చెట్టు చెట్టుకూ, పూల మొక్కకూ చివరి నమస్కారం
x

చెట్టు చెట్టుకూ, పూల మొక్కకూ చివరి నమస్కారం

గేటు తీసి లోపలికొస్తుండగా “చంద్రకాంతం మొక్కలు ఎట్లా ఉన్నాయి. పూలు పూస్తున్నాయా!?" అని అడిగింది. " పూస్తున్నాయి " అన్నాను. చంద్రకాంతం మొక్కకు దణ్ణం పెట్టింది.





అమ్మ చెప్పిన ముచ్చట్లు - 17


పెంకుటిల్లు తీసేసి అదే స్థలంలో కొత్త ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇంటికి 'విమలాదేవి నిలయం' అని పేరు పెట్టాం. ఆ పేరు చూసి ఎంత మురిసిపోయిందో మా అమ్మ! మా అమ్మ మంచం పక్కన టీపాయ్ పై కాలింగ్ బెల్ పెట్టాం. రాత్రి ఎప్పుడైనా అవసరమైతే బెల్ నొక్కమన్నాం. "బెల్ పనిచేస్తుందా లేదా, ఏదీ చూద్దాం" అని బెల్ నొక్కింది. అది గట్టిగా మోగింది. పగటి పూట కూడా తరుచూ బెల్ కొట్టేది. “ఏమ్మా ఏం కావాలి” అంటే, "ఏం లేదు, ఊరికే కొట్టా” అనేది నవ్వుతూ. ఎవరి పనుల్లో వాళ్ళుంటే, మళ్ళీ మళ్ళీ బెల్ కొట్టేది చిన్న పిల్లలా. నవ్వుకునే వాళ్ళం.

మా అమ్మ నిద్రలో మంచంపైనుంచి ఒక సారి పడిపోయింది. భుజం ఎముక బీటవారింది. అలా పడిపోకుండా ఆస్పత్రిలో లాగా మా తమ్ముడు మంచానికి రెయిలింగ్ ఏర్పాటు చేశాడు. అది ఏర్పాటు చేశాక మళ్ళీ మంచం నుంచి పడిపోలేదు.


పత్రికల్లో నేను నైట్ డ్యూటీ చేసి, ఎప్పుడో అర్థరాత్రి వచ్చి పడుకునేవాణ్ణి. లేపితే నాకు నిద్రా భంగమని, నన్ను లేపకుండా మా అమ్మ ఒక్కతే బాత్రూంకు వెళ్ళేది. శబ్దం అవుతుందని, చేతి కర్రను ఎత్తిపట్టుకుని మరీ నడిచేది. చీమ చిటుక్కుమన్నా నాకు మెలకువ వచ్చేది.

నాలుగేళ్ళ క్రితం వరకు మాది పెంకుటిల్లే . టాయిలెట్లు ఇంట్లోంచి ఉండేవి కాదు. బైట ఉండేవి. మా అమ్మ రాత్రి పూట వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేది. ఎప్పుడు లేచినా ఎక్కడ పడిపోతుందోనని, నేను ఆమె వెనకే వెళ్ళే వాణ్ణి. ఒక సారి బైటికి వచ్చి పైపు కింద కాళ్ళు కడుక్కోవాలని ప్రయత్నిస్తోంది. కానీ కాళ్ళు పైపు కిందకు రావడం లేదు. నాకు అనుమానం వచ్చి మా అమ్మ వెనకనే నుంచున్నా.


అట్లాగే వెనక్కి పడిపోయింది. కింద పడకుండా నేను పట్టుకున్నాను. నేను పట్టుకోకపోతే, వెనకే మా తాతల కాలం నాటి పెద్ద రోలు పైన తల పడిపోయేది. అలా స్పృహతప్పి పడిపోయాక పట్టుకుని "అమ్మా అమ్మా" అంటూ నేను, మా చెల్లెలు గట్టిగా ఊపాం. ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టాక కాసేపటికి స్పృహలోకి వచ్చింది. గుండె నుంచి మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో ఆటంకాలుంటే అలా పడిపోతారని న్యూరాలిజిస్ట్ చెప్పారు. అప్పటి నుంచి న్యూరాలజిస్ట్ మందులు మొదలయ్యాయి.


'విమలాదేవి నిలయం' అని పేరు పెట్టిన మా కొత్త ఇల్లు


మాకు తెలిసినంతలో మా అమ్మ ఎప్పుడూ చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీం రుచి చూసిన పాపాన పోలేదు. అలాగే బైటి వస్తువులు కూడా తినేది కాదు. రెండు మూడేళ్ళుగా పోలో, చాక్లెట్లు తెచ్చిపెట్టమనేది. అవి తెస్తే, బుగ్గన వేసుకునేది. అలాగే అప్పుడప్పుడూ ఐస్క్రీం కూడా తినేది. తన చిన్న మనవడు తినడం చూసి సాయంత్రమైతే సమోసానో, బోండానో తెచ్చిపెట్టమనేది. పెద్ద వయసొచ్చాక చాలా మంది పిల్లలైపోతారంటారు. బహుశా ఇలాగేనేమో!


మా అమ్మకు పొట్టలో నొప్పి వచ్చి గోధుమ రంగులో వాంతి చేసుకునేది.

గ్యాస్ట్రోఎంట్రాజిస్ట్ కు చూపిస్తే గాల్ బ్లాడర్లో స్లై డ్జ్ చేరిందన్నారు. గ్యాస్ట్రోఎంట్రాజి ఆస్పత్రిలో చేర్పించాం. మా అమ్మ మాటల్లో చెప్పాలంటే అది 'పొట్ట డాక్టర్ ఆస్పత్రి'. "తొంభై ఏళ్ళు దాటిన వయసులో మీకు ఆపరేషన్ చేయలేం. కాస్త ఆహార నిమయాలు పాటిస్తూ, మేం ఇచ్చే మందులు వాడితే నెట్టుకు రావచ్చు" అన్నారు డాక్టర్.

ఈ మాటలన్నీ విన్న మా అమ్మ "డాక్టర్ గారు, ఆవకాయ వేసుకోవచ్చా" అని అడిగింది అమాయకంగా. ఎందుకంటే మా అమ్మకు ఆవకాయంటే ప్రాణం కనుక. డాక్టర్ నవ్వుతూ "ఆవకాయ వేసుకుంటే మళ్ళీ ఐసీయులో కి రావాల్సి వస్తుందమ్మా'' అన్నారు. "అయితే ఆవకాయ వేసుకోలేను లెండి" అంది.

చాలా రోజులు ఆవకాయ వేసుకోకుండానే భోజనం చేసింది. మందులు క్రమం తప్పకుండా వేసుకునేది. మేం ఆవకాయ వేసుకుంటుంటే పాపం మా అమ్మకు నోరూరి, "ఏదీ కాస్త ఆవాకయ రుచి చూపించండి" అని అడిగేది. ఆమె మాటను కాదనలేక పిసరంతా ఆవకాయ వేసే వాళ్ళం. మా అమ్మకు ఆవకాయ ముక్క కొరుక్కుని తినాలని ఉండేది. కాదనలేక వారానికొక్క ఆవకాయ ముక్క వేసే వాళ్ళం. దాంతో ఎంత తృప్తిగా తినేదో! మాచెల్లెలు పిసరంత ఆవకాయవేస్తే “నాకు ఆవకాయ వేయడానికి నీకు చేతులు రావే. మీకు ఎంత చేస్తే ఇంత పెద్దవాళ్లయ్యారు!" అనేది నిష్టూరంగా.

అన్నం తిన్నాక మందులు వేసుకోవాలంటే మా అమ్మకు చాలా ఇబ్బందిగా ఉండేది. "కమ్మటి తిండి తిన్నాక ఈ మందులు వేసుకుంటుంటే నోరంతా అదోలా ఉంటోంది, నాలుకంతా చెడిపో తోంది.” అనేది.

ప్రతి ఆరు నెలలకు ఒక రోజు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్, న్యూరాలజిస్ట్ దగ్గరకు వరుసగా తీసుకెళ్ళి చూపించి మందులు వాడే వాళ్ళం. మరీ ఇబ్బందిగా ఉంటే ఆరునెలల కొకసారైనా కార్డియాలజీ ఆస్పత్రిలో చేర్చే వాళ్ళం. మాకిది మామూలైపోయింది. మా అమ్మకు అలవాటైపోయింది. ఈ నాలుగు ఆస్పత్రుల్లో విమలాదేవి అంటే చాలు, ఎంత మంది రోగులున్నా డాక్టర్ ముందుగా మా అమ్మను చూసేవారు.

గత ఏడాది మార్చిలో మా అమ్మకు జ్వరం, ఆయాసంతో పాటు, నడవలేని స్థితి ఏర్పడింది. యధావిధిగా కార్డియాలజిస్ట్ ఆస్పత్రిలో చేర్పించాం. కోలుకుందని తొమ్మిది రోజులకు ఇంటికి పంపించేశారు. మళ్ళీ నాలుగు రోజులకు జ్వరం విపరీతంగా వచ్చింది. గ్యాస్ట్రో ఎంట్రాలజి ఆస్పత్రిలో చూపించాం. జన్రల్ ఫిజీషియన్ ఉండే ఆస్పత్రిలో చేర్పించి అవసరమైన మిగతా డాక్టర్లను పిలిపించండని సలహా ఇచ్చారు.

స్విమ్స్ లో చేర్పిద్దామని ప్రయత్నించాం. డెబ్భై ఏళ్ళు దాటిన వాళ్ళను స్విమ్స్ లో పెద్దగా పట్టించుకోరని, ఎలాగో పోయే వాళ్ళకోసం రోజుల తరబడి ఒక బెడ్ ను ఎందుకివ్వాల ని అనుకుంటారని అక్కడ పనిచేసే ఒక ఉద్యోగి చెప్పారు. చూస్తూ చూస్తూ ఆమెను అలా బలిచేయలేం కదా!

అదే అంబులెన్స్ లో మరొక కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్ళాం. మా అమ్మ ఉన్న అంబులెన్సును సెల్లార్లోనే చాలా సేపు ఉంచారు. సీరియస్ గా ఉందన్నా ముందు ఒక డాక్టర్ వచ్చి అన్నీ మాట్లాడాకే చేర్చుకుంటాం అన్నారు. చాలా సేపటికి ఒక డాక్టర్ అంబులెన్స్ దగ్గరకే వచ్చారు. ఆ డాక్టర్ వచ్చి ముందు ఇంత డబ్బులవుతాయని చెప్పారు. మీకు సమ్మతమైతే చేర్చుకుంటాం, గ్యారంటీ ఇవ్వలేం అని చెప్పేశాడు మా అమ్మను చూడ కుండానే. ఎంతైనా ఫరవాలేదు, ముందు ట్రీట్మెంట్ మొదలు పెట్టండని అడిగాం.

అసలు పేషెంట్ పరిస్థితి ఏమిటి, చికిత్స ఏమిటనే కంటే ముందు బిల్లు గురించి చెప్పి వెళ్ళారు. మా అమ్మను ఐసీయూలో చేర్పారు. ఏ అర్హత ఉన్న డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో బైటికి తెలియదు. ఒక రోజంతా ఐసీయూలో పెట్టుకుని వేరే రూంకు మార్చారు.

ఆరు రోజులు ఆ ఆస్పత్రిలోనే ఉంది. డాక్టర్లు వచ్చి చూసి, టెస్ట్ లు రాసేవారు కానీ, రిజల్టు వచ్చేదో లేదో తెలియదు. మందులు రాసిచ్చేవారు. ఆమె పరిస్థితి ఏమీ మారలేదు.

మా అమ్మ ఆస్పత్రిలో చేరిందంటే మాకు తెలిసిన వాళ్ళంతా వచ్చి చూసిపోతున్నారు. మా అమ్మ చిత్రాన్ని వాటర్ కలర్స్ తో వేసిన ఆర్టిస్ట్ కిరణ్ కుమారి వచ్చి పలరించారు. ''నేనెవరో గుర్తున్నానమ్మా'' అని కిరణ్ కుమారి అడిగారు. "నాకెందుకు గుర్తు లేవమ్మా . నా బొమ్మేశారు గా" అంది. అప్పటికే పార్కిన్సన్ అదుపు తప్పి మా అమ్మ ఊగిపోతోంది.



ఆస్పత్రి బెడ్ పైన ఊగిపోతూ చివరి పాటలు పాడుతున్న విమలాదేవి


ఆస్పత్రి బెడ్ పై పార్కిన్సన్తో ఊగిపోతున్నా ఏ మాత్రం ఆపకుండా అయిదు పాటలు పాడింది. పాడుతున్నంత సేపూ ఆస్పత్రి నర్సులు కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఆరోగ్యం బాగుండకపోయినా పాటలు పాడడం ఆపలేదు. మా అమ్మకు పాటలంటే ప్రాణం. ఆస్పత్రిలో వారం రోజులున్నాక, “మందులు రాసిస్తాం తీసుకెళ్ళిపోండి " అన్నారు.


ఆస్పత్రికి తీసుకెళ్ళేటప్పుడు అంబులెన్స్ లోనో, కారులోనో తీసుకెళ్ళే వాళ్ళం. వచ్చేటప్పుడు ఎప్పుడూ అంబెలెన్స్ లో తీసుకురాలేదు. కానీ ఈ తడవ మా అమ్మ కూర్చునే పరిస్తితి లేదు. తొలుత ఆస్పత్రికి వెళ్ళేటప్పుడు కారులో వెళ్ళిన మా అమ్మ ఇంటికి కూడా అంబెలెన్స్ లో తీసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంబెలెన్స్ లోంచి స్టెచర్లో పడుకోబెట్టి మా కాంపౌండ్ లోకి తీసుకొస్తున్నాం.

గేటు తీసి లోపలికొస్తుండగా “చంద్రకాంతం మొక్కలు ఎట్లా ఉన్నాయి. పూలు పూస్తున్నాయా!?" అని అడిగింది. " పూస్తున్నాయమ్మా చూడు" అన్నాను. చంద్రకాంతం మొక్కకు దణ్ణం పెట్టింది. చంద్రకాంతం అంటే మా అమ్మకు ఎంత ఇష్టమో! మొక్కలను, చెట్లను ఇష్టపడుతోందని "ఇదిగో ఇది కనకాంబరం" అన్నా. దానికి కూడా దణ్ణం పెట్టింది. వరుసగా పారిజాతం, రాధామనోహరం, మందారం, నూరు వరహాలు, మల్లె వంటి పూలమొక్కలతో పాటు కొబ్బరి, దబ్బ చెట్లను కూడా చూపించా. ఇంట్లోకి అడుగుపెట్టేంతవరకు ప్రతి మొక్కకు, ప్రతి చెట్టుకు దణ్ణం పెడుతూనే ఉంది. చివరగా తులసి మొక్కకు కూడా దణ్ణ పెట్టేసింది.


స్ట్రెచర్ పై చివరి సారిగా ఇంట్లోకి వస్తూ, మా అమ్మ దణ్ణం పెట్టిన చెట్లు, పూల మొక్కలు.


తన మంచంపైన పడుకోబెడుతుంటే, ఆస్పత్రి నుంచి, విముక్తి అయినందుకు "హమ్మయ్యా" అంటూ ఊపిరి పీల్చుకుంది. ఎప్పుడైనా సరే ఆస్పత్రినుంచి ఇంటికి రాగానే ఎంత ఆనందంగా ఉండేదో! "మన ఇల్లు, మన వాకిలీ" అనేది తృప్తిగా. ఇంటికి రాగానే "ఏదీ కాఫీ ఇవ్వండి" 'అన్నది. పిల్లలంతా చుట్టూ ఉండడం ఎంత తృప్తిగా ఉందో! కానీ, శరీరం సహకరించడం లేదు.


ఆస్పత్రి నుంచి ఇంటికి రావడానికి ముందే ఆ ఆస్పత్రి గౌన్ ఎప్పుడెప్పుడు వదిలేద్దామా అనుకునేది. చీరకట్టుకున్నాక ఎంత తృప్తిగా ఉండేదో! చిన్నప్పటి నుంచి అలవాటైన చీర కదా! ఈ తడవ లేచి కూర్చోలేకపోతోంది. తనంతట తాను వాష్రూంకు వెళ్ళలేకపోతోంది. ఆస్పత్రి గౌన్ అలాగే ఉంచమన్నారు డాక్టర్లు.

మా అమ్మ కు చాలా ఆప్తులు ప్రేమావతి గారు, కిరణ్ కుమారి గారు మా అమ్మను చూడడానికి వచ్చారు. "అమ్మా..నే నె వ రో గుర్తు పట్టారా " అని అడిగారు ప్రేమావతి గారు. " ఏమో, " అంది
"అమ్మా..నే నెవరో గుర్తు పట్టారా? " అన్నారు కిరణ్ కుమారి గారు. కిరణ్ కుమారి గారు వేసిన మా అమ్మ బొమ్మ కేసి చూపించింది వేలు చూపుతో.

ఒక డాక్టర్ ను ఇంటికే తీసుకొచ్చి, ఆయన పర్యవేక్షణలో ఆస్పత్రిలో రాసిచ్చిన ఇంజెక్షన్లు, మందులు వాడుతూనే ఉన్నాం. "బలానికి ఒక ఇంజక్షన్ నరానికి ఇవ్వాలి" అన్నారు డాక్టర్.

ఎంత ప్రయత్నించినా నరం దొరకలేదు. గుచ్చినప్పుడల్లా విలవిల్లాడిపోయేది. వద్దంటే వద్దనేది. "అమ్మా.. ఈ ఒక్క సారి ప్రయత్నించని" అన్నాను చెయ్యిపట్టుకుని. నా మాట కాదనలేక “సరే” అంది. సరే అన్నదని సంతోషించా. కానీ, మా అమ్మ అన్న "సరే" మాటకు "నీ పశుబలానికి లొంగిపోతున్నా" అన్నట్టుంది మా అమ్మ మాట ఆ తరువాత ఆలోచిస్తే.

ఆకారానికే తప్ప శరీరంలో కండ లేదు, కొవ్వు లేదు. నేను బలవంతంగా చేయిపట్టుకుంటే, డాక్టర్ ఇంక్షన్ ఇస్తున్నప్పుడు మా అమ్మ ఎంత విలవిల్లా డిపోయిందో! బతుకుతుందని ఇంక్షన్ ఇప్పించామే కానీ, చివరి రోజుల్లో ఇంతకంటే నరకం
ఏముంటుంది?

అమ్మ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఊగిపోతున్న మా అమ్మను వీడియో తీసి యూరాలజిస్ట్ దగ్గరకెళ్ళి చూపిస్తే, న్యూరో సైకియాట్రిస్ట్కు కు చూపించమన్నారు. దగ్గరలో ఉన్న న్యూరో సైకియాట్రిస్ట్ కు చూపిస్తే,ఆ వీడియో చూసి "డ్యులీరియం స్టేజి వచ్చేసింది” అన్నారు. “అంటే ఏమిటండి" అన్నాం నేను, మా చెల్లెలు. "డ్యులీరియం స్టేజి వస్తే బతకడం కష్టం. కొద్ది రోజులు తప్ప ఎక్కువకాలం బతక లేరు” అన్నారు. "అంటే ఎన్ని రోజులు ?" అన్నాం ఆతృతగా. "చెప్పలేం.” అన్నారు.

కొన్ని రోజులైనా బతుకుతుంది లే అనుకున్నాం. 'డ్యులీరియం స్టేజి' మాట విన్న మరుసటి రోజు పరిస్థితి మరీ క్షీణించింది. ఆహారం పోవడం లేదు. బలవంతంగా పెట్టినా తినడం లేదు. మందులు మింగడం లేదు. చేదు మాత్రలను కూడా బుగ్గలో పెట్టుకుంటోంది. మేం లేనప్పుడు చూసి నోట్లోంచి తీసి పరుపు కింద దాచేస్తోంది. అంటే ఏమీ నోట్లోకి పోవటం లేదు. నోరు ఎండిపోకుండా చెంచాతో మంచి నీళ్ళు పోస్తూనే ఉన్నాం .

గత ఏడాది మార్చి 17వ తేదీ తెల్లవారు జామున నోట్లో నీళ్ళు పోసినా మింగలేదు. శరీరం చల్లబడిపోయింది. ఆస్పత్రికి తీసుకెళదామని 108కు ఫోన్ చేస్తే, టెక్నిషియన్ వచ్చి చూసి అయిపోయిందన్నారు.
ఇంట్లో అంతా ఘోల్లుమన్నారు.

నాకు తెలిసి ఎప్పుడూ ఏడవని నేను, జీవితంలో మొదటి సారి ఏడుపు ఆపుకోలేకపోయా. జీవితంలో ఇంతకంటే విషాధం ఏముంటుంది!?

మా బాదం చెట్టునుంచి పండి పోయిన ఆకు అల్లల్లాడుతూ నేలకు రాలిపోయినట్టు, తొంభై ఒక్క సంవత్సరాల పండి పోయిన మా అమ్మ జీవితం కూడా చివరికి అల్లాడిపోతూ అలా రాలిపోయింది.

(సమాప్తం)


Read More
Next Story