బ్రాహ్మల ఇంటికి ఎవరైనా భోజనానికొస్తే ఎదురయ్యే ప్రశ్న...
x
అలూరు విమలాదేవి

బ్రాహ్మల ఇంటికి ఎవరైనా భోజనానికొస్తే ఎదురయ్యే ప్రశ్న...

మా తాతల కాలంలో సహపంక్తి భోజనాలు లేవు. మా ఇంట్లో అది సర్వసాధారణం. మా మేనత్త అతిధుల్ని మొహ మాటం లేకుండా "ఏం కులం" అని అడిగేస్తుంది”. అమ్మ చెప్పిన ముచ్చట్లు -12అమ్మ చెప్పిన ముచ్చట్లు -12

Content Area


నేను గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న రోజులవి. 1984 లో ఒక మిత్రుడితో కలిసి బాపట్ల వెళ్ళాను. "హెూటల్లో భోజనం చేయడం దేనికి, మా శేషమ్మత్తయ్య ఇంటికి వెళ్దామా?” అన్నాను. పాపం అతను “సరే” అన్నాడు. ఇద్దరం కలిసి మా మేనత్త ఇంటికి వెళ్ళాం.


"ఎవరీ అ అబ్బాయ్!?” అంది మా అత్తయ్య. "మన వాళ్ళబ్బాయేలే” అన్నా. “వంటచేస్తాను భోజనం చేసి వెళ్ళండి” అంది. “సరే” అన్నా. వంట చేస్తూనే చాలా కబుర్లు చెప్పింది. ఇద్దరం భోజనానికి కూర్చున్నాం. ఇద్దరికీ విస్తరాకుల్లో వడ్డించింది. భోజనం చేసినంత సేపు నా మిత్రుణ్ణి తేరపార చూస్తూనే ఉంది.

భోజనం చేశాక ఆ మిత్రుడు తన విస్తరాకు తీసుకెళ్ళి బైటపడేస్తున్నాడు. నేను కూడా నా విస్తరాకు బైటపడేస్తుంటే, “. మొగపిల్లాడివి విస్తరాకేం పడేస్తావ్. నేను తీసేస్తాలే..” అంది కాస్త గదమాయించినట్టు. అక్కడ ఆమెతో వాదనకు దిగడం అనవసరం అని లేచేశాను. మా అత్తయ్యే నా విస్తరాకును తీసుకెళ్ళి బైటపడేసింది.

"అతను మన వాళ్ళబ్బాయి కాదు కదా?” అంది మా అత్తయ్య నా మొహంలోకి చూస్తూ. “కాదని ఎట్లా చెపుతావ్ అత్తయ్యా ” అన్నా. "అతను తినే పద్ధతి చూస్తేనే నాకు అనుమానం వచ్చేసింది. మంచినీళ్ళ చెంబు తీసుకొచ్చి బోర్లించాడు. మనం బోర్లిస్తామా?” చెప్పు అంది.

"అందరూ మన వాళ్ళే కదా అత్తయ్యా. మీ ఆయన కులానికొకళ్ళను గాంధర్వ వివాహం చేసుకున్నాడని నువ్వే గా చెప్పింది! అంతా మన వాళ్ళు కాకుండా ఎట్లా పోతారత్తయ్యా!?” అన్నా.

మారుమాట్లాడలేదు. మొహం మటమటా మాడ్చేసింది. అనుమానం వచ్చే, నా మిత్రుడి విస్తరాకు తాను తీయలేదు. లేకపోతే అతన్ని కూడా విస్తరాకును తీయనిచ్చేది కాదు. ఒక తరం అంతే. మా తాతల కాలంలో సహపంక్తి భోజనాలు లేవు. మా ఇంట్లో సహపంక్తి భోజనాలు సర్వసాధారణం. మా అమ్మ మరీను. మా మేనత్త అయితే మొహ మాటం లేకుండా “ఏం కులం అని అడిగేస్తుంది” మా అత్తయ్యకంటే దాదాపు పదమూడేళ్ళు చిన్నదైన మా అమ్మ అలా ఎప్పుడూ అడిగినపాపాన పోలేదు, అలోచించిన పాపానా పోలేదు. మా నాన్న కూడా అంతే.

ఒక్క పెళ్ళి సంబంధాల్లో తప్ప నాకు తెలిసి ఎక్కడా కులపట్టింపులు లేవు. మా ఇంటికి ఎంత మంది వచ్చినా వాళ్ళ కులం గురించి మా అమ్మ అలోచించేది కాదు. మా అమ్మకు, మా అత్తయ్యకు ఎంత తేడా! తరానికి తరానికి ఉన్న తేడానే అది.

త్రిపురనేని శ్రీనివాస్ పోయాక మిత్రులంతా కలసి అతని కవిత్వాన్ని 'హెూ' పేరుతో అచ్చేశారు. 'హెూ' అవిష్కరణ 1997లో తిరుపతిలోనే జరిగింది. నేనప్పుడు 'వార్త'లో చేస్తున్నాను. ఆ అవిష్కరణ సభ వినూత్నంగా జరిగింది. ఎద్దుకూర బిర్యాని పెట్టారు. కొందరు అస్సలు తినలేదు. కొందరు రుచి కోసం తిని వదిలేశారు. కొందరు ఇష్టంగా తిన్నారు. ఆ సభకు శివసాగర్ వచ్చారు. వసంత లక్ష్మి కూడా వచ్చినట్టున్నారు. ఆ మర్నాడు ఉదయమే మా మిత్రులతో కలిసి శివసాగర్ను తీసుకుని చంద్రగిరి బయలుదేరాం.

అందరం స్కూటర్లలో బయలు దేరే సమయానికి నాలుగేళ్ళ మా మేనల్లుడు బబ్బి గబుక్కున వచ్చి నా స్కూటర్ ఎక్కికూర్చునేశాడు. అంతా చంద్రగిరి వెళ్ళాం. శివసాగర్ అక్కడ సరదాగా గడిపారు. పున్నాకృష్ణమూర్తి, బి. వి. రమణ అందరినీ ఫోటోలు తీశారు. శివసాగర్ తో పాటు గాయని చంద్రశ్రీ, వెంకటేశ్వర్లు కూడా వచ్చారు. ఏ. ఎన్. నాగేశ్వరరావు కూడా మాతో ఉన్నారు.

చంద్రగిరి కోట ఆవరణలో (ఎడమ నుంచి బబ్బి , ఏ. ఎన్. నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, రాఘవశర్మ, శివసాగర్, చంద్రశ్రీ , బి వీ. రమణ)


శ్రీనివాస మంగాపురం ఆలయ ఆవరణలో కూర్చుని శివసాగర్ను ఇంటర్వ్యూ చేశాం. తలా ఒక ప్రశ్న వేశాం. ఓపిగ్గా సమాధానం చెప్పారు. "మీరు శివసాగర్ మరణించదలుచుకున్నారా? సత్యమూర్తిగా మరణించదలుచుకున్నారా?” అని బి.వి. రమణ ప్రశ్నించారు. మేమంతా కాస్త ఖంగుతిన్నాం.


శివసాగర్ వెంటనే సమాధానం చెప్పకుండా నవ్వుతూ మా ముఖాల కేసి చాలా సేపు చూస్తూనే ఉండిపోయారు. ఏం సమాధానం చెపుతారా అని మేం ఎదురుచూస్తున్నాం. చాలా సేపటికి “నేను శివసాగర్ గానే మరణించదలుచుకున్నాను” అని చెప్పారు.

ఆ ఇంటర్వ్యూ వార్తలో వచ్చింది. మేం ఇంటి నుంచి బయలుదేరే ముందే మా అమ్మ "మధ్యాహ్నం భోజనానికి వస్తారా?” అని అడిగింది. మేం ఏడుగురం వస్తాం అన్నాను.తిరిగొచ్చేసరికి మా అమ్మ అందరికీ వంట చేసి పెట్టింది. తరువాత అందరికీ మా అమ్మ భోజనాలు వడ్డించింది. మా మేనత్త లాగా విస్తరాకుల్లో కాదు, కంచాల్లోనే వడ్డించింది.

శివసాగర్ రాసిన పాటలు చంద్రశ్రీ పాడారు. అందరితో పాటు మా అమ్మ కూడా ఆనందించింది. మా అమ్మ కోసం శివసాగర్ చంద్రశ్రీతో ఒక భక్తి పాట పాడించారు.

“ఏడుకొండల వాడా వెంకటారమణ.. సద్దు సేయక నీవు నిదురపో తండ్రీ" అంటూ పాడినా పాట ఎంత శ్రావ్యంగా ఉందో! సినిమాలో కానీ, గ్రామఫోన్ రికార్డుల్లో కానీ ఆ పాట విన్నప్పుడు అంత గొప్పగా అనిపించలేదు. ఎలాంటి సంగీత పరికరాల సహకారం లేకుండా చంద్రశ్రీ పాడినప్పుడు ఎంతో శ్రావ్యంగా అనిపించిందో!

మా అమ్మ కూడా అన్ని పాటలనూ ఒకే రకంగా అస్వాదించింది. మా అమ్మకు పాటలంటే ప్రాణం అని చెప్పాను కదా. మాతో పాటు చంద్రగిరికి వచ్చిన మా మేనల్లుడు బబ్బి చిన్నప్పుడు చాలా సరదాగా ఉండేవాడు. తెల్లటి పైజామా, తెల్లటి లాల్చీ వేసుకుని, తెగ అల్లరి చేసేవాడు. వాడి అల్లరి కూడా చాలా ముచ్చటగా ఉండేది.

వీడు మా ఇంట్లోనే పుట్టి, మా ఇంట్లోనే పెరిగాడు . మా బబ్బి అంటే మా అమ్మకు ఎంత ప్రాణమో! మా ఇంటికి అనుకుని కాకుండా ఆ పక్క భవనంలోనే ప్రైమరీ స్కూల్లో చదివే వాడు.
మధ్యాహ్నం భోజనానికి పలక పుచ్చుకుని ఇంటికి వచ్చేవాడు. మనవడి కోసం మా అమ్మ కళ్ళలో ఒత్తులువేసుకుని ఎదురుచూసేది. ఒక్కొక్క సారి గేటు దగ్గర నిలుచునేది.

"పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు. బబ్బి రావడం లేదు. కాస్త చూడు” అంటూ ఖంగారుపడిపోయేది మా అమ్మ. మా అమ్మ కంట పడకుండా బబ్బి మా పెరట్లో ఉన్న చెట్లలో దాక్కుని దాక్కుని ఇంట్లోకి వచ్చేసేవాడు. వచ్చి ఏదో ఒక మంచం కింద దాక్కునే వాడు. ఇంకారాలేదని మేం వాడి కోసం వెతుక్కుంటుంటే, శబ్దం రాకుండా మంచం కింద దూరి, నోరుమూసుకుని ముసిముసినవ్వులు నవ్వుకుంటుండే వాడు.

ఎప్పటికో కానీ బయటకు వచ్చేవాడు కాదు. వాడికోసం మేం వెతుక్కుంటుంటే వాడికిఎంత ఆనందం! ఆ వయసులో వాడికన్నీ తమాషాలే. మంచం కింద దూర డాన్ని ఒక సారి నేను గమనించేశాను. నేను చూసే సరికి చెప్పద్దని సైగ చేశాడు. "ఆ గదిలో ఏమైనా ఉన్నాడేమో చూడు" అంది మా అమ్మ ఒక గదిలో చూస్తే, అప్పటికే మరొక గదిలోకి మారిపోయేవాడు. మా అమ్మను కాసేపు అలా ఉడకాడించాక “అమ్ముమ్మా” అని నవ్వుతూ బైటికొచ్చేసేవాడు.

మనవడు కనిపించే సరికి మా అమ్మ అనందం ఇంతా అంతా కాదు. "భడవా.. నన్ను ఏడిపిస్తావా!” అనేది. మనవళ్ళతో, మనవరాళ్ళతో, వాళ్ళ ఆటలతో, పాటలతో మా అమ్మ అంతులేని ఆనందాన్ని పొందింది. మా బబ్బి పెద్దవాడయ్యాడు. బీటెక్ చదువుకుని హైదరాబాద్ లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. వాడికి పెళ్ళి చేయాలిప్పుడు. సంబంధాలు చూడమంటావా అంటే “ఇప్పుడు కాదులే, ఇప్పుడు కాదులే” అంటూ దాట వేస్తున్నాడు.

ఒక సారి మా అమ్మ పిలిచి అన్నది కదా “ఒరేయ్ బబ్బి. వయసు పెరుగుతోంది. సంబంధాలు చూస్తామంటే ఇప్పుడు కాదులే, ఇప్పుడు కాదులే అంటావు. పోనీ నీ కిష్టమైన వాళ్ళను చేసుకో. వేరే కులమైనా పరవాలేదు. వేరే మతమైనా పరవాలేదు. నీ కిష్టమైన వాళ్ళను చేసుకుని ఇంటికి తీసుకొచ్చేసేయ్. ఎవరు కాదంటారో చూస్తాను” అన్నది. “అమ్మ ఎలా అన్నది!” అంటూ చుట్టూ కూర్చున్న మా చెల్లెళ్ళంతా బిత్తర పోయారు. తరువాత నవ్వుకున్నారు. చిన్నప్పుడు మా బబ్బి ఎంత చిలిపిగా ఉండే వాడో, పెద్దయ్యాక అంత సిగ్గరి అయిపోయాడు.

బబ్బి అనేది ముద్దుపేరు. అసలు పేరు శరత్ చంద్ర. శరత్ కాలంలోపుట్టాడు కనుక శరత్ చంద్ర అని పేరుపెట్టాం. శరత్ 'చరిత్ర హీనులు' చదివిన కొత్తల్లో ఆ ప్రభావంలో ఉండబట్టి కూడా ఆ పేరుఖరారు చేశాం. మా బబ్బికి సంబంధాలు చూస్తున్నప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పింది. తిరుపతి అమ్మాయినికానీ, దగ్గరలో ఉన్న సంబంధం కానీ చూడండి. బబ్బి పెళ్ళి చూడాలి అనేది.

మొత్తానికి మా బబ్బికి మూడేళ్ళ క్రితం నెల్లూరులో సంబంధం కుదిరి అక్కడే పెళ్ళి జరిగింది. అప్పటికే మా అమ్మ ఆరోగ్యం క్షీణిస్తోంది. మా బబ్బి పెళ్ళికి మా అమ్మను అతికష్టం పైన తీసుకెళ్ళాం. అక్కడే ఆమె పని అయిపోతుందనుకున్నాం. పెళ్ళి ఆగిపోతుందేమోనని భయపడ్డాం కూడా.

పెళ్ళి అయిపోగానే తిరుపతికి తీసుకొచ్చేసి, ఆస్పత్రిలో చేర్చాం. బబ్బికి పుట్టే ముని మనవడినో, మనవరాలినో చూడాలనుకుంది. ఏడు నెలల క్రితం మా బబ్బికి కూతురు పుట్టింది. అంతా తండ్రిపోలికలే! బబ్బి చిన్నప్పటి అల్లరంతా పుణికి పుచ్చుకుంది. కానీ, ఆ అల్లరి చూట్టానికిప్పుడు మా అమ్మ లేదు.
(ఇంకా ఉంది)


Read More
Next Story