తాటికోన: శేషాచలం అడవుల్లో చారిత్రక విశేషాల ఖజానా
x
తాటికోన గుట్టకు ఇలా కొండరాళ్ల సందుల్లోంచి వెళ్లాలి...

తాటికోన: శేషాచలం అడవుల్లో చారిత్రక విశేషాల ఖజానా

భూమన్ ట్రెకింగ్ జ్ఞాపకాలు తాటికోన లాంటి ప్రాంతాన్ని Heritage ప్రాంతంగా గుర్తించి పునరుద్ధరిస్తే ప్రజలూ సందర్శిస్తారు. వారిలో పర్యావరణ స్పృహ పెరుగుతుంది



-భూమన్


తాటికోన మా లెటెస్టు డిస్కవరీ అనాలి. చాలా కాలం ఈ చారిత్రక శిధిలాల ఖజానా గురించి తెలియదు. తిరుపతి పక్కనే ఉంటుంది. చాలా సుందరమయిన ప్రదేశం. అహ్లాదకరమయిన ప్రక‌ృతి. ఇక్కడ వెళితే తిరిగిరావాలనిపించదు. 2020లో మొదటి సారి వెళ్లాను. 2021 లో మరొక సారి వెళ్లే అవకాశం వచ్చింది. ఈ యాత్ర గురించిన కొన్ని జ్ఞాపకాలు




ఎన్నో చారిత్రక శిధిలాలకు తాటికోన వేదిక.

తిరుపతి సమీపాన ఉన్న చంద్రగిరి కోట ప్రాచుర్యం పొందక ముందు తాటికోన ప్రధాన స్థావరంగా విరాజిల్లింది. మొగిలేరు,దోసిళ్ల వంకల వడ్డున తాటికోన ఉంది.

తిరుపతి నుంచి బైపాస్ రోడ్డు మీదుగా చంద్రగిరి వెళ్తుంటే మొండి కాల్వ వస్తుంది. అక్కడి నుంచి తాటికోన దారి పట్టాలి. 2 కి.మీ దూరంలో కొండల నడుమ ఆహ్లాదకరమయిన వాతావరణంలో తాటికోన ఉంటుంది.

తిరుప‌తి నుంచి చంద్ర‌గిరి వైపు బైపాస్ రోడ్డులో మా వాహ‌నాలు సాగాయి. చంద్ర‌గిరి వంతెన వ‌చ్చేస‌రికి ఎడ‌మ వైపున స‌న్న‌ని రోడ్డు మీదకు మ‌ళ్ళాం. రెండు గ్రామాలు దాటి మూడు కిలోమీట‌ర్లు వెళ్ళ‌గానే, ఆ రోడ్డులో చిట్ట‌చివ‌రి గ్రామం తాటికోన (Tatikona).అదొక గిరిజ‌న ఆవాసం. తాటికోన చుట్టూ పచ్చని కొండ‌లు ఎంత అందంగా ఉన్నాయో! ఆ ర‌హ‌దారి అక్క‌డితో ముగిసింది. అక్కడి స‌న్న‌ని కాలి బాట‌లో ముందుకుపోతే తాటికోన గుట్ట వస్తుంది.


చెక్కుచెదరని మెగాలిత్ (రాక్షస గూడు)


తాటికోన గుట్టమీద క్రీ.పూ నాటి మెగాలిత్ (రాక్షసగూడు) ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ గూడు కప్పు బండకింద శిలాచిత్రాలు(Rock art) అబ్బురపరుస్తుంది. దీనిని పట్టించుకునే నాథుడు లేక అనామకంగా అలనాటి వైభవం మొండిగా నిలబడి ఉంది.



రాక్షస గూడు బండ కింద పురాతన చిత్రకళ ను పరిశీలిస్తున్న రచయిత భూమన్


ఈ తాటికోనలో చంద్రగిరి కోటకన్నా ముందు మట్టితో నిర్మించిన ఒక కోట ఉంది. అది పూర్తిగా శిధిలమయిపోయిఉంది. ఈ మ‌ట్టి గోడ‌ శిథిల‌మ‌య్యాకే చంద్ర‌గిరి దుర్గాన్ని నిర్మించిన‌ట్టు ఒక అంచ‌నా. ఆ ఆనవాలు చిత్రంలో చూడవచ్చు.



ఒకనాడు విరాజిల్లిన తాటికోన కోట ఆనవాలు


అక్క మఠాలు అనిపిలిచే స్థలంలో అద్భుతమయిన గుడి ఉంది. ఒక పెద్ద రాతి గుండు పైన కట్టిన గోపురం చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది.



అక్కడి శిధిలాలయ గోపురం


కింద శివాలయం ఉన్నట్లుంది. గర్భ గుడిని ధ్వంసం చేసినారు. దేవాలయం మొండిగోడలు అపూరూప శిల్ప సౌందర్యంతో బిక్కు బిక్కుముంటున్నాయి.



ధ్వంసమయిన శివాలయం


విజయనగర రాజులు కాలంలో ఈ ప్రాంతం వైభవోపేతంగా వెలిగినట్లుంది. దేవాలయానికి ముందు మెట్ల మార్గంలో గణపతి బొమ్మ చెక్కుచెదరకుండా ఉంది.

దేవాలయ ప్రహరీ ముందు భాగాన ఆ రోజుల్లో అంగళ్లున్నట్లు వాటిలో వజ్రవైఢూర్యాలు రాశులు పోసి అమ్మినట్లు భ్రాంతి కలుగుతుంది.



నాటికోనేరు ఇపుడు తామర కొలను అయింది


అంత విశాలంగా ఉంది ఆ ప్రాంగణం. పక్కనే చక్కటి కోనేరు అద్బుతమయిన కట్టడం. ప్రస్తుతం తామరపూవులతో విరాజిల్లుతూ ఉంది.



భార్య ఫ్రొఫెసర్ కుసుమకుమారితో రచయిత చరిత్రకారుడు భూమన్

తిరుపతి పరిసరాల్లో చంద్రగిరికి కూతవేటు దూరంలో ఉన్న ఈ వైభవోపేతమయిన ప్రదేశం ఇలా శిధిలావస్థలో మూలుగుతూ వుండటం చరిత్రకారులకు, రసజ్ఞులకు, ప్రాచీన కట్టడాలను అభిమానించే వాళ్లకు చాలా దిగులు కలిగిస్తుంది. చారిత్రక సందపను కాపాడుకోవడంలో మనం ఎంత వెనకబడి ఉన్నామో కూడాతెలియ చేస్తుంది.

ప్రభుత్వం చొరవ చూపి ఈ ప్రాంతాన్ని Heritage ప్రాంతంగా గుర్తించి పునరుద్ధరిస్తే ప్రజలు తండోపతండాలుగా వచ్చి చూసి అనుభవించి పరివశిస్తారు. వారి లో పర్యావరణ స్పృహ పెరుగుతుంది. అడవులను కొండలను కాపాడుకోవాలన్న తాపత్రయం కలుగుతుంది.

Read More
Next Story