లక్ష్మణ రేఖలెందుకు, దాటేయండి అంటున్న మహె జబీన్
x

లక్ష్మణ రేఖలెందుకు, దాటేయండి అంటున్న మహె జబీన్

'ఆకారాలు కాలం' గిరిజ పైడిమర్రి పరామర్శ


పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని గొప్ప కవయిత్రి మహె జబీన్. 1997లో మొదటిసారి ప్రచురించిన ఆమె కవితాసంకలనం ఆకురాలు కాలం. అన్వీక్షికి పబ్లిషర్స్ మళ్లీ 2024లో ప్రచురించారు. 1991 నుంచి 1997 వరకు వివిధ పత్రికలలో ఆమె రాసిన 26 కవితలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ప్రముఖ కవి కె. శివారెడ్డి గారు రాసిన ముందుమాట, చేరాతల్లో చేకూరి రామారావుగారు రాసిన " ఈ దశాబ్దపు మరో వాగ్దానం జబీన్ " అనే వ్యాసం ఈ పుస్తకానికి తలమానికం.

" గంగి గోవు పాలు గరిటడైనను చాలు " అన్న చందాన రాసింది తక్కువే అయినా చిక్కగా తెలుగు సాహిత్య చరిత్రలో తన పేరును శాశ్వతంగా లిఖించుకుంది. స్త్రీ దృక్పథం నుంచి, విప్లవ కోణం నుంచి, సామాజిక రుగ్మతల గురించి రాసిన కవితలు ప్రధానంగా ఇందులో ఉన్నాయి. అయితే దృక్పథం ఏదైనా అందులో పాఠకులకు విశ్వ మానవ ప్రేమ కనిపిస్తుంది. విప్లవ కవిత్వాన్ని కూడా ప్రేమ మయం చేయడం జబీన్ ప్రత్యేకత. ఆమె కవిత్వంలోని ఆర్ద్రత పాఠకులను కట్టి పడేస్తుంది. అందులోనూ ఆమె కవితా పదబంధాలు చాలా నూతనంగా ఉంటాయి.

చీకటితోనే పని పిల్ల పనికి బయలుదేరుతుంది అని చెప్పడానికి "చంద్ర పరిష్వంగం " అనే పదబంధం ప్రయోగించడం లాంటి వాటిని ఎన్నింటినో చెప్పుకోవచ్చు. పని పిల్ల గురించి చెప్పే సందర్భంలో కూడా ఇలాంటి రొమాంటిక్ పదబంధాలను ప్రయోగించడం జబీన్ కవిత్వం లోని ప్రత్యేకత. పని పిల్లను చూస్తుంటే మా అమ్మ హఠాత్తుగా చిన్నదైనట్టు అనిపిస్తుంది అంటూ అమ్మతో పోల్చడం జబీన్ లోని మానవీయతకు నిదర్శనం. అలాగే స్ట్రీట్ చిల్డ్రన్ కవితలో వాళ్ళను చూస్తుంటే " పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తుకు వస్తారు " అంటుంది. సహజత్వం పేరిట వాళ్ళను కించ పరచకుండా ఉన్నతీకరించడం జబీన్ కవిత్వంలోనే కనిపిస్తుంది. అందుకే ఈ కవిత పదోతరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో చోటు దక్కించుకుంది. దీనికి ఒక నేపథ్యం ఉన్నది. పాఠ్యపుస్తక రచనా నేపథ్యంలో కవయిత్రుల కవిత ఏదైనా అందులో ఉండాలనే సూచన వచ్చింది. తర్జన భర్జనల తర్వాత జబీన్ కవిత్వం లోనుంచి తీసుకోవాలనే నిర్ణయం బరిగింది. అక్కడ కూడా పని పిల్ల , స్ట్రీట్ చిల్డ్రన్ కవితలలో ఏదీ అయితే బాగుంటుంది? అనే చర్చ జరిగింది. పనిపిల్ల కవిత కేవలం ఒక జండర్ ను మాత్రమే సూచిస్తుంది కాబట్టి 'స్ట్రీట్ చిల్డ్రన్ 'కవిత పాఠ్యపుస్తకంలో చేరింది.

మహె జబీన్

మహె జబీన్

అలా 1998 నుంచి 2014 వరకు నేను కూడా పదోతరగతి విద్యార్థులకు ఆ పాఠాన్ని బోధించాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా తొలి యవ్వనారంభ దశలో అలాంటి పాఠాన్ని విద్యార్థులు నేర్చుకోవడం వలన ఒక సామాజిక సమస్యను, ఆ సమస్య వెనక ఉన్న తాత్వికతను అర్థం చేసుకోవడానికి అవకాశం ఆ ఈడు పిల్లలకు దక్కింది. అంతే కాదు, తమ భవిష్యత్తును నిర్మించుకోవడం పట్ల ఒక స్పష్టత వాళ్ళకు వచ్చిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. దాదాపు 16 సంవత్సరాలు ఆ పాఠాన్ని బోధించిన అనుభవం నాకుంది. ఆ పాఠ్యబోధన సమయంలో తరగతి గదిలో జరిగిన చర్చ నా మనో ఫలకంమీద ఇంకా తాజాగా ఉన్నది. ఆ పాఠం నుంచి పబ్లిక్ పరీక్షల్లో ఖచ్చితంగా ప్రశ్నలు ఉండేవి. ఈ రకంగా జబీన్ కవిత్వం భవిష్యత్తరాలను తీర్చిదిద్దింది.

" నేను మజీద్, తను మందిర్

మాకో ఏసు ప్రభువు పుట్టాడు.

కులాన్ని ఇంటి దగ్గరే వదిలేసి, మతాన్ని మర్చిపోయి, అతనితో

మైదానంలోకి నడిచొచ్చి, కొత్త వ్యవస్థ కోసం కలలు కన్నాను " అంటూ "పచ్చని జీవితం" కవితలో సెక్యులరిజాన్ని కోరుకొంటుంది.

మరోచోట అదే కవితలో.....

" అయోధ్య మాకెప్పుడూ సమస్య కాలేదు

మాకు సమస్య కాకపోవడమే

వాళ్ళకు సమస్య అయిపోయింది " అంటూ మతాన్ని రాజకీయం చేసిన వైనాన్ని చెపుతుంది. మతమే రాజకీయమైన నేటి తరుణంలో జబీన్ కవిత్వం పునర్ముద్రించడం సందర్భోచితంగా ఉన్నది.

మహె జబీన్ కవిత్వలో ప్రకృతి, విప్లవోద్యమం రెండూ పెనవేసుకొని ఉంటాయి. దీనికి ఉదాహరణగా ' ఆకురాలు కాలం ' కవితను చెప్పుకోవచ్చు. ప్రకృతిలో జరిగే ఋతు మార్పిడులలో శిశిర ఋతువుకు ఆకు రాలు కాలం ప్రతీక.

" అతనిప్పుడు లేడు

ఈ మధ్య అర్ధాంతరంగా వచ్చిన

ఆకు రాలే కాలానికి

ఎక్కడ రాలి పడ్డాడో " అంటూ రహస్య విప్లవకారుని గురించి విలపిస్తుంది. ఎన్కౌంటర్ కు ఆకు రాలే కాలం ప్రతీకగా నిలుస్తుంది.

స్త్రీల పట్ల సమాజం చేసిన అరాచకాలను వ్యతిరేకిస్తూ.....

" హద్దులు ఇప్పుడు బలాదూర్

లక్ష్మణ రేఖల్ని దాటడం ఇప్పుడు అవసరం " అంటూ 'నవస్మృతి 'ని రాసింది. అదే కవితలో.... మాతృత్వం చుట్టూ అల్లిన మాయ పొరలను విప్పి చెపుతూ......

" ఎవరైతేనేం? ఒక అనుభవం బ్రతకాలి

ఎవరైతేనేం? ధైర్యంగా నవమాసాలు

మోయాలనుకున్నప్పుడు

గుండె చప్పుడు కడుపులో వినిపించే

అద్భుతాన్ని సొంతం చేసుకోవాలి

మన రక్త మాంసాల ఫలాల మీద

ఎవరి ఆధిక్యమూ వద్దు " అంటూ కొత్తయుగం మాతృత్వాన్ని ఆవిష్కరిస్తుంది. పిల్లల్ని కనే శారీరక నిర్మాణం స్త్రీలకు మాత్రమే ప్రత్యేకం.

గొప్పగా చెప్పుకునే మన కుటుంబ వ్యవస్థ మహిళలు మౌనంగా ఉన్నంత కాలం పదిలంగా ఉంటుంది.

" మొగ్గలు విచ్చుకునే, రహస్యాన్ని చూసిన అరుదైన క్షణాల్లా

అమ్మ కళ్ళు అద్భుత వలయాలు

ఇప్పుడు అమ్మ చుట్టూ ఆంక్షల సంకెళ్ళు, మౌనం అమె సహవాసి " కానీ,

" నేను అమ్మలా మౌనంగా ఉండలేను, స్వేచ్ఛను వెతుక్కుంటూ వెళ్లిపోయాను, నా రెండు మృగనయనాలలో, అనేక కలలతో " అంటూ ఆధునిక నూతన స్త్రీని ఆవిష్కరిస్తుంది. మరో కవితలో .... "నాకు ఆదర్శ దాంపత్యం అనే నోబెల్ బహుమతి అవసరం లేదు" అంటుంది.

మనం అమ్మపిల్లలం, పితృస్వామ్య సాంస్కృతిక వారసత్వానికి రక్త సంబం ధీకుకులం అంటూ ప్రేమలేని తనంతో రక్త సంబంధం ఆనవాలు లేకుండా పోయిందని, నాన్నను చూస్తుంటే అజ్నబిని ( కొత్త వ్యక్తిని )చూస్తున్నట్లు ఉంటుందని, అమ్మ రెక్కల కింద బాల్యం సురక్షితంగా రూపుదిద్దు కుంది అంటుంది. మన దేశంలో చాలా కుటుంబాలలో నాన్నలు పిల్లలకు దూరంగానే ఉంటారనేది కఠోర వాస్తవం. నాన్న ఎలాంటి వాడైనా పిల్లల బాధ్యత మాత్రం అమ్మలదే....

ఇప్పటికీ ఎంతో అభివృద్ధిని సాధించామని చెప్పు కుంటున్నా కాలమేమీ మారలేదు. నాగరికత అనాగరికంగానే ఉన్నది. ప్రపంచం women sexuality చుట్టూనే తిరుగుతోంది.

గొప్పగా ఊదరగొట్టే భారతదేశపు ఔన్నత్యాన్ని ( దుస్థితిని ) వ్యంగ్యంగా "మేఘం రాల్బని వాన " అనే కవితలో ఇలా చెప్పారు. కవిత శీర్షికనే ఎంతో పోయిటిక్ గా ఉన్నది.

" నా దేశం పుణ్యభూమి

ఇక్కడ స్త్రీలు, రాత్రి మగవాళ్ళ అనుగ్రహంలో తడిసి

పగలు ఆగ్రహంతో కలిసి

అనాదిగా అలా బతుకుతునే ఉన్నారు, ....

నా కూతురికి ఇలాంటి దేశం వద్దు " అంటారు. అఆ లలోనే ( అనుగ్రహం)

( ఆగ్రహం ) అద్భుతమైన అనిల్పా ర్దాన్ని చొప్పించడం, ఇలాంటి పదాల కూర్పు ఒక్క జబీన్ కే సాధ్యం. పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీలకు జరుగుతున్న మోసం పట్ల స్త్రీలను అలర్ట్ చేస్తారు " చీకటి లోంచి వెలుతురు లోకి " అనే కవితలో...

" పారా హుషార్! మేల్ ఛావనిజం పహరా కాస్తుంది

సబ్ ఠీక్ హై! పితృస్వామ్యం గొంతు చింపుకొని అరుస్తుంది

అంతా సజావుగానే ఉంది, నివురు కప్పిన నిప్పులాగుంది." అంటారు.

ఫుట్ పాత్ మీద పుట్టిన జీవితాల్లోనుంచి, బాల్యం సమాధి చేయబడ్డ లేబర్ క్లాస్ నుంచి, మధ్యతరగతి ఇరుకు గదుల్లో తగలబడిన యవ్వనం నుంచి, నేరం పుడుతుంది కానీ తల్లి కడుపులోనుంచి పుట్టదు. దీనికి కారణం ప్రేమ రాహిత్యమే.... భూగోళం మీద ఓజోన్ తో పాటు ప్రేమ కూడా తరిగి పోతుంది కాబట్టి మనుషులుగా మానవీయంగా బతకడానికి ప్రేమ కావాలి అంటుంది జబీన్.

సొంత రక్తంలో పరాయి తనం, ఆత్మ స్థైర్యం సాకారమైనట్టు, యవ్వనీకరించిన బాల్యం, పెదాలు మూగవోతే కన్నీళ్ళు మాట్లాడుతాయి, పోగొట్టుకున్న నా బాల్యం తిరిగి ప్రవహిస్తుంది, అమ్మకళ్ళు పికాసో వర్ణ చిత్రాలు, నాకన్నా ముందు సౌందర్యం విస్తరిస్తుంది, ఆకాశం ఒక్కటే నాకు హద్దయింది, ఏ ఉపగ్రహం ప్రేమ లేఖల్ని మోసుకెళ్లదు లాంటి కవితా పంక్తులు మహె జబీన్ కవిత్వంలోని గాఢతకు ఉదాహరణలు. ఇంత సాంద్రత కలిగిన ఆమె ప్రతి కవితనూ లోతుగా విశ్లేషిస్తూ బోతే ఒక ఉద్గ్రంథమే అవుతుంది కాబట్టి ఇక్కడితో ఆపేస్తాను. చివరగా ఒక్క మాట. త్వరలోనే మరిన్ని కొత్త కవితలతో మరో పుస్తకం రావాలని ఆకాంక్షిస్తూ ముగిస్తాను.


Read More
Next Story