నగరి ‘కొండ ముక్కు’ మీదికి పాద యాత్ర
దాదాపు రెండుగంటల నడక తరువాత ముక్కు ముందు భాగానికి వచ్చి వారల వెంబడి నిలబడి చూస్తే లోయల అందాలు వర్ణించనలవి గావటం లేదు. రచయిత భూమన్ ‘నగరి ముక్కు’ యాత్ర జ్ఞాపకాలు
తిరుపతి నుండి మద్రాసుకు బస్సుల్లో, రైళ్లల్లో, కార్లల్లో ప్రయాణిస్తున్నపుడు నగరి పరిసరాల్లోకి రాగానే ఎత్తయిన కొండకొస ముక్కు ఆకారంలో భలే ఆకర్షించేది. కొసముక్కు ఆకారంలో ఉండటం వల్ల దానినినగిరి ముక్కు అని, చెంగాడ్డి ముక్కు అని పిలుచుకునేవారు. ఆ కొసకు ఎట్లయినా పోవాలని అనిపించేది కాని, అప్పుడు ఈ ట్రెక్కింగులు పాడుపద్దేశము లేవు కదా ఆ కోరిక అట్లా చచ్చికూర్చునేది. అది చివరికి 2020లో నెరవేరింది. ఆ జ్ఞాపకాలు...
(భూమన్)
కరోనా పుణ్యమాని మా MAC బాలును ఈ యాత్రకు ఒప్పించా. ఒక జట్టును పరిమితంగా కూడగట్టమంటే, సరే సార్ అని ముందుగాపోయి రెక్కి నిర్వహించుకొని వచ్చినాడు. నారాయణవనం నుండి బొప్పరాజుపాళెం, లక్ష్మీపురం కాలనీ లోని ఇద్దరు ముగ్గురు కొండలు ఎక్కిన అనుభవం ఉన్న వాళ్లను వొప్పించి కార్యరంగం సిద్ధం చేసుకుని వచ్చినాడు.
ఆ తిరుపతినుండి నేను, భూమన అభినయ్, నేహా (వీరు నా తమ్ముడు భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు, కూతురు) ఉన్నాం. ఇద్దర్లో అభినయ్ కి అప్పటికే అడవుల్లో బాగా తిరిగే అలవాటుంది. కొన్ని రాత్రిళ్లు అడవుల్లోనే విడిది చేసి రావటం అలవాటు చేసుకున్నవారు. నాతో పాటు పుల్లుట్ల, సత్రాలు, అన్నదమ్ములబండ, భోగందాని పీటు, జొన్నరాతికుప్ప, అరువీలుగుండు, మొగిలిపెంట, ఉర్ధళతీర్థము, యుద్ధగళం, మూదేళ్లకురవ, కంగుమడుగు, గుంజన, పులకూరపెంట, తిరిగి వచ్చినవాడు.
అతని బృందంతో కలసి జీపుల్లో దాదాపు 12 గంటలపాటు శేషాచలపు మట్టి రోడ్లంబడి రెండుమూడుమాట్లు తిరిగి వచ్చినాము Expert Trekker గా ప్రకృతి ప్రియునిగా ముద్రపడినాడు. నేహాకు అడవుల వెంటనే గాకుండా, ప్రయాణాలంటే విపరీతమయిన మక్కువ. వీరితో పాటు మాతో తరచు Treks కు వచ్చే, అశోక్, రవి, అయ్యప్ప, వంశీ తదితర మిత్రులతో కలిసి దాదాపు 20మంది పొద్దున్నే బయలుదేరి పుత్తూరు సరిహద్దులో ఇడ్లీలు తిని లక్ష్మీపురం కాలనీలో తోడుగాళ్లను తీసుకుని బాలు అటవీ స్నేహితుడు వెంకటస్వామితో కలసి కొండెక్కడం మొదలయింది.
కిందనుండి చూస్తే బల్ల పరుపుగా మొదలై, ఏటవాలుగా మంచి వరాహ అవతారంగా చూపులకు కనువిందుగా ఉంది. సునాయాసంగా ఎక్కుడు పసందుగా ఉంది. అందర్నీ ఉత్సాహపరుస్తూ మధ్యలో బండరాళ్లు కనిపిస్తే కొంచెం సేపు ఆగి చుట్టుచూస్తే కొండల వరసచూసినంతా దూరం భలే వింతగానూ, ప్రకృతి వైచిత్రిగానూ ఉన్నాయి.
మంచికాలంలో బయలుదేరినాము గనుక కొండపచ్చగా, కొన్నిచోట్ల పెద్దపెద్దమాన్లు, చిన్నచిన్నబోదలు, తుప్పలు, అడవి పూలవాసనలమధ్యన, స్వచ్ఛమయిన గాలుల మధ్య అలుపులేకుండా నడకముందు పోతున్నది.
దాదాపు రెండుగంటల నడక తరువాత ముక్కు ముందు భాగానికి వచ్చి వారల వెంబడి నిలబడి చూస్తే ఆ లోయల అందాలు వర్ణించనలవి గావటం లేదు. మనకు అత్యంతదగ్గర్లో వున్న ఈ కొండల హొయలు, అడవుల ఆకాశపు కిందిటి పచ్చటి పందిళ్ళు, దూరంగా తరచు వినిపిస్తున్న కణుతుల అరుపులు, పందుల పరుగుళ్ల శబ్దాలు, పక్షుల సంగీతపు మధురిమలు, కీటకాల రొదలు అద్భుతంగా ఉన్నాయా క్షణాలు.
చూచినంతా సేపు చూసి కదలబుద్ధికాక పోయినా, కొసకు చేరు కోవాల గనుక మరో అరమైలు ముందుకు కదిలితే పెద్ద పెద్ద బండగుండ్రాళ్ల మధ్యను ప్రయాణం చేసి మా గమ్యం చేరుకుని అలవికాని ఆనందంతో అందరం మూకుమ్మడిగా చిందులువేసినాము. ఎప్పటి కోరిక, ఎన్నాళ్ల ఎదురుచూపు, చేరుకుంటామో లేదో నన్న మీమాంసమధ్యన అక్కడికి చేరటం ఒక మహా అద్భుతాన్ని సాధించినట్టు, హిమాలయశిఖరాన్ని అధిరోహించినట్టుగా ఫీల్ అయినాము. అందరి ముఖాల్లో ఆనందతాండవం.
ఆ కొసన ప్రతినెల పౌర్ణమినాడు కింది పల్లెవారు పైకొచ్చి మంటవేయటం ఆనవాయితీ. ఆ మంటచూసి దణ్ణం పెట్టుకుని చుట్టు పక్కల గ్రామస్థులు దీపాలు వెలిగించుకుంటారట. మేము నాలుగు పుల్లలు ఏరి మంటలను ఎగదోసినాము.
బాగా చీకటిపడగానే పండు వెన్నెల్లో దిగులుగా వెనుదిరిగి మధ్యరాతి పలకలు పడకలుగా సిద్ధం చేసుకున్నాము. గుడారాలు తెచ్చుకున్నవారు వాటిల్లోను, పండు వెన్నెల్లో తడిసి తన్మయులము కావాలనీ నాలాంటి వారు కొందరు Open Airలో హయిగా పడకకు సిద్ధమయినాము.
ముందే సిద్ధంగా తెచ్చుకున్న తిండి తలా ఇంతా తినటం, ఆ తినటపు పంపకాల్లో ఎంతటి ప్రేమ, మమకారం. తమ తిండికాకుండా, పక్కవాడి తిండి గురించే పట్టించుకుంటూ ప్రతి వొక్కరూ అపురూపమయిన మానవతా గుణంతో వ్యవహరించటం ఈ ట్రెక్కింగుల్లోనే సాధ్యం.
నిద్రపడితే కదా. వొకటే మాటలు, అడవి శబ్దాలు. ఇంతకూ ఆ కొసప్రాధాన్యం, కధాకమామీషు ఏందయ్యా గురవా అంటే ఆ బ్రిటీషు వారికాలంలో ఆ కొసననాటి పోలురాత్రి వేసే మంటలు బంగాళాఖాతపు నౌకలకు లైట్ హౌస్ ఇది చాలా కాలం వినియోగంలో ఉండేదట. కొన్ని వందల మైళ్లదూరం ఈ ముక్కు ఎన్నింటికో దారి, దీపధారి.