
అడవి అదృశ్యమైతే!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో అడవుల అరాచక నిర్మూలనకు నిరసనగా
-డాక్టర్ గోపికృష్ణ మదనపల్లె
చెట్టును మనం నరికేస్తే
మరోచెట్టు మొలుస్తుంది..
కానీ అడివిని నరికేస్తే మాత్రం
ఊరిని శ్మశానం రమ్మని పిలుస్తుంది!
కాక్రీట్ జంగిళ్ళలోని
క్రూర మృగాలు
జింకల ఆవాసాలను
ఆక్రమించుకొంటున్నాయి..
అయోమయానికి గురైన
జాతీయ నెమళ్ళు
ఎక్కడికెళ్ళాలో తెలియక
నిజం కన్నీళ్ళు కారుస్తున్నాయి!
చెట్లను అల్లుకొన్న తీగలు
కూలుతున్న అడివినిచూసి
కన్నీళ్ళతో కుమిలిపోతూ
తలలు వాల్చుకొన్నాయి..
ఆక్సిజనిచ్చే చెట్లుకూలాక
కార్పోరేట్ హాస్పటళ్ళకు
సిలిండర్లనమ్మే సంస్థలు
ఊపిరి పీల్చుకొన్నాయి!
ఎదిగే నగరపు ఆకలికి
అమ్మోరిముందు మోకరిల్లిన
అమాయక మేకపిల్లలాంటి
అడవులను బలిద్దాము..
అభివృద్ధి పేరుతో మనం
పచ్చదానానికి నిప్పంటించేసి
సిమెంటు సమాజాన్ని
సగర్వంగా నిర్మిద్దాము!
నగరానికి ఊపిరితిత్తులుగా
మిగిలున్న అరాకొరా పార్కులు
అదృశ్యమయ్యాక మనం
ఒక నిమిషం మౌనంపాటిద్దాము..
కనిపించే ఒకటీఅరా అడవులు
ఆంతరించిపోతున్న డైనోసార్లని
మనమందరం మూకుమ్మడిగా
శ్రద్ధాంజలి ఘటిద్దాము!
చెట్టును మనం నరికేస్తే
మరోచెట్టు ఎలాగోలా మొలుస్తుంది..
కానీ అడివినే నరికేస్తే మాత్రం
ఊరిని శ్మశానం రమ్మని పిలుస్తుంది!