తిరుపతి పక్కనే ఎవరికీ తెలియని అద్భుతం... ఈ జలపాతం
x
భీమవరం జలపాతం చేరుకోవడం ఒక సాహస యాత్ర

తిరుపతి పక్కనే ఎవరికీ తెలియని అద్భుతం... ఈ జలపాతం

ఇక్కడికి వెళ్లడం చాలా కష్టం. పెద్ద పెద్దలు కొండల బండలు ఎగబాగుతూ చేరుకోవాలి... చేరుకున్నాక అంతా అద్భతం..


(భూమన్)


ఈ జలపాతానికి చాలా పేర్లున్నాయి. ఇక్కడి వారు దీన్ని మునీశ్వర జలపాతం అని, మహేశ్వర జలపాతం అని, మూలకోనం జలపాతం అని రకరకాలపేర్లతో పిలుస్తున్నారు.




మా క్కూడ నిన్నమొన్నటి దాకా ఇంత అద్భుతమయిన జలపాతం తిరుపతి దగ్గర్లోనే ఉందన్న విషయం తెలియదు. అక్కడికి 2020 అక్టోబర్ వెళ్ళాను. ఇదే మొదటి సారి అంటే నమ్మ శక్యం కాదు.




తిరుపతి నుంచి మోహన్ బాబు ఇంజనీరింగ్ కాలేజీ, రంగంపేట, నారాయణ పల్లె, కందులవారి పల్లె, భీమవరం, మూలపల్లె దాటుకుని రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే రోడ్డుకు ఎడమ వైపు దూకే ఈ జలపాతాన్ని కనులారా వీక్షించవచ్చు.




నారాయణ పల్లె నుండి కొండల నడుమ మన ప్రయాణం చాలా ధ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆరోడ్డెంబటా పోతే ఒకవైపు చిత్తూరుకు, మరొక వైపు పులిచెర్ల మీదుగా పీలేరు చేరుకోవచ్చు.



జలపాతపు సానువులే చూపరులను కట్టిపడేస్తాయి.




రెండు కొండల నడుమ పారుతున్న ఈ నీటి సోయగానికి చేరుకోవడానికి ఆపక్క ఈ పక్క పైకెక్కడానికి దారే లేదు.




నీటి పారకం వెంట పెద్ద పెద్ద గుండ్లు ఎక్కుతూ దిగుతూ మోకాటి నీళ్ల లోతున నడుచుకుంటూ పైక ఎగబాకినాము…



ఇక్కడ నాలుగు అంచెలుగా గుండాలున్నాయి. నాలుగు జలపాతాలకు తలలొంచి పైకెక్కడం గగనమే. ఇది చాలా సాహసోపేతమయిన ట్రెక్కింగ్…అందునా నాబోటి వాళ్లకి.





ఆ ఎగుడు దిగుళ్ల నీటి శబ్ద తరంగాల లయల మధ్య, పారే గలగలల మధ్య, ఆ ప్రకృతి సోయగం, అందచందలా మధ్య ఏ మాత్రం ఇబ్బంది పడకుండా మొత్తానికి వెళ్లగలిగాను. చివరికంటా పోతేనే గొప్ప అనుభూతి.నీటిలో ఈదులాడుతూ పైకి చూస్తే చెట్ల నడుమనుంచి కనిపించే ఆకాశపు అందాలు, అటు ఇటూ పక్షుల లయబద్ధపు గొంతుకలు గొప్ప హాయినిస్తాయి.




ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడి గారి ఇంటికి కూత వేటు దూరంలో జలపాతాలు ఎన్నో యేళ్లుగా ఉన్నాయి. ప్రభుత్వాలు పూనుకుని సందర్శన ప్రాంతంగా తీర్చి దిద్ది ఉంటే దీనిని గురించి మరింత మందికి తెలియటమే కాకుండా ప్రభుత్వానికి మంచి ఆదాయాన్ని తెచ్చేది.




ఏ ఆలనా పాలనా లేక దిక్కు మొక్కు లేని ఈ జలపాతం తాగుబోతు టూరిస్టుల నిలయంగా మారింది. సీసాల, గ్లాసుల, ప్లేట్ల మధ్యన దిగులుగా ఉంది. తగు జాగ్రత్తలు తీసుకొనకపోతే, ముందు ముందు ఇక్కడి వాతావరణ మరింత గలీజు పట్టడం గ్యారెంటీ...


(భూమన్, ప్రముఖ రచయిత, చరిత్రపరిశోధకుడు, తిరుపతి)

Read More
Next Story