
నాటి ‘చందమామ’ బొమ్మలను గుర్తు చేసే ఒదిశా ఉదయగిరి గుహలు
ఉదయగిరి కొండల్లో 18 గుహలు ఉన్నాయి. ఇందులో వేల యేళ్ల నాటి ఈ రెండు గదుల ప్రత్యేకత కచ్చితoగా చూడ తగినది
ఒదిశా, భువనేశ్వర్ సమీపాన ఉన్న రాజు రాణి టెంపుల్స్ నుండి స్టేట్ మ్యూజియంకి వెళ్ళాం. హెమీస్ పవన్ కుమార్, మ్యూజియం అని చెప్పి పూల తోటలోకి తీసుకొచ్చాడు ఏమిటి అనుకున్నాను. 15ఎకరాల విస్తీర్ణంలో కనుచూపుమేరా అందమైన, సినిమా సెట్టింగ్ లాంటి పూలతోట. ఆకులు కనిపించని పూల తోట. ఆర్చిలు ఆర్చిలుగా అల్లించి ఉంది. రంగు రంగుల పూలు.రకరకాల పూలు.ఆర్టిఫిషియలా అనిపించి ముట్టుకుని చూసాం.కాదు నిజం పూలే.ఆ తోటoతా రాకుమారిలా విహరించాలనిపించింది. కరువు తీరా ఫోటోలు దిగాం. మ్యూజియం చూడటానికి టైం చాలదని పరుగులు పెట్టాం.
మ్యూజియం ప్రవేశములోనే చందమామ పుస్తకంలోని పట్టు వదలని విక్రమార్కుడు చెట్టెక్కి శవాన్ని భుజం మీద వేసుకుని వెళుతున్న కంప్యూటర్ ఫోటో. 40 ఏళ్ళ నాటి చందమామలోని అందమైన బొమ్మలన్ని కళ్లముందు తిరిగి ముఖాలన్ని నవ్వుల పువ్వులు పూసాయి. చందమామ కథలోని ఫోటోకి ఈ ఫోటోకి కొంచెం కూడా తేడా లేదనిపించింది. అక్కడున్న స్విచ్ లను నొక్కితే ఆ మ్యూజియం గురించిన వివరాలు వస్తున్నాయి ఒరియా భాషలో. ఒరియ అర్థం కాలేదు కానీ ఆనందించాం.
ఒడిశా రాష్ట్రంలోనే ఇది అత్యంత పెద్ద మ్యూజియం ఆట.1930లో చరిత్రకారులు ప్రొఫెసర్ ఎస్పీ బెనర్జీ, ప్రొఫెసర్ ఘనశ్యామ్ దాస్ లచే కటక్ లో స్థాపించబడి 1960లో ఇక్కడకు మార్చబడినదట. మొత్తం మూడు గ్యాలరీలలో 11 విభాగాలుగా నిర్వహించబడుతుంది. పురావస్తు విభాగం చాలా ముఖ్యమైనది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి జైన,బౌద్ధ మరియు హిందూమత అతి ముఖ్యమైన శిల్పాలను సేకరించి ఒక క్రమ పద్ధతిలో అమర్చారు. ఒకొక్కశిల్పం నుండి కదల బుద్ది కాదు.మూడో శతాబ్దం నుండి మద్యయుగ కాలం చివరి వరకుదొరికిన, శిల్పాల గొప్ప సేకరణ ఇక్కడ ఉంది. ఇవన్నీ తెలియజేస్తూ ఇంగ్లీష్ బోర్డు ఉంది.ఒరిస్సా స్టేట్ మ్యూజియం ఒక బహుళార్థ సాధక సంస్థ. ఆర్కియాలజీ గ్యాలరీలో వైవిధ్య భరితమైన,ఎక్కడా చూడని,సాంస్కృతిక,మత విషయాలను తెలిపే శిల్పాలున్నాయి.
జైన,బౌద్ధ,విరిగిన అశోక స్తంభo మరియు సింహ చిహ్నం,భారీ బుద్ధిని శిల్పం,అమోఘసిద్ధి, ఆకర్షణీయమైన అవాలోకితేశ్వర, వివిధముద్రలలో జైన తీర్థంకరులు,సప్త మాత్రికలు,కృష్ణ విష్ణువులను వర్ణించే మిశ్రమ శిల్పం.ఏనుగులను పడవలో రవాణా చేయటం, ఆరు తలల కార్తికేయ శిల్పాలు,ఓడిస్సీ
నృత్యకారుణిల జీవిత శిల్పాలు మొ. అద్భుతంగా ఉన్నాయి.40,000తాళపత్ర గ్రంధాలున్నాయట.నాణ్యాలు,పాత పట చిత్రాలు,ఆనాటి ఆభరణాలు,కత్తులు,కవచాలు ఆయుధాలు మొదలైనవన్ని చూడ చక్కగా ఉన్నాయి.
మ్యూజియంలో రచయిత్రి కాంతి నల్లూరి
భువనేశ్వర్ లో జూలాజికల్ పార్కు చూడాల్సి ఉంది. కాని భువనేశ్వర్ లో ఏదో రాజకీయ అలజడి జరుగుతుoది.దానితో మా టూర్ లో లేని ఉదయగిరి ఖండగిరి (ట్విన్స్ కొండలు) గుహలు చూద్దామని టూర్ మేనేజర్లు,మా శౌరిమేడం ప్లాన్ చేశారు. ఉదయగిరి అంటే సూర్యుని కొండ, ఖండగిరి అంటే విరిగిన కొండ అని అర్థo.ఈ కొండలు భువనేశ్వర్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
ఉదయగిరి గుహలు.
ఉదయగిరి కొండల్లో 18 గుహలు ఉన్నాయి. వీటిలో రాణి గుంఫా అతి పెద్ద, అత్యంత ప్రసిద్ధ గుహ.ఈ గుహ రెండు అంతస్తులు కలిగి ఉంది.కింది అంతస్తుకు మూడు రెక్కలు(మనం మూడు వసారాలు అనాలి)ఉన్నాయి. దిగువ అంతస్తులో మధ్య వసారాకు ఏడు ప్రవేశద్వారాలు,ఆ ద్వారాలకు ముందు వసారా, దాని వెనక చిన్న చిన్న గదులు ఉన్నాయి.ఇవన్ని జైనుల విశ్రాంతి గుహలట. పక్క పక్క రెండు గదులలో ఒక్కొక్కరం నిలబడితే సగభాగాలకు పైగా కనిపిస్తున్నాం. మాట్లాడుకున్నాం. వేల యేళ్ల నాటి ఈ రెండు గదుల ప్రత్యేకత ఖచ్చితoగా చూడ తగినది. ఉదయగిరి గుహల ప్రవేశ మార్గం దగ్గరే మేము మాట్లాడుకున్న గైడు ఇవన్నీ చూపిస్తూ వివరించాడు. గైడు ఇంకా చాలా చెప్పాడు. అవన్నీ రాయటం సాధ్యం కాదు. పైనుండి కిందకు డ్రైనేజీ సిస్టం ఉండడం,వర్షపు నీరు పోవడానికి కాలువ ఉండడం రెండో శతాబ్దం నాటి శాస్త్ర సాంకేతిక, కొండనుతొలిసిన శ్రమ ఆశ్చర్యంగా అనిపించింది.
రాణి గుహలో ఏడు గదుల వసారా
ఉదయగిరి గుహలలో గణేష గుహ ఒకటి. లోపలున్న గణేశుని విగ్రహం పేరుతో ఉంది.ఈగుహ ప్రవేశద్వారం వద్ద దండలు మోస్తున్న రెండు పెద్ద ఏనుగుల విగ్రహాలు స్వాగతం పలుకుతున్నట్లు,పువ్వులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.కాపలాకాస్తున్న సైనికుల బొమ్మలు,ద్వారoపై ఏనుగుల, జంతువుల, సైనికుల బొమ్మలు కనిపిస్తాయి.
గుహ లోపల
గణేష లాగానే వ్యాఘ్ర గుంఫా,పులి నోటిలా చెక్కబడిన ప్రవేశ ద్వారం ఉంటుంది. హతిగుంఫా ఒక పెద్ద సహజ గుహ. ఈ గుహలో ఖారవేలుని (క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటి) శాసనము. ఓహో! చరిత్ర నిండా నేను చదువుకున్న హతిగుంఫా శాసనం,మా హిస్టరీ సార్ సాంబశివరావుగారు మైమరచి చెప్పిన శాసనం ఇదా!నాకు తెలియకుండా,అనుకోకుండా చూడటం.ఓ! మైమరచిపోయాను.నా ఆనందం వర్ణనాతీతం. 17వరసలలో (లైన్లలో) బ్రాహ్మి లిపిలో, వేలాడుతున్నట్లున్న గుహ లోపలి పైభాగాన చెక్కి ఉంది.అద్భుతంగా చెక్కిన ఏనుగుల వలన 'హతిగుంఫా' గా పిలవబడుతుంది.
హతి గుంఫా లో ఖారవేలుని శాసనం
రాణిగుహ పై అంతస్తులో తొమ్మిది స్తంభాలు ఉన్నాయి. జయ విజయ గుహలో భారీ చెవి కమ్ములు,పట్టీలు,అందంగా అలంకరించబడిన జుట్టున్న స్త్రీ శిల్పం భలే ఉంది ఓ భుజంపై చిలుక వాలి ఉంటుంది.ఏనుగుల స్తంభాలు,యుద్ధం,వేట దృశ్యాలు,యోధుల శిల్పాలు స్పష్టంగా చెక్కబడి ఉన్నవి. ఈ ఉదయగిరి ఖండగిరి గుహలను చూడటానికి ఒక రోజంతా పడుతుంది. మాకు సమయం లేనందున ఖండగిరి గుహలు చూడలేకపోయాం. కొండపైన జైన దేవాలయం ఉందట.కానీ అక్కడ కూడా జైన తీర్థంకుల,పార్స్యనాధుల శిల్పాలు చెక్కిన గుహలు ఉన్నాయని తెలిసింది.
ఎదో పండుగ, తిరుణాల జరుగుతుంది. వెళ్లేటప్పుడు దార్లకు ఇరుపక్కలా కిక్కిరిసి ఉన్న దుకాణాలను జనాలను దాటుకుంటూ వెళ్ళాం.గేటు ప్రవేశం దగ్గర ఓ అఘోరి, నాలుగడుగులు వేయగానే గుహల గురించి తెలిపే ఓ పెద్ద బోర్డు.తిరిగి వస్తూ,మావాళ్ళు షాపింగులో ఉంటె,దారంతా ఒక్కదాన్నే వస్తు పరిశీలిలిస్తే మన కోటప్పకొండ తిరుణాల్లా ఉన్నది.అదే, బట్టలు,బొమ్మలు, తినుబండారాలు, గాజులు పూసలు,విగ్రహాలు, బెల్టులు అమ్మే చిన్న చిన్న వ్యాపారులు.ఎగబడి కొంటున్న పేద జనం.దేశ మoతట పేదరికం.బ్రతుకు తేరువు కోసం కష్ట పడుతున్న పేద జనం.వారి శ్రమను దోసుకుంటున్న పెట్టుబడిదారులు.పేద ప్రజల సంక్షేమం పటించుకొని పాలకవర్గాలు.
నా గుండెను మెలితిప్పిన, ఉదయగిరి గేటు ఎడమవైపు, మన గ్రామాల్లో,పాఠశాలలకు వచ్చి ప్రదర్శించే రెండు వైపుల x ఆకారపు రెండు బొంగులకు 6,7అడు గుల ఎత్తున కట్టిన తాడుపై నడుస్తున్న ఓ పదేళ్ల పిల్ల.ఆ పిల్ల చేతిలో బ్యాలెన్సగా పట్టుకున్న ఓ బొంగు.ఆ పసిబిడ్ద నాకు హేమమాలిని లా అనిపించింది. మైకులో పాట.పడదు,పడుతుందన్న ధైర్య అధైర్యాలతో తిరుగుతున్న తల్లి.తాడుకు కొద్ది దూరంలో తలపై టోపికి కట్టిన చిన్న రాయి లాంటిది గిరాగిరా తిపుతున్న ఆ పిల్ల కన్నా చిన్న పిల్లోడు.నా స్కూల్ లో,చిన్న పిల్లను పెద్ద గడకర్ర పై ఎక్కించి,ఆ కర్రను గొంతుపై బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు దించు అని నేను,పిల్లలు అరుస్తున్న అరుపులకు పరిగెత్తు కొచ్చిన పక్క ఫ్యాక్టరీ వాచ్ మెన్ అరుపులు అన్ని కళ్ళముందు గిరాగిరా తీరిగేయి.(ఈ వృత్తివాళ్ళు ఆడపిల్లలు పుట్టాలని ప్రార్ధిస్తారట)ఎక్కడ చూసిన ఏముంది? పేదరికం. బ్రతుకు తెరువు కోసం ప్రాణాలను పణంగా పెట్టె పసిపిల్లల,మహిళల కన్నీటి శ్రమలే అనిపించి దుఃఖం గా ముందుకు కదిలేను.
(శతకోషియా, నందన్ పార్క్ గురించి త్వరలో... )

