
అడవిలో ఉన్నట్లుండి ఎదురుగా ఏనుగు ప్రత్యక్షమైతే...
శేషాచలం అడవిలో ఒక రాత్రి గడిపిన ట్రెక్కర్ గోవిందరాజ భాస్కర్ అనుభవం
శేషాచల అడవుల్లోని తిరుమల తీర్థాలను సందర్శించేందుకు పద్నాలుగు మంది సభ్యులతో కూడిన మా బృందం శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతిలో బయలుదేరి తిరుపతికి ఉత్తరాన 30 కి.మీ దూరాన ఉన్న కుక్కలదొడ్డి మీదుగా నాలుగు గంటలకు అడవిలోకి ప్రవేశించాం. అడవిలోకి ప్రవేశించాక మొదటి ఆరు కిలోమీటర్లు బండ్ల మీద ప్రయాణిస్తూ దారికి అడ్డంగా పారుతూ వున్న యేటి దగ్గరకు వచ్చాము. యేటి ఒడ్డున మా బండ్లను పార్క్ చేసి, యేటి రాళ్ళ మీదుగా నడుస్తూ చుట్టూ వున్న ప్రకృతి అందాలను, పారుతున్న సెలయేరులను చూస్తూ ప్రొద్దుగుంకే సమయానికి బండి ఇరుసులు తీర్థానికి చేరుకున్నాం. ఇపుడుమేము తిరుపతికి 40 కి. దూరాన ఉన్నాము.
అప్పటికే సూర్యాస్తమయం సమీపించడంతో, చుట్టూ వెలుతురు తగ్గిపోయి చీకటి కమ్ముకొనడం ప్రారంభమైంది. చీకట్లో అడవుల్లో తిరగడం శ్రేయస్కరం కాదు కాబట్టి బండి ఇరుసులు తీర్థానికి అనుకోని వున్నా బండమీద రాత్రికి సేదతీరాలని నిర్ణయించుకొని ఒక్కొక్కరం బండి ఇరుసులు గుండంకు వారగా నీటిలో నడుచుకొంటూ బండ దగ్గరకు వెళ్లి బండ మీదకు మెల్లగా ఎగబ్రాకడం ప్రారంభించాము.
వంద అడుగుల పొడవు, అరవై అడుగుల వెడల్పుతో వున్నా బండ పైకి ఎక్కిన తరువాత పడుకోవడానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకొని దానిపైన పేరుకున్న చెత్తని తొలగించాం, ఇంతలో విశ్వ మేము తెచ్చుకొన్న వంట సామాగ్రితో వంటకు ఉపక్రమించాడు.
జనవరి నెల కావడం వల్ల చలి తీవ్రంగా ఉండటమే కాక, మంచు కూడా కురుస్తుండటంతో, మా నోట్లోని పళ్లూ నిస్సహాయంగా దరువేస్తున్నాయి.
అమావాస్య కావడం మూలానా కళ్ళు పొడుచుకొన్న కాన రాని కటిక చీకటి. విస్తున్న గాలికి తలలు ఆడిస్తున్న మా ముందువున్న ఎదురు పొదల్లోని ఎదురు చెట్లు, వాటి నీడలు కలవరపెట్టేలా కనిపిస్తున్నాయి రాళ్ళ మాటున పరుగులు తీసే నీటి సవ్వడి గాఢమైన నిశ్శబ్దాన్ని చీల్చుతూ మృధుమాధుర్యంగా వినపడతావుంది.
రాత్రికి చలి ఎక్కువగా ఉంటుందని గ్రహించి రాధా కృష్ణ , శ్రీకాళహస్తి మురళి, వాసుదేవ, ఇంకా మిగతా సభ్యులు క్యాంపు ఫైర్ వేయడానికి కావలసిన ఎండిన కట్టెలను వెతకడానికి బయల్దేరారు.
చుట్టుపక్కల పరిసరాలను జల్లెడ వేసి, ఎండు కట్టెలను సేకరించిన మా స్నేహితులు, బండ మధ్యలో క్యాంప్ ఫైర్ వెలిగించారు. మంటలు ఎగిసిపడుతూ చుట్టూ స్వల్పమైన వెలుతురును ప్రసరించాయి. చలి తీవ్రతను తగ్గిస్తూ, ఆ తాపంతో మనసులు కూడా ఓ కమ్మదనాన్ని అనుభవించాయి.
మేము వెలిగించిన వెలుతురు చుట్టూ మాత్రమే కొద్దిపాటి వెలుగు విరజిమ్ముతుంది , మిగతా ప్రాంతమంతా దుప్పటి కప్పుకోనట్టు కటిక చీకటి.
అప్పుడప్పుడు ఒకటో రెండో పక్షుల అరుస్తున్న అరుపులు చెవులకు గుబులు తెప్పిస్తున్నాయి, వీస్తున్న గాలి తీసుకొస్తున్న ఆడవిపూల గుభాళింపులు, ఆ రాత్రికి ఓ ప్రత్యేకమైన మాయాజాలాన్ని అద్దింది.
ఇక్కడ బండి ఇరుసుల బండ్ల మీద సేద తీరడం మా బృందానికి కొత్త కాదు. ఇదివరకూ కూడా ఇలాగే గడిపిన అనుభవం ఉంది. కానీ ఈసారి ఎక్కడో ఏదో అపసవ్యం ఉన్నట్టుగా అనిపిస్తోంది. కానీ అదేంటో అర్థం కాక, మనసులో ఒకింత ఆందోళన చోటుచేసుకుంది.
కాలినడకన యెటిరాళ్ల మీద గంటకు పైగా నడుచుకొంటూ రావాడం మూలానా విశ్వ చేసిన అన్నం,ముద్దపప్పు, పుత్తూరు గిరి చేసిన మిరపకాయ బజ్జిలు తింటుంటే పంచభక్ష పరమాన్నాల్లా తోచాయి. ఆ నిర్జనారణ్యంలో, ఆభోజనం ఆ రుచులు అలా నాలుకకు తగిలిన మరుక్షణమే మా శరీరానికీ, మనసుకూ కొత్త ఉత్సాహం ఇంజెక్టు చేసినట్లయింది.
లెక్చరర్ వాసు తీసుకొనివచ్చిన వారి చేల్లెళ్లకు(వారిలో కొందరు టీచర్లు, లెక్చరర్స్ ) సేఫ్ గ టెంట్స్ వేసి వాటిలో సేదతీరమని చెప్పారు. ఇక మగవాళ్ళం అందరం బండ్లపై దుప్పట్లు పరచి అలసిన మా శరీరాలను వాటి పై చేర్చాము.
పడుకొనే ముందు మాకందరికి స్పీకర్ లో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఆలపించిన అన్నమయ్య కీర్తనలను వినడం అలవాటు. నా మట్టుకు శేషాచల అడవులలో ఆ పాటలను వినడం అంటే వైకుంఠపు అంచుల దగ్గర స్వామి వారి పాదాల ముందు కూర్చొని ఆయనను చూస్తున్న అనుభూతి .ఆ పాటలు వింటూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నామో తెలియలేదు.
తెల్లవారుజామున, చలికి గజగజ వణుకుతూ మంటకాచుకుంటున్న రాధా కృష్ణ , వాసుదేవ్ మాట్లాడుకుంటున్న మాటలతో మెలకువ వచ్చింది. చుట్టూ ఇంకా ముసురుగా ఉండగా, మంట చుట్టూ వారిద్దరూ చేతులు చాపుకొని వేడికట్టుకుంటుండటం కనిపించింది. ఆ సమయాన ప్రకృతి నిశ్శబ్దాన్ని విరిచిన మంట చప్పుడు, గాలిలో కలిసిన పొగ వాసన, మృదువుగా వీస్తున్న గాలి, ఇవన్నీ కలిసి ఆ ఉదయానికి మరింత ఆహ్లాదకరమైన అందాన్ని అందించాయి.
ఒక్కొకరుగా మెల్లగా చలిమంట దగ్గర చేరుకున్నాం. మా అలికిడికి మేలుకున్న విశ్వ, తెల్లవారుజాముకే పొగలు కక్కే టీని సిద్ధం చేశాడు. ఆ వేడి టీని చప్పరిస్తూ, అడవిలోని చల్లని గాలి స్నేహితానురాగ స్పర్శను ఆస్వాదిస్తూ, భానుడి లేత కిరణాల ముద్దులకు తీయని అనుభూతిని పొందుతూ, పక్షుల కిలకిలరావాలు, అడవి కోళ్ల కెక్కరించడాలను ఆసక్తిగా వింటూ ప్రకృతిలో మమేకమైపోయాం.
ఇవన్నీ మా మనసులను తేలికపరిచి, అనుభూతుల సన్నజాజి వీధుల్లోనికి నడిపిస్ధాయి. ఆ క్షణం, స్వర్గపు అంచుల దగ్గర నిలబడి అద్భుత దృశ్యం వీక్షించిన అనుభూతి కలిగిస్తుంటుంది మాకందిరికి.
మేమంతా "దంతాధావనం, కాలకృత్యాలు, బండి ఇరుసుల్లో స్నానపానాదులు ముగించుకొనే సరికి పుత్తూరు గిరి, వేడి వేడి ఉప్మా సిద్ధం చేసాడు. ఉప్మా తింటూ దేవా తీర్థం (Deva Tirtham) వెళ్లాలని మా బృందం చర్చించుకోవడం ప్రారంభించింది. ఆహ్లాదకరమైన వాతావరణం, వేడి ఉప్మా సువాసన, భక్తి భావంతో దేవతీర్థ యాత్రపై చర్చ—ఇవన్నీ కలిసి ఓ పర్వదినపు శుభారంభంలా అనిపించాయి.
అందరం ఫలహారం ముగించుకున్న తరువాత, ఎవరి లగేజ్‌ను వారు సర్దుకుని, మేము విశ్రమించిన బండ నుంచి క్రిందకు దిగడానికి సిద్ధమవుతుండగా, విశ్వ మెల్లగా నా దగ్గరికి వచ్చాడు. అతని ముఖంలో ఏదో తీవ్రమైన భయం తళుక్కున మెరుస్తావుంది . చేతులు స్వల్పంగా వణుకుతున్నాయి. కళ్ళు భయంతో విప్పారించి, గొంతులో మాటలు ఇరుక్కుపోయినట్టు "సర్… అటు చూడండి!" అని వణుకుతున్న చేతితో ఓ వైపునకు చూపాడు , నేను నెమ్మదిగా అతను చూపించిన వైపు తల తిప్పాను. విశ్వ చూపించిన దిశలో చూసిన క్షణమే, నా ఊపిరి ఒక్కసారిగా ఆగిపోయిన ఫీలింగ్.
మా ముందు ఒక యాభై అడుగుల దూరంలో, పన్నెండు అడుగుల ఎత్తున్న మగ ఏనుగు గంభీరంగా నిలబడి మమ్మల్నే గమనిస్తా వుంది. దాని కన్నులు ఎర్రగా మెరుస్తున్నాయి, మెల్లగా వెన్నులో మొదలైన చలి శరీరమంతా వ్యాపించి మా మెదళ్లను మొద్దుబారించింది.
ఏనుగు నల్లటి భారీ శరీరం ఉదయపు సూర్యరశ్మిలో మెరిసిపోతూ ఏకాగ్రతతో ఎటువంటి చలనం లేకుండా మమ్మల్నే గమనించ సాగింది.
దాని కళ్లలో ఒక ప్రశ్నార్థకం.
నాకిప్పుడు అర్థమైనది నిన్నటి నుంచి నా మనసుకి నాకే తెలియకుండా ఏదో అపసవ్యంగా అనిపించింది ఈ ఏనుగువల్లనేమో, ఏమో మేమంతా భయం తాలూకు భావనలో ఉండడంతో, మాకు తెలియకుండానే ఊపిరి బిగపట్టుకున్నాం. మా గుండె చప్పుడే మాకే కర్ణకఠోరంగా వినపడతావుంది.
గొంతులో తడి ఆరిపోయింది. మెదడులో రకరకాల ఆలోచనలు.
ఒక్కసారి ఏనుగు అరుస్తూ తన తొండాన్ని పైకెత్తి, మా వైపుకు కదిలితే !! ఏమి చేయగలము? పారిపోవాలా? అది ప్రమాదకరం. మరి నిలబడాలా? అది ఇంకా ప్రమాదకరం.
మాకందరికి భయంతో శరీరం చిగురుటాకులా వణికిపోతు శిలలా నిశ్చలంగా మారింది.
ఆ క్షణం మాకు అర్థమైంది – "ప్రకృతిలో మనం ఎంతో చిన్నవాళ్ళం" అని.
అదే క్షణం, ఎక్కడినుంచో ఒక చిన్న గాలి తరంగం కొట్టుకువచ్చి, చెట్ల ఆకులను కదిలించింది. ఏనుగు కళ్లల్లో ఏమాత్రం మార్పు లేకుండా మమ్మల్ని గమనిస్తూనే ఉంది. మేము మాత్రం ఆ నిశ్శబ్ద భయంలో మునిగిపోతూవున్నా , మనస్సులో మాత్రం వేల ప్రశ్నలు తిరుగుతూనే ఉన్నాయి –
ఆ ఒక క్షణం లో మేం అర్థం చేసుకున్నాం—ప్రాణభయమనే అనుభూతి ఎలా ఉంటుందో!
ఇప్పుడు ఏమవుతుంది?
అంత భయానకమైన పరిస్థితిలో ముందూ, వెనుకా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పటికీ, మాతో పాటు వచ్చిన పిల్లల (లెక్చరర్ వాసు చెల్లెళ్లు) క్షేమం గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను.
ఆ ఆలోచన వెంటనే రాధాకృష్ణ వైపు తిరిగి, "పిల్లలందరినీ వెంట తీసుకుని, పక్కనే ఉన్న గుట్టపైకి ఎక్కు! అక్కడ కాస్త భద్రంగా ఉంటారు" అని చెప్పాను.
రాధాకృష్ణకు, వాసుదేవన్ కు కూడా పరిస్థితి తీవ్రత అర్థమైంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, పిల్లల్ని వెంట తీసుకుని, దట్టమైన పొదల మధ్యగా దారి చేసుకొంటూ గుట్ట పైకి చేరడానికి ప్రయత్నించసాగారు.
పిల్లల భయంతో ఉన్నప్పటికీ రాధాకృష్ణ వారిని ఓదారుస్తూ, "ఏమీ కాదు, ఎక్కడికీ పరుగెత్తకుండా నెమ్మది నెమ్మదిగా నడవండి" అని వారిని ముందుకు నడిపించాడు.
ఇక, బండపై మేము ఐదుగురమే మిగిలాం—నేను, విశ్వ, శ్రీకాళహస్తి మురళి, పుత్తూరు గిరి. అందరం శ్వాసా తీసుకోవడం మరచి పోయి ఆ ఏనుగునే చూస్తున్నాము. గాలిలో కాస్త చల్లదనమొచ్చినప్పటికీ, మా శరీరాలు మాత్రం స్వేదంతో తడిచి ముద్దయింది.
ముందున్న మదగజం కదలలేదు. కానీ, దాని ఊపిరి మాకే వినిపిస్తున్నంత భారీగా అనిపిస్తోంది. ఇంకా కాసేపు ఆ ఏనుగు అలాగే నిలబడుతుందా ? లేక ఒక్కసారిగా దూసుకొస్తుందా? ఆ ప్రశ్న ఒక్కటే మా మనసును కుదిపేస్తోంది.
కొంతసేపు అలాగే నిలబడ్డ ఆ ఒంటరి గజరాజు, మా వల్ల తనకి ఎటువంటి ఇబ్బంది లేదనుకొందో? లేక ఆ వెంకటేశ్వరుని ఆజ్ఞ మేరకో ? ఏ కారణమో తెలియదు, కానీ అది తను వెళ్లాల్సిన మార్గాన్ని మార్చుకుంది. మేము వున్న బండ పక్కాగా వెళ్లాల్సిన ఏనుగు, తన దిశను మార్చుకొని మా ముందు వున్న వెదురు పొదల్లోకి దూరింది.
వెదురు పొదల్లోకి చొచ్చుకుంటూ వెళుతున్న ఏనుగు ధాటికి, పెళ పెళ మంటూ విరిగిపడిపోతున్న వెదురు చెట్ల సవ్వడి మాకు హిరోషిమా బాంబు పేలిన సవ్వడి కంటే ఎక్కువగా వినబడుతున్న అనుభూతి. మా ముందు వున్న గజరాజు వలన విరిగి పడుతున్న చెట్లు తీరు చూస్తుంటే, ప్రకృతిలో అసలు శక్తి మనిషిలో ఉందనే మా భ్రమలు ఆవిరైపోయింది.
ఏనుగు నెమ్మదిగా పొదల్లోకి అడుగుపెట్టడంతో మాకు హాయినిపించినా, అది వెళ్లిపోయేదాకా మేమంతా నిశ్చలంగా, భయంతో వణికిపోతూనే ఉన్నాం. మేము చూస్తున్న కళ్ల ఎదుట ప్రకృతి తన అసలు రూపాన్ని ప్రదర్శిస్తూ, మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది.
అలా వెదురు పొదల్లో మమల్ని దాటుకొని కొంత దూరం వెళ్లిన తరువాత , మల్లి యేటిలోకి వచ్చి యేటి వొడ్డున వున్న చెట్ల ఆకులను తన తొండంతో తెంపుకొని తినసాగింది ఆ ఏనుగు.మేము మాత్రం చడీ చప్పుడు చేయక బండ మీద నుంచి చెట్లచాటున నక్కి ఆ ఏనుగునే చూస్తున్నాము.
ఆ ఏనుగుకి మేము తనని చూస్తున్న విషయం తెలిసినా ఆ ఏనుగు ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు.మా నుంచి తనకి ఎటువంటి హాని లేదనుకోనట్టు వుంది. అది ఏ మాత్రం భయం లేకుండా నింపాదిగా చెట్ల చిగురుటాకులను తొండంతో తెంపుకొని తినసాగింది.
అలా ఒక అరగంట సేపు ఉన్నచోటే నిలబడి చెట్లఆకులను తినసాగింది.
మాకందరికి అడవిలో అంత దగ్గరగా ఏనుగుని చూడటం ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించింది. ఆ క్షణాన కలిగిన అనుభవం మా జీవితంలో ఒక మరపురాని సంఘటనగా నిలిచిపోతుందనిపించింది.
కొంతసేపటికి, ఆ గజరాజు తన తొండాన్ని ఊపుకుంటూ, మెల్లగా అడుగులు వేస్తూ దేవ తీర్థం వైపు నడచిపోసాగింది. దాని అడుగులలో ఓ హుందాతనం వుంది. అడవిలో ఒక మహారాజు మెల్లగా తన సింహాసనాన్ని వదిలి వెళ్తున్నట్టుగా అనిపించింది.
ఆ ఏనుగు కనబడేంత వరకు చూస్తూనే ఉన్నాం. దాని భారీ కాళ్ల కింద యేటిలోని రాళ్లు నలిగి చేస్తున్న శబ్దం వినబడనంత వరకు ఆ ఏనుగు వెళ్లిన దిక్కునే చూస్తున్నాము.
ఆ ఏనుగు మా దృష్టి పదం నుంచి కనుమరుగు అయినతరువాత ఇంకో భయం పట్టుకొంది మాకు.
ఆ ఏనుగు ఒంటరిదా?, లేక దాని వెనుక ఇంకొన్ని ఏనుగులు వస్తున్నాయా? అన్న అనుమానం మెదిలింది మాలో.
ఆ ఒంటరి ఏనుగు వెనుక ఏనుగుల గుంపు ఉందేమో అని సందేహిస్తూ మేమంతా మరో గంట పాటు అదే బండ మీద కూర్చొని వేచిచూశాం.
ఆ అరుణ కిరణాల్లో అడవి నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. కొన్నిసార్లు చెట్ల ఆకులు గాలికి కదులుతున్న చప్పుడుకు మనసు ఉలిక్కిపడినా, చివరికి స్పష్టమైంది—ఇది నిజంగానే ఒంటరి ఏనుగు అని.
దాంతో, ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు దేవ తీర్థ సందర్శన ప్రోగ్రామ్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఏనుగు తిరిగి వస్తుందేమో అనే భయం వలన.
మాకు అక్కడ ఎక్కువసేపు ఉండటం సమంజసం అనిపించలేదు. అడవిలో ఏనుగుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో మాకు తెలుసు. అందుకే, అత్యవసరంగా ఆ ప్రాంతాన్ని వీడాలని నిర్ణయించుకున్నాం.
విశ్వనాధ్, రాధాకృష్ణ ,మురళి వెయ్యి కళ్ళతో పరిసరాలను గమనిస్తూ, చెవులను రిక్కించి ఏదైనా అలికిడి వస్తుందేమో అని నిశితంగా చూస్తూ అడుగులో అడుగు వేసుకొంటూ మేము మోటార్ వాహనాలు పార్క్ చేసిన యెట్టి ఒడ్డు వైపుకు సాగించారు టీంని.
తిరుగు ప్రయాణంలో బాలపల్లి రేంజ్ ఆఫీసర్ టి ప్రభాకర్ రెడ్డి గారు, ఈ ఒంటరి ఏనుగును గురించి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
"అడవిలో చాలా కాలంగా ఒక ఏనుగు ఒంటరిగానే తిరుగుతోంది. మా సిబ్బంది కూడా దాన్ని ఎన్నోసార్లు చూశారు. ఇప్పటివరకు ఎవరికీ ఎటువంటి హాని చేయలేదు. నిజంగా చాలా అద్భుతమైన స్నేహ జీవి!" అని
ఈ మాటలు మళ్లీ మాలో ఆసక్తిని కలిగించాయి. ఒక ఏనుగు ఒంటరిగా ఎందుకు తిరుగుతుందో?, దాని గతం ఏమిటో?, అది ఎప్పుడైనా గుంపులో ఉండిందా? అనే అనేక ప్రశ్నలు మనసును తొలిచాయి. కానీ ఈ రోజు మేము చూసిన ఏనుగు గాంభీర్యం, నిశ్శబ్దం, ఆహ్లాదకరమైన ఉదాసీనత అన్నీ మమ్మల్ని ఒక మధురమైన అనుభూతిలో ముంచేసాయి, అప్రయత్నంగా నా చేతులు ఆ ఏనుగు వెళ్లిన వైపు తిరిగి నమస్కరించాయి.
అడవిలో గడిపిన ఆ క్షణాలు, ఆ ఏనుగును చూసిన అనుభవం, ఆ వాతావరణం, ఆ ఉద్వేగం— మా జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోయాయి.