శేషాచలం అడవుల్లో ఒక రాత్రి...
x
వాగేటి కోనలో భూమన్

శేషాచలం అడవుల్లో ఒక రాత్రి...

ఏటెంబడి సాగుతున్నది నడక . అన్ని రాళ్లే , గులకరాళ్లే . ఎక్కడ కానీ మైదానం లేదు . ఏట వాలున్న కొండలు. పచ్చ పట్టుచీర కట్టుకొని సింగారించుకున్నట్టుగా...


-భూమన్

శేషాచలం కొండల్లో వందల తీర్థాలలో మునిగాను, కొండలెక్కి దిగాను, లోయల్లోకి జారాను, సెలయేర్ల దాటాను, గుండాలలో ఈదులాడాను. కొన్నికోనలకు చేరుకోవడం చాలా కష్టం. అదొక సాహసయాత్ర. నాకిష్టమయిన ఒక సాహసయాత్ర వాగేటికోన యాత్ర. అక్కడి చేరుకోవడం ఒక అనుభూతి, చేరకున్నాక కలిగేది మరొక అనుభూతి, ఈ పూట ఆ యాత్ర గురించి చెప్పాలనుకుంటున్నాను.

తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో దట్టమైన శేషాచల అడవిలో అద్భుత జలపాతాల సరసన వాగేటి కోన యాత్ర సాగుతుంది. ఆలోచన ఆరునెలలు నాని నాని ఈ యాత్ర 2023 ఆగస్టులో ఆచరణలోకి వచ్చింది. అక్కడి వెళ్లాలని ఊవ్విళ్లూరుతున్న దాదాపు 90 మందిని జత కూడాము.

ఆ ఎండలకు ఎదురీది రెండు రోజుల ప్రయాణానికి సిద్ధమైనాను నేను మా పిలకాయల్తో కలసి. మాతో అటవీ శాఖ అధికారులు,ఒక ఇస్రో సైంటిస్టు కూడా ఉన్నారు.

మొదట ఆ దారిలో కుక్కల దొడ్డికి దగ్గిరకు ద్విచక్ర వాహనాలలో జీపులలో ,కార్లల్లో దాదాపు 90 మంది పొగైనారు. శెట్టిగుంట దగ్గర నుండి పచ్చటి పరింగాయలు, అరటి తోటల మధ్యన చాలా ఆహ్లాదకరంగా మొదలయింది పయనం. అక్కడి చెరువు బాగా ఎండిపోయింది. అక్కడక్కడ ఎర్రచందనం చెట్లు, కొంగలు,ఆ సూర్యాస్త సమయం ఆహ్లాదకరంగా ఉంది. అందరం ఫోటోలకీ దిగినాక నడక మొదలు పెట్టినాము.

ఏ టెంబడి సాగుతున్నది నడక . అన్ని రాళ్లే , గులకరాళ్లే . ఎక్కడ కానీ మైదానం లేదు . ఏట వాలున్న కొండలు పచ్చ పట్టుచీరలు కట్టుకొని సింగారించుకున్నట్టుగా మహాద్భుతంగా ఉన్నాయి .అదొక కనుల పండుగే. అందరం ఈ వాగేటి కోన పూర్వపరాలు తెలుసుకుంటూ, ప్రకృతిలో భాగమైనందుకు మాకు మేము గర్వపడుతూ, సాగుతున్నాము . ఇంతలో ఒక నీటి మడుగు వచ్చింది. అది తొలిది. దారిపోడుగునా ఇట్లాంటివి 11 ఉంటాయని మా ఫారెస్టు అధికారి మిత్రుడు ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. అన్ని మడుగులల్లో దిగి ఈదుకుంటూ దాటాలి. సరే కానీమ్మనీ ఉత్సాహంగా ముందుకు సాగా. రాత్రి 7 గంటలకు ఒక స్థావరం ఎన్నుకున్నాము .




పక్కనే నీటిమడుగు .నీళ్లు అత్యంత స్వచ్ఛంగా ఉన్నాయి. కొండల అంచున ఆ మడుగు బాగా ఆకర్షణీయంగా ఉంది. ఉన్న ఫలానా కొందరం నీళ్లల్లోకి దూకి బాగా ఈదులాడాం. తర్వాత తెచ్చుకున్న తిండి ఏదో తిని ,ఆకులు అలమలు ఏరుకొచ్చి పడక సిద్ధం చేసుకుని నిద్రకు ఉపక్రమించనాము. నిద్రొస్తే కదా. చుట్టూ కొండలు, పక్కన మడుగు, కీచురాళ్ల శబ్దాలు, మధ్య మధ్యన కణుతుల అరుపులు, ఎలుగుబంట్ల కేకలు. పైన నక్షత్ర కాంతులతో అలరారుతున్న నీలి ఆకాశం. ఎంతటి అదృష్టవంతులం రా మేము అనుకుంటూ అలా కునుకు తీసి కళ్ళు తెరిచి చూస్తే మహాద్భుతం. ఆ చోటున, వర్ణించ వీలు గాని ఆ సౌందర్య రాశుల మధ్యన నన్ను నేను పోగొట్టుకున్నానంటే నమ్మండి.




అందరం గుంజన జలపాతం కింద భాగానికి నడక మొదలు పెట్టినాము. పొద్దుటికి మరో 20 మంది వచ్చి చేరినారు. దాదాపు ఐదు గుండాలు దాటుకుంటూ కాదు, ఈదుకుంటూదాటుతున్నాం. ఈతరాని వారి నడుం దారం కట్టి, ట్యూబుల ద్వారా ఒడ్డుకు చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాము. ఆ కొండలు ,ఆ మలుపులు, ఆ ఎర్రచందనపు అందాలు కట్టి పడేస్తున్నాయి. వాగేటి కోనం దారిలో వచ్చే చివరి గుండం చాలా పెద్ది. శేషాచలం అడవులలో నేను చూసిన అన్ని గుండాల కన్నా పెద్దది. దాదాపు 100మీటర్లు పొడవుంది లోతు 50 మీటర్లకు తక్కువ ఉండదంటున్నారు. అంత దూరం ఈతాడడం కష్టమేమో సార్ అంటే “రాండయ్యా” అని నీళ్లలోకి దూకి జలపాతపు అంచుకు చేరుకున్నాను. అదొక ఒక గొప్ప సాహసం.




నాకు ఈత అలవాటు కావడం వల్ల ఇదేమంత కష్టంగా అనిపించలేదు. కొన్ని పదుల సార్లు గుంజన జలపాతాన్ని పై నుండి చూశాను కానీ కింద నుండి చూడటం ఇదే తొలిసారి. జలపాతం పైభాగం మా కంటికి అందడం లేదు. కొండల మలుపుల మధ్య ఉంది .ఆ పెద్ద జలపాతం కింద ఒక గుండం, దాని కింద ఇంకొకటి, మేము దిగిన ఆ పెద్దగుండం మూడోది. వర్షాకాలం అయితే ఇక్కడి దాకా చేరుకోలేం. జోరున దూకే జలపాతాల మధ్యన మేం నడిచిన దారంతా నీటి మయమే. ఆ స్వచ్చమయిన నీటి గుండాల గుండా దాదాపు అన్ని గుండాలను దాటుకుంటూ, ఆ పైన రాళ్ల కాల్వ ఏటి గుండా నడుచుకుంటూ పోవడం మరుపురాని సాహసం. ఆ గుండంలో తనివి తీరా ఈదులాడి,జలపాతపు నీటి అంచున సయ్యాటలాడుతూ దాదాపు గంటకు పైగా ఉండి వెను తిరిగినాము.




మేం ప్రయణించిన ఆ దారే మైదానంలోకి సాగుతుంది. అదే వాగేటికోనం. దాదాపు రానుపోను దూరం పది కిలోమీటర్లు పైనే. మైదానంలో నైతే అది 22 కిలోమీటర్లు పై మాటే. ఇంత అద్భుతమైన సౌందర్య రాశులను వెదజల్లిన ఆ ప్రకృతి ఒడికి ఒక నమస్కారం పెట్టాను. వాగేటికోనకు గుంజన జలపాతం మైదాన రూపం. అక్కడి నుంచి రావాలనిపించదు. అతికష్టం మీద దాన్ని వదిలి వెనుదిరిగా. అక్కడ మిత్రుడు భాస్కర విశ్వనాథ్ చేతి వంట సిద్ధమయింది. కొండల మధ్య అందమయిన ప్రకృతి మధ్య వేడి వేడి సాంబార్ అన్నం తింటుంటే... అనుభూతి వర్ణణాతీతం.





అందరం భోజనాలు ముగించుకొని కొందరం గ్రూపు ఫోటో దిగి ,మా తో వచ్చిన అటవీ శాఖ అధికారులను, బెంగళూరు నుండి వచ్చిన ISRO సైంటిస్ట్, చంద్రయాన్ ప్రయోగంలో కీలక పాత్రవహించిన హరినాథ్ శర్మ ను ,మా టీం లీడర్ బాచిని, నా అనుంగు శిష్యుడు శీను, మా ఆడివి గైడ్ మణి ని సన్మానించి తిరుగు ప్రయాణమైనాను.

ఈ వాగేటి కోన మా ట్రెక్కింగు లోనే ఒక తలమానికం. ప్రకృతి బాట పట్టిన మమ్మల్ని గొప్పగా ఆదరించిన ఆ జలపాతపు సొగసుల్ని మా గుంజన హోయలును గుండెల్నిండా పదిల పరుచుకుని ఎవరెవరి ఇండ్లకు వాళ్లం చేరినాము.

మా ఈ ప్రకృతి యాత్ర పది మందికి చేరువ కావాలని ,పది మందీ ఆరోగ్యకరంగా మనుగడ సాధించాలనేది మా లక్ష్యం ఆశయం


(భూమన్ ప్రముఖరచయిత, వక్త )

Read More
Next Story