సింగిరి కోన: ఇక్కడ దోసిళ్ల కొద్ది ప్రకృతి సౌందర్యం జుర్రు కోవచ్చు…
x

సింగిరి కోన: ఇక్కడ దోసిళ్ల కొద్ది ప్రకృతి సౌందర్యం జుర్రు కోవచ్చు…

అదేమిటో గాని, చిత్తూరు జిల్లా కోనలన్నీ తమిళలకు తెలిసినంతగా తెలుగువారికి తెలియవు. అన్ని కోనలకు ఎక్కువ మంది తమిళులే వస్తుంటారు. తెలుగు యాత్రికులు బాగా తక్కువ.


-భూమన్


సింగిరి కోనకు 2020 లో అక్టోబర్ లో వెళ్లాను.వాన వెలిసిన చిత్తడి. ఈ అడవులు, కొండలు, కోనలు, శిఖరాలు కలియతిరిగి నాకు ఈ కోనగురించి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ కోన గురించి తెలియగనే నలుగురి మిత్రులతో బయలుదేరాను. కొత్త దారి, కొత్త ప్రదేశం. ఈ ట్రెక్ ఒక వింత సాహసానుభం. ఆహ్లాదకరమయిన అనుభవం. ఆ జ్ఞాపకాలు:



చిత్తూరు జిల్లాలో ఉన్న కోనలన్నీ తమిళలకు తెలిసినంతగా తెలుగువారికి తెలియకపోవడం ఆశ్చర్యమే. అన్ని కోనలకు ఎక్కువ మంది తమిళులే వస్తుంటారు. తెలుగు యాత్రికులు బాగా తక్కువ.




శేషాచలం కొండలను కలియతిరిగాను. చాలా కాలంగా ఆ చుట్టు పక్కల అనేక ట్రెక్కింగ్ లు చేసినాము గాని సింగిరి కోనంగురించి విన్నతి లేదు. అట్ల ఉంది మన సమాచారం విప్లవం.

సింగిరి కోన ప్రకృతి ప్రియులకు అద్భుత దృశ్య కావ్యం. ఆ కొండల నడమ అడవుల వెంట పోతుండడమే ఒక మహావిశిష్ట అనుభవం. సింగిరి కోన ‘సింగిరిపెరుమాళ్ ’ కోన అని అంటారు. ఇది నారాయణ వనం నుంచి ఐదు కి.మీ దూరాన ఉంది.




నారాయణ వనం పుత్తూరుకూ ఐదు కి.మీ దూరం. అక్కడి నుంచి కీల గ్రామం వరకు సిమెంట్ రోడ్డు, అక్కడి నుంచి నాలుగు కి.మీ దూరం మట్టిరోడ్డులో ప్రయాణించవలసి ఉంటుంది. రహదారి బాగుంది. మాకు ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వటం వల్ల స్కూటర్లలో తిరుపతి నుంచి నలభై కి.మీ ప్రయాణం చేసినాము.అయితే, అక్కడి కార్లు నేరుగా పోయేంత బాగా రోడ్డు ఉంది.





అయితేనేమి, ఆ మట్టి రోడ్డులో స్కూటర్లో ప్రయాణించడమే మంచే అయింది. రోడ్డు వెంట చిరుజల్లు, పక్కనే పిల్ల కాలువల సందడి. ఇరువైపుల అద్భతమయిన కొండలు, ఆపచ్చదనం మధ్య కొండలు పట్టు చీరలకు నగిషీలద్దినట్లుగా గొప్పఆకర్షణతో మిలమిలా మెరుస్తున్నాయి. సానువులంతా పచ్చపచ్చటి అడవులో కలకలలాడుతున్నాయి. ఆపక్క ఈ పక్క తోవలకు ట్రెకింగ్ ట్రెయిల్స్. అద్భుతమయిన ఆహ్లాదకరమయిన ప్రయాణంతో కోన చేరినాము.





అక్కడ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం చూశాం. యాత్రికులకు ఉచిత అన్నదాన సౌకర్యం ఉంది. గుడి ఎదురుగా జలపాతం, గుండం ఉన్నాయి. ఈ దేవాలయాన్ని నారాయణ వనం పరిపాలకులు నాలుగువందల యేళ్ల క్రితం కట్టించినట్లుగా అక్కడి పూజారులు చెప్పినారు. అక్కడి తీర్థం పేరు బాలతీర్థం. సంవత్సరం పొడుగుతా నీళ్లు పారుతూనే ఉంటాయట. జలపాతం చాలా పైనుండి వస్తున్నది.




మేం వారిని అభ్యర్థించి శిఖరభాగానికి నడక మొదలు పెట్టినాము నలుగురం. దారి తెన్నులేదు. మొండిగా పైభాగానికి చేరి అక్కడ ప్రకృతి దృశ్యాలను కనులారా చూసి దిగ్భ్రకు గురయినాము. ఏమా సౌందర్యం? ఎంతటి అపురూప దృశ్యాలవి. చూసినంత దూరం పచ్చటి పడుచవైభోగమే ఆ ప్రకృతి. మాటల్లో వర్ణించలేని సౌందర్యం, అనుభవం.





కిందికి దిగేటప్పుడు వచ్చిన దారితప్పోయి జారుకుంటూ పాక్కుంటూ రావాల్సి వచ్చింది. ఇదొక అనుభవంగా ముచ్చటించుకుంటూ మోస్ట్ అడ్వెంచరస్ అండ్ హార్డ్ ట్రెక్కింగ్ అని చెప్పుకుంటూ మమ్మల్ని మేము అభినందించుకుంటూ తిరుగు బాట పట్టాం.







గిలిని జయించి, గిరుల ముద్దాటన, ఆ మధ్యన ఆచిరు జలపాతం కింద కూర్చోవడం గొప్ప రిలీఫ్ . అనుభవించిన వారికేతెలుస్తుంది. ఆ అనుభూతి.

మీరందరూ రండి ఈ చిన్న అందాలకోనకి. ప్రకృతిని మనసారా అస్వాదించండి. ప్రకృతి మీకు ఆరోగ్యం ఆహ్లాదం ప్రసాదిస్తుంది. దోసిళ్లారా స్వీకరించండి. సింగిరికోన అందచందాలలో విహరించండి



Read More
Next Story