మా అమ్మ పెళ్ళి సందడి
x
అలూరు విమలాదేవి

మా అమ్మ పెళ్ళి సందడి

బందరు దగ్గిర వేమవరం. దూరాన్నుంచి తైలవర్ణం చిత్రంలా కనిపించే ఊరు.మధ్య చెరువు, చుట్టూర ఇళ్లు, కొబ్బరి, తాటి చెట్లు. ఊరంతా పెంకుటిళ్లు: అమ్మ చెప్పిన ముచ్చట్లు : 6



అమ్మ చెప్పిన ముచ్చట్లు - 6

-రాఘవ శర్మ


“నా పెళ్ళి చాలా తమాషాగా జరిగింది.అసలీ పెళ్ళి జరుగుతుందా, లేదా అన్నది చివరికి వరకు సందేహమే.

మా వాళ్ళలో ఒకటే ఆందోళన” అంటూ చెప్పడం మొదలు పెట్టింది మా అమ్మ.

"అప్పుడు నా వయసు ప దహారేళ్ళు.

మీ నాన్న వయసు (పెళ్ళి కొడుకు) ఇరవై ఆరేళ్ళు.

అంటే మా మధ్య పదేళ్ళ తేడా!

ఇక్కడెక్కడా సంబంధం దొరకనట్టు మా రాముడు మావయ్య గుంటూరు జిల్లా వెళ్ళి ఈ సంబంధం మాట్లాడుకొచ్చాడు.

మా అమ్మను, నాన్నను కూర్చోబెట్టి, 'అబ్బాయి చాలా బుద్దిమంతుడు. మిలటరీలో చేస్తున్నాడు.

ఎలాంటి అలవాట్లూ లేవు (!?).

సెలవలకొచ్చాడు.

రెండు నెలలుంటాడు.

పెళ్ళి చేసుకుని, పెళ్ళి కూతురిని తీసుకుని వెళ్ళిపోతాడు.

వాళ్ళది బాపట్ల.

వారికి కూడా కాస్తో కూస్తో పొలం ఉంది.

బాపట్లలో స్థానం ఆచార్లుగారింటి పక్కనే వాళ్ళిల్లు.

మంచి సంప్రదాయ కుటుంబం.

స్థానం వారికి, వీరికి ఆచారాల్లో ఏ తేడా లేదు.

పిల్లాడి తండ్రి చాలా మడి ఆచారాలున్నవ్యక్తి.

మడి కట్టుకోందే మంచి నీళ్ళు కూడా ముట్టుకోడు.'

అంటూ వాళ్ళ గుణగణాలను మా రాముడు మావయ్య చెపుతున్నాడు.

'మంచి సంబంధమైతే చూడు రా చేసేద్దాం.

విమల తరువాత ఇంకా ఇద్దరు ఆడ పిల్లలున్నారు.

వాళ్ళు కూడా ఇట్టీ ఎదిగొస్తారు.' అంది మా అమ్మ.

అక్కడ మా అమ్మ ఉంది కనుక మా నాన్న యధావిధిగా తలూపాడు.”

"పెళ్ళి చూపులెలా ఉన్నాయమ్మా" అడిగాను.

"పెళ్ళి చూపులా గిళ్ళి చూపులా!

ఆరోజుల్లో అలాంటివేమీ లేవు.

పెద్ద వాళ్ళు చూసొచ్చారంటే మేమంతా తలొంచుకుని తాళి కంట్టించుకోవలసిందే.

గంగిరెద్దులా తలూపాల్సిందే.

కనీసం మా అమ్మా నాన్నా కూడా పిల్లవాడిని చూడలేదు.

పెళ్ళిలో చూడ్డమే!

మా రావుడు మావయ్యంటే మా వాళ్ళకు అంత గురి” అంది మా అమ్మ.

"అదేంటమ్మా కనీసం పెళ్ళి చూపులు కూడా లేకుండా!?” అన్నాను.

“ఆరోజుల్లో అంతేరా బాబు.

పెద్ద వాళ్ళు సంబంధం కుదుర్చుకొచ్చారంటే కాదనే మాటే ఉండదు.

వాళ్ళ నీడలో బతికిన వాళ్ళం కదా!

మీ లాగా ఎదురుతిరిగి మాట్లాడే వాళ్ళం కాదు” అంది.

"సరే పెళ్ళెలా జరిగిందో చెప్పు” అన్నాను.

చెప్పడం మొదలు పెట్టింది.

"మా ఇంటి ముందర పెద్ద పందిరి వేశారు.

మునసబు గారింట్లో పెళ్ళంటే ఊరంతా హడావుడే.

మా పాలేర్లతో పాటు మా శేషన్నయ్య కూడా పెళ్ళి పనులు చేశాడు.

మా అమ్మ పుట్టింటారంతా వచ్చారు.

చుట్టుపక్కల బంధువులంతా వచ్చారు.

నన్ను పెళ్ళి కూతురిని చేశారు. అంతా అయిపోయాక మగ పెళ్ళి వాళ్ళు కూడా దిగారు.

మగ పెళ్ళి వాళ్ళ తరపున ఎవరూ పెద్దగా రాలేరు.

పెళ్ళి కొడుకు, పెళ్ళి కొడుకు తల్లి, తండ్రి, అన్నా వదిన, అక్క. అంతే!

వాళ్ళకు వేరే విడిది ఏర్పాటుచేశారు.

పెళ్ళి కొడుకును చేశాక, పెళ్ళి కూతురును చేశాక, తెరకు అటువైపు ఒకరు, ఇటు వైపు ఒకరు పీటలపైన కూర్చోపెట్టి తలపై జీలకర్ర బెల్లం పెట్టేవరకు ఒకరినొకరు చూసుకోకూడదు.

తెర తీశాకే చూసుకోవాలి.

అసలు పెళ్ళి కొడుకు ఎట్లా ఉంటాడో చూద్దామని మా అమ్మ విడిదికి వెళ్ళి చూసింది.

పెళ్ళి కొడుకు తండ్రి ; మీ తాతయ్య పేరు ఆలూరు వీర రాఘవరావు.

మీ తాతయ్య కాస్త పొట్టిగా నామాలు పెట్టుకుని ఉన్నాడు.

తుమ్మల్లో పొద్దుగుంకినట్టు మొహం మటమటలాడిపోతోంది.

పెళ్ళి కొడుకు తల్లి మీ బామ్మ సన్నగా తెల్లగా ఉంది.

మొగుడు కంటే కాస్త పొడుగ్గా, చాలా ప్రశాంతంగా ఉంది.

చాలా మర్యాదస్తురాలు.

ప్రేమగా పలకరించింది.

వారి పెద్ద కొడుకుకు ఆకారంలో తండ్రి పోలికలున్నా, లక్షణాలు మాత్రం తల్లివే.

ఆ ఇంటి ఏకైక ఆడపుడుచు అంతా తండ్రి పోలికలు, తండ్రి లక్షణాలే.

పెళ్ళి కొడుకు ఆ మూలనుంచి ఈ మూల వరకు పడుకుని ఉన్నాడు. తుమ్మ మొద్దులాగా

నల్లగా భారీ శరీరం.

అంతే.. అక్కడేం మాట్లాడకుండా మా అమ్మ విసవిసలాడుతూ తిరిగొచ్చేసింది.

ఇంటికి రాగానే ఆమెకు పూనకం వచ్చి నట్టు మాట్లాడుతూ ఉంది.

పెళ్ళి సంబంధం తెచ్చిన మా రావుడు మావయ్య దగ్గరకొచ్చి 'చక్కగా ఉండే పిల్లకి ఎట్టాంటి సంబంధం తెచ్చావురా రావుడు' అంటూ ఏడ్చేసింది.

పెళ్ళికి అంతా సిద్ధం చేశారు.

ఈ పెళ్ళి మా అమ్మకు నచ్చలేదు.

నన్ను వేరే గదిలోకి తీసుకెళ్ళి తలుపేసేసింది, ఈపెళ్ళి చేయనంటూ.

'అక్కయ్యా..ఇంత చక్కటి సంబంధం తెస్తే ఎట్లా కాదంటావు?

మంచి సంబంధాన్ని మధ్యలో ఆపేసి కాలదన్నుకుంటే విమలకు మళ్ళీ సంబంధం కుదురుతుందా చెప్పు!

పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేశాక ఇప్పుడు కాదంటే ఊళ్ళో బావగారి పరువేం కాను.' అన్నాడు మా రావుడు మావయ్య.

'మనం నియ్యోగి పుటక పుట్టాం!

పెళ్ళి కొడుకు తండ్రికి ఆ పంగనామాలేమిటి?

వైష్ణవ సంబంధం ఎట్లా తెస్తావురా?” అంది మా అమ్మ.

'అయ్యో అక్కయ్యా వాళ్ళు కూడా నియోగులేనే.

కాకపోతే స్థానం వారింటి పక్కన ఉండబట్టి, ఆయన కూడా శంకుచక్రాలేయించుకుని వైష్ణవ మతాన్ని తీసుకున్నాడంతే.

ఇంట్లో అంతా నియోగి పద్దతులే' అన్నాడు మావయ్యా.

'నాకూతురు సన్నగా చక్కగా ఉంటుంది.

తుమ్మమొద్దులా ఉన్న ఆ పెళ్ళి కొడుకుకు ఎలా కట్టపెట్టమంటావురా నా కూతురిని?

ఈడు జోడు చూడనవసరం లేదా?” అన్నది తమ్ముణ్ణి నిలదీస్తూ.

'సరే అక్కయ్యా.. నువ్వు ఒద్దంటేచెప్పు.

నా కూతురినిచ్చి ఇదే ముహూర్తానికి ఇక్కడే చేస్తాను.

ఊ.. అను' అన్నాడు రెట్టిస్తూ.

ఈ మాటలన్నిటినీ గదిలోంచి వింటూనే ఉన్నాను.

'పెళ్ళి పీటల వరకు వచ్చిన సంబంధం కాలదన్నుకుంటే ఎట్లా?' అంటూ అంతా కలసి మా అమ్మకు నచ్చచెప్పారు.

అయిష్టంగానే మా అమ్మ మా పెళ్ళికి అంగీకరించింది." అని చెప్పింది.

వేమవరం చెరువులో పోతురాజు శిల.


“ఆ రాత్రి మా పెళ్ళి చాలా ఘనంగా జరిగింది.

పెళ్ళి అయిదు రోజులూ చేశారు.

మా ఇద్దరినీ పల్లకిలో కూర్చోబెట్టి చెరువు చుట్టూ ఊరేగించారు. తరువాత మూణ్ణిద్దర్లకని బాపట్ల తీసుకెళ్ళారు.

తరువాత ఊళ్ళో ఊరేగింపు జరుపుతున్నప్పుడు మా అమ్మ మాటల్లాంటివే కొందరనడం మా వాళ్ళ చెవుల్లో పడ్డాయి.

‘వెన్నముద్ద లాంటి మా వూరమ్మాయిని, ఎక్కడినుంచో వచ్చి గద్దలా తన్నుకు పోతున్నాడే' అన్నారట.

'అయిపోయిన పెళ్ళికి ఇప్పుడు మేళాలెందుకు!?' అని మా వాళ్ళు సర్దుకుపోయారు.

అట్లా జరిగింది మా పెళ్ళి.” అంటూ వివరించింది.

ఒక తమాషా ఏమిటంటే, మా అమ్మను కన్న తల్లి (అమ్మమ్మ) కాస్త గడుసుదైతే, మా నాన్నను కన్న తల్లి (మా బామ్మ) చాలా సౌమ్యురాలు.

మా నాన్నను కన్న తండ్రి గడుసు పిండమైతే, మా అమ్మను కన్న తండ్రి చాలా మెతక.

ఆనాటి కుటుంబాల్లో భార్యాభర్తల్లో ఒకరు మెత్తనైతే, మరొకరు నోరు నోరున్న వాళ్ళు.

"మా తాతయ్య, బామ్మ ఎట్లా ఉండే వాళ్ళు?” అని అడిగాను.

ఎందుకంటే మేం పుట్టక ముందే వాళ్ళిద్దరూ పోయారు కనుక.

తమ అత్త గారి ఇంటి విషయం ఇలా చెప్పడం మళ్ళీ మొదలు పెట్టింది.

“బాపట్లలో, బాపట్ల వారి వీధి ఉంది.

ఆ వీధి చివర్లోనే మా మావగారి ఇల్లు.

చాలా పెద్దపెంకుటిల్లు.

ఒక పెద్ద వంటిల్లు, పెద్ద వరండా.

రెండు చిన్న గదులు, మూడు పెద్ద గదులు.

దొడ్లోనే చేద బావి.

ఆ చేదబావిలో ఉప్పు నీళ్ళే అనుకో.

మంచి నీళ్ళ కోసం మడి కట్టుకుని ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు.

పాపం మా ఆడపడుచే మంచి నీళ్ళు తెచ్చేది.

బిందె నిండా నీళ్ళు నింపుకుని చంకలో పెట్టుకుని, వాళ్ళూ వీళ్ళు నడిచిన దారని దారి పొడవునా నీళ్ళు చల్లుకుంటూ వచ్చే సరికి బిందెలో పావు భాగమైనా అయిపోయేవి.

పక్కనే స్థానం ఆచార్లుగారనే సంప్రదాయ వైష్ణవ కుటుంబం ఉండేది.

మా మావగారు వైష్ణవ మత ఆచారాలన్నీ పాటించేవాడు.”

"ఆ రోజుల్లో వైష్ణవ ఆచారాలెట్లా ఉండేవి" అడిగాను.

“అయ్యో..ఎందుకడుగుతావు కానీ, ఆ ఆచారాలు పాటించడం చాలా కష్టం.

మా మావగారు ఉల్లిపాయ తినడు. వెల్లుల్లి పాయ వాసనే పడదు.

ఏ దుంపకూరా ఇంట్లోకి రానివ్వడు.

మునక్కాడ కూడా ముట్టుకోడు.

ఇంట్లో కూడా వీటిని వండనివ్వడు.

బైట ఎక్కడా తిననిచ్చే వాడు కాదు.

వీటిని తినాలంటే మా పుట్టింటికి వెళ్ళి తినాల్సిందే” అంటూ చెబుతోంది.

"అది తినకూడదు, ఇది తినకూడదంటే, ఏం తిని బతుకుతారమ్మా? " అన్నా.

"అయ్యో అట్లా అనకురా పాపం.

ఆ పాత తరం వాళ్ళు పోయారు కదా!

మా అత్తగారు చాలా మంచిది.

ఆమె కేమో తాటి ముంజలు తినాలని చచ్చే కోరిక.

మా మావగారు తిననిచ్చేవాడు కాదు.

మా మావగారు లేనప్పుడు చూసి తాటి ముంజలు తెప్పించుకుని దొంగతనంగా తినేది.

నేను కూడా తినేదాన్ని” అన్నది నవ్వుతూ మా అమ్మ.

"మా మావగారు అందరిపైన చిర్రుబుర్రులాడే వాడు.

ఆయన కళ్ళ ముందర పడకుండా మావారు, మా బావగారు తప్పించుకుని తిరిగేవారు.

ఎందుకంటే, ఇద్దరూ సిగరెట్లు తాగుతారు కదా!

మా అత్తగారినే కాదు, పెద్ద కోడల్ని కూడా మా మావగారు కసురుకునే వాడు.

కొత్త పెళ్ళి కూతురని పాపం నన్నేమనే వాడు కాదు.

'అమ్మాయి ఇట్రా' అనేవాడు.

ఎన్ని సార్లు ఒంటేలుకెళితే అన్ని సార్లు స్నానం చేసేవాడు.

ఎన్ని సార్లు దొడ్డికెళ్ళాల్సి వస్తే, జంజాన్ని చెవికి చుట్టుకుని వెళ్ళొచ్చి, అన్ని సార్లు తలారా స్నానం చేసేవాడు" అని చెప్పింది.

"మోషన్లైతే ఎంత కష్టవమ్మా!” అన్నాను.

"మా మావగారిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి.

పొలంలోకెళ్ళి కూలీలతో సమానంగా కష్టపడి పనిచేసేవాడు.

అందుకునే శరీరం గట్టిపడి, గిడసమారి పోయింది.

మిగతా సమయంలో భారత రామాయణాలు, భాగవతం చదువుకుంటుండే వాడు.

అన్నట్టు మా మావగారు కాశీకి వెళ్ళి సంస్కృతం చదువుకొచ్చాడు.

రైల్లో కాశీ చేరే వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదట! మంచి నీళ్ళు తాగాలంటే ధావళి కట్టుకోవాలి కదా!"

ధావళి అంటే ఒక రకమైన ఉన్నితో చేసిన పెద్ద టవల్ లాంటిది.

మేం పుట్టకముందే మా తాతయ్య, బామ్మ పోయారు.

దాంతో వాళ్ళు బతికిపోయారు.

ఆ ఆచారాలను పాటించడం మా కు సాధ్యమయ్యే పని కాదు.

ఇప్పుడే కాదు, ఒక వేళ మేం అప్పుడు ఉన్నా కూడా సాధ్యమయ్యేది కాదేమో!



(ఇంకా ఉంది)

( ఆలూరు రాఘవ శర్మ, జర్నలిస్టు, రచయిత, ఆయన పుస్తకాలు సాహితీ సౌ గంధం ( ఉమ్మడి చిత్తూరు జిల్లా సాహితీ వేత్తల గురించి)కొత్త బంగారు లోకం ( చైనా పర్యటన అనుభవాలు) తిరుమల దృశ్య కావ్యం ( శేషాచలం కొండల లో ట్రెక్ అనుభవాలు) పుస్తకాలు అచ్చయ్యాయి. త్వరలో ‘వనపర్తి ఒడిలో ’ విడుదల కానుంది.)


Read More
Next Story