనించలేదండి’’
‘‘మా అబ్బాయికి కూడా 64 ఏళ్ళు. వాడు కూడా పెళ్ళి చేసుకోలేదు. మీరు చేసుకోకపోవడానికి ఏదో బలమైన కారణమే ఉంటుంది’’ అన్నారు రంగనాయకమ్మ గారు.
‘‘కుటుంబ, ఆర్థిక కరాణాలే తప్ప వేరే కారణాలేమీ లేవు’’ అన్నాను.
‘‘ఉద్యోగం చేశారు కదా. చేసుకోవచ్చు కదా’’ అన్నారు.
‘‘అవి తుమ్మితే ఊడిపోయే ముక్కుపుడకలు’’ అన్నాను.
‘'మీకు జీవనమెట్లా?‘' అన్నారు.
‘‘మా చివరి చెల్లెలు, అంటే పండు వాళ్ళమ్మ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తోంది.
ఆమే చూస్తుంది’’ అన్నాను ఎదురుగా కూర్చున్న పండును చూపిస్తూ.
పండును చూస్తూ ‘‘నీకు పెళ్ళైందా?’’ అడిగారు రంగనాయకమ్మ గారు.
‘‘శరీరం భారీగా ఉంది కానీ, మా పండు చిన్న వాడు.
ఇరవై ఒక్కసంవత్సరాలే.
మొన్ననే బీటెక్ పూర్తయింది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు’’ అన్నాను.
మా పండుకు మా మాటలు విసుగనిపిస్తాయేమోనని ‘‘వెళతానన్నావుగా’’ అన్నాను.
‘‘వెళ్ళను లే, ఉంటాను’’ అన్నాడు.
మా సంభాషణ పండుకు ఆసక్తిగా ఉన్నట్టుంది.


‘‘మీరిప్పుడేం రాస్తున్నారు?’’ అడిగాను రంగనాయకమ్మ గారిని.
‘‘శ్రమ దోపిడీ గురించి రాస్తున్నాను’’ అన్నారు.
‘‘శ్రమ దోపిడీ గురించి రంగాజీ ఇదివరకు రాశారు. అది ఆమెకు సంతృప్తి కలిగించినట్టు లేదు. మళ్ళీ వివరంగా దాన్ని తాజా ఆలోచనలతో రాస్తున్నారు.’’ అన్నారు గాంధీ గారు.
‘శ్రమ దోపిడీ గురించి ప్రశ్నలు, సమాధానాల రూపంలో ‘వాయిస్ ఆఫ్ ప్రజాపంథా’లో రాస్తున్నాను. ఆ కాపీలు వారికియ్యి గాంధీ’ అన్నారు రంగనాయకమ్మ గారు.
‘‘నేను మీ వాట్సప్ కి వేస్తాను’’ అన్నారు గాంధీగారు నవంబర్ సంచిక మాత్రం ఇస్తూ.
‘‘రంగాజీ రాసిన ఒక వ్యాసం ఒక కమ్యూనిస్టు ప్రతికకు పంపించాం.
వేసుకుంటామని కానీ, వేసుకోమని కానీ చెప్పలేదు.
నేనేఫోన్ చేసి అడిగాను.
తమ పార్టీ రాష్ట్ర కమిటీ పరిశీలనలో ఉందన్నారు.
ఎన్ని రోజులకూ చెప్పక పోవడంతో మళ్ళీ అడిగాను. ‘మార్క్స్ పైన రాసింది కనుక వివాదమవుతుంది.వేసుకోలేం’ అని చల్లగా చెప్పారు.
అలా ఉంటుంది వ్యవహారం’’ అంటూ గాంధీ గారు వివరించారు.

డిగ్రీలో నేను ఎకనమిక్స్ చదువుకున్నప్పటికీ మార్క్స్ క్యాపిటల్ ఇంగ్లీషులో చదవాలని చాలా ఏళ్ళ క్రితం ప్రయత్నం చేశాను.
నాకు అర్థం కాలేదు.
రంగనాయకమ్మ గారు రాసిన మార్క్స్ క్యాపిటల్ పరిచయం చదివాకే అది నాకు కాస్త బోధపడింది.
‘రంగనాయకమ్మ గారు రాసిన మార్క్స్ క్యాపిటల్ పరిచయం’ పుస్తకాన్ని గాంధీ గారితో పాటు కేవీయార్ వంటి ఉద్దండులు కొందరు ఇంగ్లీషులోకి అనువాదం చేశారు.
అచ్చు వేయడానికి అయిన ఖర్చు కంటే తక్కువగా, అందులో సగం ధరే పెట్టారు.
అనేక దేశాల్లో అది బాగా ప్రాచుర్యం పొందింది.
ఎమర్జెన్సీ కాలంలో, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు లైబ్రరీ కెళ్ళి, చలం సాహిత్యంతో పాటు రామాయణ విష వృక్షం చాల ఇష్టంగా చదివాను.
ముఖ్యంగా రామాయణ విష వృక్షం ముందు మాట నన్ను బాగా ఆలోచింప చేసింది.
పురాణాల పట్ల శాస్త్రీయ ఆలోచనలకు పునాదిని వేసింది.
‘‘రామాయణ విష వృక్షం ముందుమాట వరకు విడిగా అచ్చు వేయవచ్చు కదా’’ అని ఒక సారి గాంధీగారిని అడిగాను.
‘‘అలా చేస్తే ముందు మాటతో చదవడం ఆపేస్తారు.
మొత్తం చదవాలి కదా’’ అన్నారు గాంధీ గారు.


‘‘వేదాలు వేదాలు వేదాలు’’ అన్న రంగనాయకమ్మ గారి పుస్తకం ఇటీవలనే చదివాను.
సనాతన ధర్మం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
‘సనాతన ధర్మం’ గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు వేదాలపై రంగనాయకమ్మ గారి పుస్తకంలోని విషయాలు నాకు చాలా ఉపయోగపడ్డాయి.
రంగనాయకమ్మ గారు కథలు, నవలల తో మొదలు పెట్టి, అనేక వ్యాసాలు, అనువాదాలు, సిద్దాంత గ్రంథాలను సరళమైనభాషలో రాశారు.
వేదాలు, పురాణాలపైనే కాకుండా ముఖ్యంగా సులభ శైలిలో మార్క్సిస్టు సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు.
అవి కూడా చాలా తక్కువ ధరలకు.
రంగనాయకమ్మ గారు రాసిన సాహిత్యాన్నంతా గాంధీ గారు చూపించారు.
రంగనాయకమ్మ గారి సాహిత్యం అంతా చదవడానికే మనకు చాలా ఏళ్ళు పడుతుంది.
వారు ఈ రచనలన్నిటీ నీ చేయడానికి ఈ జీవిత కాలం పట్టి ఉంటుంది.
మార్క్సిస్ట్ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందివ్వడంలో ఆమె ‘వన్ ఉమన్ ఆర్మీ’ అనడం అతిశయోక్తి కాదనుకుంటా.

సాయంత్రం నాలుగు గంట ల కొచ్చిన వాళ్ళం సెలవుతీసుకుని బైటికి వచ్చేసరికి ఆరవుతోంది.
వారిరువురి నుంచిసెలవు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాం.
హైదరాబాద్ లో నాలుగు రోజులున్నా, మొత్తం అరడజను మంది సాహితీ ప్రముఖులను కలిశాను.
డాక్టర్ జతిన్ గారు, నిఖిలేశ్వర్ గారు, పాశం యాదగిరి గారు, హరగోపాల్ గారు, నిజం శ్రీరామమూర్తి గారు, రంగనాయకమ్మ గారు, గాంధీ గారు.
ఇంత మందిని ఒక్క ట్రిప్ లో కలవడం నిజంగా ఎంత అబ్బురమో !

మాటల వరుసకు కొందరు పాత్రికేయ మిత్రులతో రంగనాయకమ్మ గారిని కలిసిన విషయం గురించి చెపితే, ‘‘వారు ఏం మాట్లాడారో రాయండి, ఉపయోగకరంగా ఉంటుంది’‘ అన్నారు.

అలా సలహా ఇచ్చిన వారిలో రాజశేఖర రాజు, తాడి ప్రకాష్, ఏ.ఎన్.పరమేశ్వరరావు, సాకం నాగరాజు వంటి వారున్నారు.


(ఆలూరు రాఘవశర్మ, జర్నలిస్టు, రచయిత. సాహితీ సౌగంధం ( ఉమ్మడి చిత్తూరు జిల్లా సాహితీ వేత్తల గురించి)కొత్త బంగారు లోకం ( చైనా పర్యటన అనుభవాలు) తిరుమల దృశ్య కావ్యం ( శేషాచలం కొండల లో ట్రెక్ అనుభవాలు) పుస్తకాలు అచ్చయ్యాయి. త్వరలో ‘వనపర్తి ఒడి లో’ విడుదల కానుంది.)

Read More
Next Story