ప్రజాపక్ష శాంతి దూత హరగోపాల్ : వరవరరావు
హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన భవన్ లో శనివారం ఉదయం ప్రొఫెసర్ జీ. హరగోపాల్ 6 పుస్తకాల పై జరిగిన ప్రసంగ పాఠాల సంకలనం ఆవిష్కరణ జరగనుంది.
‘‘నక్సల్ బరీ నుంచి ఇప్పటి దాకా, అంటే రాజ్యం అంతిమ యుద్ధం ప్రకటించి, గత ఎనిమిది నెలలుగా నెత్తురు పారిస్తున్న కగార్ యుద్ధం దాకా పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ప్రజాపక్షాన నిలబడిన శాంతి దూతగా దృఢంగా ఉన్నారు. గుజరాత్ మారణ హోమం(2004) నుంచి 2014లో ఇండియన్ నమూనాగా ఫ్యాసిజం విస్తరించిన ప్రమాదం గురించి అలసట లేకుండా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు.’’ అని ప్రముఖ విప్లవ కవి వరవరరావు అంటారు.
హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞానభవన్ లో శనివారం ఉదయం ఆవిష్కరించనున్న ‘సామాజిక చలనం-ప్రజాస్వామిక ప్రతిస్పందన’ అన్న పుస్తకానికి ఆప్తవాక్యాలు రాస్తూ, సామాజిక చలనంలో క్రియాశీలకంగా ఉంటూ, ఆయా సందర్భాలకు, ఆయా అవసరాలకు స్పందిస్తూ హరగోపాల్ అనేక వ్యాసాలు రాశారని, అవి ఆరు పుస్తకాలుగా వెలువడ్డాయని, వీటి ఆధారంగా ఆయన ఆలోచనలను చర్చకు తేవడం కోసం గత ఏడాది జులై 23న రోజంతా చర్చాగోష్టి జరిగిందని గుర్తు చేశారు.
‘‘1986లో ఆరుగురు ఐఏఎస్ అధికారులను కిడ్నాప్ చేసినప్పడు పీపుల్స్ వార్ (నేటి మావోఇస్టుల)కు, ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం తొలిసారిగా మొదలైంది. ఎమ్మెల్యే బాలరాజును 1993లో కిడ్నాప్ చేసినప్పుడు మొదలైన మధ్యవర్తిత్వంలో కన్నభిరన్ తోపాటు హరగోపాల్ పాల్గొన్నారు. హరగోపాల్ ప్రధాన వ్యాపకం మాట్లాడడం. అసమాతలు, ఆధిపత్యాలు లేని మానవీయ ప్రజాస్వామిక విలువలు వికసించే సమాజ నిర్మాణం కోసం అవసరమైన ఫ్రేమ్ వర్క్ ను విస్తరిస్తూ ఆయన మాట్లాడారు.
వాల్మీకి, కాళోజీ లాగా కదిలిపోయే భావుకుడు మాత్రమే కాదు, ఆయన అధ్యాపకుడు. హరగోపాల్ వచనంలో కవిత్వం ఉంటుంది. అంటే న్యాయం పట్ల ఆర్ద్రత, కష్టజీవికి ఇరువైపులా నిలబడాలనే నిబద్దత ఆయనలో ఉబికి వస్తాయి. పౌరహక్కుల ఉద్యమం, కరువు వ్యతిరేక పోరాటం కృష్ణా జలాల పున: పంపిణీ ఉద్యమం, ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, ఇథనాల్ వ్యతిరేక పోరాటం, ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామిక సంరక్షణ కోసం పోరాటం వరకు ఆయన సాగారు. హరగోపాల్ తొలుత మానవుడు. ఆతరువాతే ఆయనకు పోరాటం’’ అంటారు వరవరరావు.
వేమనలా కనిపిస్తారు : ప్రొఫెసర్ డి.ఎన్
‘‘తెలంగాణా సాధనలో హరగోపాల్ నాకు వేమనలా కనిపిస్తారు.’’ అంటారు ‘హరగోపాల్ రాసిన స్వేచ్ఛారావం’ పుస్తకం గురించిన ప్రొఫెసర్ డి.ఎన్. రాసిన ప్రసంగ పాఠంలో. ‘‘సామాజిక శాస్త్రాలకు ప్రజాప్రయోజనం లేకపోతే అవి సామాజిక శాస్త్రాలు అనిపించుకోవు. సోషల్ సైంటిస్ట్ కు కొన్ని ఎమోషన్స్ అవసరం. అవిలేకుంటే బండలాగుంటాడు. ఒక మనిషిలో పాజిటివ్ క్రియేటివిటి క్వాలిటీస్ ను క్యాప్చర్ చేయడంలో హరగోపాల్ లాగా ఇంకెవరూ కనిపించరు. తెలంగాణా ఉద్యమం ముందుకు పోతుంటే హరగోపాల్ తన ఆలోచనా విధానంలో అది భౌగోళికంగానే కాదు, మానవీయంగా కూడా ఉండాలి అని గుర్తు చేసిన వారు.
మనం ఏ ఆశయం కోసం తెలంగాణా అనుకున్నామో, అవ్వన్నీ అడియాశలయ్యాయనే భయాలు వెంటాడుతున్నాయని హరగోపాల్ అంటారు. ‘స్వేచ్ఛారావం’ రచన మొదటి భాగంలో సౌమ్యంగా ఉన్నా, రెండవ భాగంలో ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ప్రత్యామ్నాయ మానవ సమాజం, ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థను నిర్మించగడంలో కొంతైనా తీసుకు రావాలనేది హరగోపాల్ ఆలోచన’’ అంటారు ప్రొఫెసర్ డి.ఎన్ తన ప్రసంగ పాఠంలో.
సంభాషించడం ఇష్టం : ప్రొఫెసర్ వి.ఎస్. ప్రసాద్
‘‘హరగోపాల్ కు విస్తృతమైన అనుభం ఉంది. ఆ అనుభవం నుంచి నేర్చుకునేటటువంటి విశ్లేషనాత్మక శక్తి ఉంది. ఆయన మానవీయ ప్రజాస్వామిక విలువలు కలిగిన సామాజిక శాస్త్రావేత్త. ఆయనకు మాట్లాడడమంటే ఇష్టం. ఎందుకంటే ఆయనకు ప్రజలతో సంభాషించడం ఇష్టం కనుక’’ అంటారు ప్రొఫెసర్ వి.ఎస్. ప్రసాద్. హరగోపాల్ రాసిన ‘విద్యకోసం మరో పోరాటం’ పుస్తకంపై ఆయన ప్రసంగ పాఠంలో ‘‘ప్రతి విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఏ దృష్టితో పరిశీలిస్తున్నారన్నదనే స్పష్టత అవసరం అనేది హరగోపాల్ గారి దృక్పథం.
క్రిటికల్ అప్రోచ్ అంటే విస్తృత పరిధిలో ఒక విషయాన్ని చూడడం అనేది ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ఇవ్వన్నీ ఆయన అనుభవం నుంచి రాసిన వ్యాసాలు. విద్యకు ఒక విశాలమైన స్వభావం ఉందని, లక్ష్యాలు ఉన్నాయని, అది ఈ ప్రైవేటు విద్యావిధానం ద్వారా సాధించగలమా అన్నది హరగోపాల్ గారు లేవనెత్తారు. విద్యారంగ స్వతంత్ర ప్రతిపత్తి గురించి చర్చించారు. ఒక విద్యార్థికి ఒక విషయం గురించిన భిన్న దృక్పథాలు వివరించడం మా బాధ్యత. ఏది సరైందని అనుకుంటారో దాన్ని అనుసరించండని అంటామని హరగోపాల్ అంటారు.’’ అని పేర్కొన్నారు.
లైంగిక సంబంధాలను సామాజికీకరణ చేయడాన్ని వ్యతిరేకించిన మార్క్స్
‘‘హరగోపాల్ గారు రాసిన ‘స్వేచ్ఛ కోసం’ లోని మొత్తం వ్యాసాలు చదివితే వర్తమాన సమాజం, దాన్ని పరిపాలించే రాజ్యం, రాజ్యేతర సామాజిక వ్యవస్థలు తమ సమస్త చీకటి కోణాలతో కనబడతాయి’’ అంటారు అరణ్య కృష్ణ. ‘‘తెలంగాణా రెండవ దశ ఉద్యమ కాలం నుండి 2018 వరకు జరిగిన సామాజిక పరిణామాల మీద రాసినవి ఇప్పటికీ రిలవెంట్ గా ఉంటాయి. స్వేచ్ఛ అంటే వ్యక్తికి సంబంధించింది. స్వాతంత్ర్యం అంటే సమిష్టికి సంబంధించింది అని హరగోపాల్ అభిప్రాయం.
ఈ పుస్తకంలో సాహిత్యం మీద, ఒక సినిమా సమీక్షతో సహా రాసిన 8 వ్యాసాలు, చలం మీద రాసిన వ్యాసం ఇందులో ఉన్నాయి. చలం పైన చాలా ఆబ్జెక్టివ్ గా రాసిన వ్యాసం. ఎంత కుటుంబ వ్యవస్థ రద్దైనా, లైంగిక సంబంధాలను సామాజికీకరణ చేయడాన్ని మార్క్స్ వ్యతిరేకించాడనే విషయాన్ని, చలం కోరుకున్న స్వేచ్ఛ కూడా విశృంఖల మైనది కాదని, ప్రేమలేని లైంగిక సంబంధాలు పశుప్రాయమైనవని, లైంగిక సంబంధాలు ప్రేమ సంబంధాలుగా మారాలనే చలం భావించాడని హరగోపాల్ అంటారు.
నెహ్రూ మార్క్సి స్టు కాకపోయినా మతతత్వ వాది కాదని, అయితే సెక్యులరిజానికి కావలసిన రాజకీయార్థిక పునాదిని ఏర్పాటు చేయలేకపోయారని హరగోపాల్ అంటారు. ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు. ఏ ప్రజల మధ్యజీవిస్తున్నామన్నది ముఖ్యం. పాలకులు ఆంధ్రప్రాంతం వారైనా, తెలంగాణా ప్రాంతం వారైనా అదే ప్రపంచ బ్యాంకు, అదే ప్రపంచీకరణ, అదే నూతన ఆర్థిక విధానాలకు లోబడి ఉండాల్సింది కదా అన్న సంశయం హరగోపాల్ వ్యక్తం చేశారు.’’ అంటారు ‘స్వేచ్ఛ కోసం’ అరణ్య కృష్ణ ప్రసంగ పాఠంలో.
కాలం గురించి జాగ్రత్త పడేలా చేశారు : ఓల్గా
‘‘హరగోపాల్ గారు కాలాన్ని గురించి నిరాశ పడలేదు. కానీ, మనల్ని విషయంలో జాగ్రత్త పడేటట్టు చేశారు. ఇది నిరాశ పడడం కాదు కానీ, నిరాశ పడకుండా జాగ్రత్త పడడం అని చెపుతారని వివరిస్తారు’’ అని ఓల్గా అంటారు. హరగోపాల్ గారు రాసిన ‘పరిమళించిన మానవత్వం’ పుస్తకం పైన ఓల్గా రాసిన ప్రసంగ పాఠంలో ‘‘ మరిచిపోకుండా గుర్తుంచుకోదగ్గ జీవితాలను ఇందులో అక్షరబద్ధం చేశారు. సమాజ మార్పు కోసం అందరూ ఉన్నత విలువల్ని నమ్మి ఆచరించిన వారే.
సామాజిక సంబంధాలను మానవీకరించాలి. ఇది జరగకుండా ఏ ఉద్యమమూ విజయవంతం కాలేదు అంటారు. హరగోపాల్ గారు కాళోజీ గురించి రాస్తూ, మాన వసమాజానికి లేనిదాని కోసం పోరాడడం తెలుసు కానీ, తన కున్న ప్రివిలేజెస్ ను ఒదులుకోవడం తెలియదు అంటారు. విలువలు సామాజిక సంబంధంలో భాగం కాకపోతే సమాజం రాజకీయంగా నైతికంగా పేదరికంగానే ఉండి పోతుంద’’ అని హరగోపాల్ అన్న మాటలను ఓల్గా గుర్తు చేస్తారు.
ప్రజాఉద్యమాల స్వరం : కాత్యాయని విద్మహే
హరగోపాల్ గురించి ‘‘ప్రజా రాజకీయాల తత్వ వేత్త, ప్రజాఉద్యమాల స్వరం’’ అంటారు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే. హరగోపాల్ రాసిన ‘సందర్భం సవాళ్లు’ అన్న పుస్తకంపైన రాసిన ప్రసంగ పాఠంలో వర్గ వైరుధ్యాల వల్ల నానాటికీ తీవ్రమవుతున్న అసమానతలను రద్దు చేసే దిశగా జరగవలసిన విముక్తి పోరాటాలవైపు ఉంటుంది ఆయన(హరగోపాల్) చూపు. అందుకునే పెట్టుబడిని ప్రతిఘటించి, సామ్రాజ్యవాదాన్ని ధిక్కరించే ఉద్యమాలపట్ల ఆయన చూపు. పుస్తకంలో కీలక అంశం గుర్తించి పాఠకులకు మార్గనిర్దేశనం చేయగల సమర్థులు. ఒక వర్గాన్ని సమీకరించే క్రమంలో మరో వర్గం జారిపోవడం,ఒక వర్గం బలంగా మార్పును కోరుకుంటే, పాలక వర్గాలు దానికి వ్యతిరేకంగా మరొక వర్గాన్ని నిలబెట్టు కోవడం మొదలైన వైరుధ్యాల నేపథ్యంలో సామాజిక సమస్యలను, సవాళ్లు విశ్లేషించాలి అంటారు. అసమానతల్లోని అస్తిత్వాలను, అస్తిత్వాలలోని అసమానతలను చర్చించాలంటారాయన.
మోడీ ప్రధాని అయితే కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయవచ్చని 2014లో హరగోపాల్ ‘కశ్మీర్ నిషిద్ధ రాత్రి’ పుస్తకానికి ముందుమాట రాస్తూ చెప్పారు. ఏదైతే హరగోపాల్ రాశారో 2019 ఆగస్టు 5న అదే జరిగింది. హరగోపాల్ హక్కుల ఉద్యమంలో పనిచేయడమే కాదు,ఒక విద్యావేత్తగా తనకు లభించిన అవకాశాల నుండి మానవ హక్కల చరిత్రను, తత్వాన్ని ప్రత్యేక బోధనాంశంగా రూపొందిచగలిగారు’’ అని వివరిస్తారు.
ప్రత్యామ్నాయం హరగాపోలే చూపాలి : కె.ఆర్.మూర్తి
‘‘పెట్టుబడి దారీ విధానానికి మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఎంత దుర్మార్గమో వివరిస్తున్నాం. కానీ వాటికి ప్రత్యామ్నాయ ఆచరణ ఏమిటో చూపలేకపోతున్నాం. ఆ పని హరగోపాల్ గారే యాలి’’ అని సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్ర మూర్తి అంటారు. ‘మార్కెట్ లేకుండా సంపద సృష్టించడం ఎలా అని చర్చించాలి’ అన్న హరగోపాల్ రాసిన పుసక్తంపై కె.రామచంద్ర మూర్తి చేసిన ప్రసంగ పాఠంలో ముఖ్యమైన కొన్ని మాటలు ఇలా.‘‘ప్రపంచంలో జరిగే విషయాల మీద స్పందించడం, స్పందిస్తూ దానికి ఒక దృక్కోణాన్ని చూపడం ! మానవత్వం ఎలా ఉండాలి? మానవీయ లక్షణాలు ఎలా ఉండాలి? ఈ రాజ్యాంగం ఏమిటి? రాజ్యాంగం ఎట్లా పుట్టింది వన్నీ దాంట్లో ఉంటాయి. ఈ పుస్తకం చదివితే మనకు మొత్తం రాజకీయ శాస్త్రం చదివిన అనుభవం వస్తుంది. ఎంతో పరి జ్ఞానం కలుగుతుంది.’’
అరమరికలు లేని వాతావరణం : పాణి
‘‘హరగోపాల్ గారి ప్రసంగాలు ఎక్కువగా అనుభవం నుంచి ఉంటాయి. పరిణామాలు చెప్పడానికి మనుషుల మధ్య సంబంధాలను ప్రవర్తనలను అనుభవాలను ఎత్తి చూపి వివరిస్తుంటారు’’ అంటారు విరసం నాయకుడు పాణి. హరగోపాల్ రాసిన ‘మార్పుల కోసం’ పుస్తకంపై పాణి తన ప్రసంగ పాఠంలో ‘‘మేధోరంగంలో తనతో ఎవరైనా ఏ విషయంపైనైనా మాట్లాడడానికి అరలు లేని, తలుపులు లేని, అరమరికలు లేని ఒకవాతావరణాన్ని తన చుట్టూ హరగోపాల్ ఏర్పాటు చేసుకున్నారు’’ అంటారు.
‘‘వ్యక్తి భావాలు వ్యక్తి గతం కావు. అవి సామాజిక భావాలు. సమాజంలో చలనం లేకుండా వ్యక్తిలోచలనం సాధ్యం కాదు. సమాజానికి వ్యక్తికి మధ్య నిరంతరంగా జరుగుతున్న సంభాషణ గాని, లేదా ఘర్షణ వల్ల గానీ మార్పుసాధ్యం.’’ అంటారు తన ఆరు పుస్తకాలపైన చేసిన ప్రసంగాలకు స్పందిస్తూ హరగోపాల్.