గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ వాళ్లని కొండపల్లి,కొండవీడు చూపించమని ఎప్పటినుంచో అడుగుతున్నాను.16.11.25 కొండవీడు చూపిస్తాo రమ్మన్నారు.నేను మా ఫ్రెండ్ ఒంగోలులో ఉదయం రెండు గంటలకు బస్సు ఎక్కి 4.30 గుంటూరులోని చుట్టుగుంటలో దిగేం. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు.రైతుబజార్ దగ్గర నుండి కచ్చితంగా 5.30 కల్లా బయలుదేరేం. బాధ్యుడు మోహన్ గారు మాఇద్దరిని చెరొక బాధ్యుడికి అప్పచెప్పి బండి ఎక్కించాడు.ఈసారి రెండవ బాధ్యుడైన పుల్లారావుగారు రాలేకపోయారు.ఇద్దరూ చాలా గుడ్ ఆర్గనైజర్లు.(గుంటూరు ‘ట్రెక్కింగ్ కింగ్స్’ గురించి ఒకసారి ప్రత్యేకంగా రాస్తాను).
నల్లపాడు,ఫిరంగిపురం,కొండవీడు గ్రామందాటి తూర్పుకోట (పుట్ట కోటగ్రామందాటి.ఈ గ్రామంలో ఆగి టిఫిన్ చేసాము) కొండవైపుగా ప్రయాణం సాగింది.ఈ గ్రామంలోకి ప్రవేశించక ముందే తూర్పు దక్షిణ ఉత్తర ఏ వైపు తిరిగినా సరే కొండలు దారికి అడ్డుగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఆకుపచ్చటి చీర చుట్టినట్లు, ప్రకృతిసోయగాలతో మనస్సును ఉల్లాస పరుస్తూ రా..రమ్మని పిలుస్తున్నాయి.చారిత్రక వైభవానికి అద్దం పట్టే అద్భుత పురాతన కట్టడాలు.వీటన్నింటినీ చూడాలంటే కొండవీడు కోటకు వెళ్లాల్సిందే.
కొండవీడు ఉమ్మడి గుంటూరు(ప్రస్తుతం పల్నాడుజిల్లా యడ్లపల్లి మండలంలో)జిల్లాలో గుంటూరుకు 27 కిలోమీటర్ల దూరంలో ఉంది.కోట ఎందరో రాజులకు పరిపాలన కేంద్రంగా విరాజిల్లింది.ఇక్కడ రాతి నిర్మాణాలు చూస్తే ఆ కాలంలో ఇంతటి ఇంజనీరింగ్ జ్ఞానo ఆశ్చర్యం గొలుపుతుంది.గతంలో కొండపైకి వెళ్లాలంటే నడకదారి మాత్రమే ఉండేది.పెరుగుతున్న పర్యాటకoను దృష్టిలో పెట్టుకొని 2018 లో 48 కోట్లతో ఘాట్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు.వాహనాలు నేరుగా కొండపైకి చేరుకునే బెస్ట్ గా నిర్మించిన ఘాట్ రోడ్డు కనిపిస్తుంది.
చూసినవి చుక్కల కోటబురుజు,ఆమార్గంలో ఉన్నవి మాత్రమే కాబట్టి,దాని గురించి అనుకున్నా.కాని కొండవీడు చూడాలనుకునేవారికి సమాచారం కోసం కొన్ని వివరాలు,కొద్దిగా చరిత్ర వివరిస్తా.
దొంతర్లు దొంతర్లుగా కొండల వరుసలు.నల్లటి కొండలపై ఆకు పచ్చటిచెట్లు కార్టూనిస్ట్ మోహన్ క్యానువాస్ పై బొమ్మలేసినట్లు. లేలేతగా కురుస్తున్న మంచులో, దారి కిరుపక్కల ఉన్న పంట పొలాలను,కొండల అందాలను,అప్పుడే ఎగిరిపోతున్న పక్షులను ఆస్వాదిస్తున్నాను.
గౌతమ్ (నన్ను బండి ఎక్కించుకున్న)కూడా హుషారుగా పక్షులను,పంటపొలాలను ఆస్వాదిస్తున్నాడు.మలుపుల మలుపుల ఘాట్ రోడ్డు.ముందుకు వెళుతూ పైనుంచి కిందకు చూస్తుంటే పచ్చటి కొండల్లో(పచ్చటి అడివిలో నల్లటి దారి సామెతను గుర్తుచేస్తూ)నల్లటి రోడ్డు అందంగా,అద్భుతoగా,మనోహరంగా కనిపిస్తుంది.చూడటానికి రెండుకళ్ళు సరిపోవటం లేదు.ముందుకు కదల బుద్ధికావటం లేదు.ఎంత బాగుందో రాతల్లో చెప్పలేను.48కోట్లతో ఈ ఘాట్ రోడ్డు నిర్మించారట.మంచు కొండల్లో నుంచి అప్పుడప్పుడే తొంగి చూస్తున్న సూర్యుడిని,ఆకుపచ్చరంగు వేచినట్లున్న లోతైన లోయల ఫోటోలు తీద్దామని ఆగిపోయి వెనకబడాం.
మాకోసం వెయిట్ చేస్తూ చివరి మలుపులో అందరూ రౌండ్ గా నిల్చున్నారు.ఎందుకో తెలియక మేంకూడా వెళ్లి నుంచున్నాం.మోహన్ గారు చుక్కల కొండ బురుజు ఎక్కుతున్నాం అని, వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్లు వేయవద్దు,బ్యాగ్ లోనే పెట్టుకుని కిందకు వచ్చిన తర్వాత డస్ట్ బిన్ లో వేయాలని చెప్పారు.ఇది జిటికె వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు.ఎవరన్న వేసినవి ఉన్నా వేరుకొని బ్యాగుల్లో పెట్టుకునివస్తారు.ఒకటి రెండు మూడు కౌంటింగ్ చేయించారు. 50మంది.మా వెనుక మరో పదిమంది వస్తున్నారట. మొత్తం 60మంది. మాముందు గైడ్గా హిమాలయ,కిలమంజరో పర్వతాలు ఎక్కిన నాగరాజు,మావెనక చివరన కావటి కర్రసాము నాని,మధ్యలో మోహన్ గారు,6,8ఏళ్ల అతి చిన్న ట్రెక్కర్లు ఇద్దరు,60ఏళ్ళ అతిపెద్ద ట్రెక్కర్లు కవాతు చేస్తున్నట్లుగా నడక ప్రారంభమైంది.
మొదట అతినిశబ్దంగా ప్రారంభమై మెల్లమెల్లగా దారుల వెతుకులాట అరుపులతో,కబుర్లతో నిశ్శబ్దం చెరిగిపోయింది. నాలాంటోళ్ళకి చేతులు ఇస్తూ,జాగ్రత్తలు చెబుతున్నారు. ఫోటోలు తీస్తున్నారు.పకృతిలో లీనమై టైం చూడటమే గుర్తు రావడంలేదు. చుట్టూ ఎత్తైన కొండలు.కనుచూపుమేరా కొండలు.పచ్చటిపకృతి.చల్లగాలి. ఓవైపు మంచు కురుస్తుంటే,ఆ మంచులో నుంచి కనికనపడకుండా నేనున్నానని సూర్యుడు వస్తున్నాడు.జి.టి.కే వాళ్ళు వారంవారం కొండలు ఎందుకు ఎక్కుతారో అర్థమయింది.
కోట ప్రవేశo దగ్గరే,ఘాట్ రోడ్డు ప్రారంభంలోనే టికెట్ కౌంటర్.మనిషికి20రూ,బండికి 20రు.కృత్రిమంగా,చెట్టును వంచినట్లు నిర్మించిన ప్రవేశద్వారం.ఈద్వారంపై తోకలేని మచ్చలపులి.ద్వారం ఆకర్షణీయంగా ఉంది.మేం తూర్పుద్వారం నుండి ఎక్కటం ప్రారంభించాం.కొండవీటికోటకు రెండుప్రధానద్వారాలు. తూర్పుకోటద్వారం.దీనినే కట్టిన యిల్లు వాకిలిఅంటారు.రెండు కొండలను కలుపుతు రెండువందల అడుగులమీరా దీని నిర్మాణం ఉంది.పశ్చిమద్వారం మెట్లదారి.ఈదారి పురాతనమైనది.కొద్దిగా ముందుకు వెళ్ళగానే పిల్లల కోసం పార్కు,ఆట వస్తువులు,పెద్దల కోసం చెట్లమొద్దులను సోపాలుగా చేసిన ఆసనాలు.ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఎత్తైన పీఠంపై అనవేమారెడ్డి నిలువెత్తువిగ్రహం రెడ్డిరాజుల దర్భాన్ని తెలియజేస్తూ.
అనవేమారెడ్డి విగ్రహం
అద్దంకిని రాజధానిగా చేసుకుని పాలిస్తున్న రెడ్డిరాజులు,అద్దంకి కోటకు సరైనరక్షణ లేకపోవడంతో ప్రోలయ వేమారెడ్డి తమరాజధానిని కొండవీడుకు మార్చి రాజ్య విస్తరణ,కోటల నిర్మాణం మొదలు పెట్టేడు.ప్రాలయవేమారెడ్డి కుమారుడే అనవేమారెడ్డి.ఇతను రెడ్డి రాజ్యాన్ని కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖవరకు విస్తరింపజేయటమే కాకుండా కొండవీటి లోని నిర్మాణాలన్నిటిని పూర్తిచేశాడు.
కొంచెం దిగువుగా నాలుగైదు అడుగుల పీఠంపై వేమన విగ్రహం ఎడమ ముంజేయి విరిగి.పీఠం నలువైపులా వేమనపద్యాలు.ఘాట్ రోడ్ దారిలోకూడా ఉన్నాయి.రెండుభాగాలుగా కనిపిస్తున్న(12+12 స్తంభాలపై)వేమన మండపం.చారిత్రక ప్రదేశాలపట్ల మన నిర్లక్ష్యాన్ని,ఆశ్రద్ధను తెలియజేస్తూన్నాయి.
వేమన ఈఊరు వాడని లేదా కొంతకాలం ఇక్కడ నివసించి పద్యాలు రాసాడని చెబుతున్నారు.ఉండొచ్చు ఎందుకంటే రెడ్డి రాజుల కాలంలో కవులు,పండితులు,కళలు బాగా ఉన్నాయని,అనపోత వేమారెడ్డికాలం వీటికి గోల్డెన్ పీరియడ్ అని చెబుతారు.శ్రీనాథుడు(విద్యా మంత్రి కూడా) కవిత్రయంలోని ఎర్రప్రగడా రెడ్డిరాజుల ఆస్థానములోని వారని చరిత్ర చెబుతుంది.కొద్దిగా ముందుకు పోతే మసీదు కనిపిస్తుంది.మసీదుకు ఎడమ చేతి వైపుగాపోతే కోట నీటిఅవసరాల కోసం గొలుసుకట్టు చెరువులైన వెదుళ్ళ చెరువు(ప్రధాననీటివనరు.చుట్టూవెదుర్లుఉండటంతో ఆ పేరు.
వచ్చిందట)ముత్యాలమ్మచెరువు,పుట్టలమ్మ చెరువు ఉన్నాయట.ఇవి సహజసిద్ధంగా ఏర్పడ్డాయట.ఈ చెరువులు నిండితే నీటిని క్రింద ఉన్న చెరువు కు పంపించే ఏర్పాట్లుచేశారట.ఈచెరువులేకాక నీటి వనరుల కోసం అంత ఎత్తయిన కొండల్లో లోతైన బావులు23 తవ్వించారట.ఈ బావుల నుండి నీరు తోడటానికి పొడవైన చెంతాడులు ఉపయోగించారట.కనుకనే కొండవీటి చాంతాళ్లు అనే పేరు వచ్చి ఉంటుంది.
తెలుగువారి చరిత్రలో కొండవీటికి ప్రత్యేక స్థానం ఉంది.కొండవీడు అనగానే ఈ ప్రాంతవాసుల గుండెలు ఉప్పొంగుతాయి.కొండవీటికోట సముద్రమట్టానికి 1700 అడుగుల ఎత్తులో38కోటలు,44 బురుజులు(ఈ బురుజుల మీద నుండి నిత్యం సైనికులు కాపలకాస్తుంటారు)అన్ని కొండలను కలుపతు 32మైళ్ళ ప్రాకారాలతో,9000 ఎకరాలవిస్తీర్ణంలో కట్టుదిట్టమైన, శత్రుదుర్వేద్యమైన, చుట్టూ కంధకాలతో గిరిదుర్గముగా నిర్మింపబడినది.కనుకనే రెడ్డిరాజులు ఉదయగిరి నుండి ఒరిస్సాలోని కటక్ వరకు రాజ్యవిస్తరణ చేసి 100 సంవత్సరాలు పాలించారు.ఈ కొండవీటి కోటలు,బురుజులు,దేవాలయాలు ఒక్కరోజులో చూడలేం.అన్నీ చూడాలంటే నాలుగైదురోజులు పట్టొచ్చు.
కొండవీడుకు చిహ్నం చుక్కలకొండ బురుజు.దీనిని తారాబురుజు అని కూడా అంటారు.ఇది కోటకు పడమటి వైపుగా కొండశిఖరం మీద ఉంది. ఆడతాపాడతా సునాయాసంగానే చుక్కలకొండ బురుజు ఎక్కాం.ట్రేక్కర్స్ అందరూ20-35మధ్య యువతి యువకులే.బురుజు ఎక్కారు.పక్కనే ఉన్న పెద్ద పెద్దరాళ్ళు ఎక్కేరు.కరువు తీరా ఫోటోలు తీసుకున్నారు.ఉన్నవి షేర్ చేసుకుంటూ తిన్నారు.
మానసిక ఆనందం కోసం మోమోయాక్షన్,హౌసి ఆటఆడారు.బస్కీలుతీశారు.గౌతమ్ చేసిన రకరకాల డాన్స్ అందరిని అలరించింది.నాలాంటి కొందరు చుట్టూ ఉన్న కొండల,లోయల ఆకుపచ్చటి అందాలను తాగారు.దిగేమార్గంలో (అరుణాచలంలో మోక్షద్వారంలోలా) రెండుపెద్దరాళ్ళ మధ్య సన్నటిదారిలో రావటం భలే ఉంది.ఒక్కొక్కసారి ఒక్కొక్కకొండ ఎక్కుతాం అన్నారు.కొండవీటి నిర్మాణాలన్ని గ్రానైట్, రాతి, గానుగ వేసిన సున్నం ఇసుకతో కట్టబడినవి.
కొండవీటి కొండల్లో ఉన్న 38 కోటలు,బురుజులు ఒక్కరోజులో చూడలేం.అన్ని చూడాలంటే ఐదు ఆరు రోజులు పడుతుంది.ప్రారంభంలోనే కనిపించే నెమలి బురుజు కొండ అతిఎత్తుగా నిట్టనిలువుగా కనిపిస్తుంది.కొండలమీద ఉన్న అన్ని బురుజులు కన్నా పెద్దది, పొడవైనదట.గ్రామం దాటగానే మొదట వచ్చే కొండబురుజు ఇది.దారిలోకే దేవాలయం రెండుభాగాలుగా కనిపిస్తుంది.ప్రతి సంవత్సరం శివరాత్రి అప్పుడు తిరుణాల జరుగుతుందట.విచ్చుకున్న నెమలిపురి ఆకారంలో ఉంటుందట.అందుకనే ఈకొండకు నెమలి బురుజు కొండ అని పేరు.
1.నెమలి కొండ బురుజు తర్వాత 2. సజ్జమహల్ బురుజు.దీనిపై నుండి చూస్తే కొండవీడు కోట మొత్తం కనిపిస్తుందట.3. నిఖిల్లా బురుజు. పద్మవ్యూహాన్ని తలపిస్తుందట.అతిపెద్ద సైనిక స్థావరమట ఆరోజుల్లో. 4. విరియాలబురుజు.పచ్చిమ ద్వారానికి చెరువులో ఉంటుంది. 5.చుక్కల కొండ బురుజు.6. రాణిగారిబురుజు 7. ఆళ్ళవారిబురుజు 8. బ్రహ్మదేవుడి బురుజు 9. తిరుమలయ్య బురుజు.ఇలా ఇక్కడ ఒక్కొక్కబురుజుకు ఒక్కొక్కపేరు ఉందట.
శిధిలమౌతున్న సుల్తానులు నిర్మించిన మసీదు
బురుజులేకాక ఇరవై మూడు బావులు,వజ్రాల,నేతి కోట్లు, రంగశానిమండపం,తీర్పుల మండపం,గోపీనాథస్వామి దేవాలయo(రెడ్డి రాజుల శిల్ప వైభవాన్ని తెలియజేస్తుందట)(దీనిని చీకటికోనేరు,కత్తులబావి అంటారు.ప్రస్తుతానికిలేదు పూడ్చివేశారట.ఈబావిలో కత్తులను అమర్చి, తిరుగుబాటుచేసిన సామంతరాజులను,శత్రురాజులను తిరుగుబాటుదారులను చంపేశారట.మరో కథనం ప్రకారం రెడ్డిరాజుల పూజారే గుడి నిర్మాణం చేసి,పూజకు పిలిచి ఆకత్తుల బావిలోకి జారుడు బండను ఎర్పాటుచేసి రెడ్డిరాజులనందరిని చంపేశాడు అని)ఇప్పటికీ,కొన్ని కోటలు, బురుజులు ప్రాకారాలు,నిర్మాణాలు చాలా శాతం శిథిలమైనప్పటికీ ఈకోట రహస్యాల గురించి చెప్పకనే చెబుతాయి.రాజుల రాణుల కోటలు.శ్రీకృష్ణదేవరాయలు వేసిన ధ్వజస్తంభం,విజయస్తంభం, లక్ష్మీనరసింహ ఆలయం, శివాలయం,అశ్వశాలలు,గజశాలలు,ధాన్యకారాలు,శిలా శాసనాలు, శిథిలమవుతున్న కోటలు, బావులు, చెఱువులు,దేవతా,నంది విగ్రహాలు.కొండవీటికోటలో అణువణువు ఏదో ఒక ప్రత్యేకత ఉంది.
కొండవీడు వివిధ పాలకులు:- కాకతీయుల నుండి రెడ్డిరాజులు స్వతంత్రతను ప్రకటించి అద్దంకిని రాజధానిగా చేసుకున్నారు.సరైన రక్షణ లేకపోవడంతో అద్దంకికోట నుండి తమరాజధానిని కొండవీటికి ప్రోలయ వేమారెడ్డి మార్చాడు.ఏ రాజ్యరక్షణ అయినా సైనికులతోపాటు పటిష్ఠమైన, దుర్భేద్యమైనకోటలపై ఆధారపడి ఉంటుంది.
ప్రోలయ వేమారెడ్డి తరువాత అతని కుమారుడు అనపోతారెడ్డి,అనవేమారెడ్డి,కుమారగిరిరెడ్డి,పెదకోమటి వేమారెడ్డి(ఇతని పరిపాలనా కాలాన్ని స్వర్ణయగమని చెప్పవచ్చు)రాచవేమారెడ్డి పరిపాలించారు.రాచ వేమారెడ్డిని ఓడించి విజయనగర రాజులు కొండవీటి రాజ్యాన్ని అస్తగతం చేసుకున్నారు.వీరిని ఓడించి గజపతులు,గజపతులను ఓడించి గోల్కొండ సుల్తానులు,వీరిని ఓడించి బ్రిటిష్ వారు పాలించినప్పటికీ రెడ్డిరాజుల కోటగానే ఇప్పటికీ గుర్తింపు ఉంది.
అయితే రెడ్డిరాజులకు ముందే సుమారు 2000 సంవత్సరాల క్రితమే కొండవీటికొండలపై బౌద్ధ నాగరికత ఉన్నదని ఇటీవల శ్రీమతి రుషిసింగ్, కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కె.వి.రావుతో కలిసి ఈమధ్య నిధుల కోసం తవ్వకాలు జరిపిన శివాలయం పరిసరాలలో బౌద్ధ స్తూపాన్ని గుర్తించారు.స్థూపం సుమారు 12 అడుగుల వ్యాసార్థంతో ఉంది.నిర్మాణానికి లేత ఆకుపచ్చ నాపరాళ్ళు,నలుపు రంగురాళ్లు వాడేరు.స్థూపం పైన శివాలయం నిర్మించారని వీరు తెలిపారు.కొండవీటి కొండలమీద టెర్రాసు స్థూపాలు కనిపిస్తున్నాయి.ఎత్తయిన కొండల మీద ఏటవాలుగా ఉన్న ప్రదేశాల్లో నిర్మించిన స్థూపాలను టెర్రస్ స్థూపాలు అంటారు.ఈస్థూపాలు శాతవాహనుల కాలం నాటి పెద్ద పెద్ద ఇటుకలతో నిర్మితమయ్యాయి.అలాగే బౌద్ధవిహారాల పైకొప్పుల కోసం ఉపయోగించుకునే పెంకులు మట్టి పాత్రల శకలాలు కూడా దొరికాయి.
ఎవరు ఎప్పుడు పాలించినా? ఇది అతిముఖ్యమైన చారిత్రిక ప్రదేశం.ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియావాళ్ళు "ఫోర్ట్ ఆఫ్ ఇండియా సిరీస్" పుస్తకాలు వేశారు.దానిలో కొండవీటి దుర్గము గురించి అన్ని వివరాలతో ప్రత్యేకంగా రాశారు.దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి గిరిదుర్గం లేదనీ, ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే బురుజులనిర్మాణాలు,చెరువులు, లోతైనబావులు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు.దీనిని రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాలది.సరైన నిధులు కేటాయించి, నిర్మాణాలను కాపాడగలిగితే హైదరాబాదుకు గోల్కొండ కోటలాగా అమరావతికిఈ కొండవీటి కొండలుకూడా చారిత్రక ప్రదేశంగా, ట్రిక్కింగ్,సందర్శనీయ ప్రదేశంగా అభివృద్ధి చెందుతుంది.బోట్లు,జలక్రీడలు (కొండలు అడవులు ప్రకృతితోనే ఉండాలి) పెట్టకుండా ఉన్నది ఉన్నట్లుగా కాపాడగలిగితే కొండవీటి కొండలపై ఉన్న అపారమైన,వైవిధ్యమైన జంతు, వృక్ష,వనమూలికలు రక్షింపబడతాయి.
చైనా వారిలాగా కాకపోయినా కనీసం తమిళనాడు కర్ణాటక ప్రభుత్వాల్లాగా మన ప్రభుత్వాలు ఈగిరిదుర్గం పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించినా!? కోటలు,బురుజులు,దేవాలయాలు,మెట్ల దారులు మొదలైన నిర్మాణాలు శిధిలావస్థకు చేరేవి కావు.కొండవీడు ప్రస్తుతం పారెస్ట్ డిపార్ట్మెంట్ వారికింద ఉంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గుర్తించినది.వరల్డ్ హెరిటేజ్ ప్రాంతంగా గుర్తించమని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు.కొండవీటికి దగ్గరగా ఉన్నావేణుగోపాలస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి "ఇస్కాన్ సంస్థ" దత్తత తీసుకుంది.వేణుగోపాలస్వామి ఆలయంతో పాటు కొండవీటిని అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదరటంతో ఇస్కాన్ సంస్థకు 100ఎకరాల భూమిని 99 సంవత్సరాలపాటు లీజుకి ఇచ్చారని,ఎకరానికి లక్ష చొప్పున(ఇంతతక్కువ ధరకు) చెల్లించారని తెలుస్తుంది. ప్రభుత్వాలు ఇలా ఇస్కాన్ సంస్థకు ఇవ్వడం తన బాధ్యతల నుండి తప్పుకోవడమే.
కొండవీటి కొండలను చూసి,మనసులో, మనోహరమైన ఈ ఆకు పచ్చటికొండలు,లోయలు,వైవిధ్యమైన జంతు,పక్షి,వృక్ష జాతులు, వనమూలికలు ప్రశాంతమైన వాతావరణం,చారిత్రాత్మకమైన కోటలు,బురుజులు బ్రతకాలంటే,ఉండాలంటే ఈ కొండవీటి కొండలపై ఎలాంటి ఖనిజసంపద ఉండకూడదని,ఈ ఖనిజసంపదలపై ఆదానీ,అంబానీ మొదలైన కార్పోరేట్ల, ప్రభుత్వాల దృష్టి పడకూడదని బలంగా కోరుకుంటున్నాను.
వీలు చూసుకుని ఒకరిద్దరు కాకుండా ఓ సమూహంగా కొండవీటి కొండలను సందర్శించండి.ప్రకృతిలోకి వెళ్ళండి.జ్ఞానేంద్రియాలకు విందు చేయండి.ఊపిరితిత్తుల నిండా స్వచ్ఛమైన గాలిని నింపండి.వయసులను మర్చిపోండి.దిగుళ్లను అసాంతులను,విశ్రాంతి లేని బిజీ జీవితాలను,బాధ్యతలను ప్రక్కనపెట్టి నెలకు ఒక్కరోజన్నా ప్రకృతిలోకి వెళ్ళండి.ప్రకృతి,మిమ్మల్ని శారీరకంగా,మానసికంగా బలమైనవారిగా తయారు చేస్తుంది.తీపి గుర్తులు నింపుతుంది.ప్రకృతిలోకి వెళుతూ వాటర్,డ్రింక్ బాటిల్స్,ప్లాస్టిక్ కవర్లు,తిను బండారాలువేసి ప్రకృతిని నాశనం చేయకండి.ప్రకృతిని మన ముందు తరాలు నాశనం చేయకుండా కాపాడి మనకిచ్చిన సంపద.మన తరువాత తరాలకు మనం ఇవ్వబోవే గొప్ప వారసత్వ సంపద.స్వచ్ఛమైన ఆక్సిజన్.మరి మీరు ఏమనుకుంటున్నారు?