
అటవీగ్రామాల్లో పులి సంచారం : భువనగిరిలో భయం భయం
భువనగిరి గ్రామాల్లో బెంబేలెత్తిస్తున్న బెబ్బులి పులి
పశువులపై వరుస దాడులు:హైదరాబాద్ సమీప గ్రామాల్లో పులి కలకలం
యాభై ఏళ్ల తర్వాత హైదరాబాద్ జనవాసాలకు చేరువలో పులి సంచరించడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర అభయారణ్యం నుంచి వలస వచ్చిన పులి యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామాల్లో పశువులపై వరుస దాడులు చేస్తుండటంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ వన్యప్రాణి విభాగం హై అలర్ట్ ప్రకటించింది.రాత్రి అయితే చాలు గ్రామాల్లో భయం అలముకుంటోంది. పొలాలు, బావుల వద్ద పులి పాదముద్రలు కనిపిస్తుండటంతో హైదరాబాద్ శివార్ల గ్రామాలు అప్రమత్తమయ్యాయి.పులి మాన్ ఈటర్ కాదని అధికారులు చెబుతున్నా… గ్రామాల్లో మాత్రం భయం తగ్గడం లేదు.
పశువులపై పులి వరుస దాడులు
హైదరాబాద్ జనారణ్యానికి చేరువలో పులి సంచరిస్తుండటంతో అటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు.మహారాష్ట్ర అభయారణ్యం నుంచి కవాల్ మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామాల్లోకి వచ్చిన పులి గత వారం రోజులుగా పలు గ్రామాల్లో తిరుగుతూ ఆవులు, దూడలపై దాడి చేసి, వాటిని చంపి తింటుంది.కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, సిద్ధిపేట, కామారెడ్డి అటవీప్రాంతాల మీదుగా పులి హైదరాబాద్ శివార్లలోకి వచ్చిందని అటవీశాఖ టైగర్ సెల్ అధికారులు గుర్తించారు. సోమవారం తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామంలోని బావి సమీపంలో ఓ ఆవును పులి చంపిన ఘటనతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. గొట్టె శ్రీశైలం అనే రైతు తన పశువులను పొలంలో మేపుతుండగా పులి దాడి చేసి దూడను చంపేసింది.ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్ నాయక్ దత్తాయిపల్లిలో పులి చంపిన ఆవును పరిశీలించారు.పులి సంచరించిన పగ్ మార్కులను గుర్తించారు. తమ గ్రామాల్లో సంచరిస్తున్న పులి తమ పశువులపై వరుస దాడులు చేస్తున్న నేపథ్యంలో దీని బారి నుంచి తమను కాపాడాలని రైతులు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.
తుర్కపల్లి టు భువనగిరి పులి సంచారం
మొదట తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో పులి కనిపించింది. ఆ తర్వాత భువనగిరి మండలంలోని గ్రామాల్లో సంచరించింది. యాభై ఏళ్ల తర్వాత పులి మొట్టమొదటి సారి హైదరాబాద్ జనవాసాలకు దగ్గరలో సంచరిస్తుండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బస్వాపూర్ రిజర్వాయర్ సమపీంలోని రాళ్ల జనగాం,తిమ్మాపూర్, దత్తాయపల్లి గ్రామాల్లో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు.రాళ్ల జనగాం, ఇబ్రహీంపూర్, బస్వాపూర్ గ్రామాల్లో పులి భయంతో గ్రామస్థులు రాత్రివేళ మంటలు వేసి పెట్రోలింగ్ చేస్తున్నారు. చీకటి పడిన తర్వాత నివాసితులు ఇళ్లలోనే ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. అటవీ ప్రాంతాలలోకి ప్రవేశించవద్దని గ్రామస్థులను హెచ్చరిస్తూ అధికారులు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు.
పులి మాన్ ఈటర్ కాదు : అటవీశాఖ అధికారులు
పులి భక్తులతో కిటకిట లాడే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి రెండు కిలోమీటర్ల సమీపంలో సంచరించిందని అటవీశాఖాధికారు సర్వేలో తేలింది.గ్రామాల్లో పులి సంచారాన్ని మూడు అటవీశాఖ బృందాలు మానిటరింగ్ చేస్తున్నాయని జిల్లా అటవీశాఖ అధికారి సుధాకర్ రెడ్డి చెప్పారు.రోజురోజుకు పులి గ్రామాల్లో విస్తృతంగా సంచరిస్తూ పశువులను చంపుతుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. పులి మాన్ ఈటర్ కాదని, ప్రజలపై అది దాడి చేయదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పులి పాదముద్రలు కనిపించిన ప్రాంతాల్లో కెమెరా ట్రాప్ లను ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. పులి పాదముద్రలను గమనించిన అటవీశాఖ అధికారులు దీని వయసు పదేళ్లు ఉంటుందని అంచనా వేశారు.
ఇబ్రహీంపూర్ అడవిలో టెరిటరీ కోసం పులి అన్వేషణ
గ్రామాల్లో సంచరిస్తూ పశువులను చంపుతున్న పులిని బంధించేందుకు ట్రాంక్విలైజింగ్ పరికరాలు, ఇనుప జాలీలతో కూడిన బోన్లు, నిపుణులైన రాపిడ్ రెస్పాన్స్ టీం ను రప్పించేందుకు అటవీశాఖ అధికారులు యత్నిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఇబ్రహీంపూర్ రిజర్వ్ ఫారెస్ట్ 259 హెక్టార్లతో విస్తరించి ఉంది. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన పులి నివాసానికి వీలుగా టెరిటరీతోపాటు తోడు కోసం అన్వేషిస్తుందని అటవీశాఖ ప్రత్యేక అధికారి ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. బస్వాపూర్ రిజర్వాయర్ ఉండటంతో పులి నీళ్లు తాగేందుకు అక్కడికి వస్తున్నట్లు గుర్తించారు.
గ్రామాల్లో పులి సంచారంతో పరిస్థితి రోజురోజుకు ఉత్కంఠగా మారుతోంది. పులిని బంధించేందుకు అటవీశాఖ ప్రత్యేక బృందాలు, నిపుణులైన రాపిడ్ రెస్పాన్స్ టీం రంగంలోకి దిగగా, ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ కోరుతోంది.
Next Story

