ఇది నా కలల రాజ్యాంగం
x

ఇది నా కలల రాజ్యాంగం

భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకత మీద ఒక కవిత


మల్లేశ్వరరావు ఆకుల


నాకు ఒక స్వప్న లోకం ఉంది

దానికి ఒక స్వప్న శాస్త్రము ఉంది

శోకంనుండి శ్లోకం పుట్టినట్టు అస్పృశ్యతలు అసమానతలు లేని సర్వసమానత్వం సామాజిక న్యాయం సమానఅవకాశాలున్న సమాజం

కావాలి, రావాలి ! అన్న అంబేద్కరే నా వాల్మీకి.

కలలుంటే పీడకలలు ఉన్నట్లే

చట్టం ఉంటే అతిక్రమణలు ఉన్నట్లే

నీతి ఉంటే అవినీతి ఉన్నట్లే

రాజ్యాంగం ఉంటే రాజ్యాంగ

ఉల్లంఘనలుఉన్నాయి. కట్టుబాట్లు

ఉన్నప్పుడు అతిక్రమణలు జరిగితే,

ప్రవర్తనా నియమావళికి కొన్ని

సవరణలూ ఉన్నాయి. అయినా

అన్ని అభిమతాలను గౌరవించుదాం.

సామరస్య సౌమనస్య ధోరణిని పెంచుకుందాం.

మైత్రీ సద్భావనాకాశంలో, నక్షత్రాల వెలుగులో

కారు చీకట్ల నుంచి వెలుతురు లోకంలోకి

ప్రవేశిద్దాం. నడకబాటలో ముళ్ళను ఏరివేసి

పక్కా బాటలను వేద్దాం. దుర్గంధాలను

తుంచి వేసి సుగంధాలను వ్యాపింప చేద్దాం.

రక్కసి పొదలను పెకలించి పూ పొదరిళ్ళను

పొందికగా నిర్మించుకుందాం. ఇంటిని గదులుగా విభజించుకున్నట్లు ప్రాణికోటి ఆవాసాల్ని

ప్రపంచ దేశాలుగా, సరిహద్దుల మధ్య

విభజన చేసుకున్నాం. హద్దుల్లో ఉండి

సరిహద్దులను గౌరవిద్దాం.

ఒక్క వర్ణం హరివిల్లు కానట్లే

సకల జాతుల సమస్త గొంతుకల సమ్మేళనంగా ముక్తకంఠంతో ఎలుగెత్తి మానవతా గీతం

పాడటమే విశ్వ మానవ కళ్యాణ గీతం.

ఎల్ల లోకములొక్కటై మనుషులందరూ

ఆత్మబంధువులు కావడమే

విశ్వ మానవ లోకావిర్భావం

ఆ కల సాకారం కావాలి, నా అక్షరం నిజం కావాలి, వాస్తవం చరిత్రగా మారాలి.


(నిన్న గణతంత్ర దినోత్సవ సందర్భంగా తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రం లో జరిగిన కవి సమ్మేళనంలో చదివిన కవిత)

Read More
Next Story