
ప్రజాస్వామిక హక్కుల రక్షణ మీద ఢిల్లీ సదస్సు రిపోర్టు
నిరసన తెలిపే హక్కు లేక పోతే ప్రజాస్వామ్యం కాదు: జస్టిస్ శ్రీకృష్ణ
" ఈ రోజు మనం ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక హక్కుల గురించి ఎందుకు మాట్లాడు కోవలసి వస్తోంది? మనం చేపట్టిన ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థను ఎన్నికల రూపంలో అమలు చేయాలి. కానీ, దేశంలో నిజంగా ప్రజాస్వామ్యం అమలు జరుగుతోం దా?" అని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ ప్రశ్నించారు.
'ప్రజాస్వామిక హక్కులు, లౌకికత్వం' అన్న అంశంపై న్యూ ఢిల్లీ లోని గాలిబ్ ఇన్స్టిట్యూట్ హాల్ లో ఆదివారం జరిగిన జాతీయ సదస్సు లో ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ సదస్సు సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ అండ్ సెక్యులరిజం (CPDRS) ఆధ్వర్యంలో జరిగింది.
"ఐదేళ్లకొక సారి ఎన్నికలు జరగడం, ఓటు వేయడం మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. మీ తాత్విక చింతన ఏదైనా సరే వ్యక్తం చేసే హక్కు మీకు ఉంటుంది. ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు నిరసన తెలిపే హక్కు కూడా ఉంటుంది. ఆ హక్కు అమలు జరగక పోతే అది ప్రజాస్వామ్యం కాదు, లౌకికత్వం కాదు. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం , లౌకికత్వం ఉన్నాయని అంగీకరిస్తాము. పాలకులు ఒక మతానికి వ్యతిరేకంగా మరొక మతాన్ని సమర్ధించకూడదు. రాజ్యాంగంలో ఏమి చెప్పారో అది అమలయ్యే లా చూడడమే న్యాయ వ్యవస్థ లక్ష్యం. ప్రజల జీవితంలో 365 రోజులూ ప్రజాస్వామ్యం, లౌకి కత్వం ఉండాలి." అని జస్టిస్ శ్రీకృష్ణ (Justice Srikrishna) పేర్కొన్నారు.
సదస్సు లో ప్రసంగిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్
ప్రాథమిక హక్కుల బుల్ డోజింగ్ : ప్రశాంత్ భూషణ్
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగం అనేక వ్యవస్థ లను ఏర్పాటు చేసిందని, అందులో ప్రథమంగా న్యాయ వ్యవస్థ అని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ (Prashanth Bhushan) ఈ సదస్సులో ప్రసంగిస్తూ అన్నారు. రాజ్యాంగం లో పేర్కొనక పోయినప్పప్పటికీ, మీడియా కూడా ఆ బాధ్యత ఉందని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ప్రాథమిక హక్కులను బుల్ డోజింగ్ చేస్తోందని అన్నారు.
" యూ ట్యూబ్ స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా మహారాష్ట్రలోని బిజెపి నాయకుడు షిండే గురించి హాస్యం చేసినందుకు అతని పైన కేసు పెట్టి అరెస్ట్ చేశారు. రాజకీయాలపైన, రాజకీయ నాయకులపైన వ్యంగ్యం విసరడాన్ని రాజ్యాంగం అనుమతించినప్పటి కామ్రా ను చంపడానికి ప్రయత్నం చేశారు.
విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్ ను, కవి ఇమ్రాన్ ప్రతాప్ ను జైళ్ళ లో పెట్టారు. ప్రాథమిక హక్కులను కాపాడడం లో పోలీస్ వ్యవస్థ మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థ కూడా విఫలమైంది. పోలీసు వ్యవస్థ పై ఒత్తిడి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. రాజ్యాంగం లోని 21 వ అధికరణం ప్రకారం ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా ఎవరి నయినా సరే జైల్లో ఎలా పెడతారు? దీని కోసం ప్రివెంటివు డిటెన్షన్ యాక్ట్ , 'ఉపా' (Unlawful Activities (Prevention) Act (UAPA) వంటి నిరంకుశ చట్టాలను తెచ్చింది.
ఈవీయంల ను తారుమారు(టామ్ పరింగ్) చేసినట్టు రుజువై నా, కిందటి ఎన్నికల్లో బిజెపి కి ఓట్లు వేసిన వారి పేర్లను, ఈ ఎన్నికల్లో ఓటర్ల జాబితా నుంచి తొలగించినా బాధ్యతగల ఎలక్షన్ కమిషన్ పట్టించుకో లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ విఫలమైంది. ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించేదని ముప్పై ఏళ్ళ క్రితం మనం అంతా భావించా ము. అదిప్పుడు స్వతంత్రంగా వ్యవహరించడం లేదని భావిస్తున్నాము. ఆడిటర్ అండ్ కం ప్ట్రూలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ప్రతిపక్ష పార్టీల వారి లెక్కలను మాత్రమే ఆడిట్ చేస్తోంది తప్ప అధికార పక్షం జోలికి పోవడం లేదు.
నిష్పక్ష పాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ అసలు చర్చ లేకుండానే చాలా చట్టాలు పాస్ చేస్తున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించ వలసిన మీడియా మతానికి మౌత్ పీస్ లా పనిచేస్తోంది. ఈ స్థితిలో ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియా బలంగా పని చేస్తోంది. ఢిల్లీలో నిరసన తెలిపాలంటే పోలీసులు అనుమతి ఇవ్వరు. పార్లమెంటు సహా అన్ని రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేసింది " అంటూ ప్రశాంత్ భూ షణ్ ధ్వజమెత్తారు.
సదస్సు లో ప్రసంగిస్తున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏ. కే. పట్నాయక్
దిగజారి పోతున్న భారతీయ సమాజం : జస్టిస్ ఏ. కే. పట్నాయక్
భారతదేశంలో పేదరికం పెరిగి పోతోందని, దేశం మతాల మధ్య విభజి త మై ఉందని, దేశం నానాటికీ దిగజారి పోతోందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సు లో జస్టిస్ పట్నాయక్ ప్రసంగిస్తూ, " స్వాతంత్ర్యం వచ్చింది హిందువులకు, ముస్లింల కు, క్రైస్త వు లకు, బౌద్ధుల కు, సిక్కు లకు; అన్ని మతాల వారికి. రాజ్యాంగం లో తొలుత సెక్యులర్ అని పేర్కొనక పోయినా దానికి సెక్యులర్ స్వభావం ఉంది. అన్ని మతాల వారికి సమాన హక్కులు ఉన్నాయి. అన్ని మతాల వారికి పన్నులు సమానంగా విధించారు. రాజ్యాంగం ఏ ఒక్క మతానికి ప్రాధాన్యత ఇవ్వ లేదు. మతం విషయంలో రాజ్యం తటస్తంగా ఉండాలి. పౌరసత్వం ఉండడానికి మతం ప్రాతిపదిక కాదు. రాజ్యాంగం ఏర్పడినప్పుడే అది లౌకిక స్వభావం కలిగి ఉంది. పంజాబ్ లో 1980 లో ఏ మి జరిగింది? బ్లూ స్టార్ ఆపరేషన్ (Operation Blue Star) చేపట్టారు. ఫలితంగా ఇందిరాగాంధీని చంపేశారు. ఢిల్లీ లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయి. రాజకీయ పార్టీలు మతం విషయంలో తటస్తం గా ఉండక పోతే లౌకికత్వం దెబ్బ తింటున్ ది. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం మతాన్ని వాడుకుంటున్నాయి. మీడియా, న్యాయ వ్యవస్థ నిస్సహాయం గా చూస్తున్నాయి. ఒకరిని ఒకరు ద్వేషించుకునే స్థితి రాకూడదు. దీనికోసం సామాజిక ఉద్యమం తీసుకు రావాలి. 'ఏ మతస్థుడు నాకు శత్రువు కాదు' అన్న భావనతో గ్రామస్థాయి నుంచి ఉద్యమం తీసుకు రావాలి. ఏ మతానికి ఆ మతం తమలో తాము సంస్కరించుకోవాలి. నిజమైన లౌకిక వాదం ప్రజల నుంచి రావాలి. " అంటూ జస్టిస్ పట్నాయక్ పిలుపునిచ్చారు.
సదస్సు లో ప్రసంగిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ పరంజయ్ గుహ థాకూర్తా
మీడియా కిమ్మనడం లేదు: పరంజయ్ గుహ థాకూర్తా
"మన ఇంటికి దొంగలు వస్తే, కుక్క అరుస్తుంది, కరుస్తుంది. దొంగ పారి పోతాడు. సమాజానికి కావలి కుక్క లా పని చేయాల్సిన మీడియా కిమ్మదనడం లేదు. పాలకులకు భజన చేసే మీడియా ( గోడి మీడియా)నే అసలైన దొంగ. " అని సీనియర్ జర్నలిస్ట్ పరంజయ్ గుహ థాకూర్తా ఈ సదస్సులో ప్రసంగిస్తూ వ్యాఖ్యానించారు.
" రాజ్యాంగం లోని 19(1) ఏ వ్యక్తి స్వాతంత్ర్యం గురించి తెలుపు తుంది. సమయోచితమైన వ్యక్తీకరణ అని మెలిక పెడతారు. సమయోచితమైన వ్యక్తీకరణ అవునో కాదో ఎవరు నిర్ణయించాలి? డీ జీ పీ నిర్ణయించాలా ?
సమయోచితమైన వ్యక్తీకరణ ను ఎవరూ నిర్ణయిస్తారు?
ముస్లింలు తీవ్రవాదులని SMSల ద్వారా వాట్సాప్ లలో ప్రచారం జరుగుతోంది. నిజానికి ముస్లింలందరూ తీవ్రవాదులు కాదు. తీవ్రవాదులందరూ ముస్లిం లు కాదు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్ స్టా గ్రాం ల యజమాని 38 ఏళ్ళ వయస్సు ఉన్నవాడు. ప్రపంచములో ఎవరు మాట్లాడేది వాడికి తెలిసి పోతుంది. కృత్రిమ మేధ ప్రపంచాన్ని శాసిస్తోంది. చైనా లో అయితే వీటిని తరిమే శారు. చైనా సొంత ఇంటర్నెట్ ను ఏర్పాటు చేసుకుంది." అంటూ వివరించారు.
సదస్సుకు హాజరైన వివిధ రాష్ట్రాల ప్రతినిధులు
'మానవహక్కులు, పౌర సమాజం పాత్ర' అన్న అంశంపై సుప్రీం కోర్టు న్యాయవాది డాక్టర్ ఆదిత్య సోంధీ ప్రసంగిస్తూ, "భారత్ లో, పాకిస్తాన్ లో రాజ్యాంగ వ్యవస్థలు ఏర్పడ్డాయి. పాకిస్తాన్ లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చౌదరి ని జనరల్ ముషారఫ్ తొలగించాడు. భారతదేశంలో ఎన్కౌంటర్ హత్యల ను కూడా ఉత్సవం లా జరుపుకుంటారు." అంటూ పోల్చి చెప్పారు.
సుప్రీం కోర్టు న్యాయవాది, రచయిత, సామాజిక కార్యకర్త అనిల్ నౌరియా ప్రసంగిస్తూ "హక్కులు ఆకాశం నుంచి రావు. రాజ్యాంగం నుంచి కూడా రావు. అవి సమాజం నుంచే వస్తాయి" అని అన్నారు.
ఈ జాతీయ సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్ సహా 22 రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు