పాపా..ఈద్ ముబారక్ అని నీకెలా చెప్పను?
x

పాపా..ఈద్ ముబారక్ అని నీకెలా చెప్పను?

గాజా విషాదంలో ఈద్ మీద గీతాంజలి కవిత


గాజా బాల్యమా...

యుద్ధపు బాంబుల మోతలో..

లేత గొంతుతో రంజాన్ తహజుత్ నమాజు చదువుతున్న

నీ దోసిలిలో వాడు బాంబుల వర్షం కురిపించాడు !

పండగ కోసం నువ్వేసుకున్న కొత్తబట్టలు
నీ రక్తపు రంగులోకి మారాయి.
నువ్వు తినబోయే తొలి రమదాన్ ఖీర్
నీ అమ్మీ రక్తంతో ఎర్రబారింది!
పక్కనే నమాజు చేస్తున్న అబ్బా దేహం
పేలిపోయి ముక్కలై శిథిలాల్లో చెదిరిపోయింది
అచ్చం నీ యుద్ధ విరామ కలలా!
మా దేముందిలేపాపా..
పాలస్తీనా జాతి హత్యాకాండ తో మాకేం సంబంధం చెప్పు?
షడ్రసోపేతాలతో ఉగాది విందు కుడుస్తాం..
లౌక్యంగా నీ గాయాల మీద కవిత్వం రాయనే రాయం.
ఒక విషాదపు లైక్ కొట్టి నిట్టూర్చడం వరకే మా బాధ్యత!
పుష్కరాలలో పాపాలు కడిగేసుకున్నవాళ్ళం!
అమెరికా...
ఇజ్రాయేల్ రాక్షసులనే కాదు..
మౌనంగా ఉన్న మనవాడినీ ప్రశ్నించకుండా..
రాయకుండా వాడిచ్చే
ఉగాది పురస్కారాలు గాజా గుండెల్లో పేలి
విల విల కొట్టుకున్న పసిపిల్లల శవాల సాక్షిగా
నిస్సిగ్గుగా తీసుకుంటాం!
పట్టు శాలువల ముసుగులో
మొఖం దాచుకుని మురిసిపోతాం!
వాడి యుద్ధ నేరాన్ని...
దెబ్బకు దెబ్బ అని హుంకరిస్తాం!
**
గాజా..నీకు ఈద్ ముబారక్ ఎలా చెప్పను?
నీ రమదాన్ జానమాజ్
(మోకాళ్ళపైన కూర్చుని నమాజు చేసుకునే పట్టు వస్త్రం)
రక్తంలో ముంచాక..
నీ రమదాన్ నెలవంకకి
పిల్లల శవాలను వేలాడ దీశాక...
నీకెలా ఈద్ ముబారక్ చెప్పను?
సిగ్గుగా ఉంది !
కనికరమే లేని వాడు
తనకు మరిన్ని పాలస్తీనా శవాలు కావాలని
హుంకరించినవాడు.
గాజా...నీ భూమికి వాడు
మరిన్ని పిల్లల శవాలను
రమదాన్ కానుకగా ఇచ్చాడు.
దయలేనివాడా...
వాళ్ళని రమదాన్ చేసుకో నివ్వాల్సింది !
అమ్మీ ల వొడిలో కూర్చుని
అపురూపమైన ఖీర్ తిననివ్వాల్సింది !
పండుగ ఆనందాన్ని
ఒకరికొకరు జఖాత్ గా ఇచ్చుకోనివ్వాల్సింది!
యుద్ధంలో కనీస నీతిని
రమదాన్ లో నైనా పాటించాల్సింది.
పసి పిల్లలు రా... వాళ్ళు !
యుద్ధాన్ని కూడా కౌగలించుకుని
ఈద్ ముబారక్ చెప్పిన వాళ్ళురా !
తమ మీద తుపాకీని గురి పెట్టిన
ఇజ్రాయెల్ సైనికుడి చేతుల్లో
పాయసం పాత్ర ఉంచిన వాళ్ళురా ఆ పసిబిడ్డలు!
పండక్కి నిన్ను క్షమించి
నిన్ను దోఝక్ (నరకం) నుంచి తప్పించి...
జన్నత్ దారుల్లో (స్వర్గం)
నడిపించాలనుకున్నవాళ్ళురా !
వాళ్ళ అమ్మీ బావా లను క్రూరంగా హత్య చేసిన...
తమను అనాథలను చేసిన...
కర్కశమైన ఆకలికి వదిలేసిన మీకు...
యుద్ధంలో హత్యలు చేస్తూ అలిసిపోయిన మీకు..
మీ మాతృభూమికి..మీ ఇంటికీ...
మీ కన్న బిడ్డలకు
దూరాన యుద్ధభూమిలో ఉన్న మీకు
రమదాన్ తహజుత్ నమాజును...
అల్లాహో అక్బర్ అంటూ పసిగొంతులతో
వినిపించిన వాళ్ళురా ఆ పసిపిల్లలు !
***
చిన్న దేహాలురా వాళ్ళవి !
చిన్న ఆశలురా వాళ్ళవి !
ఏం కావాలి వాళ్ళకి చెప్పు?
గ్రైనేడ్ ల మృత్యు మోతలు వినిపించని నిశ్శబ్దంలో..
చిన్ని చేతులతో ప్రశాంతంగా
రమదాన్ నమాజు ప్రార్థించుకోవడమే కదా?
పండగ బట్టలకు ఇంత అత్తరు పులుముకొని
బ్రతుకు సువాసనని కోల్పోయిన దేహాలను
పరిమళ భరితం చేసుకోవడమే కదా వాళ్ళు కోరుకుంది?
అమ్మీ బావాల బ్రతుకు కోసం దువా చేసుకోవడమే కదా
వాళ్ళకి కావాల్సింది..
నమాజు ముందు ఉజూ చేయడం కోసం
అమ్మీల వెంట గారాం చేస్తూ
పోవాలన్నదే కదా వాళ్ళు కోరుకుంది?
కానీ ఆ కాసింత ప్రార్థనా సమయం
ఇవ్వలేకపోయిన ఉన్మాదం నీది!
గాజా పసి పిల్లల రమదాన్ జానమాజ్ ను
రక్త శిక్తం చేసి
వాళ్ళ కాళ్ళ కింద నుంచి లాగేసిన వాడా..
నీ దేశంలో రమదాన్ ని
గాజా పిల్లల శవాల జానమాజ్ మీద
నిలబడి కాక ఇంకెక్కడ చేసుకుంటావులే!
అందుకే ఇజ్రాయెల్ !రక్తపిపాసీ...
పిల్లల హంతకుడా..
గాజా శైశవ గీతాన్ని ...
మృత్యు సంగీతంగా మార్చిన వాడా..

గాజా పిల్లలకు దువా చేసుకోవడానికి చేతులే లేకుండా చేసిన వాడా...

నీకు నా రమదాన్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పలేను!

ఎందుకంటే..నువ్వు నీ తుపాకీ దించిన నాడే...
నీకూ నీ పిల్లలకీ కూడా
నిజమైన రమదాన్ అవుతుంది !
అప్పటిదాక పసిపిల్లల శవాలను
మోయలేని గాజా దుఃఖిస్తూనే ఉంటుంది !

(జఖాత్ రమదాన్ పండగ సందర్భంగా ఉపవాస రోజుల్లో బీదలకు చేసే దానం./ఉజూ -నమాజు ముందు కాళ్ళూ,చేతులని శుభ్రం చేసుకునే పద్ధతి)


Read More
Next Story