Kondapalli Fort|అబ్బుర పరిచే కొండపల్లి కోటలో ఒక రోజు
x

Kondapalli Fort|అబ్బుర పరిచే కొండపల్లి కోటలో ఒక రోజు

తూర్పు కనుమల్లో శత్రుదుర్భేద్యమైన కొండ మీద ఉందీ కొండపల్లి కోట.


కొండపల్లి బొమ్మల గురించి తెలుసు కానీ, ఈ కోట గురించి ఇంతవరకు తెలియకపోవటం చిత్రమే. విజయవాడకు కొన్ని పదుల సార్లు వచ్చి వున్నా ఎన్నడు దీని గురించి అనుకోలేదు. విస్మరణ మన జీవితాల్లో భాగం కదా! కొండవీడు గురించి బాగా తెలిసినట్టుగా ఈ కొండపల్లి ఖిల్లా గురించి ప్రచారము తక్కువే.

కొండపల్లి కోట స్థానికంగా కొండపల్లి కిల్లాగా ప్రసిద్ధి. మా డ్రైవర్ పుణ్యమాని కోటను చూసే భాగ్యం కలిగింది. విజయవాడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఇబ్రహీంపట్నం గుండా, ఊదా చెరువు మీదుగా ఘాట్ గుండా పోవాలి. తూర్పు కనుమల్లో శత్రుదుర్భేద్యమైన కొండ మీద ఉంది కోట.

మామూలుగ ఇట్టా తిరగటానికి ఎంత కష్టమైనా నాతో పాటు నా భార్య ప్రొఫెసర్ కుసుమకుమారి రావటము నా బలము .ఈ మధ్యన మరీ ఇబ్బందికరమైన కొండలు ఎక్కటమూ ,దిగటానికి అభ్యంతరము చెబుతున్నదికాని చదరపు దూరాలకు ఉత్సాహంగా వస్తున్నది .ఈ ఖిల్లా ను తిరిగి కొన్ని చారిత్రక వివరాలుకూడా చెప్పింది .ఆమె పరిశోధన Loan Words From Persian to Telugu గనుక చాల సంగతులుకూడా తెలుస్తున్నాయి .జింజి కోట కు పోయినప్పుడు మరిన్ని వివరాలు చెబుతా .

కోటలో ప్రొఫెసర్ కుసుమకుమారితో భూమన్

ఏ మాత్రం ఆలనాపాలనా లేదు. ప్రభుత్వాలు టూరిజం గురించి ఊదరగొట్టడమే కానీ ఆచరణలో అంతా హుళక్కే. కోటకు చేరి చేరగానే గబ్బు. పరమాకాంపు వాసన. ఆ కోనేరంతా పాచి పట్టి, చెత్త కుప్పగా ఉంది. మ్యూజియంలోకి అడుగుపెట్టగానే ఆశ్చర్యపోయాను. గొప్ప చరిత్ర కలిగిన కోటగా అర్థమైంది.

క్రీ.శ. 10 వ్ శతాబ్దానికి చెందిన కోటగా తెలుస్తున్నది. ఆ కాలంలో చాళుక్యుల ప్రధాన కార్యాలయంగానూ, సైనిక స్థావరంగాను ఉండేది. తర్వాత రెడ్డి రాజుల కాలంలో బలోపేతమైంది.

గజపతి రాజుల తర్వాత నిజాం నవాబులు, తూర్పు ఇండియా అధీనంలో వున్నా అత్యంత ప్రాశస్త్యమయినది ఈ కోట. ఈ కొండ మీదనే మరెక్కడా దొరకని పొనుకు కర్ర ఉండేది. ఈ కర్రనే కొండపల్లి బొమ్మల తయారీకి ఉపయోగపడేది.

కోట చాలా అందంగా ఉండేదని తెలుస్తున్నది. మ్యూజియం వెనుక భాగానికి చేరుకోగానే అంచెలంచెలుగా పోతూనే ఉన్నది. చాలా విశాలమయిన కోట మూడు ద్వారాలు గా ఉంది. ప్రధాన ద్వారం దర్గా దర్వాజ. తర్వాత గోల్కొండ ద్వారం.

కోటాలో కింది, మీది మిద్దెలున్నట్టుగా తెలుస్తున్నది. పై భాగం ఎక్కడా లేదు. పూర్తిగా నాశనమైంది. కోట మధ్యలో లోతయిన రిజర్వాయరు కూడా ఉంది. ప్రతి అంగుళం చరిత్రకారులు విప్పి చెప్పవలసిందే.

కోటలో భూమన్, ప్రొఫెసర్ కుసుకుమారి దంపతులు

ఎంతో విలువైన చారిత్రక పుటలు కలిగినదీ ఖిల్లా. చివరన జైలు కూడా ఉంది. ఇంత అద్భుతమయిన కోట అక్కడక్కడా నాటి కళాత్మకమైన గోడల సొగసులతో అలరారుతున్నది.

కొండ కింద ఊదా మన్ను రాబట్టుకోడానికి జరుగుతున్న పనుల్లో ఒక్క శాతం కూడా ఈ కోట బాగు కోసం చేయకపోవటమే బాధ. ఆ ఊదా మట్టిరేకుల తయారికీ, సిమెంటు కల్తీకి ఉపయోగపడి పది కోట్లు గర్విస్తున్నది కదా!

ఇప్పటికయినా ప్రభుత్వాలు పూనుకుని ఈ పురాచారిత్రిక సంపదను పరిరక్షించి నలుగురికీ చేరువలో ఉంచితే గొప్ప ఆదాయవనరుగా మిగిలి, చారిత్రక స్పృహను రగిలించినట్టుగా ఉంది. ఐ కోట దర్శనంతో అస్సలు కోటల చరిత్రపైనే చాలా మక్కువ కలగక మానదు.

Read More
Next Story