హైదరాబాద్ నుంచి సోమశిల గగనయాత్ర
x
హైదరాబాద్- సోమశిల- శ్రీశైలం హెలికాప్టర్ యాత్ర

హైదరాబాద్ నుంచి సోమశిల గగనయాత్ర

ఆకాశంలో ఆధ్యాత్మిక యాత్ర,నల్లమలపై హెలికాప్టర్ విహారం మొదలు


తెలంగాణ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. గలగల పారే కృష్ణానది, పచ్చని నల్లమల అడవులు, పవిత్ర పుణ్య క్షేత్రాల సౌందర్యాన్ని గగనతలం నుంచి ఆస్వాదించే అరుదైన అవకాశం పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌ నుంచి సోమశిల మీదుగా శ్రీశైలం వరకు హెలికాప్టర్ యాత్రలు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి.

నాడు విమానయానం...నేడు హెలికాప్టరు యానం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సోమశిలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టరు యాత్ర ఏప్రిల్ 9వతేదీన ప్రారంభం కానుంది.విమానయానంతో ఎంతో అనుబంధం ఉన్న కొల్లాపూర్ పరిధిలోని సోమశిలకు ఎంతో కాలం తర్వాత హెలికాప్టరు యాత్ర ఆరంభం అవుతోంది. నిజాం నవాబుల కాలంలో జటప్రోల్, కొల్లాపూర్ సంస్థానంలో సురభి వంశస్థులు పరిపాలించారు. 1931వ సంవత్సరంలో కొల్లాపూర్ సుభి సంస్థానాదీశులకు విమానం ఉండేది. రాజా వెంకట లక్ష్మారావు కుమార్తె సరస్వతి దేవి భర్త అనుగంటి వెంకట కృష్ణారావు విమానం నడిపేవారు. రాజ్యాలు, సంస్థానాలు పోయాక కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. 1998వ సంవత్సరంలో ఎమ్మెల్యే అయిన జూపల్లి కృష్ణారావుకు 2004వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వక పోవడంతో ఇండిపెండెంటు అభ్యర్థిగా విమానం గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు. నాడు విమానం కృష్ణారావుగా పేరొందారు. నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ పర్యాటక శాఖ మంత్రి అయిన జూపల్లి ఆ శాఖ ఆధ్వర్యంలోనే హెలికాప్టరు సోమశిల యాత్రను ప్రారంభించనున్నారు.

హెలీ ప్యాడ్ నిర్మాణంపై స్థల వివాదం

ఏప్రిల్ 9వతేదీ నుంచి సోమశిలకు హెలికాప్టర్ యాత్ర ఆరంభం కానున్న నేపథ్యంలో హెలీ ప్యాడ్ నిర్మాణంపై స్థల వివాదం రాజుకుంది. హెలీప్యాడ్ నిర్మాణానికి దళితులు సాగుచేస్తున్న భూములు లాక్కోవడం ఏమిటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు ప్రశ్నించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూములను లాక్కున్నారని బీజేపీ నేతలు, రైతులు ఆరోపించారు. హెలికాప్టరు యాత్రలు ప్రారంభానికి ముందే హెలీప్యాడ్ నిర్మాణంపై వివాదం రాజుకోవడం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రంలో హెలికాప్టరు యాత్రల విస్తరణ

తెలంగాణ రాష్ట్రంలో హేలీ టూరిజం ఆరంభం కానుంది.తెలంగాణలో సోమశిల, శ్రీశైలం హెలికాప్టరు యాత్ర విజయవంతం అయితే త్వరలో ఈ సేవలను మరిన్ని పుణ్య క్షేత్రాల సందర్శనకు విస్తరించాలని నిర్ణయించారు. పర్యాటక రంగాభివృద్ధిలో భాగంగా తెలంగాణలోని రామప్ప, నల్లమల అడవులు, నిజాంసాగర్, నాగార్జునసాగర్ ప్రాంతాలకు హెలికాప్టరు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పర్యాటకశాఖ సన్నాహాలు చేస్తుంది.

సోమశిల శ్రీశైలం హెలికాప్టర్ యాత్ర

హైదరాబాద్ నుంచి సోమశిల, శ్రీశైలం వరకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక హెలికాప్టర్ యాత్ర అందుబాటులోకి రానుంది.గలగల పారుతున్న కృష్ణా నది, నల్లమల అడవి గగనతల దృశ్యాలు,శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో వీఐపీ దర్శనం ఉంటాయి.భారతదేశంలోని జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో, ప్రత్యేకమైన వీఐపీ దర్శనాన్ని కల్పించనున్నారు.మూడు రాత్రులు నాలుగు రోజుల ఈ హెలికాప్టర్ పర్యటనకు రూ.1,24,999 లుగా ప్యాకేజీ నిర్ణయించారు.ఈజీ దర్శన్, ఈజీ ట్రిప్ ఈ హేలియాత్ర చేపట్టనుంది.కైలాస్ యాత్ర, ఛార్ ధామ్ యాత్ర, దివ్వ జ్యోతిర్లింగ హేలి యాత్రం. దోధామ్ హేలీ యాత్ర, వైష్ణోదేవి యాత్రలు చేపట్టిన ఈ సంస్థ తాజాగా సోమశిల, శ్రీశైలం యాత్రలు ప్రారంభించనుంది.సోమశిల శ్రీశైలం హెలికాప్టర్ సర్క్యూట్ ప్యాకేజీ 99,999 రూపాయలుగా నిర్ణయించారు. ఈ టూర్ ప్యాకేజీలో హోటల్, భోజనం, ఆలయాల దర్శనాలు, రవాణ సదుపాయాలు చేర్చారు.

కృష్ణమ్మ పరవళ్లు... నల్లమల ప్రకృతి అందాలు

కృష్ణమ్మ పరవళ్లు... నల్లమల ప్రకృతి అందాలను ఆకాశ మార్గం నుంచి వీక్షించే అద్భుత అవకాశం పర్యాటకులకు చేరువ కానుంది. పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ సోమశిల - శ్రీశైలం క్షేత్రాల మధ్య 'హేలీ టూరిజం' సేవలను ప్రారంభించనున్నారు.హైదరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ హెలికాప్టర్ యాత్ర సోమశిల మీదుగా శ్రీశైలం వరకు సాగుతుంది. సోమశిల చేరుకున్న పర్యాటకులు కృష్ణానదిలో బోటింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అనంతరం శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చు.ఈ యాత్రలో లలితా సోమేశ్వర స్వామి ఆలయం,శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి,గణపతి ఆలయం,కృష్ణా నది ఘాట్, సోమశిల జలాశయాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు.ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. హెలీ టూరిజం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.

హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి

హెలీ టూరిజాన్ని విస్తరిస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు

రానున్న రోజుల్లో ఈ సేవలను కేవలం సోమశిలకే పరిమితం చేయకుండా నాగార్జున సాగర్, రామప్ప, నిజాం సాగర్ వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలకు కూడా విస్తరిస్తామని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. హెలీ టూరిజంతో సోమశిలలో స్థానికులకు ఉపాధిా లభిస్తుందని మంత్రి చెప్పారు.
తెలంగాణలో పర్యాటకులకు ప్రత్యేక అనుభవాన్ని అందించేందుకు హెలికాప్టర్ ద్వారా ప్రముఖ ప్రాంతాలను చూపించే సేవలను ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు అందిస్తున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

హెలీ టూరిజం అంటే ఏమిటి?

హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ ఆకాశం పై నుంచి ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, ఆలయాలు చూసే పర్యాటక సేవలనుహెలీ టూరిజం అంటారు. ఇది తక్కువ సమయంలో ఎక్కువ ప్రదేశాలను చూడటానికి అనుకూలంగా ఉంటుంది.హెలీ టూరిజం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ప్రదేశాలు సందర్శించవచ్చు. ప్రముఖ దేవాలయాల్లో వీఐపీ దర్శన సౌకర్యాలు ,లగ్జరీ,సురక్షిత ప్రయాణం,ప్రత్యేక ఫోటోగ్రఫీ అనుభవం కల్పిస్తున్నారు.

హెలీ టూరిజం యాత్రలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు, ప్రాజెక్టులను సందర్శించేందుకు వీలుగా హెలీ టూరిజం సౌకర్యం కల్పించాలని పర్యాటకశాఖ అధికారులు నిర్ణయించారు.యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్తులకు హెలికాప్టర్ సేవల ద్వారా దేవాలయ దర్శనం ప్రత్యేకంగా అందించనున్నారు. నాగార్జునసాగర్ డ్యాం భారీ జలాశయం, అందమైన దృశ్యాలు హెలికాప్టర్ ద్వారా వీక్షించవచ్చు. యునెస్కో వారసత్వ కట్టడమైనరామప్ప దేవాలయం, చార్మినార్, హైదరాబాద్ నగరాన్ని హెలికాప్టర్ నుంచి వీక్షించే సిటీ టూర్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు.
తెలంగాణ ప్రభుత్వం పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు హెలీ టూరిజాన్ని విస్తరించే యోచనలో ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా మరిన్ని టూర్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికత, లగ్జరీ ప్రయాణాన్ని కలిపిన హెలీ టూరిజం తెలంగాణ పర్యాటక రంగాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లనుంది. గగనతలంలో కృష్ణమ్మ పరవళ్లు చూస్తూ, నల్లమల సౌందర్యాన్ని ఆస్వాదించే ఈ ప్రయాణం పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందించనుంది.
Read More
Next Story