అవును, అమ్మ ఒక ప్రజాస్వామిక వాది...
x

అవును, అమ్మ ఒక ప్రజాస్వామిక వాది...

'అమ్మ ముచ్చట్ల' లో రాఘవ శర్మ హృదయం ఉంది. ఆమె మరణం వరకు అమ్మ కొంగుపట్టుకుని తిరిగే పసిపిల్లాడు కనబడతాడు. ప్రతి అక్షరంలో రాఘవశర్మ వ్యక్తిత్వమూ కనిపిస్తుంది.


-గీతాంజలి


"అవును అమ్మ గొప్ప ప్రజాస్వామిక వాది!
అమ్మకసలు లెక్కలు రావు.
ఒక ముద్దపెట్టమంటే పది ముద్దలు పెడుతుంది.
ఇల్లంతా వెతికాను, అమ్మ తన కష్టాలను, కన్నీళ్ళని మాకు తెలీకుండా ఎక్కడ దాచి ఉంటుందా అని..
బహుశా.. మనం మళ్ళీ దూరలేని తన కడుపులోనే దాచుకుని ఉంటుంది."
-పోలాప్రగడ రాజకుమారి

అమ్మ జ్ఞాపకాలను ఎంత సున్నితంగా తలచుకున్నారు పోలాప్రగడ రాజకుమారి గారు! అందరికీ బహుశా ఇలాంటి భావనలే ఉంటాయేమో అమ్మల గురించి. రాఘవశర్మ గారికి కూడా ఇంతకంటే ప్రియమైన సున్నితమైన భావనలు ఉన్నాయి అమ్మ విమలాదేవి గురించి.

'అమ్మ ముచ్చట్ల' నిండా రాఘవగారికి హృదయం నిండా అమ్మ మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది. ఆమె మరణం వరకు అమ్మ కొంగుపట్టుకుని తిరిగే పసిపిల్లాడే. అమ్మ నీడ రాఘవగారు. ప్రతి పేజీలో అమ్మతోపాటు రాఘవగారి వ్యక్తిత్వమూ కనిపిస్తుంది.

అసలు ఆత్మకథల్లో, లేదా అమ్మల జీవిత చరిత్రల్లో ఏం ఉంటుంది? ఒట్టి వ్యక్తిగత జీవనపోరాటాలు మాత్రమే ఉంటాయా? అమ్మల చుట్టూనో, నాన్నల చుట్టూనో ఉన్న అప్పటి సమకాలీన సమాజం చరిత్ర, రాజకీయార్థిక విషయాలు ఉంటాయి.

తమ కథలో సమాంతరంగా సాగిపోయే సమాజ చలన సూత్రాలను చెప్పకనే చెబుతారు అమ్మలు. వీటితో పాటు మారే సామాజిక చలన సూత్రాల ఉత్పత్తి సంబంధాల్లో, మరీ ముఖ్యంగా కుటుంబ జీవితాలలోని స్త్రీల జీవితాల్లో మౌలిక మార్పులు ఆయా కాలాల్లో ఎలా ఉన్నాయో తెలుపుతాయి. ఈ విషయం మనకు ఎన్నో ఆత్మ కథల్లో అర్థం అవుతుంది.

గోర్కీ రాసిన అమ్మ నవలలో అమ్మ నీలోన్నా ఒక శ్రామిక వర్గ స్త్రీ. తాగుబోతు భర్త వల్ల కుటుంబ హింసను అనుభవించి ఎట్లా తనకు తాను రాడికలైజేషన్ చేసుకుంటుందో, ఎలా ఒక్క తన కొడుకు పావెల్కే కాక ఎంతో మంది పిల్లలకు అమ్మగా మారడం, అప్పటి రష్యన్ సమాజంలో విప్లవ ఉద్యమంలో ప్రధాన భూమికను పోషిస్తుందో గోర్కి చూపిస్తాడు.

అమ్మ నవలలో 1906 నాటి రష్యన్ సమాజం విప్లవాత్మక ఫ్యాక్టరీ కార్మికుల పోరాటాన్ని చిత్రిస్తాడు. కర్మాగారంలో పనిచేసే అమ్మ నీలోన్నా తనను తాను ఒక సంప్రదాయ లక్షణాలున్న అమ్మనుంచి కార్మిక విప్లవోద్యమాన్ని తన భుజస్కందాల మీద మోసే నాయకురాలిగా గుణాత్మక పరిణామాన్ని అద్భుతంగా చూపిస్తాడు. అమ్మ నవల అప్పటి రష్యన్ చారిత్రక పరిణామాన్ని పరిచయం చేసే చారిత్రక గ్రంథం.

ప్రపంచ వ్యాప్తంగా అమ్మల్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాల్గొన్న అప్పటి సంస్కరణ ఉద్యమాల నుంచి విప్లవోద్యమాల దాకా, జాతీయోద్యమం, తెలంగాణా సాయుధ పోరాటం, కమ్యూనిస్టు ఉద్యమాలు- మలి దశ తెలంగాణా ఉద్యమాలు అన్నింటిలో చూస్తాము.

అందుకే అమ్మల ఆత్మకథలు, ఆయాకాలాలకు సంబంధించిన చారిత్రక గ్రంథాలుగా మన ముందు ఆవిష్కృతమవుతాయి. అమ్మల ఆత్మకథలంటే అమ్మల జీవితాల్లోని దుఃఖం, విషాదం, ఘర్షణ, పోరాటాలను పొరలు పొరలుగా విమర్శించుకోవడం, లేదా సమీక్షించుకోవడం. అందరి అమ్మల జీవితాల చుట్టూ ఈ రాజకీయ ఉద్యమాలు ఉంటాయా అంటే తప్పకుండా ఉంటాయి. అమ్మలు పసిగట్టి రాయలే గానీ ఎంతో సామాజిక అంశాలకు, చరిత్రలకు సంబంధించిన విషయాలు దాగినవి బయటకు వస్తాయి.






అలాగే విప్లవ కమ్యూనిస్టు కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథలో గుండెలు పగిలే వేదన, నమ్మక ద్రోహం, దుఃఖం, ఒంటరితనం ఆకుంటిత పోరాటం.. విషాదం, ఆఖరికి విజయం ఉన్నాయి. ఆమె చెప్పిన ఆత్మకథలో తన మూడు తరాల చారిత్రక పుటల్లో స్వాతంత్ర్యోద్యమం, సంస్కరణోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, మహిళా ఉద్యమాలు, నక్సలైటు ఉద్యమాలున్నాయి. వీటన్నింటితో ఆమెకు సంబంధాలున్నాయి. 1910 కాలపు సమాజం వీటన్నిటినీ కొండపల్లి కోటేశ్వరమ్మ చూశారు.

రాఘవగారి అమ్మ ముచ్చట్లలో కూడా అప్పటి సమాజపు చరిత్ర ఉంది. ఫ్యూడల్ సమాజంలోని అన్ని సాంఘిక దురాచారాలు మూఢనమ్మకాలు న్నాయి. బాల్య వివాహ దురాచారం నుంచి కుల వివక్ష, అవిద్య, స్త్రీల విషయంలో పితృస్వామికి అణచి వేత వరకు వాటిని ఎదిరించి నిలబడిన పుట్టింట్లో నిర్మలా దేవి నుంచి విమలాదేవిగా మారిన అమ్మ ధీరోదాత్తత కూడా అమ్మ ముచ్చట్లలో కనిపిస్తుంది.

తొంభై ఒక్క సంవత్సరాలు బతికిన తన అమ్మ గురించి రాఘవ గారు ప్రతీ పేజీలో మురిసిపోతారు. 'పనిచేయని కాడికి ఈ చేతులెందుకు?' అని నిరంతరం ఇంటి పనిలో మునిగి పోయిన అమ్మ చేతులు నొప్పెడితే 'మోనోసిన్ బామ్' రాస్కుని మరీ పనిచేసిన అమ్మ ఎలా ఉంటుందో చెప్తారు.

"మా అమ్మ ఎలా ఉండేది? లావు కాదు, మరీ సన్నమూ కాదు. తెల్లగా, కాస్త పొట్టిగా ఉండి, తలంతా అల్లుకుపోయిన వెండి తీగల్లాంటి జుట్టు, చిరునవ్వు నిండి పొడవాటి ముక్కు, తెల్ల రాళ్ళున్న ముక్కుపుడక.. మామిడి పిం దల్లాంటి దుద్దులు, ప్రతి ఒక్కరికీ వారి బాల్యంలో అమ్మల ముఖం ఇలానే గర్వంగా సౌందర్యాత్మకంగా, సంభ్రమం కలిగించేట్టుంటుందేమో.. ఏ వర్గానికి చెందిన అమ్మైనా సరే.

ఏడుగురు పిల్లల్ని, ఇద్దరు తమ్ముళ్ళని, ఒక చెల్లె, మరిది, బావగారి కొడుకు, ఇంతమందికి తన సుదీర్ఘ మైన జీవిత కాలంలో విలువైన సమయాన్ని ఇచ్చింది, పెంచి పెద్ద చేసింది, అందరికీ అన్నపూర్ణమ్మ అయ్యింది. తన జీవితంలోని కష్ట సుఖాలలో, వెలుగుచీకట్లతో దోబూచులాడుతూనే గాయాలకు వెన్నపూస పూసుకుంటూనే అమ్మ అంత మందికి దారి చూపించిన దేవతయ్యింది. అమ్మ ప్రయాణాన్ని నిశ్శబ్ద సాక్షిగా రాఘవ గారు గమనిస్తూ వచ్చారు.

అమ్మది వేమవరం. కానీ రాఘవ గారు అక్కడికి ఎప్పుడూ వెళ్ళ లేదు. అమ్మ చెప్పిన ముచ్చట్లలో అమ్మ పోయాక తన మూలాలు, అమ్మ మూలాలు తెలుసుకోవడానికి వేమవరం వెళితే అమ్మ దృశ్యీకరించినట్లే పచ్చగా.. చెరువు చుట్టూ ఉన్న ఇళ్ళను చూసి పరవశించారు రాఘవ.

తాతయ్య చేసిన మునసబు గిరీ, అమ్మ పెద్దక్కయ్య ఆరేళ్ళ చిట్టెమ్మక్క బాల్య వివాహం అంతా అదే వూర్లో జరిగింది. రౌడీ లాంటి శేషన్నయ్య దూకుడు వల్ల అమ్మ ఇంట్లో సంగీతం నేర్చుకోవాల్సి వచ్చింది. కళ్ళు లేని నానమ్మకు గుండు కొట్టించి మరీ ఆమెతో మడి వంట చేయించిన మూఢాచార వ్యవస్థకు నానమ్మ నిలువెత్తు సాక్ష్యం.

నానమ్మ పాడిన పాటలు అమ్మకి బాగా గుర్తే. "రామలక్ష్మణ భరత శత్రజ్ఞులు వారన్నదమ్ములూ, వారంతా లేచిరి లేవే.. అత్తవారిల్లిది లేవే.. లేవే మాయమ్మా..” అంటూ పాడిన తన నాయనమ్మ పాట అమ్మకి బాగా జ్ఞాపకం. గుడ్డిదైన నానమ్మ నరసమ్మ ఎన్ని పాటలు పాడేదో! పౌరాణిక పాటలు, లాలిపాటలు, జోలపాటలు, పెళ్ళి పాటల్లో వియ్యపురాలి పాట, చల్లచిలకమని గొల్లభామ పాట, అమ్మ కన్నీ జ్ఞాపకమే.

అమ్మ ఉగాదిన పుట్టింది. ఆరోజే పుట్టింటికి అందరూ వచ్చి పండగ చేస్కోవడంలో అమ్మ పైని అవ్యాజమైన ప్రేమ కనపడుతుంది. ఈ రోజుల్లో అమ్మల పుట్టిన రోజులు వాట్సప్ ల్లో జరుగుతున్నాయి.

ఇంట్లో చల్ల చిలికి మజ్జిగను ఊరిజనంతో పంచుకునే అమ్మలో తనకు ఉన్నది అందరితో పంచుకునే సమష్టి తనం కనిపిస్తుంది. పంటకోసాక నాన్న అంటే రాఘవ గారి తాతయ్య, చెల్లె ఇంటి ముందు నుంచి పోతూ బండి తోలే పాలేరుకు కూడా తెలియకుండా ఆమె ఇల్లు రాగానే కాలితో రెండు బియ్యం బస్తాలు తన్నడం.. బండి వెళ్ళాక అత్త వచ్చి వాటిని లోపలికి గుంజుకు పోవడం ఎంత నిశ్శబ్దంగానో జరిగిపోయేది. ఆ అన్నకు చెల్లెలి మీద ఉన్న అభిమానం ఇప్పటి మనుషుల్లో లేదు.

అమ్మమ్మ తన కోడలు, అమ్మ వదిన సీతను పెట్టే గృహ హింస నిశ్శబ్దంగా జరిగి పోయేది. కొడుకు శేషు నోరెత్తేవాడు కాదు. అమ్మమ్మ వడ్డించే కూరల్లేని ఒట్టి అన్నమే తిన్న ఆ సీత పచ్చకామెర్లతో త్వరగా చనిపోయింది. అమ్మ విమలాదేవి ఈ విషయంలో చాలా దుఃఖపడేది. ఇక 'అమ్మ ముచ్చట్ల'లో అమ్మ తన ఇష్టా ఇష్టాలతో సంబంధం లేని పెళ్ళి పదహారేళ్ళ వయసులో ఎట్లా జరిగిందో, కనీసం కాబోయే భర్తని కూడా చూసే స్వేచ్ఛ లేని ఆడపిల్లల ఎదిరించలేని మానసిక స్థితి అమ్మ చెప్తుంటే బాధ కలుగుతుంది.

అమ్మమ్మ తుమ్మ మొద్దులాంటి అబ్బాయికి, తెల్లగా జాజి తీగలా ఉన్న తనకూతురు విమలాదేవినిచ్చి పెళ్ళి చేయనంటుంది. కానీ, రావుడు మావయ్య పంతంపడితే అమ్మకి ఆ పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది. కాపురం చేసింది. భర్తతో దెబ్బలు, అవమానాలు భరిస్తుంది పిల్లలకోసం. మహానిష్టులయిన వైష్ణవ బ్రాహ్మలు తాము నడిచే దారిని, నిప్పు రాళ్ళను, ఉప్పుగళ్ళను కడిగి శుభ్రం చేసుకునే మూర్ఖ ఆచారాల మధ్య అంతగా దైవ భక్తి లేని అమ్మ కాలం నెట్టుకొస్తుంది. ఆహారపు అలవాట్లలో ఉల్లి, వెల్లుల్లి, దుంపలు, మునక్కాడ తినని మావగారికి అవి లేకుండా వంట చేయడం, ఇష్టమైన వాటిని తినడానికి కోడళ్ళు పుట్టింటికెళ్ళాల్సి రావడం, అమ్మ అత్తగారు తన భర్తకు తెలియకుండా తాటి ముంజలు దొంగతనంగా తినడం.. భర్తలు తినని ఆహారపదార్థాలు భార్యలకు కూడా ఎలా నిషేధమో అవగత మవుతుంది.

వందేళ్ళ క్రితపు ఈ సూత్రాలు ఆధునిక కాలంలోనూ మరో రూపాల్లో కొనసాగుతున్నాయి. అమ్మ పిల్లల్ని ఎప్పుడూ కొట్టలేదు. పిల్లల్ని కొట్టే భర్తని మీకా హక్కులేదని గద్దించి, పిల్లలిని రక్షించుకుంది.

అలాగే రాఘవ గారి అమ్మ చంటి పిల్లలకు స్నానం చేయించే దృశ్యం చూడాలి. అమ్మ చాపిన కాళ్ళ మీద పసిపిల్లలను వేసుకుని స్నానం చేయించే విధానం ఒక అందమైన కావ్యంలా ఉంటుంది. లాలిపాట పాడుతూ, నీళ్ళు పసిపిల్లల మీద రకరకాలుగా పోస్తూ, అమ్మ పోయించే స్నానపు దృశ్యం గొప్పగా దృశ్యమానం చేశారు రాఘవగారు. బాల్యం అలా కళ్ళ ముందు కదలాడింది.

స్నానం చేయించేటప్పుడు ఒక లాలిపాట, స్నానమయ్యాక మరో జోలపాట, అన్నం తినిపించేటప్పుడు చందమామను చూపిస్తూ గోరుముద్దల పాట, చందమామలోని మచ్చని చూపిస్తూ పేదరాశి పెద్దమ్మకథ చెప్పడం మరో అద్భుతం.
అమ్మ.. తన భర్తకున్న మూఢనమ్మకాలతో కూడా చాలా విసిగిపోయింది. అతన్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేసేది.

ఇక్కడ అమ్మ జీవిత కథలో ముఖ్యమైన చారిత్రక సంఘటనలు, గాంధీ హత్య జరగడం, సుభాష్ చంద్రబోస్ మరణం, 1959లో వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీ ప్రారంభించడానికి జవహార్లాల్ నెహ్రూ రావడం, గాంధీని 1948లో నాథూరాం గాడ్సే చంపినప్పుడు రాఘవ గారి నాన్న అక్కడే ఢిల్లీలో మిలటరీలో పనిచేస్తున్నట్టు అమ్మ చెపుతుంది.

అమ్మకు గాంధీజీ అంటే చాలా ప్రేమ. గాంధీ హత్య ఆమెను తీవ్రంగా కలిచి వేసింది. గాంధీ మరణం మీద అమ్మ ఎప్పుడూ ఒక పాట గొప్ప అభినయంతో పాడేది. హత్య జరిగాక అక్కడికి గవర్నర్ మౌంట్ బాటన్ వచ్చాడు. “జవహర్ లాల్నెహ్రూ, పటేల్, గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ చుట్టూనా మూగియుండిరి బ్రతుకంగ జూచుచుండిరి ఆశతో అంటూ
" చేతులు తిప్పుతూ, హావభావాలతో తుపాకీ గురిచేయడాన్ని తన చేతులతో అభినయిస్తూ పాడేది.

అలాగే విమలాదేవికి వేమన పద్యాలు, పుత్తడి బొమ్మా పూర్ణమ్మ పాటలు కూడా చాలా ఇష్టం. ఆమె అలోచనల్లో ఎప్పుడూ అప్పటి సామాజిక దురాచారాల పట్ల నిరశన , వాటిని ఎదిరించాలన్న ప్రగతి శీలత కనబడేవి.

అలాగే 1959లో వనపర్తి ప్యాలెస్ లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీని ప్రారంభించారు. అమ్మ విమలా దేవి రాఘవగారు సహా ముగ్గురు పిల్లలతో ఆ సభకి వెళ్ళింది. సభ అయ్యాక నెహ్రూ తన మెడలోని దండను స్త్రీలపై విసిరితే దాన్ని అమ్మ ఆయన మీద భక్తితో ఇంటికి తెచ్చుకుంది. ఆయన దేశం కోసం కష్టపడ్డాడని మాత్రమే నెహ్రూ విసిరిన పూల హారం అమ్మ ఇంటికి తెచ్చుకుంది.

అలాగే అమ్మమ్మకి చిన్న కొడుకు, అంటే అమ్మకి తమ్ముడు పుడితే అప్పటి పరిస్థితులు బాగా లేని కారణంగా పేరు పెట్టలేదు. అప్పటికే సుభాష్ చంద్రబోస్ చనిపోయి నాలుగేళ్ళవుతోంది. ఆయన ఆగస్టు 18, 1945లో చనిపోయారు. అంటే 1951లో అమ్మకి తమ్ముడు పుట్టాడు. ఆస్తులుపోయి కుటుంబం దుఃఖాన్న ఉండి తమ్ముణ్ణి పట్టించుకోలేదు. వాడికి అమ్మ తానే సుభాష్ చంద్రబోస్ అని పేరు పెట్టింది. సుభాష్ చంద్ర బోస్ ఉద్యమ జీవితం అమ్మలో ఆయన మీద అభిమానం కలిగించి ఉండవచ్చు.

అలా అమ్మకు సమకాలీనంగా, జాతీయోద్యమం ముందు సంబంధం ఉన్న చారిత్రక సంఘటనలు జరిగాయి. అలాగే 1964-65 ప్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ పట్ల అప్పటి ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు, అశాస్త్రీయ భావాలు, భయాలను కూడా ఇక్కడ ప్రస్తావించారు.

కుటుంబ నియంత్రణ 'పాపపు పని' అని అప్పటి ప్రజల్లో అపోహలు ఉండేవి. కుటుంబ నియంత్రణ 'పాపపు పని' అని రాఘవగారి నాన్న గారు గోపాలరావు గారు అక్కయ్య సలహా విని అప్పటికే నలుగురు పిల్లలున్నా, కుటుంబ నియంత్రణ చేయించుకోరు. అత్తయ్య అంటే అమ్మ ఆడపడుచు. భర్త పోయిన స్త్రీ. తన తమ్ముణ్ణి కుటుంబ నియంత్రణ వంటి 'పాపపు పని' చేస్తే 'వచ్చే జన్మలో పియ్యితిన్నా పిల్లలు పుట్టరు' అని నిరుత్సాహపరుస్తుంది. అధిక సంతానంతో అమ్మే బాధపడింది. వరుసగా ఏడుగురు పిల్లలు అమ్మకి.

అప్పటి సమాజపు సంప్రదాయ భావజాలాన్ని కాక, అమ్మ ప్రగతి శీల భావజాలాన్ని ఎంత గౌరవిస్తుందో, ఆచరిస్తోందో చూస్తే, గమనిస్తే అమ్మ మీద గౌరవం కలుగుతుంది. మనిషి ఏ కులానికి చెందిన వాడో కూడా అడక్కుండా భోజనం పెట్టేది. నిజంగా అమ్మ గొప్ప ప్రగతిశీల భావాలున్న మనిషి. అందుకే మనవడు బబ్బిని ''ఏకులమైనా, ఏ మతమైనా ఫరవాలేదు. నీఇష్ట మైన వాళ్ళని పెళ్లి చేస్కొని తీసుకొచ్చేయ్''
అనగలుగుతుంది.

అలాగే తను చదువుకోవాలన్న కోరిక తీరలేదు అమ్మకి. అయినా, పెద్దకూతుర్ని చదివించలేకపోయింది బాల్య వివాహం వల్ల.
ఆ నిరాశలోనుంచి తన కూతుర్లను పాలిటెక్నిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివించింది. బాస్కెట్ బాల్ ప్లేయర్గా కూతుర్ని చూస్కుని మురిసిపోయింది. మూడవ కూతుర్ని కూడా బీ. ఈ. డీ చదివించింది. భర్త పోయి పిల్లాడితో వచ్చిన చిన్న కూతురుని మళ్ళీ ఐదు పీజీలు, పీహెచ్ వరకు ఇంట్లో అన్ని పనులు తానే చేసుకుని చదివించింది అమ్మ విమలా దేవి.

ఆడపిల్లలకు చదువెందుకు పెళ్ళి చేసిపారేయాలి అనే భర్త- అడబిడ్డ శేషమ్మతో ఒక యుద్ధమే చేసింది. ఇంత సాధించడానికి కూతుర్ని ఇంకా తనలా పాడగలవా అని పిల్లల్ని ఛాలెంజ్ చేసి, వారిలో ఒక కూతురిని యాభై ఏళ్ళ వయసులో మ్యూజిక్ కాలేజీలో చేరేలా ప్రోత్సహించింది. అమ్మ ఎప్పుడూ తన అడ పిల్లల్ని ఒకరి ఇంటి కోడళ్ళగా కాకుండా చదువుల తల్లులుగా చూడాలనుకుంది, చూసింది.

“చదువుకోకపోతే నీలాంటి మొగుడి దగ్గర ఛీ.. ఛా అనిపించుకుంటూ ఉండాలి..నాలాగా. ఇంట్లో అంట్లు తోముకుంటూ ఉండాలి. ముందు చదువు చూడండి" అని భర్తను, అడపడుచును శాసించి నిలువరించింది. అది కదా అమ్మల నుంచి పిల్లలకి కావలిసింది! ఆ స్ఫూర్తే కదా తరం నుంచి తరాలకు అమ్మల ద్వారా సమాజానికి చేరాల్సింది.

ఎనభై రెండేళ్ళు వచ్చినా మసకబారుతున్న కళ్ళతో రోజూ పేపరు చదువుతూ ప్రపంచ జ్ఞానం పొందేది అమ్మ. అంతెందుకు సంగీతం కూడా చదువే అనుకునేది, నేర్చుకుంది కూడా. ఎంఎస్. సుబ్బలక్ష్మి, బాలమురళీ కృష్ణ పాటలంటే అమ్మకి ప్రాణం.

తనకున్న ఆ కొద్ది జ్ఞానంలోనే తన జీవితంలో అమలవుతున్న పితృస్వామ్యపు అణచివేతను గుర్తించి పెనుగులాడుతూనే పోరాడింది అమ్మ. భర్త బూట్లకు సరిగా పాలిష్ చేయలేని కారణంగా తన్నులు తినాల్సి రావడం.. భర్త కోపాన్ని అడుగడుగునా భరించాల్సి రావడం చాలా కష్టంగా ఉండేది. సైద్ధాంతిక జ్ఞానం తెలవక పోవడం వల్ల 'పెళ్ళాలని కొట్టని మొగాళ్ళుంటారా' అని వ్యంగ్యంగా పెళ్ళాలని కొట్టేమగాళ్ళ ఆధిపత్యాన్ని వెక్కిరిస్తూ, నిరాశగా ఆ వాస్తవాన్ని చెబుతుంది.

విమలా దేవి భర్తకు ఎంత కోపం అంటే ఇంట్లోకి దొంగొచ్చాడనుకుని వచ్చిన పందిని కొట్టకుండా యానాదతన్ని తలపగలగొడతాడు. దానికి పశ్చాత్తాపం కూడా ఉండదు. “మీ నాన్న పొగరుబోతు” అంటుంది విమలాదేవి.

అయినా, ఆ యానాది మనిషి ఒకసారి రాఘవ గారిని కలిసినప్పుడు 'బాగున్నారా బాబు' అని పలకరించి ‘చిన్నప్పుడు మీ నాన్న నా తల పగలకొట్టారండయ్య..' అని తలమీద గాయపు మచ్చను చూపిస్తే అతగాడి సౌజన్యానికి రాఘవ గారు సిగ్గుపడతారు.

స్త్రీ అయినందుకు పురుషాధిక్యంతో అమ్మను కొట్టే నాన్న.. పీడిత కులస్తుడి పైన, పీడకకులానికి చెందిన అగ్రవర్ణ బ్రాహ్మణీయ హిందూ అధిపత్యాన్ని యానాది కులస్తుడి మీద చూపించిన నాన్న. రెంటినీ కలిపిన ఫ్యూడల్ ఎలిమెంట్ రాఘవ గారిని అలోచనలో పడేస్తుంది.

ఇక అమ్మ ముచ్చట్లలో రాఘవగారి అత్తయ్య శేషమ్మ కథ అత్యంత దీనమైంది. పితృస్వామ్యం.. ఫ్యూడల్ సంప్రదాయాలు, బాల్యవివాహం, అవిద్య లాంటి సాంఘిక దురాచారాలు స్త్రీల జీవితాలను ఎంత కకావికలం చేస్తాయో అనే దానికి శేషమ్మ జీవితమే సాక్ష్యం. వదిన విమలాదేవి మీద, అంటే అమ్మ మీద ఆమె ఆధిపత్యానికి పితృస్వామ్య పునాదుల్లోంచి వచ్చిందని అర్ధంచేసుకున్నా.. కోపం కూడా వస్తుంది, కానీ అదే వ్యవస్థ ఆమె జీవితాన్ని ఆమె భర్త రూపంలో నాశనం చేస్తుంది.

ఇద్దరికీ ఎవరి ప్రమేయం లేకుండా బాల్య వివాహం జరిగిపోతుంది. మేజర్ అయ్యాక భార్య శేషమ్మ అంటే ఇష్టంలేక గయ్యాళి భార్య వద్దంటాడు. వెళ్లిపోతాడు. వేరే విధవ స్త్రీతో కలిసి ఉంటాడు. శేషమ్మ తండ్రి కోర్టుకెళ్లి అల్లుడి అస్తి కూతురికి వచ్చేట్లు చేస్తాడు. అలాగే కోర్టు కేసు నడవడంతో శేషమ్మ భర్త ఆస్తి కరిగిపోతుంది. ఆ కోపంతో తన ఇంటి నుంచి శేషమ్మత్తయ్య ఇంటికి వచ్చి దెబ్బలు బాగా నొప్పిపుట్టేట్టు తగలాలని చెప్పుతడిపి మరీ శేషమ్మను కొట్టే వాడు దుర్మార్గంగా.

తనకు ఆస్తిలేకుండా చేసిందని, శేషమ్మను చంపడానికి కూడా ప్రయత్నించాడు. శేషమ్మ పుట్టింట్లోనే ఉంటూ కఠినంగా నిరాశక్తంగా తయారవుతుంది. కొన్నేళ్ళయ్యాక సహజీవనం చేస్తున్నావిడ చనిపోతే తిండికి ఇబ్బందవు తుందని భార్యని పిల్చుకుంటే... సమాజ పీడన తప్పిందనుకుని అతన్నే రమ్మంటుంది తన ఇంటికి. అతను వచ్చేస్తాడు కానీ, ఒక రోజు అతన్ని వెళ్లగొట్టి ఇల్లు తాళం వేసుకుని మరీ తమ్ముడింటికి అంటే.. మరదలు విమలాదేవి ఇంటికి వచ్చేస్తుంది.

ఇన్నాళ్ళూ భర్తతో కలిసి ఉండాలని ఎదురుచూసిన శేషమ్మత్తయ్య భర్తను వెళ్లగొట్టడానికి గల కారణం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. 'అతగాడికి' కుక్కలంటే ప్రాణం. పక్కలో పడుకోపెట్టుకుంటాడు. రాత్రి అది పక్కలోనే ఈనింది. అసహ్యం వేసింది. కుక్కలతో సహా 'అతన్ని వెళ్లగొట్టి ఇల్లు తాళం వేసుకుని ఇట్టే వచ్చేసా నాకొద్దు అతను' అంటుంది. ఎంత అద్భుతంగా, విప్లవాత్మకంగా అనిపించిందో ఆమె చేసిన ఈ పని!

కానీ, రెండు రోజుల్లోనే శేషమ్మ భర్త మరణిస్తే, మళ్లీ అతనితో భార్యగా ఏ మాత్రం సంబంధంలేని శేషమ్మ జీవితాంతం వైధవ్యం అనుభవించాల్సి వచ్చింది. భయంకరమైన మూఢాచారాలు స్త్రీల కెంత అన్యాయం చేసాయో కదా..

అలాగే విధవలైన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు మడివంట, పూజల కోసం బ్రాహ్మణుడు వచ్చేదాక, మధ్యాహ్నం పొద్దెక్కేదాక పచ్చి మంచి నీళ్ళు కూడా లేకుండా అల్లాడిపోయి అకలికి శోషొచ్చి పడిపోయారో అమ్మ అద్భుతంగా చెబుతుంది. తనూ బాధితురాలే... కన్నీళ్లు పెట్టుకుంటూ అటువంటి దురాచారాలకు తను ఎట్లా బాధితురాలిగా ఉండిందో కొడుక్కి చెబుతూ " ఎందుకురా నాన్నా ఇవన్నీ" అంటుంది.

ఆకలితో అల్లాడుతూ తద్దినం రోజు మడి చీరకు అంటకుండా ఆకలికి శోషొచ్చి ఇంకా రాని బ్రాహ్మణుడి కోసం ఎదురు చూడలేక చీకటి గదిలో మడి చీరలు విప్పేసి నగ్నంగా, రహస్యంగా, భయం భయంగా కాఫీ తాగుతూ తనకు పట్టుబడిన విధవరాళ్లైన అక్కా చెల్లెళ్ల దీనావస్థ చూపి విమలాదేవి చెలించిపోతుంది. మఠాలు వచ్చి బ్రాహ్మణ కుటుంబాల్లో ఆడాళ్ళు బతికి పోయారు అని రాఘవగారు వ్యాఖ్యానిస్తారు.

అట్లాగే కులం.. వంశం పేరుని... ఇంటి పేరుగా మార్చుకునే విషయాన్ని రాఘవగారు ప్రశ్నిస్తే... 'నిన్ను కన్నా కానీ నీ ఆలోచనలను కన్నానా' అంటుంది అమ్మ విమలాదేవి. అమ్మకి పేరు వెనుక కులం పేరు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అంత ప్రజాస్వామ్య వాదిగా, ప్రగతిశీలకంగా అంతగా చదువుకోని అమ్మ ఎలా ఆలోచించేదో అర్థం కాలేదు రాఘవగారికి అలా అమ్మ ఎప్పుడూ ఒక అద్భుతమే!

దివారాత్రులు 90 సంవత్సరాలు ఇంట్లో పిల్లలు, భర్త, మనవలు, బంధు వుల కోసం చాకిరి చేసిన అమ్మ తన 91వ సంవత్సరంలో చనిపోయింది. మరణించే ముందు దాదాపు 20 సంవత్సరాలు అమ్మ అనారోగ్యానికి మందులు వాడారు. ఆసుపత్రికి ఇంటికి మధ్య అనేక యాత్రలు జరిగాయి. పార్కిన్సన్స్ వ్యాధిలో కూడా అమ్మ విమలాదేవి ఆసుపత్రిలో పాట పాడుతూ స్టాఫ్ను అబ్బురపరిచేవారు. ఉత్సాహంగా ఉండేవారు.

ఆమె పరిజ్ఞానంలో పొట్ట డాక్టరు, నరాల డాక్టరు, గుండె డాక్టరు.. వాళ్లిచ్చే మందులు అన్నీ అమ్మకు తెలుసు.

అమ్మలోని సంప్రదాయ వాదికి.. ప్రగతిశీల వాదికి మధ్య నిత్యం జరిగే ఘర్షణలో ఎప్పుడూ అమ్మలోని ప్రగతిశీలవాదే గెలిచి నిలిచేది. నిజంగా అమ్మలు ఇలా ఉంటే ఎలా ఉంటుంది? అమ్మలో బయటకు చెప్పుకోలేని నిత్యం వెంటాడే వేదన..ఒకనిశ్శబ్ద పోరాటాలు.. ఓటమి.. గెలుపులు ఉంటాయి. అమ్మ విమలాదేవి అందుకు అతీతం కాదు. కానీ నిత్యం దుఃఖిస్తూ.. ప్రశ్నిస్తూ.. తర్కిస్తూ వచ్చింది.

అమ్మ విమలాదేవి చేసిన సుదీర్ఘమైన జీవన పోరాటంలోంచి సారాంశాన్ని తీసుకుంటే అమెలోని గొప్ప మానవతావాది, ప్రజాస్వామికవాది కళ్లముందర సాక్షాత్కరిస్తారు. రాఘవగారు మీరు అన్నట్టు అమ్మ ప్రజాస్వామిక వాదితో పాటు గొప్ప స్త్రీవాది. బహుశా మీరు హేతువాదంవైపు, మార్క్సిజం వైపు రావడానికి అమ్మనే కారణం ఏమో..? ప్రతి పేజీలో అమ్మ గొప్ప వ్యక్తిత్యం అడుగడుగునా కనిపిస్తుంది. ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఎంత మంది అమ్మలు ఇలా నిశ్శబ్ద పోరాటాలు చేస్తుంటారో కదా.. ఇలాంటి అమ్మలే కనుక మరణించే ముందు వారి ఆత్మ కథలు రాస్తే అవి గొప్ప చారిత్రక గ్రంథాలుగానే కాదు.. అద్భుతమైన వ్యక్తిత్వ పుస్తకాలుగా వస్తాయి.

ఇలాంటి అమ్మలు ఉన్న పిల్లలు ఎంతో అదృష్టవంతులు. రాఘవ గారూ.. మీరు ఎంతో అదృష్టవంతులు. అమ్మా.. నీకు వందనం.. జోహార్లు!

చివరగా రాఘవ గారూ.. శేషమ్మత్తయ్య జీవితాన్ని చిన్న నవలగా మీరు రాయాలి. గొప్పపోరాటం ఆమెది. 'అమ్మ ముచ్చట్లు' చదువుతుంటే అమ్మ కథలు చెప్పిన శైలి.. వాడిన భాష.. సంభాషణలు.. పాటలు.. పద్యాలతో సహా కొడవటిగంటి కుటుంబరావు కథలు, నవలలు జ్ఞాపకానికొచ్చాయి. అమ్మ అంత గొప్పగా కథ చెప్పారు. మీరు శేషమ్మత్తయ్య నవల రాయాలి. ఇది అమ్మ కాలం నాటి స్త్రీల జీవితాల్లోని సంక్షోభ పోరాటాలను అర్ధంచేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

(త్వరంలో రాబోతున్న ఆలూరు రాఘవశర్మ ‘అమ్మ ముచ్చట్లు’ పుస్తకానికి గీతాంజలి ముందుమాట)

Read More
Next Story