50 ఏళ్ల తర్వాత హైదరాబాద్ శివార్లకు చేరిన పులి
x
హైదరాబాద్ శివార్లలో సంచరిస్తున్న పులి

50 ఏళ్ల తర్వాత హైదరాబాద్ శివార్లకు చేరిన పులి

375 కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్ శివార్లకు పులి,అటవీశాఖ అలర్ట్


హైదరాబాద్ మహానగరానికి సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లా దత్తాయిపల్లి రిజర్వ్ ఫారెస్టులో పులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర నుంచి 375 కిలోమీటర్లు ప్రయాణించిన మగ పులి హైదరాబాద్ శివార్లకు చేరుకోవడంతో అటవీశాఖ అప్రమత్తమైంది.ఇంతవరకూ మ్యాప్‌లలో మాత్రమే చూసిన పులి… ఇప్పుడు హైదరాబాద్ శివార్లలో ప్రత్యక్షమైంది.యాదగిరిగుట్టకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే పులి కదలికలు ఉండటంతో అటవీశాఖ హై అలర్ట్ ప్రకటించింది.


సంచలనం రేపిన పులి సంచారం
హైదరాబాద్ నగర శివార్లలో యాభై ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి పులి సంచరించడం సంచలనం రేపింది. గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో 60 కిలోమీటర్ల దూరంలోని యాదాద్రి భువనగిరి జిల్లా దత్తాయిపల్లి రిజర్వ్ ఫారెస్టు లో పులి మూడు రోజులుగా సంచరిస్తుందని అటవీశాఖ అధికారులు పగ్ మార్కులను చూసి ప్రకటించారు.ఈ ప్రాంతంలో గతంలో పులులు సంచరించిన చరిత్ర లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి సంచారంపై అటవీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పులి సంచరించిన ప్రాంతం యాదగిరిగుట్ట దేవాలయానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉందని అధికారులు గుర్తించారు. దత్తాయిపల్లి, గంధమల్ల, కోనాపూర్, వీరారెడ్డిపల్లి, ఇబ్రహీంనగర్, వెంకటాపూర్, శ్రీనివాస పూర్ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు.

375 కిలోమీటర్ల దూరం పులి ప్రయాణం
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం నుంచి మగ పులి 375 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతానికి చేరుకోవడంతో అటవీశాఖ అధికారులు అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన మగపులి ఆడపులి తోడుతోపాటు టెరిటరీ కోసం అన్వేషిస్తూ సంచరిస్తుందని అటవీశాఖ అధికారులు చెప్పారు. ఈ పులి రెండు నెలల క్రితం పెనుగంగా నదిని దాటి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం మీదుగా తెలంగాణలోకి ప్రవేశించిందని అటవీశాఖ అధికారులు గుర్తించారు.ఈ పులి నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సిద్ధిపేట జిల్లాల మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ప్రవేశించిందని అటవీశాఖ వైల్డ్ లైఫ్ అధికారి ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ పులి పగలు పొదల్లో ఉండి రాత్రివేళల్లో సంచరిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దు
హైదరాబాద్ శివార్లలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. పులి రాత్రివేళ సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. తెలంగాణలోని 19 జిల్లాల్లో పులులు సంచరిస్తున్నట్లు పగ్ మార్కులను బట్టి అధికారులు తేల్చారు. మణుగూరు అడవుల్లో, ఏటూరునాగారం అడవుల్లో, లక్సెట్టిపేట, మంచిర్యాల్ అడవుల్లో అయిదారు నెలలుగా పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ టైగర్ సెల్ గుర్తించింది. ఒక్కో జిల్లాలో 15 కెమెరా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులుల సంచారాన్ని రికార్డు చేయాలని అటవీశాఖ నిర్ణయించింది.

పశువులపై పులి దాడి
జనవరి 17నతేదీన తుర్కపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో పులి పశువులపై దాడి చేయడంతో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు ఇంకా భయాందోళనల్లో ఉన్నారు.జనవరి 18వ తేదీన ఒక పొలంలో పులి పాదముద్రలు కనిపించడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. మరుసటి రోజుఆ పులి రెండు దూడలపై దాడి చేసి, ఒకదాన్ని అడవిలోకి లాక్కెళ్లిందని ఇబ్రహీంపూర్ గ్రామ రైతులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. పులి కదలికలను పసిగట్టడానికి అటవీ అధికారులు అడవిలోని పలు బ్లాకుల్లో కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పులి కనిపించినట్లయితే వెంటనే తమకు తెలియజేయాలని అటవీశాఖ అధికారులు కోరారు.

పులి కదలికలపై టైగర్ సెల్ నిఘా
పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అటవీశాఖ టైగర్ సెల్ అధికారులు తెలిపారు. ప్రజలు భయాందోళనలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని, పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని కోరారు. పరిస్థితిని బట్టి అదనపు భద్రతా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు.మహా నగర విస్తరణ, అంతరించిపోతున్న అడవుల వల్ల పులి ప్రయాణం ఒక హెచ్చరికగా మారింది. హైదరాబాద్ శివార్లలో కనిపించిన ఈ పులి సంచారం, మానవ–వన్యప్రాణుల మధ్య పెరుగుతున్న సంఘర్షణకు ప్రతీకగా నిలుస్తోంది.


Read More
Next Story