
ఆ త్యాగధనుల రక్తమే 8 గంటల పని
చికాగో వస్తే లెఫ్టిస్టు ఆలోచనాపరులైతే Hay Market, రైటిస్టులయితే స్వామి వివేకానంద ఉపన్యాసం చేసిన చోటు చూడ్డానికి ఇష్టపడతారు
అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన 'మే' డే (May Day) మూలకారకమయిన జ్ఞాపకాలను చూసే అవకాశం ఇప్పటికి దక్కింది.చికాగో వస్తున్నామని అంటూనే నా ఆత్మీయ మిత్రుడు జయదీప్ మెట్టుపల్లి మొదట అనింది Hay Market Martyrs Monument చూడాలని. ఎవరైనా మన వాళ్ళు వస్తే వాళ్ళు Leftists ఆలోచనాపరులైతే Hay Market, Rightists అయితే వివేకానంద ఉపన్యాసం చేసిన చోటు చూపిస్తామని చెబితే భలే వాడివేనయ్యానని మొదట మనం Hay Market వీరుల స్మారక స్తూపం చూడాలని చెప్పినాను.
1970 లలో మా కుట్ర కేసు వకీలు బాలకృష్ణారెడ్డి గారి కుమారులు ప్రకాష్, జయదేవ్ లు గత ఇరవై ఏళ్లుగా చికాగోలో సాహితీ మిత్రుల పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రకాష్ ‘స్టేజి పెళ్ళి’కి నేనే అధ్యక్షత వహించింది. జయదేవ్ విద్యార్ధి దశ నుండి నాకు బాగా కావాల్సినవాడు. పైగా నా ఆత్మీయ మిత్రుడు ఎంవిఆర్ బావమరిది.లోతుగా సాహిత్యం చదువుకున్నవాడు. సాహితీపరులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నవాడు. నలుగురం కలిసి మొదట Hay Market అమరవీరుల స్తూపం,విగ్రహం చూడ్డానికి బయలుదేరినాము.
ఇల్లినాయి లోని చికాగో నగరంలో మే 4 ,1886 లో Hay Market స్క్వేర్ లో కార్మిక ప్రదర్శనలో ఒక బాంబు పేలింది. 8 గంటల పని దినాల కోసం అత్యంత శాంతియుతంగా జరుగుతున్న ప్రదర్శనలో ఈ బాంబు ఘటన పెద్ద కలకలం చరిత్ర సృష్టించింది. అంతకుమునుపటి రోజున మే 3 న Mc Cormick Harvesting Machine Company దగ్గర కార్మికుల ప్రదర్శనలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు కార్మికులు చనిపోయినారు. అందుకు ప్రతిగా మే 4 న Hay Market లో పెద్ద ప్రదర్శన,సభ. ఈ సభలో బాంబు పేలింది. ఎవరు వేసినారో ఇంతవరకు తేల్లేదు. నలుగురు సామాన్యులు,ఏడుగురు పోలీసులు చనిపోయినారు. లెక్కలేనంతమంది గాయపడినారు.
8 మంది మీద కేసు నమోదైంది. ‘చికాగో 8’అంటారు. ఈ ఎనిమిది మందిలో అక్కడ ఉన్నది ఇద్దరే.ఏడుగురికి ఉరి,ఒకరికి 15 ఏళ్ళు జీవిత ఖైదు తీర్పు చెప్పినారు. ఇల్లినాయి గవర్నరు ఇద్దరికి జీవిత ఖైదుగా మార్చినాడు. ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు జైల్లో. మిగిలిన నలుగురిని నవంబరు 11,1887 న ఉరి తీసినారు.
August spies
Adolph fischer
George engel
louis lingg
అనే నలుగురి వీరుల పేర్లు ఆ స్తూపంపై చెక్కబడి ఉన్నాయి.
స్మారకం వెనకాతల ఇల్లినాయి గవర్నరు వీరు నిందితులు కాదన్న ప్లేటు చెక్కబడి ఉంది.
ఆ స్మారకం చుట్టూ తిరుగుతున్నప్పుడు కళ్ళు చెమర్చకుండా ఉండవు. ప్రపంచంలో వీరి త్యాగం వల్లనే కదా కార్మిక వర్గంతో పాటు అన్ని వర్గాలు 8 గంటలు పని దినాలను అనుభవిస్తున్నది. ప్రపంచంలో ఇంతటి ఫలితం ఇదొక్కటేనేమో. ఇంతకుమునుపు వల్లంపాటి వెంకట సుబ్బయ్య,కేతు విశ్వనాథరెడ్డి గార్లను ఇక్కడికి పిలుచుకొచ్చి చూపిస్తే దాదాపు కన్నీళ్ళు పెట్టుకున్నారని జయదేవ్ చెబితే,సహజమే కదా అనిపించింది.
అక్కడనుండి Hay Market స్మారకం చూద్దామని బయలుదేరినాము. జయదేవ్ ,ప్రకాష్ లకు ఈ ప్రదేశాలు కొట్టిన పిండి కనుక సులభంగా రాగలిగినాము. ఒక వాగన్ ను స్టేజిగా చేసుకుని మే4,1886 లో సభనుద్దేశించి మాట్లాడిన వారి జ్ఞాపకార్థం చేసిన ఈ స్మారకం అద్భుతంగా ఒక ఫుట్ పాత్ మీద ఉంది. అప్పట్లో ఇదంతా పారిశ్రామిక వాడ కదా.మేమంతా 1970 లలో మాట్లాడిన సందర్భాలు గుర్తుకొచ్చినాయి.
ఆ వీరుల ఫలితమే 8 గంటల పనిదినం. 1891 నుండి ప్రపంచ కార్మిక వర్గం ఒక ఉత్సవంలా జరుపుకునే మే డే.