అమ్మా..నేను అల్లరిచేయను
x

అమ్మా..నేను అల్లరిచేయను

డా.గోపీకృష్ణ ‘మండే ’ కవిత


అమ్మా..నేను అల్లరిచేయను..

అలిసిపోయిన నీకు
అసలు కోపం తెప్పించను..
ప్రొద్దున్నే మంచంపైనుంచి
లేవడానికి ఎప్పుడూ పేచీపెట్టను!
లేచాక నాస్నానం నేనేచేసి
యూనిఫాం వెంటనే వేసుకొంటాను!
ఏ టిఫిన్ పెట్టినా గొణగక
వద్దనకుండా అంతా తినేస్తాను!
అమ్మా..నేను అల్లరిచేయను..
అవీ ఇవీ కావాలని
నిన్ను నేను విసిగించను..
సాయంత్రం ఇంటికొచ్చాక
పనుల్లో నీకు సాయంచేస్తాను!
గేమ్స్ ఆడుకొంటానని
నీ సెల్‌‌ఫొన్ ఇవ్వమని అడగను!
రాత్రి నువ్వు చెప్పగానే
వెంటనే పడుకొని నిద్రపోతాను!
అమ్మా..నేను అల్లరిచేయను..
నన్ను హాస్టల్‌నుండి ఇంటికి
తీసుకెళ్ళమని వేడుకొంటున్నాను..
బజారుకు వెళ్ళినప్పుడల్లా
కారుబొమ్మ కొనివ్వమని అడగను!
సినిమాకు తీసికెళ్లినప్పుడు
పాపకార్ను కూల్‌డ్రింక్‌కై పట్టుబట్టను!
కొత్త క్రికెట్‌బ్యాట్ తెచ్చివ్వమని
ఇంకెప్పుడూ అడగను!
అమ్మా..నేను అల్లరిచేయను..
ఇంటికి నన్ను నువ్వు రానిస్తే
నాపనులన్నీ నేనే చేసుకొంటాను..
నాబుగ్గలు నేనేపట్టుకొని దువ్వినా
పాపిడి చక్కగా రావడంలేదమ్మా!
ఉతికిచ్చిన బట్టలు సూట్‌కేసులో
పెట్టుకోవడం చేతకావడంలేదమ్మా!
షూపాలిష్ సరిగ్గా చేసుకోలేదని
టీచర్ పనిష్మెంట్ ఇస్తున్నారమ్మా!
అమ్మా..నేను అల్లరిచేయను..
చిన్నపిల్లాడిని కదా
ఇంత పెద్దశిక్ష వెయ్యకంటున్నాను..
హాస్టల్‌లో పెట్టే అన్నం
నువ్వుచేసినట్టుగా రుచిగాలేదు!
తిన్నా తినకపోయినా
పట్టించుకొనేవాళ్ళు అసలు లేరు!
ఏడుపొస్తున్నప్పుడు
ఓదార్చేందుకు ఒక్క చెయ్యీరాదు!
అమ్మా..నేను అల్లరి చేయను..
అవీ ఇవీ కొనిపెట్టమని
ఇకపై నిన్నెప్పుడూ అడగను..
రాత్రిఒంటరిగా పడుకొనేందుకు
చీకటిలో భయమేస్తోందమ్మా!
అన్నం ఉడకనప్పుడు తినక
రాత్రి ఆకలి వేస్తోందమ్మా!
భయంకరమైన కలలొచ్చినప్పుడు
ప్రక్కన నువ్వెందుకు లేవమ్మా!
అమ్మా..నేను అల్లరిచేయను..
చిన్న తమ్ముడి దగ్గరనుండి
ఆట బొమ్మలు అసలు లాక్కోను..
నన్ను ఇంటికి తీసుకురమ్మని
నువ్వు నాన్నను ఒప్పించమ్మా!
తన స్కూటరుపైన ఎప్పుడూ
గీతలు గీయనని చెప్పమ్మా!
ఇంట్లోనే చదివి పరీక్షల్లో నేను
మంచిమార్కులు తెచ్చుకొంటానమ్మా!
అమ్మా..నేను అల్లరి చేయను..
ఊపిరాడని జైలులాంటి హాస్టల్లో
ఒక్క క్షణమైనా ఉండలేను..
చివరగా ఓ చిన్నమాటమ్మా
నాన్నా ఈఒక్కమాట నువ్వూవిను..
చదువుపేరుతో నన్ను
ఇంటికెందుకు దూరంచేస్తున్నారు?
మిమ్మల్ని చూసి మంచినేర్చుకొని
అవకాశం నాకెందుకివ్వరు?
అమ్మా..నేను అల్లరిచేయను!
ఈ హాస్టల్‌లో ఇక ఉండలేను!!
ఈ హాస్టల్‌లో ఇక ఉండలేను!!
ఈ హాస్టల్‌లో ఇక ఉండలేను!!!
ఆలోచించండి...
అమ్మ ఒడి ఒక గుడి!
నాన్న నడవడి నడిచేబడి!!



Read More
Next Story