పెళ్ళాన్ని కొట్టని మగవాళ్ళుంటారా!?
x
ఆలూరు విమలాదేవి

పెళ్ళాన్ని కొట్టని మగవాళ్ళుంటారా!?

భర్త చేతిలో దెబ్బతిన్న భార్య ఒకటి రెండు రోజులు బయట మొహం చూపించడానికి సిగ్గుపడుతుంది. మూడవ రోజు నుంచి షరా మామూలే. అమ్మ చెప్పిన ముచ్చట్లు -14



అమ్మ చెప్పిన ముచ్చట్లు -14


“అమ్మా..నాన్న ఎప్పుడైనా నిన్ను కొట్టాడా?" అని అడిగాను అమాయకంగా. "పెళ్ళాన్ని కొట్టని మగవాళ్ళు ఎక్కడైనా ఉంటారా బాబూ..?” అంది మా అమ్మ ఎదురు ప్రశ్న వేస్తూ. ఆ సమాధానానికి ఆశ్చర్య పోయాను.

"పెళ్ళాన్ని కొట్టని మగవాళ్ళు ఈ కాలంలో ఉన్నారేమో కానీ, మా కాలంలో లేరు నాన్నా ” అంది తన ప్రశ్నకు తానే సమాధానం చెపుతూ. ఇలా చెప్పడం మొదలుపెట్టింది.

"మీ నాన్న మిలటరీలో ఉన్నప్పుడే మా పెళ్ళైంది. నాకు చాలా చిన్న వయసు. పదహారేళ్ళుంటాయి. మా కాపురం చూద్దామని మా రావుడు మావయ్య మా ఇంటికి వచ్చాడు. ఎందుకంటే మా సంబంధం తానే కుదిర్చినాడు కనుక.

'నా బూటుకు పాలిష్ వెయ్' అన్నాడు మీ నాన్న. మా ఇంట్లో ఎవరూ బూట్లు వేసుకునే వాళ్ళు లేరు. అందుకుని ఆ పాలిష్ వేయడం నాకు చేతకాదు. 'సరే” అని నాకు చేతనైనట్టు పాలిష్ వేశా.
బూట్లు వేసుకుంటు న్నాక 'పాలిష్ వేసేది ఇట్లాగానే?' అంటూ మీ నాన్న నన్ను ఒక్క తోపు తోశాడు. దాంతో అవతల వెళ్ళి పడ్డాను.

ఏం జరుగుతోందో నాకర్థం కాలేదు. అదే తొలి సారిగా దెబ్బ తినడం. మా ఇంట్లో నన్నెవరూ కొట్టే వాళ్ళు కాదు. అంతా ప్రేమగా చూసేవారు. మా అమ్మ ఎంత గయ్యాళైనా, ఆమె అంటే భయముండేదే కానీ, నన్ను ఎప్పుడూ కొట్టలేదు.

'గోపాలరావూ.. విమల చిన్నపిల్లయ్యా. అట్లా తోయ బోకయ్యా. నీకు పని ఎట్లా కావాలంటే అట్లా చెప్పి చేయించుకోవయ్యా' అన్నాడు మా రావుడు మావయ్య బతిమాలుకుంటున్నట్టు.

మా మావయ్య మనసు ఎంత బాధపడితేనో ఆ మాట అన్నాడు. ఈసంఘటనతో మొదలై, జీవితంలో అప్పుడప్పుడూ ఆయన చేతిలో దెబ్బలు తినడం మామూలైపోయింది. మీరంతా పెద్దవాళ్ళవుతున్నకొద్దీ నన్ను కొట్టడం మానేశాడు మీ నాన్న.
పిల్లలు పెరుగుతుంటే మీ నాన్నకు కోపమూ తగ్గింది.

నాపెళ్ళైన కొత్తల్లో సెలవులకని మీ నాన్న బాపట్ల వచ్చాడు. నేను కూడా బాపట్లలోనే ఉన్నాను. బాపట్ల వారి వీధిలో మా మావగారి ఇల్లు చివరి ఇల్లని చెప్పానుకదా. మా ఇల్లు దాటితే అగ్రికల్చరల్ కాలేజీ కాంపౌండ్ వాల్. ఆ కాంపౌండ్ వాల్ ను అనుకుని, ఆ వరుసగా యానాదులు గుడిసెలు వేసుకుని ఉండేవాళ్ళు.

మీ నాన్న ఎంత పొగరుబోతుగా ఉండేవాడో, మీ పెదనాన్న అంత మెతకు మనిషి. ఒక సారి ఏమైందంటే, పొద్దున పూట మీ నాన్న ఇంకా నిద్రలేవలేదు. మా బావగారు, అంటే మీ పెదనాన్న టాయిలెట్ కు వెళ్ళాడు. యానాదులు పెంచుకునే ఒక పంది టాయిలెట్ తలుపు తోసుకుని లోపలకు వచ్చేసింది.

'ఒరేయ్ గోపయ్యా.. ఈ పంది నన్ను చంపేస్తోందిరా' అని గట్టిగా అరిచాడు. మీ పెద నాన్న అసలే పిరికి వాడు. ఆ అరుపు విని పందులను మేపుకునే యానాదతను టాయిలెట్ దగ్గరకు వచ్చాడు. నిద్రలో ఉన్న మీ నాన్న కర్ర తీసుకుని టాయిలెట్ దగ్గరకొచ్చి, పందిని కొట్టకుండా యానాదతని తలపగలకొట్టాడు.

ఇంకేముంది యానాదులంతా ఏడుపులు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్ళి కుట్లు వేయించి, కట్టుకట్టించి తీసుకొచ్చి వాళ్ళ గుడిసెలో పడుకోబెట్టారు. ఇంట్లో మేమంతా ఒకటే ఖంగారు పడిపోయాం. గొడవ జరుగుతుందేమో అని భయపడ్డాను కానీ, పాపం యానాదులు మీ నాన్న పైన కేసు పెట్టలేదు. ఆస్పత్రిలో కట్టుకట్టించి ఇంటికి తీసుకొచ్చారు. మీ నాన్న అంత పొగరుబోతు.” అని చెప్పింది మా అమ్మ.

బాపట్లలో మా పెదనాన్న ఇంటిని మా శేషమ్మత్తయ్య కొనుక్కుని ఆ ఇంట్లోనే ఒంటరిగా ఉంటోంది. మానాన్న పోర్షన్ను మా దాయాదులెవరో కొనుక్కున్నారు. మా మేనత్త ఇంట్లోనే ఉండి నేను డిగ్రీ చదువుతున్నాను. అప్పుడెప్పుడో మేం పుట్టకముందు మా నాన్న చేతిలో దెబ్బతిన్న యానాదతను మా ఇంటికి వచ్చాడు. నన్ను చాలా అప్యాయంగా పలకరించాడు.

“తవరు గోపాలరావుగారి అబ్బాయా! ఇక్కడ చదువుకోవడానికి వచ్చారా? చిన్నప్పుడు మీ నాన్న నా తల పొగలకొట్టాడండయ్యా చూడండి బాబు” అని నవ్వుతూ అతను తన తలను నాకు చూపించాడు.

తల పైన దెబ్బ పడి చీరి, మానిన గాయం పెద్ద మచ్చగా కనిపిస్తోంది. నాకు చాలా బాధనిపించింది. నేనక్కడ చదువుకుంటున్నంత కాలం ఆ యానాదతనికి నేను కనిపించినప్పుడల్లా నన్ను చూసి నవ్వే వాడు. ఏ కల్మషం లేని అతని నవ్వు చాలా నిర్మలంగా ఉండేది. అతను నవ్వినప్పుడల్లా నేనే ఏదో తప్పు చేసినట్టు బాధనిపించేది. అత్మన్యూనతా భావంలో తలదించుకునే వాణ్ణి.

"పెళ్ళాన్ని కొట్టని మగవాళ్ళు ఎక్కడైనా ఉంటారా బాబూ..?” అన్న మా అమ్మ మాట నాకు మళ్ళీ గుర్తుకొచ్చింది. మా బందువుల్లో ఒకామెను భర్త ఒక సారి కొట్టడానికి చెయ్యెత్తాడు. “మర్యాదగా చెయ్యి
దించండి. నేను మీ చెయ్యి మెలి పెట్టి తిరిగి కొడితే మీ పరువేమవుతుంది" అన్నదా ఇల్లాలు. అంతే ఆయన చేయిదించేసి తలొంచుకు వెళ్ళిపోయాడు.

భర్త చేతిలో దెబ్బతిన్న భార్యగురించి బైటికి తెలిసినా, ఒకటి రెండు రోజులు ఆ ఇల్లాలు మొహం చూపించడానికి సిగ్గుపడుతుంది. మూడవ రోజు నుంచి షరా మామూలే. ఏమీ జరగనట్టు, జరిగినా ఏమీ ఎరగనట్టు చుట్టు పక్కల వాళ్ళు కూడా అలా ఉండిపోతారు.

అదే భార్య చేతిలో భర్త దెబ్బలు తింటే!? అతని అహం ఎంత దెబ్బతింటుంది!
మా మేనత్తకు, ఆమె మేనమామకు బాల్య వివాహం చేశారని చెప్పాను కదా! వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆయన అప్పుడప్పుడూ వచ్చి భార్యను చెప్పు తడిపి మరీ కొట్టేవాడు.

భర్త చేతిలో దెబ్బలు తిన్న తరం వెళ్ళిపోయి, ఎదురు తిరిగే తరం వచ్చింది. తిరుపతి శివార్లలోని ఉల్లిపట్టెడ గ్రామంలో ఉంటున్నాం. మా వెనుక వీధిలో ఉండే ఒకావిడ చాలా ఏళ్ళ తరువాత ఒక రోజు మధ్యాహ్నం మా ఇంటికి వచ్చింది. ఆమె ముఖాన బొట్టులేదు. ఆరోగ్యంగా కనిపిస్తోంది.

“పాపం మీ వారు పోయారుటగదా! మిమ్మల్ని చూట్టానికి నేను రాలేక పోయాను. ఎట్లా ఉన్నారిప్పుడు?" అంటూ మా అమ్మ తప్పు చేసి సంజాయిషీ ఇచ్చినట్టు ఆమెను పలకరించింది.

“ఆయన పోయినాంక చాలా బాగున్నానమ్మా. ఇద్దరు ఆడపిలకాయలకు పెండ్లిడ్లు చేసి అత్తగారింటికి పంపించేసినా. ఇద్దరు పిలకాయలూ బాగున్నారు. పెద్దామెకు ఒక పాప. రెండో ఆమెకు ఇంకా పిల్లలు లేరు. మీకు తెలియందేముందమ్మా! ఆయన బతికున్నంత కాలం రోజూ తాగొచ్చే వాడు. రచ్చలు రావిళ్ళే గదా! ఇప్పుడు నాప్రాణం చానా సుఖంగా ఉండాది" అంది.

వీళ్ళ మాటలతో నా నిద్ర కాస్తా పోయింది. ఆమె మాటలు నన్ను కాస్త ఆశ్చర్చ పరిచినా చేదు నిజాన్ని చెప్పాయి. ఆమె మొగుడు బతికున్నప్పుడు మా ఇంటి వెనుక నుంచి అరుపులు, తిట్లు వినిపించేవి. అవి మామూలు తిట్లు కావు! అతను తాగుండే వాడు.

మొగుణ్ణి ఎదుర్కోవడం కోసం ఆమె కూడా తాగేది. ఇద్దరూ తాగిన మైకంలో సంస్కృతంలో సంభాషించుకునే వాళ్ళు. వీళ్ళ సంభాషణ విని ఆ భాష పిల్లలు కూడా ఎక్కడ నేర్చుకుంటారో నని “లోపలకు పదండి” అని అరిచేది మా అమ్మ.

ఇద్దరూ కలియబడే వాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళొచ్చి ఇద్దరికీ సర్ది చెప్పే వాళ్ళు కాదు. కుస్తీ పోటీలు జరుగుతున్నప్పుడు రెఫరీ లాగా, వాళ్ళిద్దరికీ బట్టలు పైకి పోతే కిందకు లాగే వాళ్ళంతే.

"కట్టెలు కొట్టేటప్పుడు, పెళ్ళాన్ని కొట్టేటప్పుడు మధ్యలోకెళ్ళకూడదు.” అనే ఒక ముతకసామెత ఉండేది. ఆ సామెత మా ఊరిజనానికి బాగా ఒంటబట్టినట్టుంది. ఎవ్వరూ వాళ్ళను విడిపించడానికి సాహసించే వాళ్ళు కాదు. వాళ్ళకు మత్తు దిగి, నోరు నెప్పి పుట్టి, అలిసిపోయి ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళిపోయే వాళ్ళు.

ఉల్లిపట్టెడను దిగూరంటారు. ఎదురుకుండా ఉండే ముత్యాలరెడ్డి పల్లెను ఎగూరు అంటారు. ఈ రెండు ఊర్లకు మధ్య రోడ్డే సరిహద్దురేఖ. ఒక భార్యభర్తలు బాగా చదువుకున్నారు. గౌరవ ప్రద మైన ఉద్యోగాలు చేస్తున్నారు. ఎగూరులో ఇల్లు బాడుగకు (కిరాయి/ అద్దెకు) తీసుకున్నారు.

ఆ భార్యాభర్తలు కూడా తరుచూ పోట్లాడుకునే వాళ్ళు. ఆ పోట్లాటలు చివరికి నడిరోడ్లో కుస్తీపట్ల వరకు వచ్చేవి.
కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన సంఘటన ఇది.

మా ఇంటికి కాస్త దూరంలో ఒక కుటుంబం ఉండేది. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. అతను చదువుకోలేదు. ఆమె బాగా చదువుకుంది. పిల్లలు పుట్టి, పెద్ద వాళ్ళయ్యారు.

భర్తకున్న వివాహేతర సంబంధం గురించి భార్య ప్రశ్నించింది. దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. అర్ధరాత్రిపూట ఆమె చనిపోయింది.
ఆమె చనిపోయినట్టు బిడ్డలకు కూడా తెలియదు. అంత అర్ధరాత్రి పూటే భార్య శవాన్ని కారులో వేసుకుని, గ్రామానికి తీసుకెళ్ళి, సూర్యోదయం కాక ముందే దహన క్రియలు చేసేశాడు. డబ్బున్న కుటుంబాల్లో జరిగే తంతిది. తెలిసినా చెవులు కొరుక్కుంటారే తప్ప ఎవ్వరూ నోరెత్తరు.

భర్త కొడుతుంటే ఆ హింసను ఒక తరం మౌనంగా భరించింది. చదువుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి 'నేను కూడా తిరిగి కొడతాను' అనిమరొక తరం హెచ్చరించింది. దీనికి సమాంతరంగా ఇంకొక తరం తిరిగి కొట్టడం నేర్చుకుంది. అవసరమైనప్పుడు వీధిపోరాటాలకు కూడా దిగింది.

చదువు ధైర్యాన్నిచ్చింది. ధైర్యంగా ప్రశ్నించమంది. ప్రశ్నకు తలొంచకపోతే తిరగబడమని చెప్పింది. ఇదొక గుణపాఠం. ఇదొక
పరిణామం.


Read More
Next Story