ఆమె మరో సావిత్రీ బాయ్ పూలేనే!
x
న్యూస్ పేపర్ చదువుతున్న ఆలూరు విమాలదేవి

ఆమె మరో సావిత్రీ బాయ్ పూలేనే!

"చదువు లేకపోతే ఇదిగో నాలాగా ఇంట్లో అంట్లు తోముకుంటూ, మొగుడు దగ్గర ఛీ ఛా అనిపించుకోవాలి.పెళ్ళి తరువాత అలోచిద్దాం ముందు చదివించండి” అమ్మ చెప్పిన ముచ్చట్లు -13



అమ్మ చెప్పిన ముచ్చట్లు -13


ఒక సారి మా అమ్మను ఆస్పత్రిలో చేర్చాం. ఇరవై ఏళ్ళుగా ఆమెకు వైద్యం చేయిస్తున్నాం. అనేక మంది డాక్టర్లు రాసిన అనేక రకాల మందులు వాడాల్సి వస్తోంది.


“ఇన్ని రకాల మందులా!” అంటూ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్, ఇతర సిబ్బంది ఆశ్చర్యపోయేవారు. ఒక సారి ఐసీయూలో చేర్చినప్పుడు కార్డియాలజిస్ట్ నర్సును పిలిచి "వీరికి చాలా మందులు ఉన్నాయి. టైం ప్రకారం మందులు జాగ్రత్తగా వాడాలి. ఏ మాత్రం తేడా వచ్చినా చర్యతీసుకుంటా" అని హెచ్చరించి వెళ్ళి పోయారు. పాపం ఆ నర్సు బిక్కమొహం వేసింది.

మా అమ్మకు వాడే మందులు వేయడం మాకు అలవాటైపోయాయి. ఆ మందులు మా కంటే మా అమ్మకే ఇంకా ఎక్కువగా అలవాటైపోయాయి. మేం ట్యాబ్లెట్లు ఇచ్చినా తను చూడందే వేసుకునేది కాదు.

ఐసీయులో నర్సు ఇచ్చిన మందులను గుడ్డిగా మింగకుండా, మా అమ్మ వాటిని తీసుకుని మళ్ళీ చూ సేది. "ఇది నరాల డాక్టరిచ్చింది. ఇది పొట్ట డాక్టరిచ్చింది. ఇది ఊపిరి తిత్తుల డాక్టరిచ్చింది. ఇది గుండె డాక్టరిచ్చింది.” అంటూ వరుసగా మందుల గురించి చెప్పుకుంటూ పోతోంది.

ఆ నర్సుకు ఆశ్చర్యమేసింది. “అవ్వా ఇంత బాగా చెపుతున్నావు. ఏం చదువుకున్నావవ్వా నువ్వు!?” అని అడిగింది. "నేను చదువుకోకపోతే ఏం? నా పిల్లలందరినీ చదివించా" అనేసింది విజయగర్వంతో.

నిజానికి మా అమ్మ నాలుగవ తరగతి వరకే చదువుకుంది. “నా మగ పిల్లల్నే కాదు, నా ఆడపిల్లల్ని కూడా చదివించా” అన్నది. మా అమ్మ ముఖంలో ఒక గంభీరమైన గర్వం కొట్టవచ్చినట్టుగా కనిపించింది.

మందుల విషయంలో మహా జాగ్రత్తగా ఉండేది. నేను రెండు రకాల ఇన్సులిన్ తీసుకుంటాను. ఏదో ఆలోచనలో ఉండి పొరపాటున ఒక దాని బదులు మరొకటి తెచ్చు కుంటే "ఇది తెచ్చు కున్నా వే మి టి?" అనేది.


ఎప్పుడన్నా మా అమ్మ గట్టిగా మా నాన్నను ప్రశ్నిస్తే, ఆయన దగ్గర సమాధానం ఉండేది కాదు. "మీ అమ్మ పొరపాటు చేసిందే. నిన్ను లా చదివించినట్టయితే లాయరయ్యేదానివి." అనే వాడు.

అడపిల్లలికి కాస్త చదువుంటే చాలు, ఎక్కువ అవసరం లేదనుకునేవాడు మా నాన్న. వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తే భారం తీరిపోతుందనుకునేది మా శేషమ్మత్తయ్య. ఆడ పిల్లల చదువుల కు మా నాన్న ఆటంక పరిచినప్పుడల్లా మా అమ్మ అడ్డుతగులుతుండేది.

మా అక్క పదవతరగతిలో ఉండగానే పద్నాలుగేళ్ళ వయసులో పదిహేడేళ్ళ మా బావ నిచ్చి పెళ్ళి చేశారు. చిన్న వయసులోనే పిల్లలు పుట్టారు. “చదువు లేకపోవడం వల్ల పెద్దపాపకు బుర్ర ఎదగలే దే" అనేది మా అమ్మ.

తరువాత తన పిల్లల్ని చదివించింది. చదువు విషయంలో మా అమ్మ మా నాన్నతో అనేక సార్లు పోట్లాడింది.

మా పెద్దచెల్లెల్ని పాలిటెక్నిక్ చదివించింది. మా రెండవ చెల్లెలికి డిగ్రీ అయిపోయాక ప్రొద్దుటూరులోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో సీటొచ్చింది. “నీ పెళ్ళి కోసం దాచిన డబ్బులు చదువుకు ఖర్చుపెడితే ఎలా?" అన్నాడు మా నాన్న. అడ పిల్లలికి చదువులు, ఈ అటలెందుకన్నది మా శేషమ్మత్తయ్య.

“చదువు లేకపోతే ఇదిగో నాలాగా ఇంట్లో అంట్లు తోముకుంటూ, మీ లాంటి మొగుడు దగ్గర ఛీ ఛా అనిపించుకుంటూ ఉండాలి. పెళ్ళి గురించి తరువాత అలోచిద్దాం ముందు చదివించండి” అంది మా అమ్మ కాస్త గొంతు పెంచుతూ.




నేను కూడా సమర్ధించడంతో మా అమ్మ మాటే నెగ్గింది. మా చెల్లెలు బాస్కెట్ బాల్ ప్లేయరైంది. పంజాబ్ లోని పాటియాలాలో బాస్కెట్ బాల్ కోచ్ గా శిక్షణ పొందడానికి ఎన్.ఐ.ఎస్ చేయాలంది. కూతురు చదువుకోసం మా అమ్మ మళ్ళీ పట్టుబట్టింది.

"ఈ ఇంట్లో నా మాట ఎవ్వరూ వినే స్థితిలో లేరు" అంటూ మా నాన్న తల పట్టుకున్నాడు. చివరికి మా అమ్మ మాటే నెగ్గింది. మా మూడో చెల్లె లు అత్త గారింట్లో సమస్యల వల్ల కొడుకును తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. ఆమెను కూడా మళ్ళీ బీయీడీ చదివించింది.

మేముండేది తిరుపతి శివార్లలోని ఉల్లిపట్టెడ గ్రామంలో. ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్లో కలిసిపోయింది. ఒకప్పుడు అది పల్లెటూరే. మా ఇంటి ఎదురు గుండానే ప్రైమరీ స్కూల్ ఉండేది. అందులో మా చివరి చెల్లెలుచేరింది. ఇంటి ఎదురుకుండా ఉంది కనుక ఇబ్బంది లేదనుకున్నాం.

అక్కడి వాతావరణం మా అమ్మకు నచ్చలేదు. చదువు సరిగా లేదని గమనించింది. టౌన్ లో ఉన్న దేవస్థానం బాలికల స్కూల్లో చేర్పించేంత వరకు పోరు పెట్టింది.

మా చివరి చెల్లెలి భర్త పోయేసరికి, కొడుకును తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. మా చెల్లెలిని మా అమ్మ మళ్ళీ కాలేజీలో చేర్పించి చదివించింది. వరుసగా అయిదు పీజీలు, పీహెచ్ డీ చేసేవరకు కూడా మా అమ్మ ఇంట్లో పనులన్నీ తానే చేస్తో, చదువును ప్రోత్సహించింది.

చదువుకోకపోవడం వల్లే జీవితంలో అవస్తలు పడ్డానని బలంగా నమ్మింది. పెద్ద కూతురుకు పెద్దగా చదివించలేకపోయానని బాధపడిపోయేది.

మా అమ్మ తన చెల్లెలిని , ఇద్దరు తమ్ముళ్ళను, మరిదినీ తీసుకొచ్చి చదివించింది.

నేను ఏ పేపర్లో పనిచేస్తే ఆ పేపరు మా ఇంటికి వచ్చేది. నేను చదివాక మా అమ్మ కూడా పేపరుచదివేది. ముఖ్యంగా నేను రిటైరయ్యాక, మా అమ్మ కూడా వంటింటి నుంచి రిటైరైంది. అంటే ఎనభైరెండేళ్ళ వయసులోనూ పేపరు వదలకుండా చదివేది.

అర్థం కాని విషయాలను అడిగేది. మా అమ్మకు రాను రాను కళ్ళు మసకబారుతున్నాయి. దాంతో చిన్న అక్షరాలు చదవలేకపోయేది. హెడ్డింగుల వరకు చదివి వదిలేసేది.

"డాక్టరుకు చూపించి కళ్ళ జోడు వేయిస్తానమ్మా” అంటే “ఈ వయసులో నాకు కళ్ళజోడెందుకు? ఉద్యోగం చేయాలా! ఊళ్ళేలాలా?” అనేది. మరో నెల రోజులకు కన్నుమూస్తుందనే వరకు కూడా పేపరు చదివేది.

ఒక్కొక్క సారి నా చేతిలో పేపరు లాక్కుని మరీ చదివేది. నవ్వుతూ “అమ్మకు ఇంత పేపరు పిచ్చేంటి?" అనే వాళ్ళు మా చెల్లెళ్ళు.

వనపర్తి ప్యాలెస్ ఆవరణలోని క్వార్టర్స్ లో ఉండగా, ఎవరింట్లో పేరంటం జరిగినా మా అమ్మను పిలిచేవాళ్ళు. "విమలమ్మ గారు ఒక పాట పాడండి" అనేవారు. మా అమ్మ పాటతోనే పేరంటం మొదలయ్యేది.

సంగీతం కూడా ఒక చదువే అనుకునేది మా అమ్మ. పాటలంటే ఆమెకు ప్రాణం. సందర్భం వచ్చినప్పుడల్లా ఆ సందర్భానికి తగిన పాటలు పాడేది.

ఎం.ఎస్. సుబ్బలక్ష్మి అన్నా, మంగళం పల్లి బాలమురళీ కృష్ణ అన్నా ఆమెకు చచ్చే ఇష్టం. వాళ్ళ కీర్తలను వినేది. అందుకునే పెద్ద కూతురికి సుబ్బలక్ష్మి అని పేరు పెట్టుకుంది.

సెల్ పోన్లు వచ్చాక చెవుల్లో ఇయర్ ఫోన్లు పెట్టుకుని మరీ పాటలు వినేది. పిల్లలు పెద్ద వాళ్ళయినా తన దృష్టిలో వాళ్ళను పిల్లలుగా నే భావించేది. పెద్ద వాళ్ళైన తన పిల్లల్ని కూడా చెక్క ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపుతూ "జో అచ్చుతానంద జోజోముకుందా" అంటూ పాడేది. అందరూ నవ్వుకునే వాళ్ళు.




మా అమ్మ పాడే పెళ్ళి పాటలు చాలా సరదాగా ఉండేవి. వియ్యపు రాలి గురించి మా అమ్మ పాడే పాటలో నాకు గుర్తున్న చరణాలిలా ఉన్నాయి.

"వియ్యపు రాలా
ఓ వయ్యారి లోల
నీ వయ్యారమిక చాలునే
నీ వయ్యారమిక చాలునే
గయ్యాళి మారి
ఓ గయ్యాళి గంప
నీ కయ్యాట మిక ఏలనే

పానకపు బిందేలు,
పలుదోము పుల్లాలు
పడతిలో నీ కోసమే
ఒళ్ళుసొగసే కానీ
పళ్ళైనా తోమావు
వయ్యారమిక చాలునే
విసవిసలాడే వియ్యపు రాలా విస్తళ్ళు తేవమ్మా
బంతికొడ్డించరావే
ఓ వగలాడి బంతి కొడ్డించరావే

తక్కిడి బిక్కిడి వియ్యపురాల
ఎక్కడ దొరికితివమ్మా మాకు
బంతికొడ్డించరావే
ఓ వగలాడి బంతి కొడ్డించరావే"

ఇలా చాలా సరదాగా ఉండేవి పాటలు. మా మేనల్లుడి పెళ్ళి సందర్భంగా మా ఇంటికొచ్చినావిడ ఒకరు పాటపాడమని మా అమ్మని అడిగింది.

వియ్యపు రాలిపాట పాడే సరికి, తనకు తగిలి వస్తుందని చివాలున లేచి వెళ్ళిపోయింది. మా అమ్మకు కాదుకానీ ఆమె, మా చెల్లెలికి వియ్యపురాలు.

ఒక సారి మా చివరి చెల్లెలితో "ఇన్ని డిగ్రీలు సంపాదించావు. ఏదీ నాలాగా ఒక్క పాట పాడు చూద్దాం" అని సవాలు విసిరింది.
"అమ్మా నేను నీ కోసమైనా పాటలు నేర్చుకుని పాడి వినిపిస్తా” అంది
మా అమ్మ సవాలును స్వీకరిస్తూ.

యాభై ఏళ్ళ వయసులో పాటలు నేర్చుకోవడం కోసం మ్యూజిక్ కాలేజీలో చేరింది. మా అమ్మ పోయినా, ఆమె కోసం ఇప్పటికీ సంగీతం నేర్చుకుంటోంది.

మా అరెండో చెల్లెలికి కూడా అదే విధంగా సవాలు విసిరింది మాఅమ్మ. “పీహెచ్ డీలు చేయడం, యూనివర్సిటీలో ఉద్యోగం సంపాదించడం కాదు, ఏదీ నాలాగా ఒక పాట పాడు." అంది.

మా చెల్లెలు దణ్ణం పెట్టేసి
“అమ్మా.. రిటైర్డ్ మెంట్ వయసులో పాటలు నేర్చుకుని పాడలేను కానీ, నన్ను వదిలేయ్. నన్ను క్షమించు.” అంది వేడుకుంటూ.

నిజం చెప్పాలంటే, మా అమ్మ మా ఇంటి వరకు మరో సావిత్రీ బాయ్ పూలేనే!
(ఇంకా ఉంది)


Read More
Next Story