
Picture from (taleof2backpackers.com)
అడవమ్మ ఎందుకో చిన్నబోయి కూచుంది
నేటి ఆదివాసీ దినం కవిత
అడవమ్మ
ఎందుకో
చిన్న బోయి కూచుంది
కానుగ చెట్టు
కంట నీరు తీస్తుంది
ఏమైందని
పలకరించబోతే
ఇప్ప పువ్వు నేల రాలిందని చెప్పింది..!
నదులు ఎందుకో
విలపిస్తున్నాయి
కుంటలు లోయల
కూడల్లు చిన్నబోయినాయి
ఏమైందని
అడగబోతే
నా తల్లి కంటనీరు ఇంకిందని చెప్పాయి...!
చెట్లన్ని ఆకులను
ఎందుకు రాలుస్తున్నాయి
వేప వెదురు వనాలు
సుడిగుండాల పాల దారాలు
ఎందుకు కారుస్తున్నాయి
టేకు లొద్దుల అడుగులు
ఎందుకు కానరాకుండా పోతున్నాయని
అడగబోతే
శిశరమైనా
వసంతమైనా
వేట గాడి కత్తి
ఇంకా వేలాడుతూనే ఉన్నదని చెప్పాయి...!
నేల తల్లి కుంగి
బీటలు వారింది
గుడేసి కూలి
నిట్టాడు కరువైంది
అయినా అమావాస్య
చీకటిని తొలిచే
అడవి కాచిన వెన్నెల
రాక మానదు....!!
-వంగల సంతోష్
Next Story