తరిగొండ వెంగమాంబ మారెళ్ల గెవి దర్శనం
x

తరిగొండ వెంగమాంబ మారెళ్ల గెవి దర్శనం

చరిత్రకారుడు, రచయిత భూమన్ కథనం. తిరుమల శ్రీవేంకటేశ్వర ఆలయం తరిగొండ వెంగమాంబ ముత్యాలహారతి తోనే ఇప్పటికీ తలుపులు మూసి వేయబడతాయి.


(భూమన్)


ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నా ఇప్పటికి వీలయింది. కవయిత్రి, తిరుమల శ్రీవారి భక్తురాలు తరిగొండ వెంగమాంబ పేరు విన్నప్పటి నుండి , ఆమెను చదివినప్పటి నుండి , ఆమె జీవితం గురించి తెలుసుకున్నప్పటి నుండి అనుకుంటున్నా ఆమె తిరిగిన దోవలన్నీ తిరిగి రావాలని.


మంగళవారం నాడు తిరుపతిలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

తరిగొండ వెంగమాంబ 300 సంవత్సరాల క్రితం అనేక గ్రంథాలను రాసింది. గొల్లకలాపం , చెంచునాటకం , రమాపరిణయం , కృష్ణమంజరి , వేంకటాచల మాహాత్మ్యం ప్రసిద్ధి. నేను ఆరోజుల్లో తి.తి.దే. వెంగమాంబ ప్రాజెక్టు ప్రారంభ సంచాలకునిగా ఒక ఉద్యమరూపంలో ఆమె రాసిన పుస్తకాలన్నింటినీ ప్రచురింప జేసినాను. అనేక పాటల్ని రికార్డు చేయించినాను. సినిమా దాకా తీసుకెళ్లినాను.




ఆమె ఈ రోజు తెలుగు ప్రజలందరికీ తెలుసు. తిరుమల శ్రీవేంకటేశ్వర ఆలయం తరిగొండ వెంగమాంబ ముత్యాలహారతి తోనే తలుపులు మూసి వేయబడతాయి. ఆమె మొదలుపెట్టిన ఈ కర్పూరహారతి ఇప్పటికీ కొనసాగుతున్నది. దశావతారాల వెండిపళ్లెంలో ఆమె వంశస్థుడు ఇప్పటికీ ఆ హారతిని ఇచ్చే సంప్రదాయాన్ని తి.తి.దే కొనసాగిస్తున్నది.

తరిగొండ వెంగమాంబ నడిచొచ్చిన తలకోన శిఖర భాగం నుండి రుద్రగళం వరకు నేను , నాభార్య ఆచార్య కుసుమకుమారి కరోనా కాలంలో తిరిగొచ్చినాము. ఆమె తపస్సు చేసిన రుద్రగళంలో ఒక రోజంతా గడిపినాము. ఆమె కొలిచిన ఆంజనేయుడి విగ్రహాన్ని చూసినాము. అట్లాగే ఆమె ధ్యానం చేసిన , చెంచు నాటకాన్ని రాసిన తుంబురకోన గుహను చూసినాము.

ఆమె జీవించిన కాలంలో శేషాచలపు అడవుల్లో చెంచులు , యానాదులు , గిరిజనుల గూడేలు ఉన్నట్టుగా తెలుసుకున్నాను. తరిగొండ వెంగమాంబ తరిగొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆంజనేయుడి విగ్రహం వెనుక గుహలో ఉండేదని తెలిసి అదీచూసి , తరిగొండకు దగ్గర్లో ఆమె ధ్యానం చేసిన మారెళ్లగెవిని చూసి రావాలని చాన్నాళ్లుగా అనుకుంటున్నా. అది ఇవ్వాళ తీరింది.

తిరుపతికి 108 కి.మీ. దూరంలో వాల్మీకిపురానికి దగ్గరలో ఈ తరిగొండ గ్రామం ఉంది. తరికుండ అంటే పెరుగు చిలికే కుండ. తరికుండ క్రమంగా తరిగొండగా మారింది.


ఈ కుండలోనుండి లక్ష్మీనరసింహస్వామి శిలా విగ్రహం బయటపడిందని భక్తుల నమ్మకం. ఈ ప్రాంతం ఒకప్పుడు చిట్టడవి నడుమ ఒక గుట్ట. ఆ గుట్టచుట్టు పక్కలవాళ్లు దీన్ని " ప్రత్తిమిట్ట " అని పిలిచేవారు. దీనికి దగ్గర్లో పాలనూతిమడుగు అనే పెద్ద నీటిమడుగు ఉండేది. ఈ లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడివారు " సత్యప్రమాణ దేవుడు " అని అంటారు. ఈ దేవాలయం " అచ్చివచ్చినదిగా ” ప్రసిద్ధి. పరమయోగిని , ఆధ్యాత్మిక కవయిత్రి తరిగొండ వెంగమాంబ ఈ లక్ష్మీనరసింహస్వామి ఉపాసకురాలు.


చిన్నతనంలోనే రచనకుపక్రమించిన వ్యక్తి. ధీశాలి , ఛాందస భావాలను ఎదిరించిన వనిత. ఆమె జీవితం ఆసక్తిగా
ఉంది. నాకొక అలవాటు ఉంది. ఇట్టాంటివారు ఎక్కడి వారైనా వారి ఆనవాలు వెదుక్కుంటూ పోతా. చలం రాజమండ్రి ఒడ్డున గుడిసెలో ఉన్నారు కదా. అది అక్కడ లేకపోయినా ఆ స్థలానికి పోయి వచ్చినా. చలం రమణస్థాన్లో కొన్నాళ్లు ఉండి వచ్చినా. బీజింగ్ లో మావోబాడీని , మాస్కోలో లెనిన్ బాడీని , వియత్నాంలో హెూచిమిన్ బాడీని చూసి వచ్చినా. అట్లా చరిత్రలో తిరిగిరావటం మహాఇష్టం.

షేక్స్పియర్ను , ఆడమ్ స్మిత్ , అబ్రహంలింకన్ , శ్రీకృష్ణదేవరాయలు మెట్లెక్కినదారుల్ని , అన్నమయ్య తాళ్లపాక నుండి తిరుమలకు నడిచొచ్చిన దారిని చూడ్డం కాదు , ఆ జాడల్లో అడుగువేసి రావటం నాకొక అద్భుత అనుభూతి.


తరిగొండ వెంగమాంబ నడిచొచ్చిన అన్నిదారులతో పాటు ఆమె ధ్యానం చేసిన ఈ మారెళ్లగుహను ఈ మిట్టమధ్యాహ్నం ఎర్రటి ఎండల్లో దాదాపు నాలుగు గంటలు ట్రెక్ చేసిరావటం గొప్ప విశేషం.




మారెళ్లగెవి తరిగొండ నుండి 6. కి.మీ దూరంలో ఉంది. ముదివేడు దారిలో 3. కి.మీ దూరంలో ఎడమ దిక్కుకు తిరిగితే మట్టిదారి. నాతోపాటు అర్చక స్వామి రాజు , రెడ్డెప్ప , హరి , నాగరాజు , రామకృష్ణ ఉన్నారు. అనుకోకుండా రావటం వల్ల పంచె , జుబ్బా , తువ్వాలు తోనే దారితీసినాను. వచ్చిన వాళ్లు దారి చేయటానికి కత్తులయితే తీసుకొచ్చినారు కాని అనుభవం లేకపోవటం వల్ల వాటిపని పట్లేదు.




కొంచెం దూరం వరకు ఎప్పటివో పరచిన రాళ్లదారి. ఎక్కుడు దిగుడు కాల్వలు , పెద్ద పెద్ద గుండ్లు , ఆహ్లాదకరంగా ఉంది. అడవి చిట్టడవి. పెద్ద పెద్ద చెట్లేవి లేవు. ఎప్పటినుండో ఈదారిగుండా పోయే వారున్నట్టుగా దాఖలాలు ఉన్నాయి. అప్పుడెప్పుడో ఈ ప్రాంతాల్లో గిరిజనుల ఆవాసాలు ఉండేవి. ఆ వచ్చిన నలుగురు తమకు తెలిసిన దారి పేర్లు చెబుతున్నారు. ఇరుకు రాళ్లదారి , దొంగలదారి , బండదారి చూపించినారు.




కొంచెం దూరం పోగానే చీకుకంప పంచెలకు, తువాళ్లకు తగులుకోవటం, వాటిని తీసుకోవటం పెద్దపని. చేతులు , కాళ్లు కంపకు చీక్కుపోయి రక్తం కారుతోంది. అయినా లెక్కచేయకుండా ముందుకు కదులుతున్నా.




అది పెద్దగా జంతువులు ఉండే నేలకాదు. నెమళ్లు , కుందేళ్లు , పందులు ఉన్నట్టుగా తెలిసింది. అక్కడక్కడా ఎర్రచందనం చెట్లు చూసి ఇక్కడ కూడానా అని ఆశ్చర్యపోయిన. మన అడవిలో ఉన్నంతగా కాకపోయినా పలచగా ఉన్నాయి. బిక్కిమొక్కలు , కలేకాయలు ఉన్నాయి. చీకులు దాక్కుంటూ పైకి ఎగబడితే పెద్ద నిలువెత్తురాయి. ఎంత అందంగా ఉందో ?




దూరంగా నల్లటి చారలతో కొండ. అదే సార్ దాని కిందనే గుహ. ఇంకెంత దూరం కూతవేటంత దూరం అని ఒక గంటకు అక్కడ చేరుకునేలా చేసినారు. చాలా కష్టమని అననుగాని , మధ్యస్థంగా ఉంది ట్రెక్.




అది ఊరగాయల గుట్ట. ఆ పేటుకిందనే మారెళ్ల గుహ. గుహ చాలా లోతుగా ఉంది. ఇక్కడే తరిగొండ వెంగమాంబ కొంతకాలం పాటు ధ్యానం చేసినట్టుగా చెబుతారు. ఆ చిన్నవయస్సులో వయసుకాని వయసులో ఆమె అక్కడికి చేరుకోవటమే ఒకవింత.




ఈ ప్రదేశానికి కర్నాటక నుండి కూడ చాలామంది వచ్చి దీపారాధన చేసి, రవికె, చీర సమర్పించి సంతర్పణలు చేస్తుంటారని అర్చక స్వామి చెప్పినాడు. చుట్టూ గోకరాజుగుట్ట , నల్గొండ , జర్లకొండ , తుమ్మకొండ ఉన్నాయి. వాటినీ చూసిరావాలని అక్కడికక్కడే సంకల్పం చెప్పుకున్నాను. గుహలో కొంచెంసేపు గడిపి , పైన కోనేరు చూసి , ఆ రాతిపలక మీద ఐదు నిమిషాలు సేద దీరి సరసరా దిగబడినాము.

ఆ ఎండల్లో సన్నటి చినుకులు. వాతావరణం హాయిగా ఆహ్లాదకరంగా మారిపోయింది. దాదాపు రానుపోను మూడు గంటల సేపు ట్రెక్కింగ్ చూసి తిరుగు ప్రయాణమయినాను. అనుకొని ఈ మారెళ్లగెవికి మా ట్రెక్కర్ల నందరినీ కూడ గట్టి వానా కాలంలో మరొక్కసారి రావాలి. అక్కడి జలపాతాలు , సెలయేటి హెుయలు కనులారా చూసి తనివి తీరాలి. ట్రెక్కింగ్లు చారిత్రక స్పృహను పెంచుతాయి. గొప్ప అనుభవాల్ని అనుభూతుల్ని పెంచుతాయి. రండి. వీలయినన్ని కొండలు , కోనలు , అడవులు చూసొద్దాము. ప్రకృతితో పరవశిద్దాం.



(వ్యాస రచయిత భూమన్ చరిత్రకారుడు, పరిశోధకుడు, ట్రెకర్, తిరుపతి)


Read More
Next Story