అక్కడ వయసు రూపంలో మగవాడి పెత్తనం కనిపించేది...
x
ఆలూరు విమలాదేవి

అక్కడ వయసు రూపంలో మగవాడి పెత్తనం కనిపించేది...

అమ్మకు దేవుడి పైన నమ్మకముంది. కానీ, తానుగా ఎప్పుడూ పెద్దగా పూజలు చే సేది కాదు. పూజకు కూర్చోవలసి వచ్చినప్పుడు నాన్నని అనుసరించేది. అమ్మచెప్పిన కబుర్లు-11అమ్మ చెప్పిన ముచ్చట్లు -11“మా అత్తగారింట్లో ఆచారాలు ఎలా ఉన్నాయో, మా పుట్టింట్లోనూ, మా అమ్మమ్మ గారింట్లోనూ అలాగే ఉన్నాయి." అని మా అమ్మ చెప్పుకుంటూ పోతోంది.

"మేం వనపర్తిలో ఉండగా, ఒక సారి పెదగొన్నూరులో మా రావుడు మావయ్య వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళది చాలా పెద్ద సంసారం. ఉమ్మడి కుటుంబం.

నేను వాళ్ళింటికి వెళ్ళగానే 'విమలత్తయ్య వచ్చింది' అంటూ పిల్లలంతా నన్ను చుట్టుముట్టారు. ఈ పిల్లల్లో ఎవరు ఎవరి పిల్లలో తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇల్లు ఎంత సందడిగా ఉందో !

‘ఏం విమలా బాగున్నావా' అంది మా కోరమ్మొదిన నవ్వుతూ. మా పెద్దన్నయ్య వదిలేసిన భార్య. కొడుకును పెట్టుకుని పుట్టింట్లోనే ఉంటోంది. వాడివన్నీ మా బాచన్నయ్య పోలికలే!

'ఏమే విమలా బాగున్నావా' అంటూ ఆ వెనకే మా పెద్ద పాప, చిన్న పాప వచ్చారు. వాళ్ళిద్దరికీ భర్తలు పోయారు. వాళ్ళిద్దరు కూడా పిల్లల్ని పెట్టుకుని పుట్టింట్లోనే ఉంటున్నారు.

చిన్నప్పుడు వాళ్ళందరితో ఎంత అడుకునే దాన్నో! వాళ్ళంతా కలిసి వేమవరం వచ్చే వాళ్ళు. మేమంతా పెదగొన్నూరు వెళ్ళే వాళ్ళం. కేవలం పెళ్ళిళ్ళప్పుడే కాదు, అప్పుడప్పుడూ ఇలా వచ్చిపోతూ ఉండే వాళ్ళం. ఎంత సరదాగా ఉండేదో!

మా రావుడు మావయ్య, సీతమ్మొదినతో పాటు, మా మావయ్య ముగ్గురు కూతుళ్ళు, వాళ్ళ పిల్లలు, కొడుకు, అతని భార్యా పిల్లలు అంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంట్లో మా రావుడు మావయ్య మాటను ఎవ్వరూ జవదాటరు. వాళ్ళింట్లో ఒక పెద్దరికం, ఒక చిన్నరికం కొనసాగుతోంది. తప్పైనా ఒప్పైనా పెద్ద వాళ్ళ మాటను చిన్న వాళ్ళు విని తీరాల్సిందే. గౌరవించాల్సిందే. ముందు పుట్టడం ఒక్కటే ఆ ఇంట్లో గౌరవానికి కొలబద్ద.

పిల్లలందరూ చదువుకుంటున్నారు. ఆ ఇంట్లో రోజూ పాతిక కంచాలు లేవాలి. ఉన్న కాస్త పొలంతో, కొడుకు జీతంతో, మా మావయ్య ఇంత మందిని ఎలా పోషిస్తున్నాడో అర్థం కాలేదు." అని వివరిస్తోంది మాఅమ్మ.

మధ్యలో నాకిలా అనిపించింది. ఈ కుటుంబంలో ఎంత సమష్టి తత్వం! కొందరికి సంపాదన ఉంటుంది, కొందరికి ఉండదు. కొందరి జీవితాలు అస్తవ్యస్తంగా ఉంటాయి. కొందరి జీవితాలు సాఫీగా సాగుతుం టాయి. సంపాదన ఉన్నా, లేక పోయినా అంతా ఉమ్మడిగా జీవిస్తున్నారు. మహత్తరంగా కాకపోయినా, మౌలిక అవసరాలకు ఇబ్బంది లేకుండా సాగిపోతున్నాయి.

ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడా కనిపించడం లేదు. మూమూలు కుటుంబాలు కూడా విచ్ఛినమైపోతున్నాయి. పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూళ్ళలో, తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పించేస్తున్నారు. భార్యాభర్తలు కూడా ఎవరిదారి వారిదే. నేను చూసిన కొన్ని ఇళ్ళలో భార్యకొక బెడ్రూం, భర్తకొక బెడ్ రూం. ఎవరి ‘ప్రైవసీ’ వారిదని చాలా గౌరవంగా చెప్పుకుంటున్నారు. మళ్ళీ మా అమ్మ ఇలా చెప్పడం మొదలు పెట్టింది.

“నేను మా రావుడు మావయ్యవాళ్ళింటికి వెళ్ళినరోజు వాళ్ళింట్లో తద్దినం. వంటింట్లోకి ఎవరూ వెళ్ళకూడదు, మడికట్టుకున్న వాళ్ళు తప్ప.

పెద్దపాప, చిన్నపాపకోసం ఇల్లంతా వెతికాను. ఎక్కడా కనిపించలేదు. ఒక గది తలుపులు తోసుకుని లోపల కెళ్ళి చూద్దునుకదా, నాకు భయమేసింది. గదంతా చీకటి గుయ్యారం.

'తలుపేసెయ్ ..తలుపేసేయ్..' అన్నారు పెద్ద పాప, చిన్న పాప. తలవిరబోసుకుని తడి గుడ్డలతో కూర్చుని కాఫీలు తాగుతున్నారు. 'మీ మొహం మండా, మీ కేం పోయేకాలమే, ఈ అవతారాలేమిటి' అన్నా ఆశ్చర్యపోతూ.

'ఏం చేయమంటావ్ విమలా.. ప్రాణాలుపోతున్నాయి. ఎంత మటుకని ప్రాణాలు బిగబట్టుకుని కూర్చుంటాం. పొద్దున్నుంచి ఈ కాఫీ నీళ్ళు తప్ప గొంతులోకి ఏమీ లేవు కదా! ఈ తద్దినం ఎప్పుడు పూర్తవుతుంది? మిగతా వాళ్ళంతా ఎప్పుడు భోజనం చేయాలి? మేం ఎప్పుడు భోజనం చేయాలి? పెద్ద వాళ్ళ తద్దినం కాదుకానీ, మా తద్దినం పెట్టినట్టుంది' అన్నారు.

'కాఫీ తాగుతున్నారు సరే. చీకటింట్లో కూర్చుని తాగడమేమిటి?' అన్నా. 'మడిగుడ్డలతో కాఫీ తాగితే మళ్ళీ ఆ గుడ్డలు మడికి పనికిరావు. అందుకని ఇలా రహాస్యం గా కూర్చుని కాఫీ తాగు తున్నాం.' అన్నారు నా వేపు జాలిగా చూస్తూ.

వాళ్ళిద్దరినీ చూస్తే నాకు నిజంగానే జాలేసింది. భర్తలు పోయి, విధవరాళ్ళుగా పుట్టింట్లో ఉండడం, రోజూ పాతిక మందికి వండి వడ్డించడం, ఎంత చాకిరీ! దీనికి తోడు ఈ ఆచారాలు. వీటిని పాటించడానికి ఎంత శక్తి కావాలి! ఎంత ఓపిక కావాలి! పాపం వీళ్ళ జీవితమంతా ఇంతేనా !" అంటూ మా అమ్మ నిట్టూర్చింది.

మా అమ్మకు దేవుడి పైన నమ్మకముంది. కానీ, తనకుగా తాను ఎప్పుడూ పెద్దగా పూజలు చే సేది కాదు. మానాన్నతో పూజకు కూర్చోవలసి వచ్చినప్పుడు ఆయన్ని అనుసరించేది.

రోజూ స్నానం చేశాక తులసి కోటలో నీళ్ళు పోసి, సూర్యుడికి దణ్ణం పెట్టుకునేది. అంతే. మంత్రాలు చదివేది కాదు. వాటిని చదవాలన్న ఆసక్తి కూడా ఉండేదికాదు. మా నాన్న పోయినప్పటి నుంచి పూజలు చేయాల్సిన అవసరం అమెకు లేకుండాపోయింది. మా అమ్మని నేనెప్పుడూ పూజలు చేయమని కానీ, పూజలు చేయద్దని కానీ చెప్పలేదు. 'మీ అమ్మపైన నీ ప్రభావం ఉంది' అని మా వాళ్ళంతా అనేశారు.

నాలుగేళ్ళ క్రితం మా పెంకుటింటిని తీసేసి పక్కా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు “పూజగది ఎక్కడా?” అని అడిగారు కొందరు. "పూజగది లేదు” అన్నాను. "పూజగది లేకుండా ఇల్లెలా కడుతున్నారు?” అంటూ కొందరు విస్తుపోయారు. మా మాటలను మా అమ్మ విన్నదే కానీ మారు మాట్లాడలేదు.

ఇల్లు పూర్తయ్యాక "బాబూ.. ఒక్క మాట అడుగుతా. నాకు హామీ ఇస్తావా?” అంది. “అడుగమ్మా" అన్నాను. "ఒక చిన్న గూడివ్వరా. ఒక్క దేవుడి పటం పెట్టుకుంటాను” అంది. “నువ్వు పూజలు చేయవుకదమ్మా. నీకు దేవుడి గూడెందుకు?” అన్నా నవ్వుతూ. "నేను పూజలు చేయననుకో. అయినా ఇంట్లో ఒక దేవుడి పటం అంటూ ఉండాలి కదా" అంది.
మా అమ్మ మాటను నేనెందుకు కాదనాలి!?
సరే అంటూ వంటింట్లో దేవుడి పటానికి ఒక గూటిని కేటాయించాను. మా అమ్మ ఎప్పుడూ ఆ దేవుడి గూడు దగ్గరకు వెళ్ళి దణ్డం పెట్టుకుంది లేదు.

అంత కాకపోయినా మా ఇంట్లో కూడా కాస్తో కూస్తో ఆచారాలున్నాయి. మగవాళ్ళు ఆదేశాలు జారీ చేస్తారు. మహిళలు ఆచారాలను పాటిస్తారు! అందుకునే నేమో తనకన్నా తక్కువ వయసున్న మహిళలనే పురుషులు పెళ్ళి చేసుకుంటారు. వయసులో పెద్దవారైతే వారి అధికారమే కొనసాగుతుంది కదా!

వయసులో మా అమ్మ కంటే మా నాన్న పదేళ్ళు పెద్ద. పాత తరంలో ఈ వయో భేదం ఇంకా ఎక్కువగా కూడా ఉండేది. వయసు రూపంలో కూడా మగ వాడి పెత్తనం కనిపిస్తోంది. అందుకేనేమో, పురుషులెవ్వరూ సమవయస్కులను కానీ, కాస్త పెద్ద వయసున్న వారిని కానీ పెళ్ళి చేసుకోరు.

ప్రతి ఏటా మా ఇంట్లో కూడా మా బామ్మకు, మా తాతయ్యకు మా నాన్న తద్దినాలు పెట్టేవాడు. మడికట్టుకుని చేసే వంటచాకిరీ అంతా మా అమ్మ పైన పడేది.

సూర్యుడు నడినెత్తికొస్తే తప్ప తద్దినం మొదలు పెట్టేవారు కారు. అప్పటి వరకు మడికట్టుకుని వంట పూర్తి చేయాలి. తద్దినం బ్రాహ్మల కోసం ఎదురుచూడాలి. ఆరోజు వాళ్ళకున్న డిమాండ్ మేరకు వాటిని ముగించుకుని, మనింటికి ఎప్పుడొస్తారో తెలియదు.

బ్రాహ్మలు మధ్యాహ్నం 12 గంటలకొస్తే మేం బతికి పోయినట్టే. తద్దినం పూర్తయ్యే సరికి ఏ మూడో అవుతుంది. వాళ్ళ భోజనాలై, మా అమ్మ భోజనానికి కూర్చునే సరికి సాయంత్రం నాలుగవుతుంది. అంత వరకు కాఫీ నీళ్ళు తప్ప ఏమీ తాగడానికి, తినడానికి వీలులేదు.

తద్దినం వంటలో కందిపప్పు వాడరు. పెసరపప్పు మాత్రమే చేస్తారు. ఉత్తి పెసర పప్పు, మూడు రకాల పచ్చళ్ళు, మూడు రకాల కూరలు, చారు, బూరెలు, గారెలు, పాయసం చేసినా నైవేద్యం పెట్టి, తద్దినం బ్రాహ్మలు తినే వరకు ఎవరూ ముట్టుకోవడానికి వీలుండేది కాదు. మా చిన్న తనంలో ఆ వంటకాలను చూస్తే నోరూరేది. కడుపులో ఆకలేసేది.

మా అమ్మదగ్గరకొచ్చి కళ్ళతో సైగ చేసేవాళ్ళం. “మీ నాన్న చూశారంటే ఇంకేమైనా ఉందా! నన్ను చంపేస్తార్రా” అనేది. దొడ్డివైపురమ్మని సైగ చేసేది. గారెలు, బూరెలు పెట్టి "మీ నాన్నకు తెలియకుండా దూరంగా వెళ్ళి తినండి" అనేది. వాటిని దాచుకుని ఎక్కడికో వెళ్ళి తినే వాళ్ళం. మా దొంగతనం ఎప్పుడూ బైటపడలేదు. బైటపడితే ఇంట్లో ఇక ప్రపంచ యుద్ధమే!

ఇప్పుడా సమస్య లేదు. మఠాలు వెలిసి చాలా మంది మహిళల్ని బతికించేశాయి. మఠాల్లో ముందుగా డబ్బు కడితే చాలు, అన్ని ఏర్పాట్లు చేస్తారు. వాళ్ళే మడి వంట, అక్కడే తద్దినం బ్రాహ్మలు. ఎంత మంది భోజనానికి వస్తామో, ఆ మేరకు డబ్బులు చెల్లిస్తే చాలు, అంత మంది వెళ్ళి తంతు పూర్తి చేసుకుని, భోజనాలు చేసి రావచ్చు.

ఒక సారి మధ్యాహ్నం ఒంటిగంట దాటినా తద్దినం బ్రాహ్మలు రాలేదు. మా నాన్న కాలు కాలిన పిల్లిలా వాళ్ళ కోసం పచార్లు చేస్తూ ఎదురు చూస్తున్నాడు. మా అమ్మ ఆకలికి తట్టుకోలేకపోతోంది. తడిగుడ్డల్తో ఉంది. కాళ్ళు ఒణుకుతున్నాయి.

పొద్దునెప్పుడో తాగిన కాఫీ నీళ్ళు. మా అమ్మ పరిస్థితిని నేను గమనిస్తున్నాను. ఏమీ చేయలేని నిస్సహాయత. మా అమ్మకు మాట తడబడుతోంది. నాకు దణ్ణం పెట్టేసింది.

“బాబూ..ఇవ్వన్నీ ఎవరుచూడొచ్చారు! ఎవరు తినొచ్చారు! నేను బతికున్నంత కాలం కాస్త బాగా చూస్తే చాలు. నేను పోయాక ఈ తద్ది నాలు పెట్టక్కర లేదు ” అన్నది. మా అమ్మ పరిస్థితి చూసే సరికి నా కళ్ళు చెమర్చాయి. మా అమ్మ మాట నన్ను వెంటాడుతూనే
ఉంది.
(ఇంకా ఉంది)


Read More
Next Story