అమ్మ చివరి సంతకం!
x

అమ్మ చివరి సంతకం!

మా అమ్మ భయపడి నట్టే జరిగింది. ఆమె బతికుండగా పెన్షనర్ కు రావలసిన డీఏ వేయలేదు. మా అమ్మ పోయి పదకొండు నెలలు అవుతున్నా ఇంకా డీఏ పడలేదు: అమ్మ చెప్పిన ముచ్చట్లు - 16




అమ్మ చెప్పిన ముచ్చట్లు - 16


పండగొస్తోందంటే మా అమ్మకు భలే సంతోషం! ఆ సంతోషం అంతా పిల్లల కోసం, మనవల కోసమే! పండగంటే కొత్త బట్టలు కట్టుకోవడం, పిండివంటలు చేయడం, అందరూ కలిసి భోజనం చేయడం. పిల్లల ముఖాల్లో ఆ సంతోషాన్ని చూసి మా అమ్మ ఆనందపడిపోయేది.


ఉగాది, దసరా, దీపావళి, సంక్రాంతినే ఎక్కువగా జరుపుకునే వాళ్ళం. ఉగాది సరేసరి, అది మా అమ్మ పుట్టిన రోజు. అంతా కలిసి కూర్చుని ఆనందంగా భోజనం చేసేవాళ్ళం.

ఒక ఏడాది తిరుపతిలో వార్త తరపున కవిసమ్మేళనం నిర్వహించాం ; నేనక్కడ పనిచేస్తున్నప్పుడు. తుడా ఆఫీసు ప్రాంగణంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఒకప్పటి వనపర్తి పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ రామిరెడ్డి అధ్యక్షతన కవిసమ్మేళనం జరిగింది.

ఉగాది కవిసమ్మేళనానికి వార్తలో ఎడిటోరియల్ సిబ్బంది తలా ఒక పని పంచుకున్నారు. "మీ ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకురండి. దానికైన డబ్బులు మేం ఇస్తాం” అన్నారు. అదే మాట మా అమ్మ దగ్గర చెబితే "ఛ..ఛ..ఉగాది పచ్చడి చేసిచ్చి, డబ్బులు తీసుకుంటామా!? ఆ పని ఎప్పుడూ చేయకు. డబ్బులు తీసుకుంటే పరువుపోతుంది" అంది మా అమ్మ. ఒక చిన్న స్టీల్ బక్కెట్ నిండా ఉగాది పచ్చడి చేసిచ్చింది.

తన చిన్న తనం దస రా గురించి మా అమ్మ ఇలా చెప్పింది.

"మా చిన్నప్పుడు పంతుళ్ళకు జీతాలు తక్కువ కదా! దసరా వచ్చిందంటే పిల్లల్ని తీసుకుని వారితో పాటలు పాడిస్తూ, ఇంటింటికీ వెళ్ళి సంభావనలు అడిగే వాళ్ళు"

"దసరాకు వస్తిమని విసవిసలు పడక
బహుమానములనిచ్చి పంపండి వేగా
అయ్యవారికి చాలు అయిదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు
జయీ భవ..విజయీ భవ..” అంటూ పిల్లల్ని తీసుకుని పంతుళ్ళు పాడే వాళ్ళని చెప్పింది.




దీపావళి వచ్చిందంటే మా అమ్మ మనవల కోసం టపాకాయలు తెమ్మని తెగపోరు పెట్టేది. నరకచతుర్దశి రోజు స్నానానికి ముందు పిల్లల చేత టపాకాయలు కాల్పించేది. టపాకాయలు కాల్చాక స్నానంచేసి తీపి తినమనేది. మా చిన్న తనంలో ఏ తీపీ లేకపోతే, కనీసం బెల్లం గడ్డ అయినా తినమనేది.


దీపావళి వచ్చిందంటే వృద్ధాప్యంలో ఆ శబ్దాలకు చాలా ఇబ్బంది పడేది. ఆ రెండు రోజులూ రాత్రి పూట తలుపులన్నీ వేసేసే వాళ్ళం. మా అమ్మ చెవుల్లో దూది పెట్టే వాళ్ళం. ఇంట్లో మనవలు కూడా పెద్ద పెద్ద శబ్దాలు చేసే బాంబులు పేలిస్తే ఇష్టపడేది కాదు.

కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, భూచక్రాల వంటి తేలికైన టపాకాయలను మాత్రమే కాల్చమనేది.

రాను రాను మనవలు పెద్ద వాళ్ళవుతున్నకొద్దీ మా ఇంట్లో టపాకాయలు కాల్చడం తగ్గించేశారు. వీటి వల్ల కాలుష్యం అని టపాకాయలు అసలు కాల్చడమే మానేశారు. కానీ, మా అమ్మ మాత్రం “శాస్త్రానికి కాల్చాలి" అనేది. ఇంట్లో టపాకాయలు ఎవరు కాల్చినా, కాల్చకపోయినా కొన్నేళ్ళుగా తను మాత్రం కాల్చేది. మా అమ్మ కోసమే కాకరపువ్వొత్తులు తెచ్చేవాణ్ణి.

వరండాలో కూర్చుని కాకరపువ్వొత్తులు కాల్చేది.
గత ఏడాది వచ్చిన దీపావళికి మా అమ్మ టపాకాయలు తెమ్మని నన్ను పోరుపెట్టింది. నేను వెళ్ళి కాకరపువ్వొత్తులు తెచ్చాను. నరకచతుర్దశి రోజున వరండాలో కూర్చుని కాకరపువ్వొత్తులు కాల్చింది. కొన్ని కాకర పువ్వొత్తులు మర్నాడు దీపావళి కోసం దాచుకుంది.

మర్నాడు కాకరపువ్వొత్తులు కాల్చే సమయానికి మా బంధువుల్లో ఒక పెద్దావిడ టపాకాయలు కాలుస్తూ, ఒళ్ళు కాల్చుకుంది. దాంతో మా అమ్మ భయపడిపోయింది. కాల్చమన్నా కాకరపువ్వొత్తులు కాల్చలేదు. మా అమ్మకు అదే చివరి దీపావళి.

సంక్రాంతి పండగ వస్తోందంటే నెల ముందు నుంచి మా అమ్మ ఇంటి ముందర ముగ్గులు వేసేది. మధ్యలో గొబ్బెమ్మలు పెట్టేది. నా చిన్నప్పుడు ఆ గొబ్బెమ్మల కోసం ఆవు పేడ తెచ్చేవాణ్ణి. మా అమ్మకు వయసు బాగా పెరిగాక, ముగ్గులు వేయడం మానుకుంది. ఆ పని మా చెల్లెళ్ళు చేయడం మొదలుపెట్టారు. మామూలు రోజుల్లో కూడా తెల్లారే సరికల్లా ఇంటి ముందు ముగ్గు వేసేది మా అమ్మ.




భోగి మంట కోసం పాడైపోయిన చాపలు, చీపుర్లు, కొబ్బరి మట్టలు అట్టిపెట్టమనేది. వాటన్నిటినీ తీసుకుని భోగిమంట వేస్తే, పిల్లల్తో పాటు తాను కూడా వచ్చి కూర్చునేది. ఒక్కొక్క సారి చలికి తట్టుకోలేక భోగిమంట దగ్గరకు రాలేకపోయేది. కిందటి ఏడాది జనవరిలో మాత్రం అందరితో పాటు భోగిమంట దగ్గరకు వచ్చి కూర్చుని చలికాచుకుంది. ఆ భోగిమంట ముందు ఎన్ని కబుర్లు, ఎన్ని సరదాలు. కానీ, మా అమ్మకు అదే చివరి భోగి మంటని ఊహించలేకపోయాం.


“నవంబర్ వచ్చేసింది. పెన్షన్ సర్టిఫికెట్ ఇవ్వద్దా!?" అనేది మా అమ్మ. "మార్చి వరకు టైం ఉందమ్మా” అంటే వినేది కాదు. “సర్టిఫికెట్ ఇవ్వకపోతే, నేను చచ్చిపోయానని పెన్షన్ ఆపేస్తారేమో!" అంటూ చాలా బాధ పడేది.

మా నాన్న పోయినప్పటి నుంచి ఇరవై ఏళ్ళుగా మా అమ్మతో ఇదే పోరు. లైఫ్ సర్టిఫికెట్ డిసెంబర్లో తీసుకుంటామనే వాళ్ళు. ఒక్కొక్క సారి జనవరిలో తీసుకుంటామనేవారు. లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేంత వరకు మా అమ్మకు నిద్రపట్టేది కాదు. మమ్మల్ని నిద్రపోనిచ్చేది కాదు.

తొలుత లైఫ్ సర్టిఫికెట్ ఫారం నింపి, మా అమ్మను గెజిటెడ్ ఆఫీసర్ ముందుకు తీసుకెళితే, ఆమెను చూసి బతికున్నదని నిర్ధారించుకుని, ఆ ఆఫీసర్ సంతకం పెట్టేవాడు. మా ఇంటి ఎదురుగా ఉండే డాక్టర్ ఆర్ ఆర్ రెడ్డి మాపైన నమ్మకంతో మా అమ్మను చూడకుండానే సంతకం పెట్టేవారు. ఆయనదగ్గరకు సంతకానికి వెళ్ళి నప్పుడల్లా "మీ అమ్మ బాగున్నారా!” అని అడిగేవారు. ఆ మాటే మా అమ్మ దగ్గర అంటే, “మీ అమ్మ ఇంకా బతికున్నారా? అన్న అనుమానం ఆయనకు కలిగిందేమో!" అనేది.

ఒక్కొక్క సారి ట్రెజరీ ఆఫీసరే స్వయంగా చూడాలనే వారు. లైఫ్ సర్టిఫికెట్ కోసం మా అమ్మను తీసుకుని ట్రెజరీకి వెళితే, అప్పటికే చాలా మంది వృద్ధులక్కడ పడిగాపులు కాస్తుండే వాళ్ళు.
వీళ్ళ ఫైళ్ళు చూసే క్లర్కు టీకని, వాష్రూం కని రెండు మూడు సార్లు బైటికెళ్ళి చాలా సేపటి వరకు వచ్చే వాడు కాదు. ఆ క్లర్కు కరుణాకటాక్ష వీక్షణాల కోసం పాపం ఈ వృద్ధులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసే వాళ్ళు.

అంత మంది వృద్ధులు కూర్చోడానికి కనీసం అక్కడ తగినన్ని బెంచీలు కూడా ఉండేవి కావు. ఈ వృద్ధులంతా ఆ క్లర్కు దయాదాక్షిణ్యాల పైనే బతుకుతున్నట్టుండేది.

కొందరికి వేలిముద్రలు పడేవి కావు. జీవితంలో పనులు చేసి చేసి, వృద్ధులకు వేళ్లు అరిగిపోయుంటాయి. ఎన్ని సార్లు వేసినా వేలిముద్రలు పాత వాటితో సరితూగకపోతే, "పక్కన కూర్చోండి మళ్ళీ చేస్తా " అనే వాళ్ళు. అప్పుడా వృద్ధుల గుండెలు దడదడలాడేవి. వాళ్ళ కళ్ళలో ఆశ , నిరాశలు కొట్టు మిట్టాడేవి.

తరువాత ఐరిష్ వచ్చింది. కళ్ళను పోల్చి చూసే వాళ్ళు. కొన్నేళ్ళుగా మా అమ్మ ట్రెజరీకి వెళ్ళ లేకపోయేది. ఆమె రాలేదని చెపితే, “అంబులెన్స్ లో తీసుకురండి" అనే వాళ్ళు. లేదా తామే వస్తామనే వాళ్ళు. “వాళ్ళు వచ్చేదెప్పుడు? నన్ను చూసేదెప్పుడు!?” అని మా అమ్మ ఎదురు చూసేది.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు దాటినా, పెన్షనర్ల గురించి ఒక సరైన విధానమంటూ ఏర్పాటు చేయలేకపోయారు. పెన్షన్ కోసం లైఫ్ సర్టిపికెట్ సమర్పించడానికి మా నాన్న ఎన్ని అవస్థలు పడ్డాడో తెలియదు! మా అమ్మ పెన్షన్ కోసం తిరగడంలో ఆ అవస్థలన్నీ నా అనుభవంలోకి వచ్చాయి. తరువాత ఐరిస్ పద్ధతి అంటూ కళ్ళు చూసి నిర్ధారించే పద్ధతి ఒకటి వచ్చింది.

మా అమ్మకు ‘డీఏ' అని రాక, “అప్పుడప్పుడు పెరిగే జీతం వేస్తారు కదా! ఈ తడవ అదేమైనా పడిందా?” అని తరుచూ అడిగేది. అయిదేళ్ళుగా అడుగుతూనే ఉంది. కానీ పడలేదు. నా నుంచి అదే సమాధానం. “నేను చావడానికి వస్తున్నాను. ఇంకా ఎప్పుడేస్తార్రా వీళ్ళ పిండాకుడు" అని తిట్టిపోసిందొకసారి.

మా అమ్మ భయపడి నట్టే జరిగింది. ఆమె బతికుండగా డీఏ వేయలేదు. మా అమ్మ పోయి పదకొండు నెలలు అవుతున్నా, ఎవ్వరికీ డీఏ పడలేదు.

అయితే ప్రభుత్వం ఈ లైఫ్ సర్టిఫికెట్ సమస్య నుంచి వృద్ధులకు శాశ్వత విముక్తి కలిగించింది. కొన్నేళ్ళుగా కొత్త నియామకాలన్నీ నిలిపి వేసింది. తాత్కాలిక పద్ధతిపైన, ఔట్ సోర్సింగ్ తో నియమిస్తోంది. చాలా చోట్ల అసలు ఉద్యోగాలే భర్తీ చేయడం లేదు.




మా అమ్మ చివరి రోజుల్లో లైఫ్ సర్టిఫికెట్ కోసం సంతకం చేయలేకపోయేది. చేతులు ఒణికేవి. "సంతకం చేయలేకపోతే పోనీ, వేలిముద్ర వేయమ్మా". అంటే "నేనేమన్నా నిశాన్నీ దాన్నననుకుంటున్నార్రా!?” అనేది కోపంగా. నవ్వుకునే వాళ్ళం.


కిందటి ఏడాది జనవరిలో లైఫ్ స ర్టిఫికెట్ పూర్తి చేసి సంతకం కోసం మా అమ్మకు ఇచ్చాం. ముందర తెల్లకాగితం పైన సంతకం చేసి, సరిగా ఉందంటే, లైఫ్ సర్టిఫికెట్ మీద సంతకం చేస్తానంది. సంతకం ఒక మూల నుంచి మరొక మూలకు వెళ్ళిపోతోంది. మొత్తానికి అతి కష్టం మీద సంతకం చేసేసింది. అదే మాఅమ్మ చివరి సంతకం అని గమనించలేకపోయాం.

(ఇంకా ఉంది)


Read More
Next Story