అమ్మ పసికందు  (కవిత)
x
Mother: Tony Luciani

అమ్మ పసికందు (కవిత)

వృద్ధాప్యం అనారోగ్యంతో మంచాన పడిన అమ్మని గొప్పగా చిత్రీకరించిన ఒక అసాధారణ కవిత.




అమ్మ పసికందు


డా.గూటం స్వామి


అమ్మ రోజురోజుకూ
చిన్న పిళ్ళై పోతోంది!
చేతిలో తాయిలం పెట్టకపోతే
దొర్లిదొర్లి ఏడ్చే పసిపిల్లలా
మారాము చేసేస్తోంది!
నేను కనిపిస్తే చాలు
సముద్రపు కెరటాలు ఉవ్వెత్తున ఎగసినట్టు
అమ్మ కన్నీళ్ళు వేగంగా దూకే జలపాతాలు అవుతాయి!
ఎందుకమ్మా ఆ కన్నీళ్లు అంటే
నంగిరిపింగిరి మాటలేవో పలికేస్తుంటుంది!
ఆ మాటలకు నా కళ్ళు నీటి చెలమలౌతాయి!
గబగబా అమ్మగది దాటి కళ్ళు ఒత్తుకుంటాను!
మనిషినైతే బయటకొచ్చేస్తాను గాని
మనసంతా అమ్మ మంచం చుట్టూనే తిరుగుతుంటుంది!
రోజూ పొద్దెక్కగానే
చిన్నతమ్ముడు,చిన్నక్క
అమ్మ ముఖం కడిగి,తలదువ్వి
స్నానం చేయించి, బట్టలు మార్చి టిఫిన్ పెట్టి
బడికి పంపడానికి సిద్ధం చేసిన స్కూలు పిల్లలా
ముస్తాబు చేసేస్తారు!
అమ్మకు ఈ పనులు నచ్చనప్పుడు
వాళ్ళను గుడ్లురిమి చూడటం,
అప్పుడప్పుడు కదలని చెయ్యిని కొట్టేందుకు లేపడం చేస్తుంటుంది!
అన్నీ వాళ్ళు నవ్వుతూనే
పని ముగించేస్తారు!

అమ్మ బాల్యాన్ని మేమెరగమని కాబోలు
ఆ భగవంతుడు బాల్యం మొత్తం
మా కళ్ళముందు ప్రత్యక్ష పరిచాడు!!
ఇది ఒక అదృష్టం గా మేం భావిస్తుంటే
అమ్మ మాత్రం ఎక్కడో ఒక మూల
బాధపడుతున్నట్టే మాకనిపిస్తుంది!!
అమ్మ చెంపలపై కట్టిన కన్నీటి చారికలు
అమ్మ బాధను ధృవీకరిస్తుంటాయి!

అమ్మకు ఇప్పుడు ఎనభై యేళ్ళు!
రెండేళ్ల క్రితం వరకు మాతో
అమ్మ ఏ పని చేయించుకోవడం ఎరగం!
ఇప్పుడు అమ్మ బాధ చూస్తుంటే
గుండె నెవరో పెనంపై వేపుతున్నట్టే ఉంటుంది!

అమ్మ ఇప్పుడు
అచ్చం పురిట్లో పసికందే!!
మేం మాత్రం అమ్మను లాలించే ఆరిందలమయ్యాము!!

(పక్షవాతం తో రెండేళ్లుగా మంచానికే పరిమితం అయిన అమ్మను చూసి బాధతో)




Read More
Next Story