అడవి పరిమళం లాంటి ఆ అనుభవం
గుభాళించే ఒక ప్రకృతి కవిత ఈ ఆదివారం
-అలజంగి మురళీధర రావు
అడవి పరిమళం లాంటి ఆ అనుభవం
రోజూలానే ఇవాళ కూడా జీవితాన్ని మోసుకుంటూ పోతున్నా
అడివిపల్లెలో పిల్లలకి పాఠాలు బోధించడానికి !
ఈ ప్రభాత పయనంలో
మత్తైన చల్లని కొండగాలి
కునుకుల్ని కుమ్మరిస్తుంటే
కళ్ళు మరో లోకంలోకి తెరుచుకున్నాయి!
కొన్ని లిప్తల అనుభవం
కొన్ని ఘడియల యోగం
కనురెప్పల చివార్లలో ముడిపడి వ్రేలాడుతున్నాయి!
కలం తీసా కవిత్వీకరిద్దామని,
విరుచుకువస్తున్నాయనుకున్న వాక్యాలు
ఏదాటుకుపోయినాయో...!?
వెల్లువెత్తుతాయనుకున్న పదాలు
ఎటెళ్ళి పోయినాయో...!?
నాకలం గేలానికి చిక్కక
అక్షరమీనాలన్నీ ఆటాడుకుంటున్నాయి!
ఇక ఎదురుపడ్డ
అడవిని,అడవిపూలని;
ఋతురాగాల్ని,వెలుగునీడల దృశ్య సాగరాల్ని;
మంచు అందాల్ని,వాన మకరందాలని
తమవి చేసుకుంటూ మౌన మునులవుతాయి నా కళ్ళు !
ఆకురాలే అడవి నగ్నత్వంలో ఏదో అందీ అందని దివ్యత్వాన్ని,
రాలిపడిన ఎండుటాకుల్లో ఏవో అందమైన నైరూప్య చిత్రాల్ని
ఏరుకుంటోంది నా అంతర్నేత్రం!!
నిండా పూలు పూచిన కాఫీ మొక్కల్ని చూస్తే
నెమళ్ళు పురి విప్పాయా అనిపిస్తుంది!
అడివంతా అల్లుకున్న ఓ సతత హరితపు ఆప్యాయత
అల్లిబిల్లిగా అల్లుకుపోయిన నా గుండె ముళ్ళ పొదపై
పసుపు పచ్చని పూలను పూయిస్తుంది!
ఇంకేదో లోకపు భ్రమలు తొలగిపోతున్నాయి !!
ఇప్పుడు నేను
ఈ అడవి ఒడిలో,కొండ గుడిలో,ప్రకృతి బడిలో
రెక్కలు తొడుక్కుని విహరిస్తున్న ఒక సప్త వర్ణ సుందర స్వప్నాన్ని!
అనంతతత్వపు లోయలో చరిస్తున్న ఓ ఆదిమ కణాన్ని!!
(అలజంగి మురళీధర రావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల,పాడేరు)
Next Story