TREKKING | అందరాని చందమామ.. వర్షాల్లో తుంబురు కోన !
x
నడుము లోతు నీళ్ల ప్రవాహంలో ఏటిని దాటుతున్న ట్రెక్కర్లు

TREKKING | అందరాని చందమామ.. వర్షాల్లో తుంబురు కోన !

నడుములోతు ఏర్లలో పన్నెండుగంటల నడక !


రహదారులు కాలువలయ్యాయి. ఏర్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తుంబురు కోన అందాలను ఆస్వాదించాలని మా ట్రెక్కర్లు ఆ నీళ్ళ లోంచి దట్టమైన అడవిలోకి సాగుతున్నారు. మోకాలు లోతే కాదు, నడుము లోతు నీళ్ళున్న ఏర్లను కూడా దాటుతున్నారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ప్రవహిస్తున్న ఏటికి అడ్డంగా సాగుతుంటే, ఆ ఏటి ప్రవాహానికి ఎక్కడ కొట్టుకుపోతామేమోనన్న భయం. ఒకటా రెండా పన్నెండు గంటలపాటు అడవిలో నడక.

కుక్కల దొడ్డి వైపు నుంచి శని, ఆదివారం (డిసెంబర్ 14, 15) తుంబురు తీర్థం వెళ్ళాలని మూడు నెలల క్రితమే తిరుపతి ట్రెక్కంగ్ క్లబ్ నిర్ణయించింది. విడవకుండా పదిరోజులుగా ఒకటే వర్షాలు. రాత్రి, పగలు తేడా లేకుండా గురువారం (12వ తేదీ)వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి. మాకు రుతుపవనాలు లేవు. బంగాళా ఖాతంలో అల్పపీడనమో, వాయుగుండమో, తుఫానో ఏర్పడితే తప్ప మాకు వర్షాలు పడవు. ప్రకృతికి కూడా సవతిబిడ్డలైపోయాం కదా! వర్షాలు ఇలాగే పడాలంటూ కొందరు శకునాలు పెడుతూనే ఉన్నారు. పిల్లి శకునాలకు ఉట్లు తెగుతాయా !? శనివారం మేం బయలుదేరాల్సి ఉండగా, శుక్రవారం తెరిపిచ్చింది.

అడివిలో సాగుతున్న ట్రెక్కర్లు

శనివారం ఉదయం తెల్లవారు జామున 5 గంటలకే తిరుపతిలో కుక్కల దొడ్డివైపు బయలుదేరాం. తిరుపతి నుంచే కాకుండా, గుంటూరు ట్రెక్కింగ్ టైగర్లు, విశాఖ, హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు నుంచి కూడా ట్రెక్కర్లు వచ్చారు. కుక్కల దొడ్డికి మూడు కిలోమీటర్ల ఈవల ఎడమవైపున రైల్వే వంతెన కింద నుంచి వర్షపు నీళ్ళు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆకాశం మేఘావృతమయ్యే ఉంది. సూర్యుడు కనిపించడం లేదు. వాతావరణం చల్లగా ఉంది. అందులో శరత్ కాలం.మధు కు కాలు ఫ్రాక్చర్ రై కట్టు కట్టుకుని .
రైల్వే వంతెన వరకే వచ్చాడు. వంతెన కింద నుంచి వాహనాలు ముందుకు కదలవు. వంతెన కింద నీటి ప్రవాహం లేకపోతే మరొక ఆరు కిలోమీటర్లు వాహనాల్లో వెళ్ళగలిగే వాళ్ళం. ఉదయం 7 గంటలకు అక్కడి నుంచే మా నడక మొదలైంది. రైలు కట్ట ఎక్కి అటువైపునకు దాటాం. నీళ్ళున్నాయని బూట్లిప్పినా ఉఫయోగం లేదు. కనుచూపు మేరలో మళ్ళీ నీళ్ళే. అడవిలో దారంతా నీటి ప్రవాహమే. పొడిజాగా చూసుకుని టిఫిన్లు పూర్తి చేశాం.

అన్నమయ్య మార్గం కూడలిలో సేదదీరుతున్న ట్రెక్కర్లతో రాఘవ (కుడివైపు చివర)

ముందుకు సాగుతున్నాం. నాలుగు బాటల కూడలి వచ్చింది. కుడివైపున వెళితే మామండూరు. ఎడమ వైపున దారి అన్నమయ్య నడుచుకూంటూ తిరుమల వెళ్ళిన మార్గం. ఎదురుగా తుంబురు వెళ్ళే దారి. ఏడేళ్ళ పిల్లవాడు తండ్రి చేయిపట్టుకుని నడుస్తున్నాడు. డెబ్భైయవ ఏటిలోకి అడుగిడిన నేనున్నాను. గృహిణులు, వివిధ వృత్తులు చేసుకునే మహిళలు, పురుషులు, ఆరుపదులు దాటిన విశ్రాంత ఉపాధ్యాయులు, యువకులు అంతా నడుస్తున్నారు. డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి వంటి వైద్యనిపుణులున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ నడకమొదలు పెట్టాం. దారికి ఇరువైపులా దట్టమైన అడవి. మధ్యలో మా మాటల కొలువు. సరదా కబుర్లు, ట్రెక్కింగ్ అనుభవాలు, ఉద్యోగ ఉపాది కష్టాలు; ఓహ్.. ఒకటేమిటి, జీవితానికి సంబంధించిన సమస్త భావనలు, అనుభూతులు మా మాటల్లో కి చొరవ బడ్డాయి. మాటల్లో పడి అలుపు తెలియడం లేదు.

ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఏరు దాటు తున్న ట్రెక్కర్లు

ఎదురుగా పెద్ద ప్రవాహంతో ఏరు మా దారికి అడ్డంగా సాగుతోంది. కాదు కాదు, దాని దారికే మేం అడ్డంగా వచ్చాం. ఏటిని దాటడం ఎలా? ఏటిలో కెళితే తోసేస్తోంది. యువకులు ఒకరొకరు చేయిపట్టుకుని, ఈ మూల నుంచి ఆ మూల వరకు గొలుసులా ఏటిలో అడ్డంగా నిలుచున్నారు. నడుములోతు నీళ్ళు. వాళ్ళను పట్టుకుని ఈ మూల నుంచి ఆ మూలకు దాటుతున్నాం. నా ట్రెక్కింగ్ చేతికర్ర కాస్తా ఏటిలో జారి ప్రవాహంలో కొట్టుకుపోతోంది. నిస్సహాయంగా కళ్ళప్పగించి చూస్తున్నాను. ట్రెక్కింగ్ లో ఎంత సహాయం చేసిందీ చేతికర్ర. చేతికర్ర లేక ముందు అడవిలో నడుస్తూ నడుస్తూ అప్పుడప్పుడూ తీగ తగులుకునో, కాలి కింద బండ రాయి కదిలో కింద పడేవాణ్ణి. ఈ ట్రెక్కింగ్ చేతికర్రను డెకత్లాంలో కొన్నప్పటి నుంచి పడకుండా ఏళ్ళ తరబడి అది నన్నెంత కాపాడిందో! అలాంటి నా సహాయకురాలు నీళ్ళలో కొట్టుకు పోతూ పోతూ నా కేసి జాలిగా చూస్తుంటే, నా నిస్సహాయతకు గుండె బరువెక్కింది. తరువాత దీని గురించి రాంప్రసాద్ కు చెప్పాను. ‘‘అయ్యో నేనుంటే పట్టుకొచ్చేవాణ్ణి’’ అన్నాడు. రాం ప్రసాద్ దేనినైనా సాధించే కమాండో శిక్షణ పొందిన సాహసికుడు. అతను వెనకుండి పోయాడు.

ఈయనే కమెండో రామ్ ప్రసాద్ (వేలు చూపెడుతున్న వ్యక్తి), పక్కన శ్రీ హరి

వెనకటి రోజుల్లో బోయిలు ‘‘అయ్యోం..అయ్యోం ఓం.. అయ్యోం..అయ్యోం ఓం..’’ అంటూ పల్లకీలను మోసే వారు. ఇప్పుడు పల్లకీ lu లేక పోయినా, దేవదాసు వంటి పాత సినిమాల్లో ఇలాంటి దృశ్యాలను ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. మళ్ళీ అలాంటి దృశ్యాన్ని పోలిన దృశ్యం ఈ ట్రెక్కింగ్ లో కనిపించింది. మమ్మల్ని మేం మోసుకుంటూ నడవడమే కష్టం అనుకుంటే, ఆర్య వంటి యువకులు బియ్యం, కూరగాయలు, పాలు, పెరుగు, వంట పాత్రల వంటి సామానంతా ఒక కర్రకు వేలాడ దీసి, పల్లకిని మోసినట్టు మోసుకొస్తున్నారు.
ఒక్కొక్కటిగా వాటిని ఏటి నుంచి దాటిస్తున్నారు. వాళ్ళ కష్టం మామూలు కష్టం కాదు. వాళ్ళ ను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

పల్లకీ లా సామాన్లు మోసుకెళ్తున్న ట్రెక్కర్లు

ప్రవహిస్తున్న ఏటి పక్క నుంచి కొండ ఎక్కుతున్నాం. వర్షం పడింది కనుక జారుతోంది. నేనెక్కుతూంటే, ఎక్కలేనేమోనని ఒక మహిళ చేయి చాచింది. ఆ చేయి పట్టుకోకుండానే ఎక్కేశాను. నవ్వుతూ వింతగా చూసింది. ఒకరికొకరు సాయం చేసుకుంటూ సాగుతున్నాం. ఆకాశంలో దట్టంగా మబ్బులు భయపెడుతున్నాయి. వర్షం వస్తే తడిసిపోతాం. కాసేపు అడవిలో, కాసేపు ఏటిలో నడక. మధ్యాహ్నం ఒంటిగంటైంది. పారుతున్న ఏటి పక్కన భోజనాలకు ఉపక్రమించాం. ఆ ఏటిలోనే ఫొటోలు, సరదాలు. ఆ ఏరు అంతకు ముందు కంటే ఉధృతంగా ప్రవహిస్తోంది.

ఏటికి అడ్డంగా చెట్టును వేసి, దాన్ని పట్టుకుని దాటుతున్నవైనం

ఒక చెట్టు ఏటికి అడ్డంగా పడింది. దాని పక్కనుంచి ఏరు మరింత ఉధృతంగా సాగుతోంది. ఆ చెట్టును ఒక పక్క నుంచి లాక్కొచ్చి తక్కువ లోతున్న ప్రాంతంలో అడ్డంగా వేశారు. ఆ చెట్టుకు ప్రవాహం వస్తున్న వైపు యువకులు చేతులు పట్టుకుని అడ్డంగా నిలుచుంటే, వారికి ఎదురుగా ఆ చెట్టు పట్టుకుని దాటుతున్నాం. ఆ ప్రవాహానికి మా కాళ్ళు పైకి లేస్తున్నాయి. ‘‘అడుగులు ఎత్తి వేయకండి. పాదాలు ఈడుస్తున్నట్టు వేయండి’’ అంటూ సలహాలిచ్చారు. ఏటిలో పాదాలు ఈడుస్తూ అడుగులు వేయడం వల్ల కొట్టుకుపోకుండా సాగగలిగాం.
దాదాపు అరడజను మోకాలు లోతుండే ఏర్లను తేలికగా దాటగలిగాం. నడుము లోతుండే దాదాపు పన్నెండు ఏర్లను దాటడానికి సాహసాలు చేయాల్సి వచ్చింది. ఈ దారిలో వేసవిలో తుంబురుకు అనేక సార్లు వెళ్ళి వచ్చాను. కానీ ఇంత ప్రవాహాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇంతకూ బండిరుసు ఎక్కడుంది? గుర్తించలేకపోయా. బండిరుసు వరకు ఆరు కిలోమీటర్లు నడవాల్సిన పనిలేకుండా వాహనాల్లో వచ్చేయవచ్చు. వెనకటి రోజుల్లో ఈ దారి వెంటే తిరుమలకు, తుంబురుకు ఎద్దుల బండ్లలో వెళ్ళేటప్పుడు, ఇక్కడ ఏటిలో బండి ఇరుసులు విరిగిపోయేవి. అందుకునే దీనికి బండిరుసు ఏరని పేరొచ్చింది.
‘‘దారంతా ఇలాగే ఉంటే తుంబురుకు వెళ్ళలేం. ఇక్కడే ఎక్కడో రాత్రికి బస చేసి, పొద్దున్నే తిరిగి వచ్చిన దారిన వెళదాం’’ అన్నారు కొందరు. ‘‘రాత్రికి ఎక్కడ బస? ఎక్కడ బస?’’ అంటూ నడుస్తూనే ఉన్నాం. త్వరగా నడుం వరకు తడిసిన బట్టలు విప్పేయాలని అనుకుంటున్నాం. అందరికీ ఫ్యాంటు పూర్తిగా తడిసిపోయింది. చొక్కా కూడా కింద భాగాన తడిసి పోయింది. భుజాన తగిలించుకున్న బ్యాగులకు కూడా నీళ్ళు తాకాయి. నాకు నడుం వరకు తడిస్తే, కొందరికి ఎదవరకు తడిసాయి. బ్యాగులు తడిసి మరింత బరువెక్కాయి. ఈ బరువులను దించుకోవాలనుకుంటున్నాం.
అలాగే సాగుతున్నాం. చీకటి పడుతోంది. ఎక్కడా రాత్రి బసకు పొడి జాగా కనిపించడం లేదు. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ, నీళ్ళలో పడుతూ లేస్తూ పన్నెండు గంటలు నడిచాం. ఈ చీకట్లో, సెల్ ఫోన్ లైట్ల వెలుగులో, పడుతూ లేస్తూ సాగుతున్నాం. రాత్రి ఏడుగంటలకు ‘‘ఇదే వెంగమాంబ గుహ’’ అన్న మాట వినిపించింది. హమ్మయ్యా..అనుకున్నాం. ఒక్క సారిగా ప్రాణం లేచొచ్చింది. యువకులైన తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్ అడ్మిన్ లు మాకంటే ముందుగా వచ్చి టెంట్లు వేస్తున్నారు. వంటలు మొదలు పెట్టారు.

అడివిలో వంటలు చేస్తున్న దృశ్యం

ఎవరు ఏ టెంట్లో పడుకోవాలో కార్తీక్ చెపుతున్నాడు. తిరుమల రెడ్డి, వంట బాధ్యతలను తీసుకున్నాడు. శ్రీహరి, శివారెడ్డి, రవి, ఆర్య, రమేష్ తదితరులు అన్ని పనులు చేస్తున్నారు. పదిరోజులుగా వర్షాల వల్ల నెలంతా చెమ్మగా ఉంది. ఎండిన కట్టెలు ఏరుకు రావడం చాలా కష్టంగా ఉంది. పచ్చని చెట్ల మధ్య, తడిసిన నేల పైన ఒకరొకరు టెంట్లలోకి దూరి విశ్రమిస్తున్నారు. బ్యాగుల్లో ఉన్న బట్టలు, దుప్పట్లు, శాలువాలు కూడా ఒక మేరకు తడిసిపోయాయి. రేపటి కోసమని తెచ్చుకున్న మరొక జత బట్టలు కూడా తడిసిపోయాయి. ఏకధాటిగా పన్నెండు గంటలపాటు నడక వల్ల శరీరం వేడెక్కి చెమటతో తడిసిపోయింది. అదొక ఒక వింత అనుభవం, వింత అనుభూతి.

వెంగమాంబ గుహముందు బస చేసిన ట్రెక్క ర్లు

చుట్టూ దట్టంగా పెరిగిన పచ్చని చెట్లు. రెండు కొండల మధ్య ఎదురుగా రొద చేస్తూ ప్రవహిస్తున్న ఏరు. రాళ్ళ పై నుంచి జారుతూ, దుముకుతూ, వింత వింతగా జలసంగీతాన్ని వినిపిస్తోంది. వర్షం అనుకున్నాం కానీ, చెట్ల పైనుంచి మంచు బింధువులు టపటపా మంటూ బొట్టు బొట్టుగా రాలుతున్నాయి. మర్నాడు ఆదివారం నిండు పున్నమి. ఆకాశంలో చందమామ తొంగి చూస్తున్నాడు. చందమామ వెన్నెలను మరింతగా కురిపిస్తున్నాడు. అందులో శరత్కాలం కదా !

వంటలు పూర్తయ్యాయి. ఒకరొకరు భోజనాలకు ఉపక్రమిస్తున్నారు. వేడి వేడి అన్నం, వేడి వేడి సాంబారు, పెరుగు, అందులో నంచుకోవడానికి ఊరగాయి. ఈ అడవిలో ఇంతకంటే ఏం కావాలి !? ‘నిద్ర సుఖమెరగదు. ఆకలి రుచి ఎరుగదు’ అన్న సామెత కాదు కానీ, భోజనం చాలా రుచికరంగా ఉంది. టెంట్లో దూరి వెచ్చగా పడుకుంటే, అలిసిపోయి కొందరికి గురక వచ్చేస్తోంది. టెంట్ల పైన టపటపా రాలుతున్న మంచుబిందువుల శబ్దాలు, ప్రవహిస్తున్న ఏటి సంగీతం అడవి తల్లి ఒడిలో సేదదీరుతున్న ట్రెక్కర్లకు జోలపాడినట్టుంది.
తెలతెలవారుతోంది. చెట్ల పైనుంచి పక్షులు పలకరిస్తున్నాయి. అడవిలో వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏరు రొద చేస్తూ ప్రవహిస్తోంది. చలికి లేవబుద్ది కావడం లేదు. ‘‘అప్పుడే ఎందుకు తెల్లారాలబ్బా!’’ అనుకుంటుండగానే జీవావసరాలు లేపే శాయి. తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్ అడ్మిన్ లు తెల్లవారు జామునే లేచి, పొయ్యి వెలిగించి టిఫిన్లు, టీలు తయారుచేస్తున్నారు. పక్కన కొండ పై నుంచి సన్నని ధారగా పడుతున్న నీటిని గిన్నెల్లో పట్టుకుని వంటకు వాడుతున్నారు.

ఇదే తంబురు కోన

అంతా లేచేశారు. టెంట్లను సర్దేస్తున్నారు. ఏ టి పక్క నుంచి ఎక్కు తున్నప్పుడు నాకు సాయం గా చేతిని అందివ్వ వచ్చిన మహిళ బూట్లు పోయాయి. ఒట్టి కాళ్ళ తో నడుస్తున్నది. నేను అదనంగా తెచ్చుకున్న తేలి కై న బూట్ల ను ఆమెకు ఇచ్చే సరికి ఎంత సంతోష పడి పోయిందో! నేను ఇవ్వ క పోతే ఒట్టి కాళ్ళ తో నడ వలసి వచ్చేది పాపం. కొందరు తుంబురు కోన ముఖద్వారం వరకు వెళ్ళి వెనుతిరిగి వచ్చేశారు. తుంబురు లోకి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. పై నుంచి ప్రవాహం పెద్ద ఎత్తున వచ్చిపడుతోంది. సమీపంలో ఉన్న కొండ పైనుంచి జలపాతం జాలువారుతోంది. కొందరు ఆ జలపాతం వరకు వెళ్ళి ఆనందించి వచ్చారు. టీలు, టిఫిన్లు పూర్తవుతున్నాయి. మధ్యాహ్నానికి పెరుగన్నం ఎవరి టిఫిన్ బాక్సుల్లో వాళ్ళకు సర్దిచ్చారు.
ఆదివారం ఉదయం పదిన్నరవుతోంది. తిరుగ ప్రయాణమంటే గుండె గుభేల్ మంటోంది. శనివారం దాటిన ఏర్లు గుర్తుకు వస్తున్నాయి. పన్నెండు గంటలు నడిచాం. తిరిగి తిరుపతి చేరే సరికి ఏ అర్ధరాత్రవుతుందో తెలియదు? ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. నడవలేని వాళ్ళను, వయసులో పెద్ద వాళ్ళను తిరుమల పాపనాశనం వైపు నుంచి పంపితే ఎలా ఉంటుంది? అంతా ఒప్పుకునే సరికి ప్రాణం లేచొచ్చింది. కాస్త ఎత్తు కు నడవాలి..అంతే. మధ్యలో ఏర్లు దాటాల్సిన అవసరం ఉండదు. నాలుగు గంటల్లో పాపనాశనం చేరిపోతాం.
పెద్ద వాళ్ళు, నడవ లేని వాళ్ళను నాకు అప్పగించారు. వాళ్ళందరినీ తీసుకున తుంబురు ముందు నుంచి పాపనాశనం వేపు బయలు దేరాం. మా బృందంలో ఇద్దరు డాక్టర్లు, కొందరు మహిళలు, రచయిత్రులు గిరిజ పైడిమర్రి, కాంతి నల్లూరి కూడా ఉన్నారు. పాపనాశనం పైనుంచి వస్తున్న ఏరును ఒకే ఒక్క దగ్గర దాటాల్సి వచ్చింది. అంతే.. దారంతా కాస్త ఏట వాలుగా ఎక్కుడే ఎక్కుడు. దారి పొడవునా మళ్ళీ కబుర్లు. నడుస్తుంటే ఎవ్వరికీ పెద్ద కష్ట మనిపించలేదు. నిన్నటి కష్టంతో పోల్చుకుంటే అసలిది కష్టమే కాదు. చుట్టూ కొండల్ని, పక్కనున్న పాపనాశనం లోయను చూసుకుంటూ సాగుతున్నాం.
ఎక్కడా సెల్ సిగ్నల్స్ లేవు. కొంత దూరం ఎక్కాక పాపనాశనం లోయలో అక్కగార్ల గుండాలకు వెళ్ళే దగ్గర సెల్ సిగ్నల్స్ చాలా తక్కువగా అందాయి. ఇక్కడ నుంచి లోయలోకి దిగి, దాదాపు పది గంటల పాటు నడిస్తే ఏడు తీర్థాలను చూసుకుంటూ, పాపనాశనం పైకి వెళ్ళిపోవచ్చు. అదొక అద్భుతమైన ట్రెక్కింగ్. మరి కాస్త ముందుకు వెళ్ళ గానే చెట్ల కింద కాసేపు ఆగాం. చుట్టూ పచ్చని కొండులు. వాటి మధ్యలో లోతైన లోయ. అప్పటికే మధ్యాహ్నం ఒంటిగంటవుతోంది. సగం దూరం వచ్చేశాం. అక్కడే భోజనాలు పూర్తి చేసుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్నాం.

పాప నాశనం వైపు నడుస్తూ మధ్య లో భోజన విరామంలో సేద తీరుతున్న ట్రెక్క ర్లు

ఎండ పెద్దగా లేదు. ఆకాశం మేఘావృతమైంది. మళ్ళీ మా నడక మొదలవుతోంది. కుడి వైపున కొండ అంచునే సాగుతున్నాం. కొంత దూరం వెళ్ళగానే ఎడమ వైపుకు మలుపు తిరగాలి. కుడి వైపున కొండ ఎక్కితే రామ కృష్ణ తీర్థం వెళ్ళే దారి. ఆ దారిలో కొంత దూరం వెళ్ళి, ఎడమ వైపుకు తిరిగితే తాంత్రిక లోయ, శక్తికటారి తీర్థాలకు వెళ్ళే దారి వస్తుంది. మరి కాస్త దూరం నడవగానే మధ్యాహ్నం రెండుగంటలకు చలువు బండలదగ్గరకు వచ్చేశాం. అది దాటితే సనకసనందన తీర్థం. ఇక్కడ ఎప్పుడూ నీళ్ళుంటాయి. సనక సనందన తీర్థం నుంచి మేం నడిచి వచ్చిన తుంబురు వరకు, రామకృష్ణ తీర్థం, తాంత్రిక లోయ వరకు ఎక్కడా నీటి జాడ ఉండదు.
సనకసనందన తీర్థం నుంచి ఎక్కడా ఎక్కుడు లేదు. అడవిలో దారంతా సాఫీగా ఉంది. రకరకాల చెట్లు. ‘‘అదిగో పాపనాశనం డ్యాం’’ అనగానే ఒక్కసారిగా అందరికీ ప్రాణం లేచొచ్చింది. ఇంటి ముఖం పట్టిన ఎద్దుల్లాగా మా నడక వేగం పెరిగింది. రెండు కొండల నడుమ పాపనాశనం డ్యాం నిండుగా నీటితో తొణికిసలాడుతోంది. మధ్యాహ్నం మూడయ్యింది. బస్సెక్కి తిరుమలకు, అక్కడ మళ్ళీ బస్సు మారి తిరుపతికి తిరిగి వచ్చేసరికి సాయంత్రం అయిదైంది.
శనివారం మేమంతా కలిసి కుక్కల దొడ్డి నుంచి వచ్చిన దారినే తిరిగి వెళ్ళిన వాళ్ళు కూడా కేవలం ఆరుగంటల్లో రోడ్డెక్కారు. శనివారం పన్నెండు గంటలు పట్టిన నడక, మర్నాటికి సగానికి సగం ఎలా తగ్గిపోయింది !? మేం దాటిన ఏర్లలో ప్రవాహాలు బాగా తగ్గాయి. పెద్దగా నడవలేని వాళ్ళు మా బృందంలో కొచ్చేశారు. ఈ రెండు కారణాల వల్ల వాళ్ళు కూడా చీకటి పడక ముందే తిరుపతి చేరేశారు. కుక్కల దొడ్డి దగ్గరకు వచ్చిన వారందరికి ఈ రచయిత రాసిన ‘శేషాచలం కొండల్లో..(తిరుమల ధృశ్యకావ్యం-2) పుస్తకం తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్ కానుకగా ఇచ్చింది.
తిరుపతి నుంచి కుక్కల దొడ్డికి దాదాపు ముప్ఫై కిలోమీటర్లు వాహనాల్లో వెళ్ళినా, అక్కడి నుంచి దాదాపు పదహారు కిలోమీటర్ల నడక. తుంబురు నుంచి పాపనాశనం వరకు అయిదున్నర కిలోమీటర్ల నడక. పాపనాశనం నుంచి తిరుపతికి ఇరవై నాలుగు కిలోమీటర్లు వాహనంలో ప్రయాణం. ఈ సాహస యాత్ర ఒక అనిర్వచనీయమైన ఆనందాన్నే కాదు, కాస్త భయాన్ని కూడా కలిగించింది. రెండు పగళ్ళు, ఒక రాత్రి అడవి తల్లి ఒడిలో గడిపిన అనుభూతి మిగిలింది. భారీ నీటి ప్రవాహం వల్ల తుంబురులోకి వెళ్ళలేకపోయామన్న కాస్త అసంతృప్తిని కూడా మిగిల్చింది


Read More
Next Story