‘అమ్మల ప్రాణాలకు అండగా ‘అమ్మ రక్షిత’:నిర్మల్‌‌కు రెండు జాతీయ అవార్డులు
x
నిర్మల్ జిల్లాలో మెటర్నరీ మాతృ మరణాలకు చెక్

‘అమ్మల ప్రాణాలకు అండగా ‘అమ్మ రక్షిత’:నిర్మల్‌‌కు రెండు జాతీయ అవార్డులు

వినూత్న కార్యక్రమాలతో కొత్త చరిత్ర ...నిర్మల్ జిల్లా దేశానికి ఆదర్శం


మహిళా సాధికారత, మాతృసురక్షకు అంకితమైన పరిపాలన ఎలా ఫలితాలు ఇస్తుందో తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా చూపించింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రవేశపెట్టిన ‘అమ్మ రక్షిత’ పథకం, జిల్లా ఎస్పీ జానకీ షర్మిల అమలు చేసిన ‘పోలీసు అక్క’ కార్యక్రమాలతో నిర్మల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఒకప్పుడు ఆందోళన కలిగించిన మాతృమరణాలు ఇప్పుడు గణనీయంగా తగ్గి, దేశానికి ఆదర్శంగా నిలిచాయి.

‘ అమ్మ రక్షిత’ కార్యక్రమం

ఇద్దరు మహిళలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీగా ఉన్న నిర్మల్ జిల్లాకు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. జిల్లాలో మాతృ మరణాలను పూర్తిగా తగ్గించాలనే లక్ష్యంతో నిర్మల్ జిల్లా కలెక్టరు అభిలాష అభినవ్ ‘ అమ్మ రక్షిత’ కార్యక్రమాన్ని2024వ సంవత్సరం డిసెంబరు 14వతేదీన ప్రారంభించారు. ఈ పథకంతో మాతృ మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు.2030 నాటికి మాతృ మరణాలు లేని జిల్లాగా నిర్మల్‌ను మార్చడమే లక్ష్యంగా నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పథకం ద్వారా గర్భిణీలకు టిఫా స్కాన్, 2డి ఎకో వంటి ఆధునిక పరీక్షలతో పాటు రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు అందిస్తున్నారు.

నిర్మల్ కలెక్టరు అభిలాషకు స్కోచ్ అవార్డు ప్రదానం

తగ్గిన మెటర్నల్ మాతృ మరణాలు
నిర్మల్ జిల్లాలో 2021-22 సంవత్సరంలో 18 మెటర్నల్ మాతృ మరణాలు సంభవించాయి. జిల్లాలో అమ్మ రక్షిత కార్యక్రమాన్ని ప్రారంభించాక మాతృమరణాల సంఖ్య మూడుకు తగ్గిందని నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కీని రాజేందర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 2018-20 మధ్య కాలంలో లక్ష కాన్సులకు మాతృమరణాల నిష్పత్తి 43 ఉంది. 2019-21 వ సంవత్సరం నాటికి మాతృమరణాల నిష్పత్తి 45కు పెరిగింది. లక్ష కాన్పులకు నమోదయ్యే తల్లుల మరణాల ఆధారంగా మాతృమరణాల నిష్పత్తిని లెక్కిస్తారు. కరోనా కాలంలో రాష్ట్రంలో మాతృ మరణాలు స్వల్పంగా పెరిగాయి. ప్రసవ సమయంలో ప్రతి లక్షమందిలో 50మంది మృత్యువాతపడ్డారు. ఎస్‌ఆర్‌ఎస్‌ బులెటిన్‌ 2018-20 ప్రకారం తెలంగాణలో మాతృమరణాల సంఖ్య 45గా నమోదు కాగా, 2020-22లో అది 50కు పెరిగింది.

నిర్మల్‌ జిల్లాలో తగ్గిన మెటర్నల్ మోర్టాలిటీ రేషియో

దేశంలో 2023వ సంవత్సరంలో మెటర్నల్ మోర్టాలిటీ రేషియో (ఎంఎంఆర్) 8.1 శాతం కాగా, తెలంగాణ రాష్ట్రంలో 3.8 శాతంగా నమోదైంది. 2024వ సంవత్సరంలో దేశంలో ఎంఎంఆర్ శాతం 7.3 కాగా తెలంగాణలో 3.6 శాతం మాతృమరణాలు సంభవించాయి. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రవేశపెట్టిన అమ్మ రక్షిత పథకంతో నిర్మల్ జిల్లాలో దేశ, తెలంగాణ సగటు కంటే అతి తక్కువగా మాతృమరణాల శాతం 0.6కు తగ్గిందని నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సౌమ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. 2020-21 వ సంవత్సరంలో 11,060 ప్రసవాలు జరగ్గా 12 మంది తల్లులు మరణించారు.
2021-22లో మరణాల సంఖ్య 18కి పెరిగింది.2024-25 వ సంవత్సరంలో కేవలం మూడు మెటర్నరీ మాతృ మరణాలు మాత్రమే సంభవించాయని నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సౌమ్య చెప్పారు.

గర్భిణులపై వైద్యాధికారుల శ్రద్ధ

నిర్మల్ జిల్లాలో ప్రతీ ఏటా 8 వేల నుంచి 10వేల మంది మహిళలు గర్భం దాలుస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం దాకా జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి నెలవారీగా వైద్యపరీక్షలు చేస్తూ, ఐరన్ టాబ్లెట్లు అందిస్తున్నామని నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సౌమ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.మొదటి రెండు చెకప్స్ ‌ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో చేస్తుండగా, మూడు, నాలుగు చెకప్స్ ‌గైనకాలజిస్ట్, ‌పీడియాట్రిషన్‌, అనస్థిషియా డాక్టర్‌ ఉం‌డే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్నారు.ఎనిమియాను సమస్య ఉన్న వారిని గుర్తించి వారికి సప్లిమెంటరీ టాబ్లెట్స్ ఉచితంగా అందిస్తున్నారు. ఆశా, ఏఎన్‌ఎం‌లు ప్రతి గర్బిణికి ఐరన్‌ ‌క్యాప్సుల్స్ ఇవ్వడంతో పాటు, వాళ్లు సరిగ్గా వినియోగిస్తున్నారా లేదా అనే విషయాలను తెలుసుకుంటూ వారికి అవగాహన కల్పిస్తున్నామని నిర్మల్ కు చెందిన రమ్య అనే ఆశా వర్కర్ చెప్పారు.

హైరిస్క్ గర్భిణులపై వైద్యాధికారుల దృష్టి

అధిక ప్రమాదం ఉన్న గర్భాలను లక్ష్యంగా చేసుకుని వారిని హైరిస్క్ గా గుర్తించి, వారి బర్త్ ప్లానింగ్ అవసరాన్ని బట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తున్నామని డాక్టర్ సౌమ్య చెప్పారు.సూపర్ వైజరీ అధికారులతోపాటు ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి, గర్భిణులను నిరంతరం పర్యవేక్షించి వందశాతం సంస్థాగత ప్రసవాలు అయ్యేలా పర్యవేక్షణ వ్యవస్థ కల్పించడం వల్ల మాతృ మరణాలను 3 కు తగ్గించగలిగామని డాక్టర్ సౌమ్య వివరించారు. ఏ తల్లి కూడా బిడ్డకు జన్మనిచ్చి చనిపోకూడదని, జన్మించిన ప్రతిబిడ్డ ఆరోగ్యవంతంగా పెరిగేందుకు వైద్యుల కృషి ఎంతో అవసరం అఅని డాక్టర్ సౌమ్య చెప్పారు.రక్తహీనతను తగ్గించేందుకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు, క్యాల్షియం సప్లిమెంట్లను ఉచితంగా అందజేస్తున్నామని ఆమె వివరించారు.

నిర్మల్ జిల్లాకు రెండు స్కోచ్ పురస్కారాలు

నిర్మల్ జిల్లా మరోసారి తన విశిష్ఠతను చాటుకుంది.నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకీ షర్మిల అంకితభావంతో పనిచేసి అమ్మరక్షిత, పోలీసు అక్క పేరిట రెండు వినూత్న పథకాలను ప్రవేశపెట్టి విజయవంతం చేశారు.
నిర్మల్ జిల్లాకు రెండు స్కోచ్ (SKOCH) పురస్కారావచ్చాయి.జిల్లా కలెక్టరు అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకీ షర్మిలకు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జిల్లా స్కోచ్అవార్డులను ప్రదానం చేశారు.

సీఎంతోపాటు మంత్రుల అభినందన

నిర్మల్ జిల్లాలో వినూత్న కార్యక్రమాలను అమలు చేసి స్కోచ్ అవార్డులు సాధించిన జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రులు ధనసరి సీతక్క, దామోదర్ రాజనర్సింహలు అభినందించారు.ఇదే అంకితభావంతో తమ పనిని కొనసాగించాలని ఆ బృందాన్ని ప్రోత్సహించారు.అధికారుల కఠోర శ్రమకు, అంకితభావానికి ఈ పురస్కారాలే నిజమైన ప్రతిబింబాలని వారు పేర్కొన్నారు.

‘పోలీసు అక్క’

నిర్మల్ జిల్లాలో విద్యాసంస్థల్లో విద్యార్థినులపై వేధింపులను నివారించేందుకు వీలుగా జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ‘పోలీసు అక్క’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్కో మహిళా కానిస్టేబుల్ కొంతమంది విద్యార్థులను సొంత అక్కలా వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకోవడంతోపాటు గుడ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించడం, వారి భద్రతకు భరోసా ఇస్తున్నారు. మహిళల భద్రతతో పాటూ విద్యార్ధినుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించే విధంగా నిర్మల్ జిల్లా పోలీసులు రూపొందించిన మీ పోలీసు అక్కా (MiPoliceAkka) కార్యక్రమానికి జాతీయ స్థాయి గౌరవం దక్కింది. ఢిల్లీ వేదికగా జిల్లా ఎస్పీ జానకి షర్మిలకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది.
నమ్మకమే భద్రతకు పునాది.అమ్మాయిల్లో ఆ నమ్మకం కల్పించిన ఎస్పీ జానకి షర్మిలకు దక్కిన గౌరవం స్కోచ్ అవార్డ్ అని మంత్రి ధనసరి సీతక్క వ్యాఖ్యానించారు.

నిర్మల్ జిల్లాలో పోనికి వనం

జీఐ ట్యాగ్ ఉన్న నిర్మల్ బొమ్మలకు మద్దతుగా ఒక సుస్థిర పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుకు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పోనికి వనం కార్యక్రమాన్ని ప్రారంభించారు.నిర్మల్ హస్తకళాకారులకు పోనికి చెక్కను అందుబాటులో ఉంచేందుకు వీలుగా కలెక్టర్ పోనికి వనాలను పెంచుతున్నారు. వన మహోత్సవంతో అనుసంధానించడం ద్వారా పోనికి వనం కార్యక్రమం సాంప్రదాయ హస్తకళను పరిరక్షిస్తూ, పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నారు. పోనికి వనాల సాగుతో నిర్మల్ కళాకారులకు పోనికి చెక్క అందుబాటులోకి వచ్చింది.
నిర్మల్ జిల్లాలో అమలవుతున్న ‘అమ్మ రక్షిత’, ‘పోలీసు అక్క’, ‘పోనికి వనం’ వంటి కార్యక్రమాలు పరిపాలనలో సృజనాత్మకత, అంకితభావం ఉంటే సాధ్యమయ్యే మార్పులకు నిదర్శనం. మాతృమరణాలను పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న నిర్మల్ జిల్లా, భద్రతా–ఆరోగ్య రంగాల్లో సమగ్ర అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం, వైద్య సిబ్బంది, పోలీసుల సమన్వయంతో నిర్మల్ ఒక ఆదర్శ జిల్లాగా రూపుదిద్దుకుంటోంది.
Read More
Next Story